సరదా రమణీయం 

 

-ముళ్ళపూడి వెంకట రమణ

చిత్రంగా ఉందే.. ఒక్క నిముషం ఉండండి. కోటు జేబులో ఉందేమో చూస్తాను అన్నడు అప్పారావు తొట్రుపడుతూ.

అబ్బే తొందరేం లేదు. తాపీగా చూడండి అన్నడు టిక్కెట్టు కలెక్టరు. ఖాళీగా ఉన్న మూడవ తరగతి పెట్టెలో కాళ్ళు బారజాపి కూర్చుంటూ..

 

అప్పారావు కోటు తడవడం మానేసి కిందనున్న పెట్టెను కొంచెం పక్కకి లాగాడు. ఏవండీ మీరు అహూరాత్రాలు రైళ్ళలోనే తిరుగుతూ ఉంటారు. టికెట్టు కొనుక్కుని కూడా రైల్లో బల్ల అడుగున దూరి ప్రయాణం చేసిన ఆసామీ కథ విన్నారా అన్నాడు.

 

ఎవరండీ, గుర్తులేదే అన్నడు. టిక్కెట్టు కలెక్టరు. సిగరెట్టు ముట్టిస్తూ..

మహాద్భుతమైన కథలెండీ, లైను లోనే జరిగింది. తెనాలి బెజవాడ స్టేషన్ మధ్య. సుబ్బారావూ ఇంకో సింగారం తెనాలినుండి బెజవాడ బయలుదేరారు.

 

సుబ్బారావు టిక్కెట్టు కొని, హడావుడిగా ముందునడుస్తూ ఇదిగో టిక్కెట్లు మీ దగ్గరుంచండి అని సింగారానికి అందించాడు. గోచీ సర్దుకుంటూ ఆదరా బాదరా వెనకాల వస్తున్న సింగారం అందుకుని జేబులో పడేసుకున్నాడు. అని ఆగి కోటు జేబులో వెతకటం మొదలుపెట్టాడు. చిత్రంగా ఉందే ఇక్కడ లేదు సుమండీ. అని ఆశ్చర్యం వెలుబుచ్చాడు.

 

సరే కథ చెప్పండి.

కథకేముంది. సుబ్బారావు అందిచ్చిన రెండు టిక్కెట్లయితే సింగారం అందుకున్నది ఒక్క టిక్కెట్టే. రైలు బైల్దేరాక వాళ్ళీ సంగతి తెలుసుకున్నారు. రెండూ నీకే ఇచ్చా నంటాడు సుబ్బారావు. కాదొక్కటే నంటాడు సింగారం. ఇంకోటి కొనడానికి ఇద్దరి దగ్గరా డబ్బులేదు. నేనిచ్చిన డబ్బుక్ర్ నాకు టిక్కెట్టిచ్చావు. పైన నాకేం తెలీదు. అనేశాడు సింగారమ్. అయితే నన్ను బల్ల కింద దూరమంటావా అన్నాడు సుబ్బారావు బిక్కమొహం పెట్టి. నాకేం అభ్యంతరం లేదు. అన్నాడు సింగారం. అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి టిక్కెట్టు కలెక్టర్ గారు.అన్నాడు అప్పారావు.

 

మరే మరే, అంతే కదండి. తనకి మాలిన ధర్మం ఏముంది.. అన్నడు టిక్కెట్టు కలెక్టర్

 

సరే, సింగారం బల్ల మీద కూర్చున్నాడు. టిక్కెట్టు లేని సుబ్బారావు బల్ల కింద దూరాడు. చాలా మంచివాడులెండి. అయినా ఒక టికెట్ కలెక్టక్ వచ్చాడు. చాలా మంచివాడు లెండి. అయినా సంగతి బల్ల కింద పడుకున్న సుబ్బారావుకి తెలీదుగా. అసలే బల్లకింద నారింజ తొక్కలు, పిప్పి, చుట్టపీకెలు, బీడీ ముక్కలూ, పులిహోరలో మిరపకాయలు, ఎంగిలాకులు, వల్లకాడు, నశనపుకం మొదలైన మోకాల్లోతున ఉన్నాయేమో సుబ్బారావు ఊపిరి సలపక ఉక్కిరి బిక్క్రిరైపోతున్నాడు. 

పాపం

 అంతలో టికెట్ టికెట్ అనే భయంకరమైన మాటలు వినిపించాయి. టకటకా మంటూ బూటుకాళ్ళు కనిపించాయి. సుబ్బారావు గుండె గుభేలుమంది. అప్పారావు ఆగి, పరీక్షగా చూశాడు.

 టికెట్ కలెక్టర్ వచ్చి సింగారాన్ని టిక్కెట్ అడిగాడు. సింగారం బల్లకింద సుబ్బారావుని తలచుకుని కొంచేం కంగారుపడుతూ టికెట్ అందించాడు. అప్పుడేమయింది తెలుసాండి.

 తెలీదండీ

 

కంగారులో సింగారం అందివ్వబోయిన టిక్కెట్టు చేతిలోంచి జారిపోయింది. సింగారం వంగిచూస్తే కనబడలేదు. లేచి నుంచుని పంచె కుచ్చిళ్ళు దులిపాడు. అన్నాడు అప్పారావు.

 అప్పుడేమయ్యింది.

 

ఏమవుతుంది. సింగారం టిక్కెట్టు తో పాటు ఇంకో టిక్కెట్టు కూడా కింద పడింది. రెండోది కూడా మంచిదే. తెనాలిలో సుబ్బారావు అందిచ్చిన రెండు టిక్కెట్లలో అది రెండవదన్నమాట. జారిపడి సింగారమ్ పంచె కుచ్చిళ్ళలో పాదాలమీద ఉన్న మడతలో తలదాచుకుంది.

 చిత్రంగా ఉందే. అన్నడు టికెట్ కలెక్టర్.

 ఆవేళ రైల్లో ఎక్కిన టికెట్ కలెక్టర్ కూడా అదే మాట అన్నాడండీ. రెండు టిక్కెట్లు చూసి రెండో ఆయన ఏడీ అడిగాడు, బల్ల కింద పడుకున్నాడండీ. అదో సరదా, అదో రకం ముచ్చట లెండి అన్నాడు సింగారం సిగ్గుపడుతూ.

 కథ విన్న టికెట్ కలెక్టర్ కడుపిబ్బేలా, కణతలు ఎర్ర బడేలా కంటనీరు తిరిగేవరకూ నవ్వాడు. నవ్వడం పూర్తి అయిపోయాక సరే మీ టికెట్ దొరికిందా అని అడిగాడు గంభీరంగా.

 అప్పారావు టికెట్ దొరకలేదు. ముచ్చెమటలు పోశాయి. జేబురుమాలి తీసి మొహం తుడుచుకోబోయాడు. అందులోంచి టికెట్ నేలరాలింది. అదిగో అన్నాడు. అప్పారావు వంగి, వంగినవాడు అర నిముషం వరకూ లేవలేదు. అరనిముషం తరువాత నిటారుగా నిలబడి రెండు టిక్కెట్లు చూపించాడు. టిక్కెట్టు కలెక్టర్ కళ్ళు విప్పార్పి చూశాడు అప్పారావు వంక.

 రెండోది నా పంచె కుచ్చిళ్ళలో ఉందండి.. మా నేస్తం...

బల్లకింద పడుకున్న నేస్తం కిందపడున్న సిగరెట్ పీకతో చురకపెట్టాడు అప్పారావు కాలిమండ దగ్గిర. అప్పారావు కెవ్వుమన్నాడు.

 -ముళ్ళపూడి వెంకట రమణ

(పునర్ముద్రితం)

 

 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech