కథ నడిచింది 

 

- తరిమెశ జానకి

 “కథలపుస్తకాలు తెగచదువుతారుగా...... ఓ కథరాయండి మీరు కూడా”
భార్యకాంతం మాటలకి కంగారుపడిపోయాడు ఆంజనేయులు “ నేను కథలు రాయడమా?”
“ఏం ? ఆమాత్రం రాయలేరా? రోజూ ఎన్నెన్నో పత్రికులు చదువుతూనే ఉంటారుగా?” అదోరకం ఎత్తిపొడుపుకాబోలు. ఇరవైనాలుగ్గంటలూ సీరియల్స్ చూస్తూ టి.వీ ముందు కూచునే బదులు పుస్తకాలు చుదువుకోరాదా అని మొన్న తను బుద్దిపొరపాటై అన్నదానికి ప్రతీకారమా ఇది…..
“ఇదిగో .... ఈ పత్రికలో కథలపోటీ ఏదో పెట్టారు. మీరు రాసి పంపండి.”
ఆంజనేయులి గుండెల్లో బండపడింది. దాన్నెలాబయటికి దొల్లించాలో ఒక్కక్షణం తోచలేదు ఏదో సామెత చెప్పి తన బరువుతోసేసి భార్యకి తెలివితేటలు పెంచాలనుకున్నాడు.
“అసలంటూ ఏనాడైనా రాసినవాడినయితే నువ్వడిగినా అందంచందం. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట.”
“ఉహూ.... తప్పించుకోవడానికి వీల్లేదు. మీకోసం తెల్లకాయితాలూ అరడజను పెన్నులూ కూడా తెప్పించాను పక్కింటి పిల్లాడిచేత” గదిలోంచి తెల్లకాయితాల కట్టా నల్లటి పెన్నులూ తెచ్చి ముందు పెట్టింది. ఏడవలేక నవ్వాడు ఆంజనేయులు. చాలా బరువైన నవ్వుఅది. పాతసినిమాల్లో ఎ.ఎన్.ఆర్. తోనూ ఎన్.టి.ఆర్ తోనూ పోల్చేసుకున్నాడు తననితనే ఆక్షణంలో కత్తికంటే కలం మిన్న అని తనలాంటి అభాగ్యుడెవరో ఇలాంటి సంధర్భంలో వాపోయి ఉంటాడనిపించింది.
“ఈ ఆరు కలాలుకాదుకదా మరో ఆరు చేర్చుకుని నన్ను నేను పొడుచుకున్నా ఒక్క కథాబొట్టు కూడా చిందదు నాలోంచి. ఈ కాయితాలన్నీ కలిపి పుస్తకంగా కుట్టిస్తాన్నీకు. రకరకాలముగ్గులు వేసుకో. పత్రికలవాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు పంపిస్తూఉండు. బహుమతి రాక పోయినా నేను నవ్వను.” బతిమాలుతున్నట్టుగా చూశాడు....”
“మా అమ్మనాకు ముగ్గులెయ్యడం నేర్పలేదండీ...”
“మా అమ్మమట్టుకు నాకు కథలు రాయడం నేర్పిందా?
“అయ్యోరామా... కథలూ ముగ్గులూ ఒకటేనా?”
“అమ్మయ్య! ఒకటేకాదని ఒప్పుకున్నావుకదా..... ఎవరిదగ్గరన్నా నేర్చేసుకుని వెయ్యచ్చు ముగ్గులు. కథలు అలాకాదుగా! పుట్టుకతోరావాలికాంతం.... పుట్టుకతో రావాలి” జ్ఞానబోధ చేసేవాడిలా పోజు పెట్టాడు.

“ఏం? మీ చిన్ననాటివిశేషాలు అప్పుడప్పుడు నాకు చెప్తూనే ఉంటారు గా?”
“అయితే ఏవిటి?”
“అయితే ఏవిటా? వాళ్ళ చిన్నప్పటి విశేషాలు కోతికొమ్మచ్చి రాస్తున్నారుగా బాపురమణలు. మీరు రాయలేరా?”
కూచున్న కుర్చీలోంచి దబ్బున కిందపడ్డాడు ఆంజనేయులు. మనసులో బాపురమణల్ని తల్చుకుని చేతులు జోడించాడు.
“ నాకుమీరెన్ని దండాలుపెట్టినా వొదిలిపెట్టను.” కొంగు బిరించింది కాంతం. ఈదండాలు నీక్కాదని సత్యహరిశ్చంద్రుడిని చంపిపుట్టిన వాడిలానోరు జారితే నవల రాయమని శిక్షవేస్తుందేమో? భయంతో నోరు నొక్కుకున్నాడు.
“చూడండీ..... పోనీ.... బాపురమణలకి పోటిగా మీరెళ్ళి వాళ్ళమనసులు చిన్నబుచ్చడం ఎందుకుగానీ... రైతన్నల మీదో నేతన్నలమీదో రాయండి. వాళ్ళమీద రాస్తే బహుమతి తన్నుకుంటూ మనింటికే వొచ్చిపడుతుంది.”
తన్నడానికెవరూ రాకుండా ఉంటే అంతే చాలు... గొణుక్కున్నాడు లోలోపల.
“ఏవిటి..... మీలోమీరే ఆగొణుగుడు?”
“అబ్బే మారేంలేదు. అన్నదమ్ములంటూ లేనివాడిని. ఒంటికాయి సొంఠికొమ్ములా పెరిగానింట్లో. రైతన్నెవరు? నేతన్నెవరు?”
“ చాల్లెండి సంబడం. మరీ అంత అమాయకంగా చూడక్కర్లేదు.”
“లేకపోతే ఏవిటి కాంతులూ...” అలాపిలిస్తే ఆవిడగారు మురిసిపోయి మనిషంతా వంకర్లు తిరిగిపోయి అసలు విషయం మర్చిపోతుందన్న భ్రమ ఆవరించింది.
ఆభ్రమ తెరలుతెరలుగా కాదు... మెల్లిమెల్లిగా అసలేకాదు... సర్రుమని ఒక్కసారిగా కాయితం చిరిగినట్టు పర్రుమంది.
“నన్ను మీరు మాయచెయ్యలేరు. పోనీనేతన్నలు మీకు తెలియదు. రైతన్నగురించి రాయండి”
“నేనేదో పొలంలోపనిచేస్తునట్టు మాటాడుతున్నావు అంత తేలిగ్గా”
“మీతెలివి తెల్లారినట్టే ఉంది.....”
భార్యమాట పూర్తికాకుండా మధ్యలోనే అందుకున్నాడు.. “ చూశావా! నాకు తెలివితేటలు లేవని నువ్వే ఒప్పుకున్నావు. మరినన్ను కథరాయమనడం బావుందా?” దెబ్బ కొట్టాననుకున్నాడు కాని ఆ దెబ్బ తనకే తగుల్తుందని ఊహించలేదు పిచ్చిమానవుడు.
“కథలు రాయడానికి తెలివితేటలెందుకుండీ.... పైగా..... మీకు లేనివి కొత్తగా ఇప్పుడెక్కడినించి తెస్తా? మీరోపదిరోజులు సెలవు పెట్టండి. అవసరమైతే పొడిగించుకుందురుగాని. మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను మీ రొస్తున్నారని. రేపటికి రైలుకో బస్సుకో టిక్కెట్ తెచ్చేసుకోండి. ఆ పల్లెటూళ్ళో ఆపొలాల్లో తోటల్లో తిరుగుతూ కథరాసెయ్యండి.”

* * * *

కత్తికంటే కలం మిన్నా అనిపాడుకుంటూ కలాలూ కాయితాలూ ఓ చిత్తునోట్ బుక్కూ బట్టల్తో పాటూసద్ది.... బట్టలేవైనా పోయినా పర్వాలేదుగానీ.... రాసినకాయితమ్ముఎక్కడ పోగొట్టుకోకండి అంటూ హెచ్చరికలు జారీచేసింది కాంతం. కొత్తగా బడికేళ్ళే పిల్లాడిలా బుంగమూతీ బెంగమొహం పెట్టాడు ఆంజనేయులు. “ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో మరి వెళ్ళొస్తా.....” తల్లికి చెరోవైపూ అంటిపెట్టుకునిలబడ్డ పిల్లలిద్దరి చూపులూ బలిపశువుని చూసినట్టు చూస్తున్నట్టుగా అనిపించింది అతని బాధా తప్ప హృదయానికి.
* * **

“అదికాదు బావా... చెల్లాయితప్పేంలేదు. నువ్వు కనపడ్డ పత్రికల్లా చదువుతావుకదా.... ఓ కథ గిలికి పారెయ్యలేవా?”
“నేను అర్జునుడు... నువ్వు క్రిష్ణుడివీనా?” అయ్యిందా కథోపదేశం...” అప్పటివరకూ ఊపిరితీసుకోడానికి తక్కువసమయం ఉపన్యాసానికి ఎక్కవ సమయం తీసుకుని ఆయాసపడిపోతున్న బావమరిది గోవర్థన్‌వైపు సీరియస్‌గా చూశాడు ఆంజనేయులు.
“నువ్వు గోవర్ధన్‌వి కదా... గోవర్ధనపర్వతం ఎత్తమంటే ఎత్తగలవా? ” “ రోలుకూడా ఎత్తలేవు.”
“చూశావామరి... నాపరిస్థితీ అలాగే ఉంటుంది కథరాయమంటే” తేల్చేశాడు చప్పరించి.
“నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోకుబావా.... ఏ పుట్టలో ఏ పాముఉందో ఎవరు చెప్పగలరు? పొలంగట్లంట తిరుగు.......” మాట పూర్తవ కుండా మధ్యలోనే అడ్డుపడ్డాడు
“పాముల్ని వెతుక్కుంటూనా?”
“ఉండుబావాచెప్పనీ.... పొలంగట్లంట తిరుగు... కాలవగట్లంట కూచో......”
“దేనికీ.... దీనికా..... ” రెండువేళ్ళు చూపించాడు ముక్కుమూసుకుని.

“మరీ అంతలా తీసిపడెయ్యకులే నామాట... మావగారికి సీరియస్‌గా ఉందని కబురిప్పుడే వొచ్చింది మరి. కుటుంబ సమేతంగా నేను వెళ్ళక తప్పదుమరి.”
“వెళ్ళిరండి మరీ.......” బావమరిదిని అనుకరిస్తూ దీర్ఘం తీశాడు ఆంజనేయులు.
“నీకే ఇబ్బంది కలక్కుండా ఇంట్లో అన్నీచూసుకుంటూ..... వొండిపెట్టేందుకు సోమేశ్వరం ఉన్నాడు. దేనికీ మొహమాటపడకు నీ ఇల్లే అనుకో..... నీ ఊరే అనుకో.......”
“కథరాసిచ్చేందుక్కూడా ఎవడైనా ఉంటే ఇంకాబాగుండేదిగా” నిరాశా నిస్పృహలతో మనసు మూలగడం పైకి వినపడుతుందా.... కనపడుతుందా?
* * **
పొలంగట్లంట తిరుగుతుంటే బాగానేఉంది ఆంజనేయులుకి. పల్లెటూరి అందాలు ప్రకృతిలోనే కాదు పొలంపన్లు చేసే ఆడంగుల్లో కూడా కనపడటం మొదలైంది. కాంతాన్ని తిట్టుకోడం మానేసి.... కాంతమణులపరిశీలనలో పడ్డాడు. ఓ చేతిలో కలం మరోచేతిలో ఓ నోటుబుక్కూ. “ బొమ్మలేస్తారా అయ్యగారూ?” దగ్గరగా వొచ్చిందోపడుచు. గబగబాతల అడ్డంగా ఊపాడు. ఒక్కక్షణం అనిపించింది.... బొమ్మలెయ్యడం వొచ్చినా బాగుండిపోను....ఈ పల్లెటూరి పడుచందాలుగీసేసేవాడుగా ఈ పాటికి! ఇరవయ్యేళ్ళకి తక్కువుండదు వయసు.....
అంచనా వేసుకున్నాడు మనసులో, “ ఇలా కూచోవొచ్చి” చెట్టుకింద తనుకూచుంటూ పిలిచాడు. భయంభయంగా చూస్తూ బుద్దికగా వొచ్చి పక్కనే కూచుంది
“ ముందు నీ పేరు చెప్పు... తర్వాత నీ జీవితం చెప్పు”
“నాపేరు చంద్రి..... జీవితం ఏంటండీ?”
“అదే.... నీ బతుకు.....” తనమాట తనకే ఏదో తిట్టులావినిపించి నాలిక్కొరుక్కున్నాడు. అది ఉత్తుత్తినే అని ఆపిళ్ళకేం తెల్సు? గట్టిగానే కొరికాయి. మండింది నాలిక.
“నాలాంటి బతుకెవ్విరికి వొద్దండీ.....” రెండుచేతుల్తో మొహం కప్పేసుకుంది. అయ్యాబాబోయ్! ఏడ్చేస్తోందా? తనేమన్నాడనీ? నీ బతుకు నాక్కావాలని అడిగాడా? పిచ్చిమొహంలా ఉందే? ఇంకానయం దరిదాపుల్లో ఎవ్వరూలేరు.
“మా అమ్మ అయ్య నాచిన్నప్పుడే చచ్చిపోయారు, ఉన్నది అమ్మమ్మేనాకు. ముసలిదై పోయింది. నామనువు చెయ్యగలదా? కొంగుతోకళ్ళుతుడుచుకుందో చెంపలమీద చెవట తుడుచుకందో తెలియలేదు ఆంజనేయులికి. జాలిమాత్రం నిజంగానే వేసింది.”

“ఊరుకో..... బాధపడకు... నేనున్నానుగా?”
ఏ మాత్రం చెమ్మలేని కళ్ళతో నవ్వుతూచూసింది, అయ్యబాబోయ్.... ఇదేంటీ!.... ఇలాంటిడైలాగొచ్చింది తననోట్లోంచి.... తడబడిపోయాడు. తూనాబొడ్డూ అందామంటే అననిచ్చిందా పిల్ల?..... అయస్కాంతమై అంటుకు పోలా?
* * *

మూడోరోజు కాంతం ఫోను “ ఏవండీ ఎంతవరకొచ్చిందీ?”
“ ఇదుగో.... ఇప్పుడిప్పుడే రక్తికడుతోంది.”
“ఓహోహో.... రచయితవయిపోయారుగా..... మీ భాషకూడామారిపోతోంది నే చెప్పలా? “ మీరురాసెయ్యగలరు. ఆంజనేయ స్వామి తనశక్తి ఎరగనట్టూ.....” చెప్పుకుపోతోందావిడ. ఔనౌను..... మాముత్తాతకిద్దరు.... మాతాతకిద్దరు....నాకూ అంతశక్తి ఉందని మరిచే పోయానిన్నాళ్ళు.....
“ఏవిటి మాట్లాడరూ? ఎప్పుడొస్తున్నారు?”
“తొందరేముంది? సెలవుపొడిగిస్తాను.”
“కథముగించాక నవలకూడా రాద్దామనుకుంటున్నారా?”
“అలాచెయ్యమంటావా?”
“నవలకుకూడారైతన్నల మీదేరాస్తే ఎలాగండీ?”
“మరెలాగ? గ్రంథ సాంగుడినవుదామనుకుంటున్నాను......”
“అయ్యోరామ! గ్రంథంరాస్తే గ్రంథసాంగుడంటారనుకుంటూన్నారా? అది వేరే అర్థంతో
వాడతారండీ బాబూ!” తను ఒలకబోసే సిగ్గు ఆఫోన్లో కనపడదని తెలిసికూడా తెగ మెలికలు తిరిగి పోయింది కాంతం.

* * * *

“చెల్లాయ్.... కాంతం...మీ ఆయన్నింక మీ ఊరొచ్చెయ్యమని ఫోన్లో చెప్పు తల్లీ” ఆ ఒక్కముక్కా ఉంది ఊర్నించి వెంకన్న పట్టుకొచ్చిన చీటీలో.
“ ఈ చీటీముక్క ఇమ్మని బస్సుచార్జీలిచ్చి పంపించాడా మా అన్నయ్య? ” విడ్డూరంగా చూసింది. రాకరాక బావగారు.... ఇంటల్లుడు.... వాళ్ళ ఊరొస్తే బావమరిదికి చూపించాల్సిన మర్యాద ఇదేనా? రానురాను అన్నయ్యకి బొత్తిగా ఇంగిత జ్ఞానం లేకుండా పోతోంది. పోతాడనుకున్న వాళ్ళమావగారు పిడిరాయల్లే లేచికూచున్నాడు. ఇంకదిగులేముందీ? వెనక్కిచేరుకున్నాడింటికి. నెత్తిన పెట్టుకు చూసుకోవద్దూ బావగార్ని? ఇంకదయ చెయ్యమంటాడా ఆ మాట కూడా ఇక్కడినించి తనచేత చెప్పిద్దామని చూస్తూన్నాడా? చెల్లెలన్నా చెల్లెలి భర్తన్నా అంతలోకువా? హూ.... సమాధానం చెప్పిపంపలేదు వెంకన్నచేత కాంతం. ఇనపచువ్వల్లే బిగుసుక్కూచుంది. మర్నాడు మోగిన ఫోన్లో మొత్తుకున్నాడు అన్నగారు.
“ ఏ విటన్నయ్యా మరీనూ..... బహుమతి తెచ్చుకునే కథరాయాలంటే అక్కడివాళ్ళ కష్టసుఖాలు చూసి తెలుసుకోడానికి సమయం పడుతుంది కదా? అయ్యాక ఆయనేవొస్తార్లే”
“ అయ్యిందమ్మా.... అంతాఅయిపోయింది. ఇంకా బావగారీ ఊళ్ళోనే ఉంటే ఇంకెంతమంది కష్టసుఖాలు చూస్తారోనని భయంగా ఉంది నాకు. రేపటికి టిక్కెట్టుకొనేశాను” గబగబచెప్పేశాడు.
ఎంతమందికష్టసుఖాలు చూస్తే అంతబాగా కథపుడుతుందికదా! ఈ అన్నయ్యేవిటీ ఇలా మాట్లాడతాడు.... ఆమధ్య ఓసారి వొదిన్ని ఇరవైరోజులు ఇక్కడ ఉండమని కుట్లు అల్లికలు నేర్పి పంపలేదూతను! ఒకరికొకరు ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా? అదే మాటకాస్త కోపంమిళాయించి అడిగేసింది “ ఒకరికొకరు అండగా ఉండద్దా?”
“సిగ్గు సిగ్గు అలా మాట్టాడకుతల్లీ”
సిగ్గు సిగ్గు అంటూ సిగ్గులేకుండా ఆ మాటేవిటో మధ్యలో.... అర్ధంకాలేదామెకి. విసుగ్గా అరిచింది “బహుమతి అన్నయ్యా బహుమతి వొస్తుంది”
“ఎంతమ్మా బహుమతి రొఖ్ఖం?”
“అయిదువేలన్నయ్యా.....” గర్వంగా చెప్పింది అందుకున్నంత గొప్పగా.
“చూడమ్మా! రేపే పదివేలకి చెక్కుపంపిస్తాన్నీకు..... ఇంకెప్పుడూ కథరాయమని బావగార్ని మా ఊరు పంపించకు. మీ ఆయనకి కథ నడపడమే తప్ప కథ రాయడం తెలియదు.” అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడవగానే చిరాకుపడి పోయింది కాంతం.
బావగారు రచయిత అయి పోయారని అంతకుళ్ళు మోత్తనం పనికిరాదామనిషికి. ఒకవేళ వొండి వార్చనని మొండికేసిందేమో వొదిన? ఏం చెప్పుకుంటాడు పాపం మొగపీనుగ.... ఈయనగారసలే తిండి పుష్ఠిగలమనిషి..... భోజనప్రియుడు....... పోన్లే ఎంతరాస్తే అంతే పట్టుకురానీ. మిగిలింది ఏ పాత కథల్లోంచో కాపీ కొట్టమంటే సరిపోతుంది..... తనకితనే సద్ది చెప్పుకుంటూ వొదిన్ని తల్చుకుని మెటికలు విరవబోయి వేళ్ళు నెప్పెట్టి ఊరుకుంది కాంతం.


 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech