అన్నమయ్య కృష్ణ తత్వం

 

- శ్రీమతి సరోజా జనార్ధన్

అన్నమయ్య అనగానే శ్రీ వేంకటేశ్వరుడు అందరి కన్నుల ముందు నిలుస్తాడు. శ్రీ వేంకటేశ్వర అవతార మహత్యాన్ని పెంచినది అన్నమయ్య అనడంలో అతి శయోక్తి లేదు. శ్రీనివాసుణ్ణి ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఆవిష్కరించవచ్చో అన్ని విధాల మన కనుల ముందుంచాడు అన్నమయ్య. వేంకటేశ్వరునితో పాటు అమ్మ లక్ష్మీదేవిని కూడా అనేక కీర్తనల్లో వర్ణించాడు. దశావతార విశేషాలను పలుచోట్ల వర్ణించాడు.ఎన్నో నీతులను, జీవిత సత్యాలను అందించాడు. వీటన్నింటితో పాటుగా శ్రీ కృష్ణ తత్త్వాన్ని తనదైన శైలిలో ఎన్నో కీర్తనల్లో శ్లాఘ్హించాడు.కృష్ణుణ్ణి తలవని వాగ్గేయకారులుంటారా? ఆ తత్వం అలాంటిది.

అద్వైత సిద్ధాంత స్థాపకులైన శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఎన్నో సిద్ధాంత పరమైన స్తోత్రాలు, గ్రంధాలు రచించి, చివరకు ఏదో తెలియని నల్లని స్వరూపం తనని ఆకర్షిస్తోందని, శ్రీ కృష్ణావతారాన్ని గురించి పేర్కొని, భజగోవింద స్తోత్రాన్ని అందించారు. అలాగే అన్నమయ్య ప్రత్యేకించి కృష్ణుని గూర్చి అచ్చ తెలుగులోనూ, చక్కటి సంస్కృతంలోనూ, జయదేవుని అష్టపదులకు ధీటుగా రచించాడా అనిపించేలా.. ఇలా ఎన్నో కీర్తనలు తెలుగులో సంస్కృతంలో మన కందించాడు.

కృష్ణుడు అనగానే ఎవరికైనా తలపుకి వచ్చేది చిన్ని కృష్ణుని రూపం. ఆ శైశవ రూపాన్ని తలచుకుని, ఆ అనుభూస్తి నుంచి తొందరగా బయటపడలేరెవ్వరూ. చిన్ని కృష్ణుని రూప లావణ్యం, చిలిపి చేష్ణలు, మహిమలు స్మరించుకుని, ఆ ఆనందాన్ని మనకి తన కీర్తనా రూపంగా అందించాడు అన్నమయ్య.

భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్ పదం చింతమేయం సదా

అంటూ చిన్నారి కృష్ణుని, ఆయన ముద్దు పాదాలని తానెప్పుడూ తలుస్తానని చెప్తాడు.

కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా
బుజ్జి నడుమికి కట్టిన రత్న ఖచితమైన మొలతాడుని తలుస్తాడు. నిరంతర కవిత నవనీతం బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం

వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చేతులను, ఆ రూపాన్ని ఎప్పుడూ మనసుల్లో నిలుపుకునే సర్వదేవతలనూ స్మరిస్తాడు.

చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి అన్న పద్యం అందరికీ తెలిసినదే కదా

అలాంటి భావమే ఒక కీర్తనగా అందించాడు. ఇందులో పదాల కూర్పు ఎలా ఉంటుందంటే అనుభవించి పాడితే ఆ వెన్న కృష్ణుని రూపం కళ్ళముందు అలా కదలాడుతుంది. చివరికి పరమపురుషం గోపాలబాలం అని చిన్ని కృష్ణుడైనా పరమపురుషుడే కదా అనుకుంటూ కీర్తన ముగించాడు. ఇద్ర్ సంస్కృత రచన.

చిన్ని శిశువు, చిన్ని శిశువి ఎన్నడూ చూడమమ్మ
ఇటువంటి శిశువు.


ఈ కీర్తనలో ఇంకా ముద్దు రూపం చూపించాడు. బలుపైన పొట్టమీద పాల చారలతోడ - నులి వేడి తిన్న నోడి తోడ
ఇంతకన్నా అందంగా, ముద్దుగా ఇక వర్ణించగలరా
ఒక్కసారి ఆ పాలచారలతో ఉన్న బొజ్జని ఊహించి మురిసి పోనివారుంటారా?

మన ఇళ్ళలో పసిపిల్లలు పాలు త్రాగుతూ మీద పోసుకుంటేనే మనం వాళ్ళ రూపం చూసి మురిసిపోతాం.
అలాంటిది ముగ్దమోహన స్వరూపుడైన క్రుష్ణుని విషయం చెప్పేదేముంది.
ఆ ముంగురులు, మువ్వల పాదాలతో
"పాయక యశోద వెంట పారాడు శిశువు" అంటారు ఆ అదృష్టమంతా యశోదదే కదా మరి.
వెన్న కృష్ణుణ్ణి ఎంత వర్ణించినా తనివి తీరదు. అందులోనూ వెన్నదొంగగా చిత్రీకరించడమంటే ఏ రచయితకైనా, కవికైనా ఆనందం.
"ఇట్టి ముద్దులాడి బాలుడేల వాడు వాని
పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే"
"కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన. చేమపూవు కడియాల చేయిపెట్టి
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార-వేమరు వాపోయె వాని వెడ్డు వెట్టరే"

అంటారు
వెన్న కాగుతుంటే అందులో చెయ్యిపెట్తి, చీమ కుట్టిందని ఏడ్చాడట. చేసే దొంగపని కప్పిపుచ్చుకుంటూ, ఎదురు తానే ఏడవడం ఎంత కొంటెతనం కృష్ణుని చేష్టలన్నీ అలాగే ఉంటాయి.
’నవనీత చోర నమోనమో’ అంటారొక కీర్తనలో, చౌర్యం ఆయనకు బిరుదైపోయింది,నామమైపోయింది.
కృష్ణుడు వెన్న దొంగిలించడానికి తెల్లవారు ఝాముననే లేస్తాడట.అలా లేవడానికి వెన్న చిలికేటప్పుడు వచ్చే శబ్దాలే ఆయనకు గుర్తులట.
’శ్రీ కృష్ణకర్ణామృతం’ అనే మహాకావ్యంలో లీలాశుకులనే మహాకవి శ్రీకృష్ణ తత్త్వాన్నంతా రంగరించి పోశారు. అందులొ లేని కృష్ణతత్త్వం కొత్తగా ఎక్కడా ఉండదు.

అందులో ఆ కవి అంటారు
"దధి మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే
నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః
ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్
కబళిత నవనీతః పాతు గోపాల బాలాః"

తెల్లవారు ఝామున పెరుగు చిలికే శబ్దం వినిలేచి, నెమ్మదిగా ఆడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి, దీపం ఆర్పివేసి, వెన్నదొంగిలించే కృష్ణుడు మనల్ని రక్షించుగాక అంటారు.
ఆ శబ్దం ఆతనికి ’అలారమ్’ లాంటిదట. ఇది ఒక చమత్కార వర్ణనైతే, వాగ్గేయకారులకు ప్రకృతిలో అన్నింటా నాదం ద్వనిస్తుంది మన అన్నమయ్య ఒక కీర్తనలో ఎలా వర్ణిస్తారంటే
"ఝుమ్మని మెడి శృతి గూడగను
కమ్మని నేతులు కౌగగ చెలగే"
ఈ కీర్తనలో
"పాలు పితుకుచును బానల కేగుల
సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే"

నేతులు కాగుతుంటే వచ్చే ధ్వని, పాలు పితికేటప్పుడు వచ్చే ధ్వని ఇవన్నీ ఝుమ్మంటూ శృతిలాగ ఉన్నాయంటారు.
సర్వం సంగీతమయంగా దర్శించడమంటే ఇదే కదా.ఇక వెన్న కృష్ణుణ్ణి కాసేపు అటుంచితే, ఆతని శరీర సౌందర్యం గురించి ఎన్ని వర్ణనలో.
’కృష్ణ’ నామం వినగానే నల్లనయ్య నల్లని రూపం గుర్తొస్తుంది అది ఒక అందమైన నీలిరంగు.
నీలవర్ణుడని, నీరజాక్షుడని బాలుని అతివలు పాడేరు’ అంటారు, ఝుమ్మని యెడి కీర్తనలోనే
’శ్రీకృష్ణకర్ణామృతంలో’ కృష్ణుని రంగుని గురించి ఒక శ్లోకం చిన్న కధగా చిత్రిస్తారు.
చంద్రునికి నక్షత్రాలన్నీ భార్యలట. స్వాతి కార్తెలో, ముత్యపు చిప్పలో నీటి బిందువు పడితే అది ముత్యంగా మారుతుందట. స్వాతి ఒక నక్షత్రం కదా. అయితే ముత్యాలు స్వాతి నక్షత్రానికి సంతానమట. మరి ’రొహిణి’ అనే మరో నక్షత్రం ఉందికదా. అది అనుకుందట స్వాతికి ముత్యాలు సంతానమైతే నేనింకా గొప్ప సంతానాన్ని కంటాను అని, ’కృష్ణుడు’ అనే నీలి రత్నాన్ని కన్నదట. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కదా.
"సా రోహిణి నేల మసూతరత్నం
కృతాస్పదం గోప వధూ కుచేషు"

రోహిణీ కృష్ణుడనే నీలి రత్నాన్ని కన్నది దానిని గోపికలెప్పుడూ తమ వక్షస్థలంలో ధరిస్తారు అని కవి చమత్కరించారు ఇక్కడ లీలాశుకులు కృష్ణుని నీలి రత్నంగా చెప్తే, అన్నమాచార్యులవారు చిన్ని కృష్ణుని నవరత్నాలతోనూ పొల్చి ఒక కీర్తనగా మలిచారు. అదే సుప్రసిద్ధ కీర్తన "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు" అన్నది.
యశోదమ్మ ముంగిట ముత్యము, గొల్లెతలు అంటే గోపికల అరచేతి మాణిక్యము, కంశుని పాలిట వజ్రము, కాంతుల మూడులోకాల గరుడపచ్చ పూస అంటే ముల్లోకాలలో కాంతులు విరజిమ్మే గరుడ పచ్చ పూస, రతికేలి రుక్మిణికి రంగుమోవి పగడము, గోవర్ధనపు గోమేధికము, శంఖు చక్రాల సందుల వైఢూర్యము, కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము,
శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రత్నంగా వర్ణించి చివరికి "పాలజలనిధిలోనా బాయని దివ్యరత్నము బాలుని వలే తిరిగే పద్మనాభుడు"
అంటారు.

 - సశేషం.


శ్రీమతి సరోజా జనార్ధన్ :

ఎమ్మెస్సీ అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "మాస్టర్ ఆఫ్ మ్యూజిక్" పట్టా అందుకున్న శ్రీమతి సరోజా జనార్ధన్ సంగీతం ముఖ్యాంశంగా పద్మావతీ యూనివర్సిటీ (తిరుపతి) యందు  పి .హెచ్. డి. చేస్తున్నారు. సంగీత సాహిత్య కళానిధి \శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి శిష్యురాలైన వీరు ఎన్నో సంగీత కచేరీలు నిర్వహించడమే కాక సంగీతాన్ని భోధిస్తున్నారు కూడా.


 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech