మా నాన్నకు జేజేలు

 

- రమేష్ బాబు పూల

 
  ఇక్కడ(అమెరికాలో) ప్రతియేడు 'ఫాదర్సుడే 'రోజున మా పిల్లలు ' యూ ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ ' అని, ఒక ఫొటో గాని, కార్డు తెచ్చి ఇచ్చినపుడు, చెప్పలేని ఆనందమేస్తుంది. అంతలోనే నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చి, ఆరోజుల్లో 'మదర్స్ డే, ఫాదర్స్ డే ' లేకపోయాయే అన్ని కొంచెం బాధ కలుగుతుంది. లేకపోతే నాపిల్లలలాగే మా అమ్మనాన్నలకు కృతజ్ఞతలు తెలిపి వారిని అనందపరిచే అవకాశముండేది. మా ఇంటి పేరు 'పూల '. మా తండ్రిగారి పేరు శ్రీ పూల కొండప్పగారు, అమ్మగారి పేరు శ్రీమతి పూల సిద్ధమ్మ గారు.


మావూరు పేరు కోటూరు అనే కుగ్రామం. ఇది చౌడేపల్లి అనే మండలంలో, చిత్తూరు జిల్లాలో వుంటుంది. మాతండ్రిగారి కుటుంబం గురించి చెప్పవలసి వస్తే, రామ, లక్ష్మణ, శతృఘ్ణు, భరతులులాగ నాన్నతో కలిపి నలుగురు అన్నదమ్ములు.'ఆ నలుగురి 'లో నాన్నగారు మూడవవారు. దశరథుడులాగానే, మాతాత గారు త్వరగా నిష్క్రమించడంవలన, పెదనాన్నగారు కుటుంబ భాధ్యతలను చేపట్టారు.

ఆరోజుల్లో పెదనాన్నగారికి, ఎదురుగా వెళ్ళడం గాని,ముఖంవైపు చూసి మాట్లాడే ధైర్యంగాని, ఎవరికి వుండేది కాదు. పెదనాన్న గారంటె భయమని కాదు. అతడంటే అంత గౌరవం. ఏపనిచేసిన ఆయన కుటుంబం మంచికోసమే చేస్తారనే నమ్మకం. పెదనాన్న గారిచ్చిన పనిని చేయడమంటే, ఇంట్లో అందరు చాలా గొప్పగా భావించేవారు. పెదనాన్నగారు మానాన్నగారికి ఆవులను, గేదెలను మేపడం, పాలు పితకడం వంటి, పనులను అప్పగించారు. మిగిలిన ఇద్దరు తమ్ములను వ్యవసాయపనులు చూసుకోవాలని ఆదేశించారు. పెదనాన్నగారు కుటుంబ మరియు బయటవ్యవహారాలు చూసుకొనెడివారు. చాలా సంవత్సరాలవరకు, పశువుల ఆలనపాలనా చూసుకోవడమె, మానాన్నగారి దినచర్య. పశువులు, వాటి మేత అనే విషయాలు తప్ప, వేరే ఏ విషయాలు నాన్నకు తెలెసెవి కావు. పెళ్ళై పిల్లలు పుట్టినా, నాన్నగారి దినచర్యలో ఎటువంటి మార్పువుండేది కాదు. తన అన్నగారు, అంటే మాపెదనాన్నగారు, తన పిల్లలకికూడ చక్కని జీవితాలను అమర్చుతారని ప్రగాడమైన విశ్వాసంతో వుండేవారు.

అయితే అపుడు జరిగిన ఒక చిన్న సంఘటన, నాన్నగారి జీవతంలో చాలా మార్పు తెచ్చింది. ఒక పండుగరోజున ఇంటిలో అందరికి, పెదనాన్నగారు క్రొత్త బట్టలు కొన్నారు. కొత్త బట్టలు వేసుకొని నాన్నగారు చాలా మురిసిపోయారు. వేసుకొన్న బట్టలు ఖరీదైనవా, కావా అనేది ముఖ్యంకాదు నాన్నకి. తనను గుర్తుపెట్టుకొని, ప్రేమతో తన అన్నబట్టలు తీసుకొచ్చారనే భావమే, తన ఆనందానికి కారణం. ఆ విషయం అందరితో చెప్పుకొని మరింత సంతోషించాడు.

అయితే అరోజు పశువులు మేపుకొంటూ పొలంవైపు వెళ్ళగా, అక్కడ మాపాలేరు కూడ, నాన్నగారు వేసుకొన్న బట్టలే ధరించివున్నాడు.
అది చూసి నాన్నగారికి ఎటువంటి బాధకలుగలేదు. కాని చుట్టు ప్రక్కల వున్నవాళ్ళు నాన్నతో 'మీ అన్న గురించి చాలా గొప్పలు చెప్పావు. ఇప్పటికైనా కళ్ళు తెరచి చూడు. అతని దృష్టిలో నీకు, పాలేరుకు తేడా లేదనే విషయం గమనించు ' అని హేళన చేశారు. అదివిని నాన్నగారు తట్టుకోలేకపోయారు. పాలేరుకు తెచ్చిన ధరకే,వేరే రంగు బట్టలు, తెచ్చివుండినా కూడ, నాన్న బాధ పడివుండేవాడు కాదు. తనకు బట్టలధర ముఖ్యంకాదు. అయితే నలుగురి దగ్గర ఇలా హేళనకు గురికావడం చాలా మధనపడేటట్లు చేసింది. అందువలన మొదటిసారిగ ధైర్యం చేసి, తన బాధను పెదనాన్నగారితో విశిదపరిచాడు. అంతే పెదనాన్న గారు విషయమేమని ఆలోచించకుండా, 'నన్నే అడిగే స్థాయికి ఎదిగావా నువ్వు. నన్ను ప్రశ్నించే వాళ్ళెవరు నాతో వుండాల్సిన పనిలేదు.మీరు సొంతంగా సంపాదించుకొని ఖరీదైన దుస్తులు కొనుకొండి ' అని ఉగ్రుడైపోయాడు. అశాంతితో వున్న నాన్నమనసుకు, పెదనాన్నగారు ఊరటనిస్తారని భావించాడు. కాని ఈవిధంగా మండిపడతాడని ఊహించ లేదు. 'బాధల్లో వున్నవాడు, దేవుడికి మొరపెట్టుకొందామని గుడికెళ్ళితే, గుడి విరిగి వాడిపైన పడినట్లు 'అయింది నాన్న పరిస్థితి.
నిజానికి పెదనాన్నగారికి, నాన్నను వేరుగా పంపించాలని ఉద్దేశం లేదు. ఒకసారి గట్టిగా అరిస్తే, ఇంకేవరు తనని ప్రశ్నించరని అతడు భావించాడు. అంతేకాకుండా, పశువులు మేపడం తప్ప ఏమి తెలియని నాన్నగారు, నోరు మూసుకొని తనదగ్గర పడివుంటాడని, అతడి గొప్ప నమ్మకం. పెదనాన్న ఒకటి తలిస్తే, నాన్న ఇంకొకటి తలిచాడు. 'నేను మీతో కలసి వుండడం మీకు ఇష్టం లేనపుడు విడిపోదాం. నాకేమిస్తారో ఇవ్వండి ' అని నాన్నగారడిగారు. తనఫ్లాను వికటించినందుకు పెదనాన్నగారు అవాక్కయాడు. అవిధంగా నాన్నగారు వేరుకాపురం పెట్టారు. అయితే సేద్యం చేయడంగాని, కుటుంబవ్యవహారాలు గాని తెలియకపోవడం వలన మొదటల్లో చాలా ఇబ్భంది పడ్డారు.

మానాన్నగారికి మేము ఆరుగురు పిల్లలం. నేను చివరివాడిని. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు. అప్పుడు నాన్నగారు
మా అందరితో, 'ఇనాళ్ళు మన జీవితాలు వేరు. ఇపుడు వేరు.మనం బంధువులముందు గర్వంగా బ్రతకాలి. పెద్దలు, పిల్లలు కలిపి మనం ఎనిమిదిమంది. అంటే మన పదహారు చేతులు కలిపితే, చేయ్యలేని పనంటూ ఏది వుండదు. మరియు మనం పనిలో తేడాలు చూడ కూడదు. అంటే ఇది ఆడవారి పని, ఇది మగవారి పని చూడకూడదు. ఇదంతా మనపని అనే భావం కలిగి,మనం ఇష్టపడి కష్ట పడాలి ' అనిమాలో ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నింపారు. నాన్న గారిచ్చిన స్పూర్తి మా అందరిలో మంచి టీం స్పిరిటును తెచ్చింది. అప్పటినుండి అందరం కుటుంబం గురించె ఆలోచించె వాళ్ళం. వీధి బడి అయిన వెంటనే, పశువులు, పొలం, ఇంటిపనులు చేసెవాళ్ళం. మొదటలో కొందరు ఎగతాళి చేసెవారు. మేము పట్టించుకొనే వాళ్ళం కాదు. అయితే త్వరగానే మా కుటుంబంలోని ఐక్యత చూసి అందరు గౌరవించడం మొదలెట్టారు.
మసుషులు మమ్మలిని చూసి నవ్వినపుడు మేము దిగులు చెందలేదు. కాని ప్రకృతి మాపైన దయచూపనపుడు చాల వెత చెందెవాళ్ళం.
అంటే మా వ్యవసాయమంతా వరుణుడి కరుణపైన ఆధారపడి వుండేది. వర్షం కురవని వర్షం (సంవత్సరం) మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం.

అసమయంలో పిల్లలు పల్లెలోనే వుంటే, వీరికి భవిషత్తు వుండదని మానాన్నగారు యోచించారు. ఈ కష్టాలు ఏలాగు వుండేవే. కావున వీళ్ళకెలాగైనా చదువులు చెప్పించాలని నిర్ణయించుకొని, దగ్గరలోనె వున్న చౌడేపల్లె అనే మేజరు పంచాయితికి,  మాకుటుంబాన్ని మార్చారు.మేము మాపల్లెనుంచి అమెరికాకు రావడం గొప్పకాదు. పశువులు మేపుకొనె మాతండ్రి, మాచదువులు గురించి దూరాలోచన చేయడమె చాలా సాహాసోపేతమైన పని.

చదువులకోసం వూరుమారిన మాతీరులో, అంటే టీం స్పిరిటులో మార్పు రాలేదు. ఒకరికొకరు మేము ఏలా సహాయం చేసుకొన్నా
మనేందుకు కొన్ని ఉదహారణలిస్తూన్నాను. మా పెద్దక్క తనకు వచ్చే మెరిట్ స్కాలరుషిపు నుండి,కొంత మనీ కనీస అవసరాలకు
వుంచుకొని మిగిలిన మనీ అంతా ఇంటికి పంపేది. మెడికల్ కాలేజిలఓ చదివే మా అన్న ఖర్చులు కోసం, నేను స్కూలైన తరువాత
కొన్ని గంటలు మెడికల్ షాపులో పనిచేసెవాడిని.మా అక్కలు మరియు మారెండొ అన్న కూడ పాలు అమ్మడం లాంటివి ఏవొ పనులు చేసి కొంత డబ్బులు సంపాదించేవాళ్ళం. ఆ విధంగా ఒకరికొకరు సహాయపడుకొంటూ, చదువుకొంటూ, మా ఇంటిని ఒక వాణీనిలయంగా మార్చాం. మా ఇంటినుండి ఒక డాక్టరు, ఇద్దరు డాక్టరేట్లు వచ్చారు. మా పెద్దక్క పూల ఇందిర గారు, మేరిలాండులో సైంటిస్టుగా పనిసేస్తున్నారు. బ్రెస్టు కాన్సరు పైన చాలా అద్భుతమైనా రిసెర్చు చేశారు. మా పెద్దన్న ప్రభాకరుగారు, మావూరిలోనే డాక్టరు వృత్తి చేస్తూ, రోటరిక్లబు ద్వారా
ఎన్నో ఉచిత వైద్యసేవలందిస్తూన్నారు. మారెండొ అక్క ఉష గారు రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తూన్నారు. మారెండో అన్న సుధాకర్ గారు బి.కాం బి.ఎడ్ చదివి, వూర్లోనె వుంటూ, కుటుంబ వ్యవహారాలన్ని చూసుకొంటున్నారు. మాచిన్నక్క నాగరాణి టీచరుగా పనిచేస్తూన్నారు.

నేను ఐ.ఐ.టి చెన్నైలో మెకానికల్ ఇంజీనీరింగులో పిహెచ్.డి చేసి, యూనీవర్సటీ ఆఫ్ చికాగొ లో ఏం.బి.ఏ చదివినాను. ఆరాగాను అనే
ఫెడరల్ ల్యాబ్ లోను, జనరల్ మోటరులో పనిచేసి, మెకానికల్ ఇంజీనీరింగులో చాలా క్రొత్త విషాయాలు కనుగొని, ఏన్నో రిసెర్చి పేపర్లు వ్రాశాను. పేటెంటులు సాధించాను. వాటికి గుర్తింపుగా ఫలు అవార్డులు పొందినాను.

CNNలో నా రిసెర్చి గురించి, నా ఇంటర్వూ వచ్చినపుడు, మా ఇంట్లిపాది ఆనందించారు. RD అనేమాగజైను వారు, ఏంపిక చేసిన
ప్రపంచంలోని అత్యుత్తమ 100 మెకానికల్ ఇంజీనీర్లో నేను కూడ వుండడం, నాకు లభించిన బెస్టు అవార్డు అని చెప్పవచ్చు.
ఆ అవార్డు ఫంకషనుకి మా అమ్మ గారొచ్చారు. కాని మానాన్నగారు అప్పటికే లోకము నుండి విరమణ పొందినారు.
నేను అవార్డు తీసుకోవడం చూసి అమ్మ చాలా ఆనందించారు. ఆమె ఎంతో సంతోషంగా కనపడుతున్నా, ఇతరులు గుర్తించని
కంటతడిని, నేను గమనించాను. ఈ ఆనంద సమయాన్ని మానాన్నగారు అస్వాదించలేకపోయారనేదే అమె కంటతడికి అర్థం.

మేము చాల పెద్దచదువులు చదువుకొన్నామని, లేదా ఏన్నో అవార్డులు సాధించామని, గొప్పలు చెప్పడం నావుద్దేశం కాదు.
నిజానికి ఇందులో మాగొప్పేమేమిలేదు. ఇవ్వని కూడ మానాన్నగారు మా హృదయక్షేత్రాలలో నాటిన విలువలు, స్పూర్తి యనే
మొక్కలకి వికసించిన కుసుమాలే.

మరొక విషయం, నేను ఐ.ఐ.టిలో చదివి, తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగొలో, టాప్ 2%లో ఉతీర్ణుడనయ్యానంటే,
చిన్నప్పటి నుండే నేను గొప్ప ర్యాంకు స్టూడెంటు అయ్యివుంటానని లేదా మేధావినని మీరు భావించే అవకాశం కలదు.
కాని నేనొక సాదరణ లేదా అవరేజ్ స్టూడెంటుని. టెన్తు మరియు ఇంటరులో కనీస మార్కులతో పాసయ్యానంటే మీరు
నమ్మరనుకొంటాను.అదే నిజమయితే ఈ అవరేజ్ స్టూడెంట్ ఇన్ని డిగ్రీలు మరియు అవార్డులు ఎలా సాధించగలిగాడనే అనుమానం రాక తప్పదు. దానికి సమాధానం మానాన్న గారే అని చెప్పక తప్పదు. నేను ఇంటరు చదివేట్పటికె, అక్క రెసెర్చి పరంగాను, అన్న
డాక్టరు చదువుతూ, ఇంటికి దూరంగ వుండేవారు. నాన్న ఇల్లు పొలం పనులతో బీజిగా వుండేవారు. నేను చిన్నవాడినని తలచి
నాపైన అంతా ఫోకసు వుండేదికాదు. నేను క్లాసులయి ఇంటికొచ్చిన తరువాత పశువులు మేపడానికెళ్ళేవాడిని. అప్పుడు
ఆవులు మేపుకొనె కొంతమందితో నాకు స్నేహం కుదిరింది. ఆ స్నేహం బీరు త్రాగెంతవరకు ఎదిగింది.
ఓక రోజు అలాగే బీరు త్రాగి ఇంటి కెళ్ళాను. వాసనరావడం గమనించి అమ్మ నిలదీసింది. నాన్నగారు పనిమీద బయట కెళ్ళినారు.
ఆ రాత్రంతా అమ్మ నన్ను తిడుతూ, బాధ పడుతూ ఏడుస్తూవుంది. రాత్రి పన్నెండు గంటల సమయంలో
నాన్నగారొచ్చారు. అమ్మ ముఖం చూసి ఏమి జరిగిందని అడిగినారు. ఆమె వివరిస్తూంది. నిద్రపోతున్నట్లు నటిస్తూ
పరిస్థితిని పరివేక్షిస్తూన్నాను. తుఫాను గాలికి కొట్టుకొనె కిటికి తలుపులా, నా గుండె కొలవలేనంతా వేగంగా
కొట్టుకొంటూ వుంది. నాలో కలిగె అలజడికి, నేను కప్పుకొన్న రగ్గు, భయంతో వణికిపోతుంది. యుద్ధానికి సైనికుడు సిద్ధమైనట్లు,
దెబ్బలెన్నిపడినా, ఓర్చుకొనెటట్లు వుండాలని, నా మనసు నా శరీరాన్ని తయారు చేస్తూవుంది.
నాన్నగారు వచ్చి లేవరా అని అరిచారు. ' ఏమి జరిగిందని ' అడిగినారు. 'బీ..రు..తాగినాని ' వణుకుతూ చెప్పినాను.
అదివిని నాన్నగారు కొంచెం మౌనం వహించారు. మొదటి దెబ్బ ఎప్పుడు పడుతుందా, ఎక్కడ పడుతుందాని, నా తనువు
అణువణువు కన్నులు చేసుకొని, ఆత్రంగా చూస్తూంది. నాన్నగారి సైలెన్సు నాలో చాలా టెన్షను పెంచింది. ఏదొ రెండు తన్నులు
నాలుగు దెబ్బలేస్తే త్వరగా అయిపోతుంది కదానిపిస్తూంది. అపుడు నాన్నగారు గంభీరంగా ' ఇపుడు నువ్వు కొట్టి చెప్పేంత చిన్నపిల్లవాడివికావు. పరిస్థితులు అర్థం చేసుకొనే వయసు నీకు వచ్చింది. ఈ వయసులో ఫ్రెండ్సుతో కలసి బీరు త్రాగలని, సిగెరెట్టు కాల్చలని అనిపిస్తుంది. అది సహజం. కాని అవి ఎటువంటి దుష్ఫలితాలను ఇస్తాయనేది నీకు ఇప్పుడు తెలియదు. అవిషయం తెలిసె నాటికి తిరిగిరాని దూరం జీవితంలో ప్రయాణించేస్తావు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వయస్సు చాల ముఖ్యమైనది. ఎవరు ఈ వయసులో చెడుదారిలో నడుస్తూరో, వారు మిగిలిన జీవతమంతా కష్టాలు పడతారు. ప్రస్తుతం మీ అక్క, అన్న గొప్ప చదువులు చదువుతూ, ఈ వూరిలో మన కుంటుంబానికి చక్కటి పేరు తీసుకొస్తూన్నారు. మరి వారి తమ్ముడుగా నువ్వు ఇంకా ఎక్కువ సాధించాలి. అయితే ఈ అలవాట్లు పట్ల నీకు విగ్రహంకు వున్న నిగ్రహం కలిగిన రోజె అది సాధ్యమవుతుంది. నువ్వు గొప్పవాడివయితే అందరు నిన్ను మావాడని అంటారు. చెడిపోతే సొంత అన్నలు, అక్కలు కూడా తనవాడని అనరు. నీ జీవతంలోవచ్చే సుఖాలకి, దు:ఖాలికి నీవె జవాబుదారి. ఇకమీదట నీవు బీరు త్రాగివచ్చావా, సిగెరెట్టుకాల్చివచ్చావా, అని సి.ఐడి లాగ నిఘాలాంటివి పెట్టను. అలా చేస్తే ఒక తండ్రిగా నీకిచ్చిన స్వేచ్చని, నీ వ్యకిత్త్వాన్ని అవమానించినట్లవుతుంది.రేపు త్రాగివచ్చినా నిన్ను నేనేమి క్లాసు తీసుకోను. ఈ విషయాలపైన మాట్లడడం ఇదే చివరిసారని గుర్తుపెట్టుకో. తండ్రిగా నాశక్తి మేరకు నీకుతగిన సహాయం చేశ్తాను. నువ్వు బాగుపడితే సంతోషిస్తాను. లేకపోతే నా పెంపకం లోనే లోపముందని కుమిలిపోతాను. కావున ఎమార్గం కావలఓ నిర్ణయించుకో. ఒకవేళ నీకిష్టం లేకపోయిన ఫ్రెండ్సు బలవంత పెడితే,నామాటలు గుర్తుచేసుకో. మరియు నీకు మార్కులు తక్కువ రావడానికి కారణం నీకు తెలివి లేక కాదు, సాధించాలనే తపన లేకపోవడమే ' అనిచెప్పారు.

ఎంతో గొప్పగా చదువుకున్న తల్లిదండ్రులే, తమ బిడ్డలకు, చెడు అభ్యాసాలు, అలవాటయ్యాయని తెలిస్తే ఎంతో ఉద్రిక్తతకు లోనవుతారు.
అటువంటిది మా నాన్నగారు ఎంచుకొన్న తీరు, ఎపుడు గుర్తుకొచ్చిన ఆశ్చర్యమేస్తూంది. ఆ రోజు నాన్నగారు ఆవిధంగా మాట్లడకుండా,
నాలుగు తన్ని భయపెట్టడానికి ప్రయత్నించినట్లయితే, నాలో మార్పుగాని నూతన ఆలోచనలు గాని వచ్చేవికావేమో. నన్ను ఒక వ్యక్తిగా గుర్తిస్తూ, నన్ను నమ్మి పూర్తి స్వేచ్చ నియడంవల్ల, మునుపటికన్నా నేను బాధ్యతగా మెలగాలనిపించింది. తరువాత ఎల్లపుడు నాన్నగారి మాటలే పదేపదే గుర్తుకొచ్చి, చదువులపట్ల ఆసక్తిని, పట్టుదలను పెంచాయి. ఆరోజు నుంచి నాకు చదువులలో ఎదురులేకపోయింది. తరువాత జరిగిన కథాంతా తెలిసిన చరిత్రే. వేటగాడు వాల్మికీగా అవతరించినట్లు,  గాలివాటంగా ఎటో కొట్టుకుపోతున్న, నన్ను ఈస్థితికి చేరేటట్లు, తీర్చిదిద్దిన నా తండ్రికి, ఏరీతిగా ఋణం తీర్చుకోగలననే, ప్రశ్న నన్ను ఎపుడూ వేదిస్తూ వుండేది.

అయితే ఈ సుజనరంజని వారు నిర్వహిస్తూన్న "మా నాన్నకు జే జేలు " శీర్షికద్వారా మా నాన్నగారి గురించి కొన్ని మాటలు వ్యక్త పరిచే అవకాశం ఇచ్చినందులకు ధన్యవాదంలు తెలుపుతున్నాను.


 


పేరు : పూల రమేష్ బాబు
చదువు : బి.టెక్, యస్.వి.యు తిరుపతి, ఏం.టెక్ (అన్నా, చెన్నై).
పిహెచ్.డి (ఐ.ఐ.టి చెన్నై). ఎం.బి.ఏ(యూనివర్సటీ ఆఫ్ చికాగొ)
ఇంజీరింగు : మెకానికల్
నివాసం : నేపర్వేల్ చికాగొ(గత 13 వర్షాలుగ)
సాధించినవి: ఐ సి ఇంజన్సు పైనా చాల పేపరులు, పేటెంటులు, అవార్డులు
ప్రస్తుతం: మేనెజింగు ఫండ్సు మరియు ఫైనాన్ షియల్ అడ్వైజర్

 

                                       శీర్షికా నిర్వాహకులు: అక్కుల కృష్ణ

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech