|
|
aaa
అంతర్జాతీయ
జియో కెమిస్ట్, పర్యావరణ శాస్త్రజ్ఞుడు - డాక్టర్ ఉప్పుగుండూరి
అశ్వథనారాయణ
|
|
డాక్టర్ అశ్వథనారాయణ గారు " ఐసోటోప్
జియో కెమిస్ట్రీ " లో అంతర్జాతీయ నిపుణుడు - ఈ క్షేత్ర రంగంలో
ప్రపంచ మహా మహులలో దిగ్గజం. జియాలజీ క్షేత్ర రంగంలో నిష్ణాతుడిగా
అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ మేటి భూగర్భ శాస్త్రవేత్త,
పరిజ్ఞనానికి " సోషియో ఎకనామిక్ " అంశం అనుసందానించి సద్ ఫలితాలు
సాధించారు.వీరి పీ హెచ్ డి థీసిస్ నేడు - " న్యుక్లియర్ జియాలజీ "
గా వెలసింది. అణు భూగర్భ శాస్త్ర క్షేత్రంలో డాక్టరేట్ సాదించిన
ప్రప్రదమ భారతీయుడు. ఐదు దశాబ్దాల పాటు భూగర్భ, పర్యావరణ
క్షేత్రాలలో తన అమూల్యమైన సేవలు అందిస్తూ వచ్చారు. భూ రసాయిన
శాస్త్రాన్ని ప్రజా ప్రయోజనాలకి మళచిన అనుభవ యోగ్య శాస్త్రవేత్త.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఒంటారియో
(కెనడా), సాగర్ విశ్వవిద్యాలయం (ఇండియా), టాంజానియా దార్ ఈ సలాం
విశ్వవిద్యాలయం జియాలజీ విభాగ అధినేతగా, టాంజానియా, ఎడ్వార్డొ
మొండ్లేన్ విశ్వవిద్యాలయం, మొజాంబీక్ దేశాలలో పనిచేశారు. సాగర్
విశ్వవిద్యాలయం - సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడి ఇన్ జియాలజీ డీన్,
సంచాలకుడిగా ఉన్నారు. మహదేవన్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ వాటర్
రిసోర్సెస్ మెనేజ్ మెంట్ గౌరవ సంచాలకుడిగా ఉన్నారు. యునైటెడ్
నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ప్రపంచ బ్యాంక్, లూయిస్ బెర్గెర్
సంస్థలకు కన్సల్టెంట్ గా పనిచేశారు. పర్యావరణానికి సంభందించిన అనేక
కీలక అంశాలను పరిశోధించి తన అమూల్యమైన అభిప్రాయాలను ప్రకటించారు.
తాంజానియా ప్రభుత్వ నిమంత్రణ మేరకు అక్కడకు వెళ్ళి దార్ ఈ సలాం ఓ
అంతర్జాతీయ ప్రమాణాలు గల " ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్త్ సైన్సెస్ "
సంస్థను నెలకొల్పారు. గనులు తవ్వే పద్ధతులను, వాటిని శుద్ధి చేసే
ప్రక్రియలను విశిదీకరించారు. ఎల్ కే ఏ బి ఇనుప ఖనిజం (మై నింగ్
టెక్నాలజీ), డి-క్యానిడేషన్ టెక్నాలజీ ఫర్ గోల్డ్ ఎక్స్ ట్రాక్షన్
పద్ధతి (బోలిడెన్) ని కనిపెట్టారు.
ఖనిజ నిక్షేపాలైన - జిప్సం, సున్నం (లైం స్టోన్), ఫాస్ఫేట్, సాండ్
స్టోన్ విచక్షణా రహితముగా తవ్వకాలు చేయడం ద్వారా సంభవించే పర్యావరణ,
సాంఘిక సమస్యలను విశదీకరించి ఆవిష్కరించారు.
వీరు రచించిన " మినరల్ రిసోర్సెస్ మానేజ్ మెంట్ అండ్ ది ఎన్విరాన్
మెంట్ " పుస్తకం జియాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, జియోగ్రఫీ,
పర్యావరణ శాస్త్ర క్షేత్రాలను ప్రామాణిక గ్రంధంగా ఉపయోగపడుతుంది. ఈ
పుస్తకంలో ప్రపంచంలో ఖనిజ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో, ఏ పద్ధతులు
అవలంబిస్తున్నారు, పర్యావరణ సమతుల్యం పాటిస్తూ ఖనిజ నిక్షేపాలను ఎలా
వాడుకోవలో (ఎలాంటి రెగులేషన్స్) అవలింబించాలో అక్షుణ్ణముగా
వివరించారు.
ఉంబెర్తో కార్డాని, సావ్ పాలో విశ్వవిద్యాలయం (బ్రాజిల్),
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో సైన్సెస్ సంచాలకుడు అశ్వథనారాయణ గారి
చిరకాల మిత్రుడు. వీరికి 1967 ఎడ్మంటెన్, కెనడా పర్యటన నుండి మంచి
మిత్రత్వం ఏర్పడింది.
వీరి పేరు పలక లేక అవస్త పడేవారు వీరిని ఆచార్య (ప్రొఫెసర్) ఏ అని
పిలుస్తారు!.
చదువు, ఉద్యోగం:
ఉప్పుగుండూరి అశ్వథనారాయణ గారు 1928 లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర
ఒంగోల్ జిల్లా వల్లూర్ లో జన్మించారు. చిన్నతనంలో అనేక ఆర్ధిక
ఇబ్బందులకి గురికావలసి వచ్చింది. ఒంగోల్ జిల్లా మునిసిపల్ హై స్కూల్
లో చదువుకున్నారు. గణితం లో విశేష అభిరుచి చూపించారు. నూటికి నూరు
శాతం సంపాయించారు. ఆర్ధిక స్తోమత లేక పోవడం వల్ల ఉన్నత చదువుకి
పరిసమాప్తి చెప్పే తరుణంలో, తల్లి నగలు అమ్మి డబ్బు సంకూర్చడం తో
కాలేజిలో చదువులో చేరారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య సీ మహదేవన్ శిష్యరికంలో అదునాతనమైన
అణు భూగర్భ శాస్త్రం (న్యుక్లియర్ జియాలజీ) డాక్టరేట్ పట్టా
సాధించారు.
డాక్టరేట్ రిసర్చ్ చేసే రోజులలో స్వయంగా అణు ధార్మిక ప్రక్రియలను
కొలవడానికి పరికరాలను నిర్మించారు. 1957 లో కాల్టెక్ నుండి " లెడ్
ఐసోటోప్స్ " అంశం మీద పోస్ట్ డాక్టరల్ రీసర్చ్ చేశారు. ఆర్బి - ఎస్
ఆర్, కే - ఆర్ దేటింగ్ మీద ఆక్స్ ఫోర్డ్ లో (1963) పనిచేశారు.
వీరి సతీమణి విజయలక్ష్మి గారు. కుమార్తె వాణి, అమెరికాలో ఉంటున్నారు.
ఆచార్యుడిగా, శాస్త్రవేత్తగా ఐదు దశాబ్దాల పాటు తన అమూల్యమైన సేవలను
అందించారు డాక్టర్ అశ్వథనారాయణ గారు. యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్
(యూ జీ సీ) నేష్నల్ ఫెల్లో గా, యు జీ సీ నేష్నల్ లెక్చరర్ గా,
యునిడో (వియాన్నా, యూరప్) కన్సల్టెంట్ గా పనిచేశారు. మొజాంబీక్
ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు.
జియో సైన్సెస్ - ప్రజా ప్రయోజనాలకు:
ఆఫ్రికా లో పనిచేస్తున్న సమయంలో గనుల వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న
సమస్యలను అక్షుణ్ణంగా అధ్యయనం చేసి, జియో సైన్సెస్ ని ప్రజా
ప్రయోజనాలకి పనికి వచ్చేటట్టు మలిచారు. దీని ద్వారా జన బాహుళ్యానికి
భారీ ప్రయోజనాలకి నాందీ పలికింది.
ఫిన్లాండ్, టాంజానియా కు చెందిన సాటి శాస్త్రవేత్తలతో కలసి, జియో
కెమికల్, ఐసోటోపిక్ పరిజ్ఞానంతో పర్యావరణం కారణంగా సంభవించే రోగాలని
(ఫ్లొరోసిస్, క్యాన్సర్, గోఇ టర్) చేదించే మిషలో పడ్డారు. సైన్స్
ప్రగతిలో సముపార్జించిన పరిజ్ఞానాన్ని ఆఫ్రికాలోని సామాన్యులకు అందే
ప్రయత్నం, సాదించిన ఫలితాలు డాక్టర్ అశ్వథనారాయణ గారి జీవితంలో
పెద్ద మైలు రాళ్ళు. ఈ అనుసంధానం వారి జ్ఞాన సాధనకి కూడా సార్ధకత
ఇచ్చింది. అశ్వథనారాయణ గారు ఈ విషయంలో అదృష్టవంతులే, ఎందుకంటే
జ్ఞాన, పరిజ్ఞానాల కోసం కృషి చేసేవాళ్ళు కొందరైతే, అది ఆర్జించే
ఘనత కొంత మందికే సుసాధ్యం అవుతుంది. దానిని ప్రజా హితానికి
ఉపయోగించి వేల, లక్షల సామన్య వ్యక్తులకు ఉపయోగ పరచి, ఫలితాలు
సాదిస్తే సార్ధకత ఏర్పడుతుంది. ఈ అదృష్టం ఏ కొద్ది మందికో
లభిస్తుంది. అదీ ఫలాపేక్ష లేకుండా చేస్తే అంతకన్నా అద్భుతం ఉండదు.
ఇలాటి ఘనత డాక్టర్ అశ్వథనారాయణ గారికి దక్కడం అందరికి గర్వకారణం.
వీరి విజయాలను - " ఇన్నొవేషన్ ఇన్ డెవలప్మెంట్ ఇన్ థర్డ్ వరల్డ్ "
గా పశ్చిమ దేశాలు చిత్రీకరించాయి.
సహజ సిద్ధమైన వనరులతో, అత్యల్ప ద్రవ్యంతో సమస్యను నివారించ గలిగే
పద్ధతులను అందించారు. ఉదాహరణకి నీటిలోని ఫ్లోరస్ ని
నియంత్రించేందుకు కొబ్బరి చిప్పలతో తయ్యారు చేసిన బొగ్గు (ఆటివేటెడ్
చార్కోల్) ఉపయోగించే పద్దతిని రూపొందించారు. తద్వారా జనానికి సోకే
వ్యాధులను నివారించగలుగుతున్నారు.
భారత దేశం తిరిగి వచ్చిన తరువాత మాధవన్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్
వాటర్ రిసోర్ సెస్ మానేజ్ మెంట్ సంస్థ నెలకొల్పి దాని గౌరవ
సంచాలకుడిగా ఉన్నారు. ఇటలీ లోని ఐ సి టి పీ సంస్థ మాదిరిగా, ఈ
సంస్థ నీటి శాస్త్రజ్ఞులకి, పరిజ్ఞానికులకి, నిర్వాహకులకి శిక్షణ
ఇస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆవశ్యకతకు తోడ్పడుతోంది.
యునెస్కో సంస్థ, మాధవన్ ఇంటర్ నేష్నల్ సెంటర్ ని " సెంటర్ ఆఫ్ ఎక్స
లెన్స్ ఇన్ అర్త్ సైన్సెస్ " గా గుర్తించింది.
రచనలు:
జియో కెమిస్ట్రీ క్షేత్ర అంతర్జాతీయ నిపుణుడిగా తన పరిజ్ఞానాన్ని
ప్రజా క్షేమాలని కాపాడడానికి వినియోగించిన అపూర్వ పురుషుడు శ్రీ
అశ్వథనారాయణ గారు. వీరు వందకు పైగా సైంటిఫిక్ పత్రాలు ప్రకటించారు.
పది పుస్తకాలు రచించారు. ఇవి ఎంతో ఆదరణ పొందాయి - " ప్రిన్సిపుల్స్
ఆఫ్ న్యుక్లియర్ జియాలజీ " (నెదర్ లాండ్స్) వీరు రచించిన తొలి
పుస్తకం. " ఎంప్లాయ్ మెంట్ జెనరేటింగ్ యూస్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్
- జియో ఎన్విరాన్ మెంట్ ", " సాయిల్ రిసోర్సెస్ అండ్ ది ఎన్విరాన్
మెంట్ ", " వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్ ", " మినరల్
రిసోర్సెస్ మెనేజ్ మెంట్ అండ్ ది ఎన్విరాన్ మెంట్ ", " ఏజ్ డిటర్
మినేషన్ ఆఫ్ రాక్స్ అండ్ జియో క్రొనాలజీ ఆఫ్ ఇండియా ", " ఎనర్జీ
పోర్ట్ ఫోలియోస్ ", " వాటర్ రిసోర్సెస్ మెనేజ్ మెంట్ అండ్ ది
ఎన్విరాన్ మెంట్ ", " అడ్వాన్స్ మెంట్ ఇన్ వాటర్ సైన్స్ మెతడాలజీస్
" అశ్వథనారాయణ గారి ఇతర రచనలు.
అస్వతనారాయణ గారి ప్రసిద్ధ రచన - " నాచురల్ రిసోర్సెస్ అండ్
ఎన్విరాన్ మెంట్ " జి ఎస్ ఐ ప్రకటించింది. ఇది పలు భాషలలోకి తర్జుమా
చేయబడింది. " అడ్వాన్సెస్ ఇన్ వాటర్ సైన్స్ మెథడాలజీస్ " (2005), "
ది ఇండియన్ సునామి " (2006), " ఫూడ్ అండ్ వాటర్ సెక్యూరిటీ "
(2008), " ఎనర్జీ పోర్ట్ ఫోలియోస్ " (2009) వీరి ఇతర ముఖ్య రచనలు.
ఈ పుస్తకాలన్నీ తమ క్షేత్ర రంగంలో ఆణిముత్యాలే. పర్యావరణ
క్షేత్రానికి సంభందించిన " గ్రీన్ ఎనర్జీ - టెక్నాలజి, ఎకనామిక్స్
అండ్ పాలసి " (బ్రిటన్) డాక్టర్ అశ్వథనారాయణ గారి ఇతర రచనలు.
నిర్వహించిన పనులు, అందుకున్న పురస్కారాలు:
- ఫెల్లో, యునిడో (1989)
- ఫెల్లో, యు ఎన్ ఔటర్ స్పేస్ అఫ్ ఫైర్స్ డివిషన్ (1989)
- అమెరికన్ జియో ఫిసికల్ యూనియన్, అంతర్జాతీయ పురస్కారం (2007)
- అమెరికన్ జియో ఫిసికల్ యూనియన్, జియో ఫిసికల్ ఎడుకషన్ అవార్డు
(2005)
- ఇంటర్నేష్నల్ అసోసియేషన్ ఆఫ్ జియో కెమిస్ట్రీ, సెర్టిఫికెట్ ఆఫ్
రికగ్నిషన్ (2007)
- శివానంద ట్రస్ట్, (వాటర్ సైన్సెస్) విశిష్ట వ్యక్తి పురస్కారం
(2007)
ఇవి కాక:
- జియో లాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కార్యదర్శి గా ఉన్నారు (1976 -
1979)
- ఐ ఏ జి సి ఐసో టోపిక్ జియో కెమిస్ట్రీ వర్కింగ్ గ్రూప్
అధ్యక్షుడిగా ఉన్నారు
- డక్కన్ వాల్కానిజం వర్కింగ్ గ్రూప్ అధినేతగా ఉన్నారు
- ఇంటర్ నేష్నల్ అసోసియేషన్ ఆఫ్ జియో కెమిస్ట్రీ అండ్ కాస్మో
కెమిస్ట్రీ, " జియో కెమికల్ శిక్షణ " వర్క్ గ్రూప్ అధ్యక్షుడిగా
ఉన్నారు
- ఫ్రాన్స్ లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రేస్ ఎలిమెంట్ రిసర్చ్ లో యు
నెస్ కో నిపుణుడిగా పనిచేశారు
డాక్టర్ అశ్వథనారాయణ గారి విజయాల వెనుక వారి పరిశ్రమ, నిరంతర కృషి,
ప్రగాడ ఆత్మవిశ్వాసం, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్నాయి. సాధించిన
పరిజ్ఞానం ప్రజా హితానికి తోడ్పడింది. కృషి వుంటే మనుషులు
ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న నానుడి సత్యం చేవాళ్ళు ఉన్నారని
ఉదాహరించవచ్చు. ఈ విశిష్ట భూగర్భ శాస్త్రవేత్త భారత దేశానికి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం, భావి తరాలకు ఆదర్శం. |
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
|
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|