అద్దంలో బొమ్మ

 


- విహారి


ఉదయం నడకకి సిద్ధమవుతూ రవికి ఫోన్ చేశాను.“చెప్పండి నాన్నా. రాత్రి ఒంటి గంట కొచ్చి ఇప్పుడు మళ్లీ
బయలేర్దుతున్నా. కంపెనీలో ఏదో గొడవలు. చాలా బిజీగావుంది.”ఫోన్ కట్ అయింది లేదా తొందరలో వుంది వాడే కట్ చేశాడేమో మళ్లీ చేశాను. సుందరి తీసింది. రవిభార్య. “ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తున్నానమ్మా. రెండు పెళ్లిళ్లన్నై. అఖిల మరిదిదీ.” గణపతి బావ మరిదిదీ. అఖిల నా కూతురు. గణపతి నా రెండో కొడుకు.“సరే వెళ్లిరండి మామయ్య .ఆ శుభలేఖలు మాకూ వచ్చాయి
మేము చాలా బిజీగావున్నాం మామయ్యా. పైగా మీ మనవళ్లి దర్గికీ పరీక్ష రోజులు రాలేకపోతున్నామని చెప్పండి వాళ్లకి” అని రిసీవర్ పెట్టేసింది .రవి బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు.సుందరి ఏదో ప్రైవేట్ కంపెనీలో హెచ్ ఆర్ హెడ్. ఆమెకూడా బిజీ ఇంట్లో పనిమనిషీ , వంటమనిషీ ఉన్నారు. అయినా సాధారణంగా
ఇలాంటి ఫంక్షన్స్ కి తాను రాలేనంటుంది.నడక మొదలెట్టాను. నడకతో పాటు నా ఆలోచనలూ
సాగినై పాత రోజులూ, ఈ నాటి రోజులూ... మనుషులూ...
స్వభావాలూ... జీవనశైలీ... అన్నీ కలగాపులగంగా తలపు కొస్తున్నాయి.
ఈ తరమంతా ఊపిరి సలుపుకోలేని బిజీ జీవితంలో
పడి సతమతమవుతున్నారు. మా తరం వేరు. నేను చేసింది చిన్న
ఉద్యోగం. పిల్లలకి మంచి చదువులే చెప్పించాను. ఉన్నంతలో
తృప్తిగానే బతికాను. గణపతి హైదరాబాద్ లో మర్కెటింగ్ లో
కుదురుకున్నాడు. గణపతి భార్య మాధవి. చిన్న ఉద్యోగం. ఇద్దరు
ఆడపిల్లలు అఖిల భర్త చీరాలలో క్లాత్ మర్చంట్ వాళ్లకి
ఒక్కడే కొడుకు. మిగిలింది నేనూ, అక్కయ్య చంద్రమ్మా. ఆమె
మా ఇంటికి పాతకాపు. చిన్నతనంలోనే భర్త గతించాడు. భర్త తరఫున
ఏమీలేదుః ఈ మెకీ ఏమీ రాలేదు. మా కుటుంబంలో ఒక తయిపోయింది.
పెద్దదిక్కుగా నిలిచింది . పిల్లల్ని బుజాన్నవేసుకుని పెంచింది. నా భార్య
శారదకీ, అక్కయ్యకీ మనసులు కలవటం ఒక అదృష్టం. శారద
పోయి నాలుగేళ్లు. ఆమె పోయిన ఆర్నెల్లకే నా రిటైర్ మెంట్.
రవీకీ, గణపతకీ చెప్పింది చంద్రమ్మక్కయ్య. “ఏదో చారెడు
గూడువుంది గదా . చాలు మీరు మమ్మల్ని రమ్మనలేరు . మేముగా
వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలనీ లేదు. మా రోజులిలా వెళ్లమారి
పోనీయండి. నెల నెలా వెయ్యీ పంపండి గడిచిపోతుంది” అని
ఈ నాలుగేళ్ల నుంచీ అలాగే గడిచిపోతోంది.
నడక ఒక రౌండు అయింది. వాకర్స్ కోసమే కట్టిన గట్టు
మీద కూర్చున్నాను. బారులు తీరిన చెట్లనుంచీ చల్లటి గాలి
వీస్తోంది. మంచి మనసు మాటలా పులకరింప చేస్తోంది కమ్మతెమ్మెర.
నగరం నాజూకు తనం – వేకువ రేకల్లో బయటికొస్తోంది.
జనసంచారం మొదలవుతోంది. బిజీ జీవనం రోడ్డు కెక్కుతోంది
“ఏమిటి మాష్టారూ ఆలోచిస్తున్నారుకి” అంటూ వచ్చాడు

విఠల్ రావు. వాకర్స్ వలన పరిచయాలు బాగానే పెరిగినై గట్టుమీద కూర్చున్నాడు.
“చెప్పండి ఎలా బిజీనెస్?” అడిగాను.
“ఏం చెప్పను మాష్టారూ రియల్ ఎస్టేట్ చేస్తున్నానంటేనే
అదోలా చూస్తారు జనం రిజిష్టేషన్ సమస్యలూఠ”
విఠల్ రావుకి బ్యాంక్ లో ఉద్యోగం, కానీ ప్లాట్ల వ్యవహరంలో
బిజీ. ఇటు కొనే వారిదగ్గరా, అటు అమ్మేవారి దగ్గరా కమీషన్ ని
బాగానే లాగిస్తాడంటూ వుంటారు – తెలిసినవాళ్లు ప్రమోషన్లు
తీసుకోకుండా, విజయవాడలో స్థిర పడ్డాడు.
ఇంతలో కృష్ణమూర్తి వచ్చాడు చిరునవ్వుతో నేపలకరించాడు
పక్కగా కూర్చున్నాడు. అతన్ని చూసి లేచాడు విఠల్ రావు.
“ఏవైనా బేరాలు తెలిస్తే చెప్పండి సారూ నన్నుమరచిపోకండి.
ముగ్గురాడ పిల్లల తండ్రిని. ఎంతొచ్చినా దిగలాగుడుగానే వుంది”
అని వాచీ చూసుకుంటూ లేచి వెళ్లిపోయాడు.
విఠల్ రావు మాటలు విన్న కృష్ణమూర్తి అదోలానవ్వేడు.

“పెద్ద హేండ్ సార్ – ఇతను. ఎప్పుడూ బిజీనే. నీతో మాట్లాడితే
నాకేమిస్తావ్ అనెరకం పెద్ద బనేవా” అన్నాడు.
“అంటే ?” అడిగాను . నిజంగానే బనేవా అంటే అర్థం కాలేదు
“బనేవా – అంటే బతకనేర్చిన వాడు సార్” అని నవ్వేడు.
నాకూ నవ్వొచ్చింది . కృష్ణమూర్తి ఆర్ ఎంపీ. అతని హస్తవాసి.
మంచిదని చుట్టు పక్కల పెద్దపేరు. సన్నకారు, చిన్నకారు రోగులకి
అతనొక ఆపద్భాంధవుడు. ఉదయం తొమ్మిది నుంచీ రాత్రి పదిదాకా
బిజీ...బిజీ అతను. కృష్ణమూర్తి సెల్ మ్రోగింది .”ఆ...వస్తున్నా.....”
అంటూ లేచి , “వస్తా మాష్టారూ” అని చకచకా వెళ్లిపోయాడు.
పూర్తిగా వెలుగొచ్చింది .నగరం రొదమొదలైంది . సవ్వడీ,
వడీ జోరందుకున్నై . మనుషులంతా బిజీ. పరుగో పరుగు....
నేను లేచి ఇంటి ముఖం పట్టాను.
దారిలో కాశీపతి ఇంటికి వెళ్లాను. అప్పటికే అతనెక్కడికో
వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు. కాశీపతి మా ఇంటి పురోహితుడు.
“మా అమ్మ ఆబ్దీకం. తిథి రేపు సోమవారం కాశీపతీ గుర్తు చేసి
పోదామని వచ్చాను” చెప్పాను “ఆఁ . నాకు గుర్తే మాష్టారు
అని కొంచెం పనుంది మరి, వెళ్లిరానా అని చెప్పుల్లో కాళ్లు
పెట్టాడు. నేనూ కదిలాను.

“క్షణం తీరికలేదుః దమ్మిడీ ఆదాయం లేదు – అన్నట్టుంది”.
అని తనకుతాను చెప్పుకుంటూ సైకిల్ తీశాడు. పిల్లాజెల్లా లేరు.
భార్య ఏదో మాల్ లో సేల్స్ గాళ్ గా చేస్తుంది . టైమ్ లేదనే అంటూ
వుంటాడు. ఇక్కడా అక్కడా స్థలాలూ , పాత కొంపలూ కొంటున్నాడని
చెప్పుకుంటూ వుంటారు – చుట్టు పక్కల వాళ్లు.
