తెలుగువారి తరగని ఆస్తి మొగ్గలు తొడిగి నానా పుష్ప శోభితంగా మార్చాయి. ఇప్పటికీ జెండాపై కపిరాజు వినిపిస్తూనే ఉన్నాడు. బావా ఎప్పుడు వచ్చితీవు అన్న పలకరింపులు మార్మోగుతూనే ఉన్నాయి. మరో వైపు దుడ్దు కర్రలతో పద్యాల్ని మోదుతూనే ఉన్నా పద్యం చిరంజీవిగానే ఉంది.

చిత్రంగా 2007 సంవత్సరానికి పద్య కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్దు అందుకోవడం సర్వత్రా చర్చనీయాంశమే అయింది. 1955లో ప్రారంభమైన అవార్దుల్ని పరిశీలిస్తే పద్యం ఇప్పటివరకూ పలుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్ని చేజిక్కించుకుంది. 1958, 59, 66, 67, 68, 76, 80 లలో అకాడమీ ఏ భాషకీ అవార్డులు ప్రకటించలేదు.

1962 లో మధ్యాక్కఱలు కు - విశ్వనాథ సత్యనారాయణ
1964 లో క్రీస్తుచరిత్ర కు - గుఱ్రం జాషువా
1965 లో మిశ్రమంజరి కి - రాయప్రోలు సుబ్బారావు
1969 లో మహాత్మ కథ కి - తుమ్మల సీతారామమూర్తి
1979 లో జనప్రియ రామాయణము నకు - పుట్టపర్తి నారాయణాచార్యులు
2002 లో శ్రీ కృష్ణ చరిత్రము నకు - ఉత్పల సత్యనారాయణాచార్య

అవార్డులు పొందాక 2007 లో పురుషోత్తముడు కావ్యానికి చిటిప్రోలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్దు పొందడం విశేషం.

ఎవరీ కృష్ణమూర్తి?

నిజానికి వీరి గురించి తెలిసిన వారికన్నా తెలియని వారే ఎక్కువ. ఎందుకంటే ఆయన నూతికి నూరుపాళ్ళు పద్యకవి. పత్రికల్లో రాసిన దాఖలాలు తక్కువ. కవితాగానాల్లోనూ విరివిగా పాల్గొన్నట్లు లేదు. ఒకవేళ కవితా గానాల్లో పాల్గొని ఉంటే అదీ.. గుంటూకి, విజయవాడల్లో జరిగిన వాటిల్లోనే పాల్గొని ఉండాలి. అయితే ఆయన కావ్య సంపద మాత్రం అపురూపమే.

1932 డిసెంబర్ 26 న కనకమ్మ, వేంకటరత్నం దంపతులకు గుంటూరు జిల్లా మారుమూల ప్రాంతాల్లో జన్మించిన చిటిప్రోలు కృష్ణమూర్తి పురుషోత్తముడు కావ్యం కన్నా ముందు కైకేయి, తరంగిణి, మాఘమేఘములు, అక్షర దేవాలయము, మహిష శతకము వంటి పద్య కావ్యాలు రాశారు. ఆయనకు కవి రాజశేఖర్, కవితా సుధాకర అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన గురించి రాస్తూ సుప్రసిధ్ధ కవి, విమర్శకులు కోవెల సుప్రసన్నచార్య పురుషోత్తముడు రచించిన శ్రీ చిటిపోలు కృష్ణమూర్తి 21వ శతాబ్దానికి ఇక పద్యమయ మహాకావ్యం రచించి స్వాగతం చెబుతున్నారు. భారతీయ జీవన తాత్పర్యాన్ని అవిచ్చిన్నంగా వ్యాఖ్యానాన్ని సుందరంగా ఈ అమృతమయ కావ్య రూపంలో అందించారు. ఇంతకు ముందు వచ్చిన దేశభక్తి కావ్యాలకు జాతీయోద్యమం ప్రేరణ అయ్యింది. ఈ మహాకావ్యానికి జాతీయ సంస్కృతి పైనా రచన ప్రేరణ అవుతున్నది. చారిత్రక కావ్యాన్ని సాంస్కృతిక భూమిక మీద నిలబెట్టడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించదగిన అంశం. ఈ మహాకావ్యం ఇంత ప్రాణమహితంగా, భావలోక ప్రకాశకంగా రసలోక కవాట భేదకంగా ఈనాడు వెలికి రావడం ఆంధ్ర సారస్వత సంప్రదాయ చేతన యొక్క సజీవతకు ఉదాహరణం అన్నారు.

అలెగ్జాండర్ దండయాత్రల గురించి తెలిసిందే. ఆయని ఎదిరించిన ధీరోదాత్తుడు పురుషోత్తముడు వారి చారిత్రక గాధను అక్షరీకరించిన కృష్ణమూర్తి తన కావ్యంలో వారిలో ఎవరో ఒకరిని విజేతగా నిలపలేదు. ఎవరూ జయించలేదు, ఎవరూ ఓడిపోలేదు. ఇద్దరూ పరస్పరం స్నేహార్ధ్రతతోనే యుద్ధాన్ని విరమించారు. అంటారు. మరో సీనియర్ రచయిత మొవ్వ వృషాద్రిపతి మాటల్లో చెప్పాలంటే ఈ దేశభక్తి భరిత కావ్య రచనమును, మహా సమర్ధతతో ప్రతి సన్నివేశ రసానుభూతితో, ప్రతిభావ్యుత్పత్తులతో ప్రతి పద్యమును రసోల్బణముగ రచించిరి.

అలాగే బెంగుళూరుకి చెందిన ఆచార్యులు తంగిరాల వేంకట సుబ్బారావు అంటారు. ప్రాచీన మహాకవుల పద్యాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏ విధమైన దోషాలు లేకుండా, స్వచ్చంగా, పులుకరిగిన ముత్యంలా పద్యాల్ని తీర్చి దిద్దారు అనీ! అందుకు ప్రతిపద్యమూ నిదర్శనమే.

ధర్మమనునది సూక్షమై తనరుచుంతు
గ్రాహ్యమియ్యది యియ్యది కాదటంచు
నేర్పఱుచుటెంత ప్రతిభా మహిష్టులకును
జాలదుస్తర మొక్కక సమయమాదు.

ఇది చాలా చిన్న పద్యం. ధర్మాన్ని గురించి రాస్తూ.. ఇలా అందరికీ అర్ధమయ్యేలా చెప్పడం కృష్ణమూర్తి శైలీ విన్యాసం. కావ్యంలో పదకొండు వందలకు పైగా పద్యాలున్నాయి. ఈ కావ్యం నా దగ్గరికి యుగాల నాటి అప్సర యెవరో అభినవ సౌందర్యంతో కదలివచ్చినట్లుగా తరలివచ్చింది. అని రాశారు కోవెల సుప్రసన్నాచార్య. అలాగే.. మనందరి దగ్గరకూ అంతే సౌందర్యంతో నడచి వచ్చింది. పద్యం పని అయిపోయిందనుకొనేవారు ఆశ్చర్యపోయేలా అంత సుందరమ్గా, ప్రతిభావంతంగా, అర్ధవంతంగా, సుమనోహరంగా రూపొందించిన పురిషోత్తముడు కావ్యాన్ని అందించిన చిటిప్రోలు కృష్ణమూర్తి ఎంతైనా అభినందనీయులు.
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech