సమీర్ మరియు బిందు ద్రోణంరాజు కాలిఫోర్నియాలోని Mountain View నగరంలో నివసిస్తున్నారు.

అతను:

మాది ఆంధ్రరాష్ట్రంలో సాగర తీరాన ఒక అందమైన ఊరు - విశాఖపట్నము. నాన్నగారు గవర్నమెంటులో ఉద్యోగం చేసి రిటైర్  అయ్యారు. మా అమ్మా నాన్నలకి నేను ఏకైక సంతానం.  ఏకైక సంతానం అన్నాను కదా అని నేను అల్లారు ముద్దుగా పెరిగాను అనుకుంటున్నరెమో, లేదు లెండి, చిన్నప్పుడు అల్లరి వేషాలు వేస్తే అప్పుడప్పుడు వీపు విమానం మోత మోగించె వారు లెండి మా అమ్మ నాన్నలు. కాని కొంచెం ముద్దు గానే పెరిగాను.  చదువు విషయం నన్ను నిర్ణయించుకోమని వదిలేసినా, పెళ్ళి విషయం మాత్రం వాళ్ళ ఇష్టానికి వదిలేసాను.

విశాఖపట్నంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యాక అమెరికా వెళ్ళి ఫై చదువులు చదువుతాను అని అమ్మా నాన్నలతో చెప్తే, సరే నీ ఇష్టం అని వాళ్ళు ఒప్పుకున్నారు. అమెరికాలో MS డిగ్రీ పూర్తి చేసాక ఉద్యోగం వచ్చింది. ఒక 6-7 నెలలు అయ్యాక మెల్లిగా పెళ్ళి గురించి నా ఆసక్తి ని తెలుసుకోవడం మొదలు పెట్టారు మా అమ్మా నాన్నలు. అప్పటికి నాకు ఇంకా 24 ఏళ్ళు. "అబ్బా, అప్పుడే పెళ్ళికి ఏమి కొంప ములిగింది అమ్మా" అని తోసి పుచ్చేవాడిని. మా అమ్మ నాన్నలకి ఎప్పుడు ఫోను చెసినా, "ఒరేయ్, వాళ్ళ అమ్మాయి ఉంది, వీళ్ళ అమ్మాయి ఉంది, మట్లాడమంటావా?" అని అమ్మ అడిగేది. నేను చాకచక్యంగా మాట మార్చేసే వాడిని. అలాగ ఒక రెండేళ్ళు గడిచాయి.

మార్చి 2006 లొ నాకు ఒక సంబంధం వచ్చింది. "అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్, హైదెరాబాదులో ఉద్యోగం చేస్తోంది, మంచి కుటుంబం, మట్లాడమంటావా?" అని అమ్మ నాన్నగారు అడిగారు. నా ఉద్యోగం బాగానే ఉంది, అన్ని విధాల స్థిరపడ్డాను అని నిశ్చయించుకుని, "సై" అన్నాను. మా వాళ్ళకి జాతకాల పట్టింపు బాగనే ఉంది లెండి. నేను "సై" అన్న మరుక్షణం హుటా హుటిన జాతకాలు సరిపడ్డాయా లేదా అని చూబించారు. జాతకాలు భేషుగ్గా కలిసాయి అని తెలిసిన వెంటనే అమ్మాయి గురించి మరిన్నివిషయాలు నాకు చెప్పసాగారు.  యెదో తెలియని వింత అనుభవం, మా ఇంట్లో కంప్యూటర్ లేకపొవడంతో అమ్మాయి ఫొటో నాకు వెంటనే పంపలేకపోయారు.

ఈ లోపల మా అమ్మా నాన్నగారు ఆ అమ్మాయిని ఒకసారి చూస్తాము అని అడిగితే, తను విశాఖపట్న వచ్చింది. పెళ్ళి చూపులకి రంగం సిద్ధం అయ్యింది. అమెరికాలో ఉండటం ఏమో కాని పెళ్ళి చూపులకి నేను లేను. అమ్మాయి పేరు బిందు. అమ్మా నాన్నలకి అమ్మాయి నచ్చింది. ఆ తంతు జరిగాక నాకు ఒక పది రోజుల్లొ ఫొటో అందింది. అమ్మాయి అందంగా ఉంది. కాని నా మనసులో ఎన్నొ ప్రశ్నలు, అంటే అసలు ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, మా ఇద్దరి frequency కలుస్తుందా లేదా అని ఒక అనుమానం, ఈ లొపు ఆఫీసులో మేనేజెర్ని సెలవ అడిగితే ఇవ్వను, ససేమిరా ఇవ్వను అని అన్నాడు. ఈ లోపు బిందు ఫోన్ నంబర్ మా వాళ్ళు నాకు ఇచ్చారు. సరే అని ఒక శనివారం నాడు తనకి ఫోన్ చేసాను.

తను M.Sc. బొంబాయిలో చదివింది. బొంబాయి పిల్ల కదా బాగా style కొడుతుందేమో అని ఒక అనుమానం. కాని ఫోనులో మాత్రం చాలా సింపుల్ గా, ఎప్పట్నించో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడిండి. మా ఇష్టాఇష్టాలు చెప్పుకున్నాము...మా ఆశలు అబిలాషలు ఇద్దరికి బాగానే అర్ధమయ్యాయి. ఇలాగ ఒక రెండు మూడు సార్లు ఫోనులో మట్లాదుకున్నాము. ప్రతి సారి ఒకరి గురించి ఇంకొకరికి కొత్త విషయాలు తెలిసాయి. నాకు ఆ అమ్మయి మీద ఆసక్తి పెరిగింది. ఇండియా ఎప్పుడు వస్తున్నారు అని రెండు మూడు సార్లు అడిగిండి...సెలవు లేదు అని చెప్పేసరికి కొంచెం బాధపడింది.

ది ఇలా ఉండగా మా మేనేజర్ ఉన్నట్టుండి ఏమైందో....నీకు ఇండియా వెళ్ళడానికి సెలవు ఇస్తున్నాను...."go to india and enjoy" అన్నాడు....వెంటనే రాత్రికి రాత్రి టిక్కట్టు కొనుక్కున్నాను. ఐతే ఈ విషయం బిందు కి చెప్పలేదు. అన్నీ చెప్పి చెస్తే, జీవితంలో థ్రిల్లు ఏముంటుంది చెప్పండి? రెండు రోజుల్లో హైదరాబాదు చేరుకున్నా. విశాఖపట్నము చేరిన వెంటనే బిందుకి ఫోన్ చేసాను. తను ఆశ్చర్యపోయింది....మొన్ననే అమెరికా నుంచి ఫోన్ చేసారు కదా అని నివ్వెరపోయింది.

బిందు అమ్మా నాన్నగారు బొంబాయిలో ఉంటారు. వాళ్ళకి కూడ ఫోన్ చేసి మాట్లాడితే వెంటనే హైదరాబాదులో బిందు పెదనాన్నగారి ఇంట్లో రెండో రౌండు పెళ్ళి చూపులు కి రంగం సిద్ధం అయ్యింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. నేను, మా అమ్మ నాన్నగారు, మా మవయ్య, అత్త అందరం కలిసి వెళ్ళాము. అందరూ మర్యాదల్తో హడావుడిగా ఉంటే, నా కళ్ళు మాత్రం బిందు ఎక్కడుందా అని గాలిస్తున్నాయి. కొంత సేపటి తరువాత వచ్చింది...బిందు....సన్నటి నవ్వు నవ్వుతూ..కాస్త సిగ్గు పడుతూ. అందరూ నాతో మాట్లడుతుంటే నా కళ్ళూ మాత్రం తన వైపే... అతిథి మర్యాదలు అయ్యాక మేము ఇద్దరం డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకున్నాం.

ఫోనులో నచ్చినా ఇలాగ ఎదురెదురుగా మాట్లాడుకోవడం వల్ల తన మీద ఇస్స్టం ఇంకొంచెం పెరిగింది. భోజనాలు చేసి ఇంటికి చేరుకున్నాం. బాగా ఆలోచించి మా వాళ్ళతొ అమ్మాయి నచ్చింది అని చెప్పాను. "మా సమీరుడు పెళ్ళి కొడుకాయెనే" అంటూ  ఆనందంతో బిందు తల్లి తండ్రులకు చెప్పి బిందు ఉద్దేశం ఏమిటో కూడా కనుక్కున్నారు.  బిందుకి కూడా మా సంబంధం నచ్చింది అనటంతో పెళ్ళి ముహూర్తం నిర్ణయించారు. ఫిబ్రవరి  11న ముహూర్తం పెట్టారు పెద్దలు. అప్పటి నుంచి పెళ్ళికి ఇంకా 6 నెలలు గడువు ఉండటంతో ఇంకా రోజూ ఈ-మెయిల్ మరియు చాట్‌లో మట్లాడుకునే వాళ్ళము.  గడియారంతో పని లేకుండా గంటల తరబడి ఫోనులో మాట్లాడే వళ్ళం. అది ఒక అందమైన అనుభూతి. ఇలా 9 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియనే లేదు. అలాగ మొదలయ్యింది మా ఇద్దరి ప్రయాణం, సంసారమనే నావలో చిరు గొడవలతో, ముచ్చటలతో, సరదాగా, జాలీ గా......

ఆమె:

ఈ అమెరికా సంబంధాల గురించి మనము వింటూనే ఉంటాము. స్నేహితులు, చుట్టాల ద్వారా వచ్చే కబుర్లు, వాటిపై సినిమాలలో చూపించే సన్నివేసాలు ఎంతైనా మనని ఆలోచింపజేస్తాయి. నాకు మా అమ్మానాన్నగారు పెళ్ళి కొడుకు అమెరికాలో ఉంటాడని చెప్పినప్పుడు, నేను ఈ సంబంధానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు ఆ కుటుంబం చాలా మంచిదని, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని, ఒకసారి మాట్లాడి చూడమని చెప్పారు. తల్లిదందండ్రులమాట కాదనలేక, ఫోనులో మాట్లాడడానికి ఒప్పుకున్నాను.

నాకు అమెరికాలో ఉన్నవాళ్ళు అంటే - అక్క్డికి వెళ్ళి కొన్ని సంవత్సరాలే అయినా తెలుగు వచ్చీరానట్ట్లుగా మాట్లాడుతూ, స్టైలు కొడతారని, బంధుమిత్రులతో కలసిమెలసి ఉండలేరని, భాద్యతలు స్వీకరించలేరని, వేషధారణ, తిండి అలవాట్లలో మార్పు ఉంటుందని, ఇంకా ఎన్నో అభిప్రాయాలు ఉండేవి. ఇన్ని కారణాలు ఉండగా ఏదోఒకటి చెప్పి తప్పించుకోవచ్చులే అనుకున్నాను. తనతో ఫోనులో  మాట్లాడడానికి ఒప్పుకున్నాను. మొదటిసారి తను ఫోను చేసినప్పుడు, ఏమి మాట్లాడానో గుర్తులేదు కానీ, నేను ఎదురుచూసింది మాత్రం ఎప్పుడు NRIలా స్టైలు కొడతాడా అప్పుడు ఫోను పెట్టేద్దామని. కానీ అలా జరగలేదు. అతను చాలా simple and down to earth మనిషి లాగా  అనిపించింది. అరగంట సేపు మాట్లాడుకున్నాము. ఎవరో తెలిసిన వాళ్ళతోనే మాట్లాడినట్టు అనిపించింది. నా మొదటి అభిప్రాయం అయితే తప్పు అని తేలింది.

నా వరకు అయితే, నాకు బంధువులూ, మిత్రులతో కలసిమెలసి పోవడం చాలా ఇష్టం. నా జీవిత భాగస్వామి కూడా అలాగే ఉంటే బాగుండును అనుకునేదాన్ని. నా అదృష్టం అనుకుంటా, తనతో కొన్ని రోజులు మాట్లాడగా అర్ధమైంది, తనదీ అందరితోనూ కలసిపోయి, వాళ్ళను మనవాళ్ళు  అని భావించే స్వభావం అని. ఇలాగ అతని గురించి నా రెండో అభిప్రాయం కూడా తప్పైపోయింది.

ఒక రోజు తను ఆఫీసు పనిమీద ఊరు వెళుతున్నాను. ఒక 2-3 రోజులలో ఫోను చేస్తాను అని చెప్పారు. అలాగే మూడవరోజు పొద్దున్న 6:30 AMకి ఫోను వచ్చింది. "Surprise నేను ఇండియా వచ్చాను" అని చెప్పారు. నేను నమ్మలేదు. ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను.  తాను హైదరాబాదు వచ్చి నన్ను కలుస్తాను అని చెప్పినప్పుడు అర్ధమయ్యింది, కల కాదు నిజమేనని. తనన్ను కలసి మాట్లాడాక, నాకు ఉన్న మిగిలిన భయాలన్నీ తొలగిపోయాయి.

మొత్తానికి ఒకటి అర్ధమయ్యింది - ఏ దేశమేగినా ఎందుకాలిడినా - మనము మన character and attitude మారిపోకుండా కాపాడుకోగలం అని. ఈ విషయం కూడా పాపం సినిమాలలో చూపించారు, పాట పాడి వినిపించారు కూడా. ఇలా మేము ఒకరినొకరు కలసి అర్ధం చేసుకున్నాక పెళ్ళికి ఒప్పుకున్నాము. February 11న ముహూర్తం కుదిరింది. మధ్యలో ఆరునెలలు ఎలా గడచి పోయాయో తెలియలేదు.

పెళ్ళి అంటే అందరికీ సరదానే. కొంతమంది బయటకి చెప్తారు. కొంతమంది చెప్పరు అంతే. నేను బయటకి చెప్పేస్తా. నా మనసుకు నచ్చినవాడిని పెళ్ళి చేసుకునే మధుర స్మృతిని, జీవితంలో ఒకేసారి వచ్చే ఈ సందర్భాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అని.

 

పెళ్ళికి మూడునెలెల ముందునుంచీ నేను, నా చెల్లెలు కలసి ప్రదానంలో పెట్టే సామానులు తయారు చేసాము. రకరకాల పువ్వులు, పసుపు కుంకుమలు పెట్టి ఇచ్చే (పంచిపెట్టే) బ్యాగులు, బుట్టలు, Train బొమ్మ, చాకలెట్ దండలు, పురోహితులు, పెళ్ళి మండపం, అలా ఎనో వస్తువులు తయారు చేసాము. ఎదురుకోలప్పుడు మా మేనత్త కవిత వ్రాసి మగపెళ్ళి వారిని ఆహ్వానించారు. మా అక్క కాశీయాత్ర విసనికఱ్ఱ అందంగా తయారు చేసింది. పెళ్ళి తెరమీద మా అన్నయ్య మా పేరులతో కవిత్వం వ్రాయించాడు.

ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగా, ఒక పక్క మేము ఇద్దరమూ  ఓ రోజు ఫోనులో  మాట్లాడుకుంటున్నాము. నాకు అటూ, ఇటూ నడుస్తూ ఫోనులో మాట్లాడడం అలవాటు. అలా తిరుగుతూ మాట్లాడుతూ గుమ్మం తగిలి క్రింద పడిపోయాను. ఎడమకాలు బాగా వాచింది. వెంటనే Hospitalకి వెళితే, hair-line fracture అయ్యిందని కాలుకు పెద్ద కట్టు కట్టారు. అందరూ ఒక పక్క జాలి పడినా, "నీ పెళ్ళి నడక చాలా బాగుంది, ఇలా కుంటుకుంటూ" అని ఆటపట్టించారు. పెళ్ళికి పది రోజుల ముందు కట్టు విప్పేసారు.

పెళ్ళి బాజాలు, మంత్రాలతో హైదరాబాదులోని R.T.C కళ్యాణమండపంలో పెళ్ళి ఘనంగా జరిగింది. నా అభిప్రాయాలను గౌరవించి, నన్ను నన్నుగా ప్రేమించే భర్త దెరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నట్లు ఇంకో విషయం కూడా - నా పేరు 'పూర్ణసుధా బిందు అంబారు' నుండి 'పూర్ణ సుధా బిందు ద్రోణంరాజు' అయింది. 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech