మంత్రానికి శక్తి ఉందా! -  ధ్యానం - సర్వాతీతజ్ఞానం

 

- ప్రఖ్యా మధు


ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి అడిగాడుట, మంచి మెడిటేషన్ మ్యూజిక్ ఏదైనా వుంటే ఇమ్మని. గురువుగారు లోపల్నించి ఒక చక్కటి సీడీ తెచ్చి ఇచ్చారుట. అది పెట్టుకుని శిష్యుడు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎంతకీ ఏమీ సంగీతంగాని, మంత్రాలుగానీ రాలేదు. చూస్తే ఇంతకీ అది కొత్త ఖాళీ సీడీ అని తేలింది. "గురువుగారు! మీరు ఈ సీడీ పొరపాటున ఇచ్చినట్టున్నారు. ఇది ఖాళీ సీడీ, ఇందులో శూన్యం తప్ప ఏమీ లేదు " అని శిష్యుడు అంటే గురువుగారు తాపీగా సెలవిచ్చారు, "నాకు తెలుసు నాయనా! అంతా ఖాళీ అని. అదే నిజమైన ధ్యానం. నీకు తెలియాలనే ఇచ్చాను".
ఎన్నో మంత్రవిద్యలకి, మహాసిద్ధులకు మూలం ధ్యానం. ధ్యానాన్ని సాధించిన మనిషి కారణ, స్థూల, సూక్ష్మదేహాలు ప్రచోదనం చెంది, మానవ పరిధులకతీతుడై, సర్వవ్యాపక పరబ్రహ్మను అనుభూతి చెందుతాడు. విండానికి అద్భుతంగా వుంది. ఇది నిజజీవితంలో ఎలా పనిచేస్తుంది? ధ్యానం చేస్తూ చేస్తూ మనిషి సమాధిలోకి వెళ్ళిపోతాడా? అసలు భగవంతుడు సర్వవ్యాపకుడని ఎలా చెప్పగలరు? నేనెలా దర్శించగలను? ఎన్ని వేల జన్మలకి ఈ మూలాధరంలోని కుండలిని ఎక్కి పైకెక్కి సహస్రారంచేరుతుంది? మహాయోగం మాట సరే అరగంటకూడా నాకు ఏకాగ్రత కుదరడంలేదు. కళ్ళు మూసుకుంటే నాకు అక్కరలేనివే గుర్తుకొస్తున్నాయి. మరి ధ్యానం ఎలా కుదురుతుంది? అని అనేకసార్లు అనుమానాలు వస్తాయి.


ఒక సద్గురువులు చెప్పారు. ఏకాగ్రత గురించి ఎక్కువగా ఆలోచించకు, సాధన చెయ్యి అని.ఒక నాణెం తీసుకో. అది కొలనులో వేశామనుకో అది ఎక్కడికి వెడుతుంది? అలా అలా మరింత లోతుకి వెడుతుంది. కిందకి వెళ్ళే కొద్ది అక్కడున్న, పేరుకుపోయిన, కూరుకుపోయిన మట్టిని దాటుకుంటూ అట్టడుక్కు చేరుతుంది. ఆ కోలనే నీ మనసు! ఆ నాణెమే నీ మేధస్సు. ఈ నాణెం ప్రయాణమే ధ్యానం. ఆంగ్లంలో చెప్పాలంటే కాన్షస్ మైండ్ దాటి మన ఫోకస్ సబ్కాన్షస్ మైండ్ లోకి వెళ్ళడం అన్నమాట. అణిగిపోయిన, నిగ్రహించ ప్రయత్నించిన భావాలు అక్కడ అడుగునవుంటాయి. ఆ అట్టడుక్కు చేరేకొద్దీ ఈ మట్టి కనిపిస్తూ వుంటుంది. ఏకాగ్రతని భగ్నం చేస్తూ వుంటుంది. అందుకే ఆరంభంలో ఈ లోపలి అనవసరపు భారం తొలక్క ముందు ఎంతలోపలికి వెడుతుంటే అంత డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఇంకో కోణంలోంచి చూస్తే ఎంత డిస్టర్బెన్స్ వస్తే అంతలోతుకు వెడుతున్నామన్న మాట. మనలో వున్న నిజమైన 'మనని ' ముందు దర్శిస్తే అప్పుడు దేవుడు కనపడతాడు. ఆత్మసందర్శనాని ఇది మొదటిమెట్టు. అందుకని ధ్యానం చేస్తుంటే డిస్టర్బ్ అవుతున్నామని కంగారు పడక్కర్లేదు ప్రగతి మార్గంలోనే వున్నామన్న మాట! ఆధునిక భౌతిక శాస్త్ర పరంగా కూడా చలనం (మూవ్ మెంట్) వుంటే ఘర్షణ (ఫ్రిక్షణ్) వుంటుంది. ఈ భౌతిక సూత్రాన్ని ఆధిభౌతిక సూత్రంగా మార్చుకుంటే 'ఘర్షణ వుందంటే చలనం వుంది '. సమస్యలొస్తున్నాయంటే జీవితరంగంలో ముందుకెళుతున్నామన్న మాట! 'ఐ యాం హ్యాప్పీ ఐ హావ్ ఫ్రిక్షణ్ ' అనుకోవచ్చు.


ఏ నాణాన్ని కొలనులో వేసినా అది కిందకి, మూలానికి వెడుతుంది. అది అలా వెళ్ళేందుకు కారణం? గురుత్వాకర్షణ శక్తి (అంటే గ్రావిటి)అని భౌతిక శాస్త్రం చెపుతుంది. దీన్ని ఆధ్యాత్మికరంగంలోకి అన్వయించుకుంటే ఏ మనిషి ఏ మనఃస్థితిలో ధ్యానం చేసినా ఆత్మమూలాన్ని, అంటే పరబ్రహ్మాన్ని చేరతాడు.అందుకు కారణం 'గురు 'త్వాకర్షణ, దాన్ని మనం గురు అనుగ్రహం అంటున్నాం.అది మనం ఎక్కడున్నా పనిచేస్తుంటూ వుంటుంది తనవైపు తీసుకెళుతూ వుంటుంది, తన అస్థిత్వాని గుర్తుచేస్తూంటుంది.


గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

 

ఈ పరమగురు అనుగ్రహంకోసం అనేక సాధనలు చేయవచ్చు. కొందరు దత్తాత్రేయ సాధన చేస్తారు.
ఓం ద్రాం దత్తాయ నమః


ఈ మంత్రాన్ని మానసికంగా సాధన చేయవచ్చు. ఆంధ్రులలో ఎక్కిరాల భరధ్వాజ గారు అవధూతల గురించే ఎంతో అన్వేషణ చేసి, వారితో తిరిగి అనేక అద్భుతాలను దర్శించారు వాటిని గ్రంధాలుగా పొందు పరచారు. వాటిలో ముఖ్యంగా సాయీ సచ్చరిత్ర, గురుచరిత్ర జగత్ప్రసిద్ధమైనవి. అవధూతల గురించి తెలుసుకునే వారు తప్పకుండా చదవ వలసినవి రంగన్న బాబు గారి చరిత్ర, పాకలపాటి గురువుగారు, వెంకయ్య స్వామీజి గురించి. నిరాడంబరతలో అంత నిర్మలత్వం వుంటుందని, సాధారణత్వంలో అంత అసాధారణ శక్తి దాగుందని చెప్పడానికి ఇవి మంచి తార్కాణాలు.


నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువు గారు (శ్రీ ఎక్కిరాల భరధ్వాజ గారి రచన)లో ఈ ఆణిముత్యాలు చూడండి. విశాఖజిల్లాలో వున్న శ్రీ పాకలపాటి గురువుగార్ని బాబు గారు అని పిలిచేవారు.ఈ కింది వాక్యాలు యధాతధంగా ఆ గ్రంధంలోవి.


బాబుగారన్నారు-"ఉపదేశమంటే చెవిలో మంత్రం చెప్పడం మాత్రమే కాదు ఎక్కడో వున్నాడని నీవు తలచే పరమాత్మ అన్ని రూపాలలోనూ, నీలోనూ గూడా ఈ క్షణంలో వున్నారన్న దర్శనం అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశమవుతుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందుడికి అటువంటి అనుభవాన్నిచ్చారు. అలా అయితేనే ఉపదేశం!" ..."అసలీ రోజుల్లో జరిగేది ఉపదేశమే కాదు మంత్రానికి శక్తి,బీజము,కీలకము,ముద్ర అన్నవి నాలుగూ ఆయువుపట్ల వంటివి.అవేమిటో తెలిసినవాడే లేదుప్రతివారూ జపం చేసేముందు 'ఇది బీజం ','ఇది శక్తి ', 'ఇది కీలకం ' అంటూ ఆ మంత్రంలోని భాగాలు వూరికే చెప్పుకుని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు. ఇది సరిగాదు. మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్నీ జపించేటప్పుడు ఒక్కొక్క విధంగా వినియోగించాలి. ఆ బీజక్షరాన్ని ఎలా వినియోగించాలన్నది 'బీజము, శక్తి, కీలకము ' అన్న పదాలు సూచిస్తాయి.వాటి అర్ధమేమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుంది? రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో 'రెంచి,స్ఫానర్,జాకి 'అనే పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయడం 'బీజము, శక్తి, కీలకము ' అన్నవాటి అర్ధం తెలిసి వినియోగించడం. అలాకాక కారు ఎదుట కూర్చుని, ఆ మూడు పరికరాలను ఎదుట వుంచుకొని, వాటిని చూపుతూ వాటిపేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే, ఆ బీజాక్షరాలు వల్లించినందువలన మంత్రం సజీవం కాజాలదు. 'ముద్ర 'అంటే గూడా చేతులు, వేళ్ళు కొన్ని భంగిమలలో వుంచడం అనుకుంటారు. వాస్తవం అంతమాత్రమే అయితే వాటిని గురుముఖతః తెలుసుకోవలసిన అవసరమేమిటి? వాటి ఫొటోలు చూచి ఎవరైనా నేర్చుకోవచ్చుకదా! మన చేతులు, వేళ్ళు మనలోని కొన్ని క్రియాశక్తులకు సంకేతాలు. ఆ క్రియా శక్తులను మనమేరీతిగా వినియోగించుకొంటే మంత్రం శక్తి వంతమౌతుందో తెలియాలి. వాటినలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువువద్ద అందుకు కావలసిన యోగక్రియలభ్యసించాలి" అన్నారు.
ఇక ఇటువంటి సాధనలని మంత్ర ధ్యానాలని సాధించినవారు నిజంగా అతీతులవగలరా? కళ్ళతో చూస్తేకాని నమ్మలేం - అంటాం కదా! ఈ చిత్రాన్ని చూడండి - మనకళ్ళని మనమే నమ్మలేం!
ఈ మహానుభావులు వ్యక్తిగతంగా మనకి తెలియక పోయినా శక్తి గతంగా ఆలోచింపచేస్తారు. పంచ భూతాలగురించి, ధ్యానంతో వాటిని జయించే యోగుల ప్రయత్నాల గురించి వచ్చే సంచికల్లో తెలుసుకుందాం.
నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం
నమో ఉవజ్ఝాయాణం నమో లోఎ సవ్వ-సాహూనాం

(జైన నమస్కార మంత్రం. అరిహంతులకు నమస్కారం, సిద్ధులకు నమస్కారం,ఆచార్యులకు నమస్కారం,ఉపాధ్యాయులకు నమస్కారం,సాధువులకు మరియు సాధ్విలకు నమస్కారం.)

Please watch: http://www.youtube.com/watch?v=La5ZxpbE0s4

-ప్రఖ్యా మధు
 

 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech