అతి సర్వత్ర ...

-- గంటి భానుమతి

>

ఎడమ వైపు, జాకెట్టు కిందగా, తాళం చేతుల్తో గుమ్మటంలా ఉన్న ఓ వెండి గుత్తిని, చీరలో దోపుకుని, ఆ గదిలోంచి ఈ గదిలోకి, మండువాలోకి, వంటింట్లోకి, నట్టింట్లోకి, పెరట్లోకి వెళ్తుంటె ఘల్లు ఘల్లుమంటూ వెళుతున్న లక్ష్మీదేవిలా ఉంటుంది కాంతాలు. ఆ వెండి తాళాల గుత్తి ఆమెకు మంచి శోభనిచ్చింది. ఆమె హోదాని ఒక్క రవ్వ పెంచిందనే చెప్పుకోవాలి.

లయబద్ధంగా వినిపించే ఆ తాళాల గుత్తి శబ్దం, ఆమె ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో చక్కగా అనువాదం చేస్తుంది. దానితో, కోడళ్ళు, పనివాళ్ళు, పిల్లలు భక్తి-భయంతో ఏదో పని చేస్తున్నట్లుగా నటించేవారు. నిజానికి కాంతాలుకి తాళాలు సేకరించి, లిమ్కా బుక్కులోనో గిన్నెస్ బుక్కులోకో ఎక్కాలని లేదు. ఏదో రికార్డులు బద్దలు కొట్టెయ్యాలన్న కోరిక కూడ లేదు.

ఆమె దగరున్న వాటిల్లో చాలా వాటి అవసరం లేనే లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. అందులో పాత సైకిళ్ళ పాడైపోయిన తాళాలచేతులు కూడా ఉన్నాయి. అయినా వాటిని పారేయడం ఇష్టం లేక వాటిని వేరు చేయలేదు. పారేయడం ఎందుకు, పాపం ఉంటాయి అని అనుకుంటుంది. అయితే అన్ని తాళం చేతులు ఒక్క చోట ఉండడం వల్ల ఒక్కోసారి ఏ తాళం చెయ్యి దేనిదో వెంటనే గుర్తురాక తికమక పడిన సమయాలు కోకొల్లలు. అయినా సరే కాంతాలు వాటిని విడదీయ దల్చుకోలేదు. ఒక్క చోట అలా సంఘీభావంతో ఉన్న గుత్తికి, దాని శబ్దానికి అంతా అలవాటు పడి పోయారు. కాంతాలు కూడా ఆ యింటి సర్వాధికారాలు తనదగ్గరున్నాయంత గర్వంగా ఠీవిగా మహారాణిలాగా ధీమాగా నడుస్తూ ఉంటుంది.

ఐతే వసుధైక కుటుంబంలా ఉండే ఆ తాళాల గుత్తివల్ల పరిస్థితి వికటించిన సమయాలు కూడా ఉన్నాయి. ఓ మధ్యాహ్నం రెండిళ్ళ అవతల ఉన్న తోడికోడలింటికి వెళ్ళింది కాంతాలు. ఆ యింటికి వెళ్ళిన ఓ అరగంటకే పెద్దకోడలు తన కొడుకుని పంపింది స్టోర్‌రూం తాళాలు కావాలని. గుత్తి పూర్తిగా మనవడికిచ్చేసి తన శక్తిని ఓ చిన్నపిల్లాడి ద్వారా కోడలికి పంపడం అధికారాన్ని ధారాదత్తం చేయడం కాంతాలుకి బొత్తిగా ఇష్టం లేదు. అందుకని గుత్తి తీసి స్టోర్‌రూం తాళం చెవిని వేరు చేసి ఇచ్చింది.
"ఉరేవ్, జాగ్రత్త! గమ్మున తీసుకు రావాలి. ఏం బోధపడిందా? ఇక్కడున్నట్లుగా రా.. జాగ్రత్త" అనికూడా అంది.
"అలాగే నానమ్మా!" అంటూ ఆ తాళం చెవిని తీసుకుని తుర్రుమన్నాడు.
ఆ తరువాత ఓ ఐదు నిముషాలు మామూలుగానే ఉంది. ఇంక ఆ తరవాత నించీ మనవడు తెచ్చే తాళం చెవి కోసం ఎదురుచూడడం మొదలు పెట్టింది. తెలియని గాబరా ఆమెని చుట్టేసింది.

ఎప్పటికీ మనవడు వచ్చే జాడ లేకపోతే ఇంక అక్కడ కూచోలేకపోయింది. ఇంటికి వచ్చేసింది. ఐతే ఇంటి మూందరే నేల చూపులు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న మనవడు కనపడ్డాడు. మనసు కీడు శంకించింది. ఐనా తేరుకుంది.
"ఏరా ఏదీ తాళం చెయ్యీ? ఇలా తీసుకెళ్ళి అలా తెమ్మన్నాను కదా? ఇక్కడేం చేస్తున్నావూ?" అంటు దీర్ఘాలు తీసింది.
వాడు తల ఎత్తలేదు. కళ్ళెత్త లేదు. అలా కింద చూస్తూ ఉండి పోయాడు.
"ఏరా మాట్లాడవేం?"
ఒక్క సారి తడబడ్డాడు.
"అదే నానమ్మా .. అదే .. నేనూ .. దానికోసమే చూస్తున్నా.

వాధూలసగోత్రీకులకి సహజంగానే పుట్టుకతోనే వచ్చిన కోపం కాంతాలుకీ వచ్చేసింది. వెంటనే నషాళాని కంటుకుంది. బాధ్యత లేదని మనవణ్ణీ, పెంపకం సరిగ్గా లేదని కోడల్నీ ఎన్ని అనాలో అన్నీ కూడా ఛెడామడా అనేసింది. కర్తవ్యం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళంతా పోయిన తాళం చెవికోసం కోనకోనలా మూలమూలలా అంతా వెదికారు. కానీ ఫలితం శూన్యం. కాంతాలు పోరు పడలేక కొడుకులిద్దరూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురం వెళ్ళి కనుక్కొచ్చారు ఉత్తమమైన మార్గాన్ని.
"మీరు అలా అలా నోటితో చెప్పేస్తే తాళం చెవి చేయలేం. మీరు చెప్పిన దాన్ని బట్టి చేయడం చాలా కష్టం. తీరామోసి చేసాక అది తాళంలో దూరుతుందో లేదో. దూరాకా, తిరిగి అది బయటికి వస్తుందో లేదో .. అందులోనే ఉండిపోతే .. అయినా తాళం పాతదని మీరే అంటున్ణారు కాబట్టి దాన్ని పగల కొట్టడం ఒక్కటే మార్గం.." అని పరిష్కారం చూపించాడు.

ఇంటికి రాగానే సుత్తిని వెదికి తెచ్చి పని మొదలు పెట్టారు. కాంతాలు తననే సుత్తితో మొత్తుతున్నట్లుగా అనిపించింది. చచ్చిపోయిన మామగార్ పుస్తకాల అలమారాదో, పాతబొమ్మలున్న అలమారాదో ఐతే బెంగ లేదు. వాటి అవసరమైతే వెంటనే లేదు. కానీ ఇది ఇంట్లో వాళ్ళ జఠరాగ్నిని చల్లార్చడానికి కావలసిన పదార్థాలుండే గది తాళం చెవి. అది తెరుచుకుంటేనే దీపాలు పెట్టే వేళకల్లా వంటవుతుంది. లేకపోతే ... ఆ సుత్తి శబ్దాలు వినలేక చెవులు మూసుకుంటూ తనగదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని మౌనవ్రతం ప్రారంభించింది.

ఏ సత్యాగ్రహమైనా చెయ్యొచ్చు గానీ మౌనవ్రతంలా సాగే సత్యాగ్రహం .. ఆడవాళ్ళకైనా మగవాళ్ళాకైనా చాలా కష్టమే. ఏదో గాంధీగారంటే .. వేరు .. ఆయన థియరీ వేరు. అది ఆయనకే చెల్లింది. ప్రస్తుతం కాంతాలు గాంధీగారు కాదు కాబట్టి సత్యాగ్రహం విజయవంతం అయిందనడానికి వీల్లేదు. ఎందుకంటే కాంతాలు ఓ స్త్రీ. మాట్లాడ్డం ఆమెకు జన్మతః వచ్చినది. అదో సాంప్రదాయం. అందుకని ఆమె సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎక్కువ సేపు ఉండలేక పోయింది. ఐతే ఆ విరిగిన తాళం ముక్కల్ని ఏరి ఓ మూల దాచింది.
ఎందుకూ? దానికి సమాధానం లేదు.
ఇది జరిగి ఎంతో కాలం కాలేదు.


కావడానికి అదీ పల్లెటూరే. కానీ అతిథులూ, అభ్యాగతులూ ఎక్కువగానే వస్తుంటారు. ఐతే అది సీజనల్. ఉద్యోగరీత్యా వేరేనగరాల్లో ఉంటున్నా ఇంకా ఇళ్ళూ వాకిళ్ళూ పొలం పుట్రా ఉండడం వలన కానీ, ఊరి మీద ఉన్న మమకారం కానీ ఏదైనా కానీ వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడి వైశాఖమాసం పెళ్ళికీ, శరన్నవరాత్రులకీ, కార్తీక మాసం శివాలయంలో చేసే రుద్రాభిషేకాలకీ, లక్ష బిల్వార్చనలకీ ఇలా వాళ్ళకి తోచిన వీలైన సమయాల్లో వస్తూ ఊళ్ళో వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ ఇండ్లకి వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. అలా ఓ సారి ఓ నలుగురు ఆడా మగా అతిథులు కాంతాలు ఇంటికి వచ్చారు. కోడళ్ళిద్దరూ టీ చేయడం కోసం లోపలికెళ్ళారు. ఆ సఖ్యతకి వచ్చిన వాళ్ళు ముచ్చట పడ్డారు. టీకి నీళ్ళు పొయ్యి మీద గిన్నెలో పెట్టి టీ డబ్బా చక్కెర డబ్బాలు పక్కన పెట్టూకుని మూతలు తీసి చూసింది. చక్కెర నిండుకుండి.

"అయ్యో అక్కా! చక్కెర నిండుకుంది. అత్తయ్యనడిగి తాళం చెయ్యి తీసుకురా!"
"అలాగే" అంటే మంచి నీళ్ళు ఇచ్చే వంకతో వీధి సావిడి గదిలోకి వెళ్ళి అత్తగారి దగ్గరికొచ్చి తాళంచేతులివ్వమని అడిగింది. కాంతాలుకి అలా అందరి ముందూ తాళాల గుత్తి ఇవ్వడం ఇష్టం లేదు.
"నువ్ పద, నే వస్తున్నా" అంటూ స్లోమోషన్ లో లేచింది.
తొందరగా గోడకున్న అలమార తలుపు తీయాలన్న ఊహతో ఓ దానికొకటి దూర్చింది. తాళం తెరుచుకోలేదు. సరే అనుకుని ఆ చెవిని లాగబోయింది కాంతాలు. తెరుచుకోనే లేదు. లాగింది. అటూ ఇటూ తిప్పింది.
అది బయటికి రానని మొరాయించింది. పైగా ఇంక బిగుసుకు పోయింది.b "నువ్వక్కడ కూర్చో. బాగుండదు. మనం ఏదో మంతనాలు చేస్తున్నా మనుకుంటారు .." వెళ్ళు .. నే దీని సంగతి చూస్తా" అంటూ పెద్ద కోడల్ని వచ్చిన చుట్టాల దగ్గిరికి పంపింది.
టీ రాక పోయేటప్పటీకి పెద్ద కొడుకు లోపలికి వెళ్ళాడు.
"వాళ్ళనక్కడ కూర్చోపెట్టి మీరేం కబుర్లు చెప్పుకుంటున్ణారు? టీ ఏది? పావు గంట నుండి కూర్చోని ఉన్నారు" అంటూ ఆ ఇద్దర్నీ చూశాడు.
సంగతి తెలుసుకున్నాడు.
"హుహ్. దీనికింత గొడవేవిటి? ఈ వెనకాలనించి వెళ్ళి పెద్ద పిన్ని ఇంట్లోంచో బుల్లి పిన్ని ఇంట్లోంచో తేవచ్చు కదా? అవతల వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు. మీరిచ్చే టీనీళ్ళ కోసం వాళ్ళు కూచుంటారనుకుంటున్నారా? తొందరగా తెచ్చి టీ చెయ్యండి." అంటు కర్తవ్యం బోధించి వెళ్ళిపోయాడు.
అలాగే అంటూ లేచింది కోడలు. కాంతాలు ఎడంచేత్తో వారించింది.
"ఆగు. ఎక్కడికీ వెళ్ళేది? వెళ్తే మన పరువు పోదా? పక్కనే ఉన్న వెంకాయ్ నోరు అసలే ఓ టీవీవార్తల ఛానెల్. ఆ మొగలో నిలబడి వచ్చేవాళ్ళకీ పోయేవాళ్ళకీ అడిగే వాళ్ళకీ అడగని వాళ్ళకీ ఆపి మరీ చెప్తుంది. మనం ఎంత తెలివి తక్కువ పని చేశామో ఊరూ వాడా టాం టాం చేస్తుంది. కొబ్బరి బోండాలు తీసినవి ఉన్నాయి, కొట్టి ఇచ్చేయండి వాళ్ళకి."

అప్పుడే ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లో వాళ్ళు చేసుకున్న సదుపాయాలూ అవీ చూస్తూ వంటింటి దగ్గరకు వచ్చారు. "పల్లెటూరైనా అన్నీ బాగా చేసుకున్నారు. బావుంది. ఇంక మేం వస్తాం." "ఉండండి. గంగా బోండాలు తీసి ఇస్తాం. తాగి వెళుదురు కాని."
వాళ్ళు వెళ్ళాక ఇంట్లో కళింగ యుద్ధం అయింది.
మళ్ళా తాళం బద్దలు కొట్టారు.
కాంతాలు వ్రతం చేసింది.
రాత్రికి ఉద్యాపన కూడా చేసేసుకుంది.

ఇలాకాదని, ఈ మౌనవ్రతాలు, ఆగ్రహంతో సత్యాగ్రహాలూ ఉద్యాపనలూ భరించలేమని ఇంట్లో వాళ్ళకి అర్థమై పోయింది. కాంతాలు పెద్దకొడుకు హైద్రాబాద్ ఏదో పనిమీద వెళ్ళినప్పుడు నెంబర్లున్న తాళం తెచ్చాడు. ఆ నెంబర్లు సరిగ్గా తిప్పితే ఆ తాళం తెరుచుకుంటుంది. నెంబర్లని అటూ ఇటూ మార్చేస్తే తాళం మూసుకు పోతుంది. మరి తెరుచుకోదు. ఇదేదో బాగుంది గొడవ ఉండదు అని అనుకుని అంతా సంబర పడ్డారు. కాంతాలుకి కూడా ఈ అక్షరాస్యత ఉన్న తాళం చాలా నచ్చింది. బాగా సంతోషించింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.

జీడిపప్పులూ, వేపుడు బియ్యం, జంతికలూ, నెస్కాఫీలూ, చక్కెరా, టీ పొడీ ఇష్టం వచినట్లుగా రెక్కలు తొడుక్కుని ఎగిరిపోతున్నాయని గ్రహించింది. ఒకటి రెండు సార్లు రెడ్ హేండెడ్ గా పట్టుకూంది. ఆమెకి తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ తరువాత కాంతాలు ఆ తాళాన్ని తీసి నూతిలో పడేస్తుంటే ఎవరూ నోరెత్తలేదు. తాళం అక్షరాస్యత అనర్ధ దాయకం అని తెలుసుకుంది కాంతాలు.
ఈ మూడు అనుభవాలు మిగిల్చిన చేదులోంచి పాఠం నేర్చుకుంది కాంతాలు.

ఆలోచనలో పడింది. తాళం నొక్కగానే పడిపోవాలి. తెరవడానికి మాత్రం తాళం చెవి కావాలి. ఇంట్లో వాళ్ళ భయం ఉండదు. అటూఇటూ తిరిగే వాళ్ళనించి కూడా భయం ఉండదు. తనే స్వయంగా అమలాపురం వెళ్ళి తెచ్చుకూంది. ఆ భోగం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఓ రోజున అతగారూ కోడళ్ళూ కలిసి జంతికలూ, లస్కోరా ఉండలూ చేశారు. అన్నింటినీ నాలుగు కుంచాల డబ్బాల్లో సద్దుతుండగా వీధిలో సన్నాయీ డోలూ వినబడింది. వీధి తలుపులు తీసి ఉన్నా తలుపు టకటకా కొట్టారు.
"ఏవండోయ్ ఉన్నారా?"
కోడళ్ళిద్దరూ గబగబా వెళ్ళారు. ఈ లోపునే కాంతాలు డబ్బాలన్నింటినీ గోడకి ఉన్న అలమారలో పెట్టి తాళం నొక్కి చేతులు తుడుచుకూంటూ నవ్వుతూ బయటికి వచ్చింది.

వీధి చివర ఉన్న వడ్లమాని వారి కోడలు గ్రామకుంకం నోము చేసుకుందిట. ఆమె అమెరికానుంచి వచ్చి ఇక్కడ నోము నోచుకుందిట. ఆమెకు ఊళ్ళో వాళ్ళతో పరిచయం లేదని, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమెకు తోడుగా సంబరంగా వచ్చారు.

తమిరిశ జానకి గారి విశ్లేషణ: అతి సర్వత్ర వర్జయేత్ అనేది ఏ విషయానికైనా వర్తిస్తుంది. అది తాళాల గుత్తికి అన్వయిస్తూ తమాషాగా శ్రీమతి గంటి భానుమతిగారు రాసిన హాస్యకథ ఈ "అతి సర్వత్ర ..". ఇదివరకటిరోజుల్లో ఉమ్మడికుటుంబాల్లో తాళాలగుత్తికి చాలాప్రాముఖ్యత ఉండేది. ఇంటికి పెద్దదయిన మహిళ చేతుల్లో తాళాలుండేవి. తమకంటే చిన్నవారి చేతికి అవి అప్పగించడానికి ఇష్టపడేవారు కాదు. ఇతరుల దృష్టిలో తాము తక్కువ అయిపోతామనే భావం వారిని భయపెట్టేది. కానీ రోఉలు మారాయి. పరిస్థితుల ప్రభావం వల్ల ఉమ్మడికుటుంబాలూ తగ్గిపోయాయి. ఎవరి తాళాలు వారివే. ఎవరి చికాకులు వారివే. ఈ కథలో కాంతాలుకి చాదస్తం పాలు కాస్త ఎక్కువే. తాళాలగుత్తి ఎవరికీ ఇవ్వకపోవడమే కాదు అక్కర్లేని పనికిరాని తాళం చేతులుకూడా గుత్తిలోంచి తీసెయ్యకుండా పెట్టుకుని తిరగడం అదో గొప్ప, అదో సరదా. దానివల వచ్చే అగచాట్లని అర్ధం చేసుకుని మసలుకోలేని కాంతాలు చాదస్తంగా ప్రవర్తించే కొంతమందికి ప్రతీక. అటువంటి వారు చాదస్తానికి దూరమైతే తప్ప మిగిలిన కుటుంబ సభ్యులకి మనశ్శాంతి ఉండదు.

గంటి భానుమతి గారు 1986 నుండి రచనలు చేస్తూన్నారు. ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో వారి కథలు, వ్యాసాలు, కవితలు ప్రచురితమయ్యాయి. వీరు పుట్టింది,పెరిగిందీ హైదరాబాదులో. భర్త ఉద్యోగ రీత్యా పలు దేశాలలో నివసించి ఆ అనుభవాలకు కథా రూపమిస్తూ రెండు కథా సంపుటాలు వెలువరించారు. "మహనీయుల జీవిత చరిత్రలు" పుస్తకం రచించారు.