అలవాటు పడిన కాళ్లు మా ఇంటి ముందు కొచ్చి ఆగినై.
లోపలికి నడిచాను. రాజశేఖర్ కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాడు.
అతను నా మేనకోడలు కుమారిభర్త గవర్నమెంట్ ఉద్యోగి. వేరే
వక్కపొడి, ప్లాస్టిక్ కవర్లూ తయారు చేస్తాడు. చిన్నకుటుంబ పరిశ్రమ
వాటిని షాపులకి వేయటమేకాక , శుభకార్యాలకీ పరిచయస్థులకి సప్లయి
చేస్తూవుంటాడు. కుమారీ ఈ వ్యవహారాలకి అలవాటుపడింది.
“గణపతికీ, అఖిలకీ చెప్పండి మామయ్యా. మేమురాలేక
పోతున్నాం. ఈ కవర్లూ, ప్యాకెట్సూ వాళ్లకి అందజేయండి”
గిఫ్ట్ చెక్స్ ఉన్న గ్రీటింగ్ కవర్లూ , వక్కపొడీ, ప్లాస్టిక్ కవర్లూ
ఉన్న ప్యాకెట్లూ ఇచ్చాడు . “బిజీగా ఉన్నామని చెప్పండి మామయ్యా”
అని మళ్లీ చెప్పాడు. నేనతని భార్యకి మేనమామనైనా, అతనుకూడా
నన్న మామయ్యా అనేపిలుస్తాడు.
“ఏం బిజీనో పాడో. సంపాదనలో పడికొట్టుకుపోతున్నారు.

మనుషులు...” అని లో పల్నుంచీ చంద్రమ్మక్కయ్య ఏదో అంటున్నది.
కానీ, రాజశేఖర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. నేను నిరాసక్తితో
పెదవి విరిచాను. “ఇట్లావుంటే సంబంధాలేం నిలుస్తయ్యింక” - అక్కయ్య.
హైదరాబాద్ చేరేసరికీ ఉదయం తొమ్మిదయింది. బస్ లేటు. ఇంటికి వెళ్లెసరికీ మనవరాళ్లిద్దరూ స్కూల్ కి వెళ్లిపోయారు.
గడపలోనిలబడి హడావిడి పడుతున్నారు గణపతీ , మాధవీ,
“తొమ్మిదికి గడవదాటక పోతే, ట్రాఫిక్ తో ఆ రోజు అవుట్. ఒక
రోజు సెలవు గోవిందా” అని గణపతి చెప్తుంటే, “అన్నీటేబుల్ మీద
సర్దివుంచాను మామయ్య గారూ. కాఫీ ఫ్లాస్క్ లోవుంది. ఇవ్వాళో
అర్జంటు పనుంది. సెలవు లేదన్నాడు మా ఆఫీసరు. స్నానం చేసి
భోజనం చేసేయండి. విశ్రాంతి తీసుకోండి. నాలుగింటికల్లా
పిల్లలొచ్చేస్తారు” అని తానూ కాలు కదల్చింది మాధవి.
సిటీ లైఫ్ మరి. బిజీ. వాళ్ల శ్రమని నేనూహించుకోగలను.
స్నానం అయింది. పేపర్ చేతిలోకి తీసుకుని బాల్కనీలో
కూర్చున్నాను. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కార్లూ, స్కూటర్లూ
కదివిపోతున్నై. ఎక్కువ మంది జంటజీతాల దంపతులే. వీరందరికీ
ఆఫీస్ టైమ్ పదో, పదిన్నరో..... అనిపించింది.
జనమంతా ఉరుకులూ పరుగుల పళ్లచక్రంలో ఇరుక్కు పోయిన
వారే. అందరి మొహల్లోనూటెన్షనే. ఒక్కమనిషీ నవ్వడుకాబోలు
ఏ ఒక్కరూ హాయిగా బతుకుతున్న కళలేదు.
నాలుగు దాటుతుండగా రజనీ, రాగిణీ వచ్చారు. డ్రెస్‌లు
మార్చుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. టిఫిన్ చేశారు.
కబుర్లు చెప్పారు. ఉన్నట్టుండి రాగిణి లేచింది “సారీ... తాతయ్యా
ఇవ్వాళ హోమ్ వర్క్ ఎక్కువుంది”. అంటూ తన గదిలోకి నడిచింది
మరో కొద్దిసేపు నాతో తన స్కూల్ గురించి చెప్పి, టెన్త్ కదా. చాలా ప్రిపేర్ కావాలి తాతయ్యా అంటూ తానూ తనగదిలోకి కదిలింది రజని. అవును,
వాళ్లూ బిజీ.
రాత్రి భోజనాలైనాయి. లోకాభిరామాయణం, మా బంధువుల
యోగక్షేమాలూ సాగినై పిల్లలు నిద్రకుపక్రమించారు. ప్రసంగాను
ప్రసక్తం చెప్పుకొచ్చింది మాధవిః “అస్సలు ఏపనికీ టైమ్ చాలదు.
మామయ్యగారూ. పోనీ ఉద్యోగం వదిలేద్దామా అంటే – ఆగి భర్తవైపు
చూసి, “ఆడపిల్లలు. అనేక ఖర్చులు. నా జీతం ఐదువేలే అయనా,
కనీసం మీకు పంపటానికీ, చిల్లర ఖర్చులకీ వస్తుందని అవస్థ
పడాల్సొస్తోంది..... “అన్నది.

నాకు మనస్సు చివుక్కుమంది .నేను వాళ్లకి భారమనే సంగతి
లేక్యంగా చెప్పిందా మాధవి అనిపించింది. గణపతి మొహం కేసి చూశాను. ఏ భావమూ తోచలేదు. ఆ రాత్రి ఈ ఆలోచనతోనే గడిచింది నాకు.
మర్నాడు ఉదయాన్నే మాధవి, పిల్లల్ని తీసుకుని సలైక్ పురి
శాళ్లమ్మ గారింటికి వెళ్లి పోయింది. తమ్ముడి పెళ్లిగదా అని రెండు రోజులు
ముందుగా రమ్మని మరీమరీ అడిగారట వాళ్ల వాళ్లు.
నేను రాధమ్మ గారింటికి బయల్దేరాను. రాధమ్మ నాబాల్య మిత్రుడు గుర్నాథం కూతురు . ఉండేది మల్యాజిగిరి. ఈ రెండు రోజులూ వాళ్లింట్లో
వుండి , ఆమర్నాడు గణపతి బావమరిది పెళ్లికి వెళ్లాలి. ఆ మర్నాడు
అఖిలా వాళ్లింటికి మకాం .ఇదీ నా ప్రోగ్రాం. అఖిల అత్తగారూ, మరుదులూ
ఈ ఊరివారు .అందుకని ఆ పెళ్లీ ఇక్కడే.
నే వెళ్లేసరికీ రాధమ్మ భర్త - శ్రీధర్ – ఆఫిస్‌కి
బయల్దేరుతున్నాడు. అతని ఉద్యోగం హైటెక్ సిటీదగ్గరట వాళ్ల ముగ్గురు
పిల్లలూ అప్పటి కప్పుడే స్కూల్స్ కి వెళ్లిపోయాడు. నాకు టిఫిన్ పెటచ్టింది
రాధమ్మ. కబుర్లు కలపోసుకుంటూ కాఫీకూడా పూర్తించేశాము.

నేను మ్యాగజైనేదో చేతుల్లోకి తీసుకున్నాను ఎవరో నడి వయస్సు
స్త్రీ వచ్చింది, రాధమ్మని పిలుస్తూ. “మా బంధువులొచ్చరు రాధమ్మగారూ
రెండ్రోజులు ఉండి వెళ్తారనురకున్నాం. కానీ, వాళ్లు ఇప్పుడే ప్రయాణమైనా
రు. ఉత్తచేతుల్తో ఏం పంపుతాం. అందునా వాళ్లింట్లో ఈయన రెండేళ్లుండి చదువుకున్నార్ట ఆ రోజుల్లో రెండు శారీస్ ఇవ్వండి.”
నవ్వుమొహంతో, “అవును... అంతేగామరి... అలాగే” సమాధానాలతో గదిలోకరి వెళ్లి శారీస్ తెచ్చతి టేబుల్ మీద ఉంచింది రాధమ్మ. ఆ
వచ్చినావిడ వాటిల్లోనుంచీ రెండు ఎంచుకుని తీసుకెళ్లింది. “డబ్బు కేంలే
గానీండి. చీరెలు బాగున్నయ్” అంటూ సాయంత్రం ఇచ్చేస్తా లెండి పైసలు అని వెళ్లింది.
నా మనసులోని ప్రశ్నలకి సమాధానమా అన్నట్టు చెప్పె సాగింది రాధమ్మ. ఆయనకొచ్చే నాలుగురాళ్లతో ఏం నెట్టుకొస్తాం చెప్పుబాబాయ్. పిల్లలు ముగ్గురూ చదువల్లో కొచ్చారు. స్కూల్ ఫీజులా, ట్యూషన్ పీజులే చాలా అవుతున్నయ్. అన్నీ పెద్దఖర్చులే. పైగా సిటీవైఫ్. అందుకని ఇంట్లోనే ఈ వ్యాపకం పెట్టుకున్నా. క్లాత్ బిజినేస్‌లో లాభం ఎక్కువ. రెండునెలలకోసారి, ఏ విజయవాడో చీరాలో వెళ్లి సరుకు తెస్తాను. మా కాలనీ వాళ్లంతా ఈ చీరెల్నీ, డ్రెస్ మెటీరియల్ నీ బాగా లైక్ చేస్తారు,” అని నవ్వుతూ,” టైమ్ చాలటం లేదు – పిల్లల పనులతో. చాలాబిజీగా ఉంటుంది. లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు” అన్నది. ఏమనాలో తెలీక “ చాలా బాగుందమ్మా” అన్నాను.
నా మధ ఆలోచనల సుడిలో.... ఇక్కడా బిజీ ... కొత్త కొత్త ఆదాయవనరుల కోసం వెంపర్లాట. ఆర్జనా మార్గాల అన్వేషణ!
రాత్రి భోజనలైనయి. అదే కాంప్లేక్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిట ఆయనొచ్చాడు. పేరు స్వామి. పిచ్చాపాటీగా మొదలైన మాటకచ్చేరీని స్వామి తన ‘బిజినెస్ వైపు మళ్లించాడు. పోస్టల్ పోదుపు పథకాల గురించిన వివిరాలు చెప్పెసాగేడు. శ్రీదర్‌కి చెప్తూనే, మద్యమద్యనున్నూఉద్దేశించి- గిట్టుబాటయ్యే వడ్డీ రేట్లు చెప్పుకొచ్చాడు. “ సరే ఆలోచిస్తా” నని ఆయన్ని పంపించాడు శ్రీదర్.
“ భార్యపేరుతో పోస్టల్ ఏజన్సీ వుంది. సంవత్సరానికో నాలుగు లక్షల ఆదాయంట. బీజీకాక ఏమవుతుంది,” అన్నాడు శ్రీదర్- స్వామిగురించి చెప్తూ.
అందరి ఆలోచనకీ కేంద్రకం సంపాదన డబ్బు, డబ్బుబిజీ..బిజీ
చదివి, చదివి... నిద్రలకి తయారవు తున్నారు రాధమ్మ పిల్లలు.
ఇద్దరు ఆడపిల్లలూ, ఒక పిల్లవాడూ. రేపటి పౌరులు. పోటీ
ప్రపంచంలో, డాలర్ కలలతో – ఊపిరి సలుపనీయని బిజీ చదువు
వీళ్లంతా ఎప్పుడూ టైమ్ లేని విద్యార్థులు ఎన్నటికీ టైమ్ లేని విద్యార్థులు; నేడూ , రేపుకూడా వీరిజీవన గమనంలో పరుగే, పరుగు.
నా కళ్లల్లో నీటి తెర. రెప్పలుతుడుచుకున్నాను. వాటి వెనుక క్షోభ-ఏదో తెలియని ఉద్వేగంతో గుండెని బరువెక్కించింది.
- పెళ్లిళ్లు అయినై. తిరిగి విజయవాడ చేరేను
సాయంత్రం నాలుగయింది. టీ తాగి ముందుగదిలో కూర్చున్నాను. చంద్రమ్మక్కయ్య ఏదో గుడికి వెళ్లింది. ఆమెకు పురాణప్రవచానాలంటే ఆసక్తి. వీధి గుమ్మం తలుపు తీశాను. మాది వీధివార ఇల్లు రోడ్. జనసంచారం, వాహనాలూ అన్నీకనిపిస్తున్నై. అన్ని రకాల బతుకు పోకరాటాలూ అక్కడే జరిగిపోతూవూంటాయి.
వేచి గమ్మంలోకొచ్చాను. మాయింటి మెట్లమీద ఎవరో హమాలీ. వయసెంత వుంటుందో తెలియనీయని ఆకారం. ముగ్గుట్టలాంటి జుట్టు.
గుమ్మంలోంచీ మెట్లమీదకొచ్చి పరీక్షగాచూశాను. బీడీ వెలిదించుకుని తృప్తిగా పొగపీలుస్తూ ఆనందిస్తున్నాడు. మొహం అనాకారిగావుంది. గుంటలుపడిన కళ్లు. చిరుగుల బనీను. చెమటపట్టిన దేహం. చూసిన మొహమే అనిపించింది. క్షణం ఆలోచిస్తే స్ఫురించింది. ఎదురుగావున్న మాల్‌లోకి సరుకులు చేరవేస్తూవుంటాడు. ఏ లోడ్ లారీయో, టెంపోనో వచ్చినప్పుడు- బస్తాలూ, టిన్నులూ, బాక్స్‌లూ దించి మాల్‌లోకి చేరుస్తూవుంటాడు.
తలతిప్పి నాకేసి చూశాడు. మాట్లాడాలనిపించింది. ఎలా మొదలు పెట్టాలా అనే ఆలోచనలో పడ్డాను. క్షణాల తర్వాత అడిగాను, “ బండపని. చాలా శ్రమపడుతున్నావ్. మాల్ వాళ్లు ఏమిస్తారు? ” అని.
నా కళ్లల్లోకి సూటిగా చూశాడు. బహుశ తన గురించీ, తన శ్రమ గురించీ ఈ విచారణలూ, సానుభూతీ- చాలామందినుంచీ వచ్చినట్లుంది. “ ఐటమ్‌కి ఇంతని ఉంటుంది. ఎంతోస్తే అంత.....” అన్నాడు. యథాలాపంగా.
“ అట్టాగైతే కష్టంకదూ. సరిపోవాలి కదా?”
నోట్లో నుంచీ బీడీ తీసి ఉమ్మేసుకున్నాడతను. నా వైపు చూస్తూ పెదవుల అంచుల్నుంచీ చిత్రంగా నవ్వేడు. “ సరిపోవటానికి అంతేంవుందిసారూ. అయినా ఒక్కపొట్టకి రెండు ముద్దలు! ఎంతగా ఆరాటపడినా, పంటికిందకి ఎంతకావాలి గనుక? తాపత్రయపడి సంపాయించి కట్టుకుపోయేదేం వుంది? రెక్కలున్నంతవరకూ మరొకరి మీద ఆధారపడటమెందుకు? వెన్ను జలిదరించిందినాకు”
ఈ మాటలని మెట్టుకి నడ్డిని ఆనించి, చేతులు వెనక్కు మోటించి వాలాడు. హాయిగా, నిండుగా ఊపిరిపీల్చుకున్నాడు.
అతన్ని పరీక్షగా చూశాను. అత్మతృప్తితో వెలిగిపోతున్న త్యాగిలా, ద్యానముద్రలో కూర్చున్నయోగిలా తోచాడు.
విఠల్‌రావు, కృష్ణమూర్తీ, రాజశేఖరం, రాధమ్మా, మా పిల్లలూ.... అందరూ కళ్లముందు మెదిలారు. బిజీ...బిజీ.... సంపాదన... సంపాదన.... అనే ఘోషలో కొట్టుకుపోతున్న అనేకమంది మధ్యతరగతి అల్పజీవులు! వారి భావజాలాన్ని తలకెత్తుకుని బాల్యాన్ని పారేసుకుంటున్న రేపటి పౌరులు!
ఇటుచూస్తే, అన్ని వేదాంతాల, సారంగా-బతుకు మెతుకుల్ని పంచుతూ శ్రమశక్తి! ఎన్నెన్నో జీవన విలువలకి పుటం పెట్టిన వాస్తవం! తామరాకుమీద నీటి బొట్టులా ఈ మనిషి! నిలిచి వెలుగుతున్న ఆత్మస్థైర్యం!
నా కోడలి మాటలు చెవుల్లో రింగుమన్నాయి నాకు. నా కోసం తాను శ్రమిస్తోంది! ఇతను చెప్తున్నసూక్తి సంగతేమిటి
అప్రయత్నంగా అతని పక్కగా అదెమెట్టుమీద కూర్చుండిపోయాను. అతనన్నమాటల్ని నెమరువేసుకోసాగింది మనసు.ఏదో జ్ఞానోదయం అవుతోందనిపిస్తోంది! అర్థం పరమార్దం అందుతోంది, మనిషి మనిషికీ చెప్పాలీ కథ!


 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech