మొదటి రాంకుకు వందసూత్రాలు

- యండమూరి వీరేంద్రనాధ్

 

  ట్యూనింగ్
చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా ఇష్టపడటమే ధ్యానం.దువ్వేటప్పుడు జుట్టునీ, తినేటప్పుడు తిండినీ, చదివేటప్పుడు పాఠాన్నీ ఇష్టపడటమే ఏకాగ్రత.
ఎక్కడయితే కుతూహలం ఉంటుందో, ఆ పనిమీద ఏకాగ్రత ఉంటుంది. ఇది చదువుకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో కెల్లా దురదృష్టుడెవరంటే తనకిష్టంలేని రంగంలో జీవితాంతం పనిచేస్తూ ఉండిపోయేవాడు.
మొదటి శ్రేణి కోర్సులో చెత్త కాలేజీలో చివరి ర్యాంకు విద్యార్దిగా చేరటం కంటే, తక్కువ డిమాండ్ ఉన్న కోర్సులో మంచి సంస్థలో ఉన్నత శ్రేణి విద్యార్ధిగా చేరటం మంచిది.
కోపమూ, బద్ధకమూ, భయమూ, పదిమందిలో మాట్లాడలేక పోవడమూ, ఏకాగ్రత లేకపోవం విద్యార్ధుల సమస్యలు. సరిగ్గా చూడండి. పైవి సమస్యలా? బలహీనతలా? ఆక్సిడెంట్ అవడం, పరీక్షల ముందురోజు హాల్ టికెట్ పోవడం సమస్యలు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు. కానీ బలహీనతల్ని జయించడం పెద్ద కష్టం కాదు.
చదువుతూంటే ఆలోచనలు ఎటెటోపోతూ ఉంటాయని కొందరు విద్యార్ధులు అంటూ ఉంటారు. చదువు ప్రారంభించడానికి ముందు మీరేం చేశారన్నవిషయం మీద ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. చదివే ముందు ఎవరితో వాదించవద్దు. ఎక్కువ సేపు మాట్లాడవద్దు. గొడవ పెట్టుకోవద్దు.
సాయంత్రం ఆరయ్యాక మీ స్నేహితుల్ని ఇంటికి రావొద్దని చెప్పండి. శలవుల్లో తప్ప, మిగతా రోజుల్లో స్నేహితుల్ని, బంధువుల్నీ పిలవొద్దని మీ పెద్దలకి చెప్పండి. వాళ్ళు పక్క గదిలో మాట్లాడుకుంటున్నా మీ మనసు చదువు మీద నిలవదు.
పుస్తకం ముందు కూర్చొని ’ఎందుకొచ్చిన చదువురా, భగవంతుడా..’ అని మీలో వాపోవద్దు. అలాచేసే కొద్దీ పుస్తకం ఒక శత్రువులాగా కనబడటం ప్రారంభం అవుతుంది. ఆలోచనలు పక్కకి వెళ్ళినప్పుడూ, చదువుపట్లా విసుగుకలిగినట్టు అనిపించినపుడూ లేచి నిలబడి పచార్లు చేయండి. ఆలోచన పక్కదారి పట్టినప్పుడల్లా ’లేవాలి’ అన్న హెచ్చరిక వాటిని అదుపులో ఉంచుతుంది. రూమ్ బయటకి వెళ్ళొద్దు. కిటికీలోంచి బయటకు చూడొద్దు. రూమ్ లోనే నడవండి! ’నడవడం కన్నా చదువే బాగుంది’. అనిపించినప్పుడు మళ్ళీ పుస్తకం ముందు కూర్చోండి.
చదవడంలో బోరు కొట్టినపుడల్లా, రాయడమో - లెక్కలు చేయడమో చేయండి. ఇష్తంలేని సబ్జెక్టుని, రెండు ఇష్టమైన సబ్జెక్టుల మధ్యలో చదవాలి. చదువుతున్నప్పుడు విసుగొచ్చి ఇతరులతో మాట్లాడటమో, టీవీ చూడడమో ప్రారంభిస్తే, ఇక దాని నుంచి బయటపడడం కష్తం.
చదువుని ఒక మహత్కార్యంగా ప్రారంభించే ప్రయత్నం చెయ్యకండి. చదువు గురించి గొప్ప ప్రిపరేషనూ, మంచి మూడ్ వుంటేనే సాధ్యం అన్న ఆలోచన మానుకోండి.
’ఇక కాసేపట్లో చదవాలి’ అన్న భావం, సమయం దగ్గరపడేకొద్దీ దాన్ని ఎలా వాయిదా వెయ్యాలో అన్న కారణాల్ని వెతుకుతుంది. ఆహ్లాదకరమైన విషయాల్లో ప్రారంభించి క్రమంగా చదువులోకి ప్రవేశించండి. నాన్ డిటెయిల్హ్డ్ కథతో ప్రారంభించి, సబ్జెక్ట్ లోకి రావడంలాగా అన్నమాట!
గడువుకి ముందే చదవాలనుకున్న సిలబస్ అయిపోతే ఆ రాత్రి ఎంత హాయిగా నిద్రపోవచ్చో ఒకసారి అనుభవంలోకి వస్తే ఇహ ఆ అలవాటు వదలరు.
అవసరమైనవి, అర్జెంటయినవి అని పనులు రెండు రకాలు. పరీక్షల ముందు చదువుకోవడం అవసరమైనది, అర్జెంటయినది. అభిమాన నటుడి సినిమాకి మొదటిరోజు వెళ్ళకపోతే నిద్రపట్టకపోతే, అది అవసరమైనది కాదుగానీ, అర్జెంటు అవుతుంది. స్నేహితులతో గంటలకొద్దీ కబుర్లు చెప్పడం అనవసరం. పైగా అర్జెంట్ కూడా కాదు గదా!! సమయపాలన (టైమ్ మేనేజ్ మెంట్) అంటే అదే!
ఒక పని ప్రారంభించడానికి కొన్ని ఆటంకాలుంటాయి. వీటిని ఇంగ్లీషులో ’రోడ్ బ్లాక్స్’ అంటారు. ఇవి శారీరకం కావొచ్చు. మానసికం కావొచ్చు. చదువుకి ముందు తలనొప్పిగా అనిపించడం, ఇంకేదో పని దీనికన్నా ముందు చెయ్యాలనిపించడం, గది వేడిగా ఉందన్న ఇబ్బంది - ఇవన్నీ ఉదాహరణలు. వీటిని ఎంత తొందరగా నిర్మూలించగలిగితే అంత మంచిది.
బధ్ధకానికీ, పని వాయిదా వేయడానికీ ముఖ్య కారణం - మీరు చదువుతున్న కోర్సు గానీ, అందులో ఒక సబ్జెక్టు గానీ అయిఉండవచ్చు. వీలైతే కోర్సు మార్చడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్టు ఇష్టం లేకపోతే, దాన్ని ఇంకా ఎంతకాలం చదవాలో చూడండి. ఉదాహరణకి మీరు పదో తరగతి చదువుతూ, మీకు లెక్కలు కష్టమైతే, ఇంకో ఆర్నెల్ల తర్వాత ఇంటర్మీడియట్లో సైన్స్ కోర్సులో మీకు లెక్కల బెడద ఉండదన్న ఫీలింగ్, ఈ సంవత్సరపు లెక్కల్ని చేసేయడానికి కావలసిన శక్తినిస్తుంది.
ప్రొద్దున్నే బ్రష్ చేసుకోకపోయినా, స్నానం చేయకపోయినా ఎలా ఫీలవుతామో చదువుకోకపోతే కూడా అలా ఇబ్బంది ఫీలయ్యే విద్యార్ధి విజయం సాధిస్తాడు.
మొత్తం పాఠాన్ని చిన్న చిన్న పాయింట్ల రూపంలో వ్రాసుకోవాలి. ఆ పాయింట్లని చూస్తూ ’తన భాష’లో తిరిగి పాఠాన్ని వ్రాయాలి. ఏదైనా మర్చిపోవడం జరిగిందేమో సరి చూసుకోవాలి. ఈసారి పాయింట్లు చూడకుండా రెండోసారి వ్రాయాలి. అంతే! మొత్తం అంతా మెదడులో ప్రింట్ అయిపోతుంది. పరీక్షల సమయంలో తిరిగి ఒకసారి చూసుకుంటే చాలు. దీన్నే ’కీ-నోటింగ్’ అంటారు.
వేసవి శెలవుల్తో సహా, క్రమం తప్పకుండా రోజూ చదవండి. పరీక్షల ముంది కొంచెం ఎక్కువ చదవండి! అంతేగానీ టెన్షన్ వద్దు. కాన్ఫిడెంట్ గా ఉండండి. పరీక్ష పత్రాన్ని చూడగానే "..ఓ .. ఇదా! దీనికి సమాధానం నాకు తెలుసు" అనిపించాలి. "..ఇదేమిటి? ఇంత సులభంగా ఉన్నదీ - పేపరు" అని ఆనందంగా అనుకోవాలి. సబ్జెక్టుపై పూర్తి అధికారం ఉంటేనే ఆ ధీమా వస్తుంది.

తిండి - బధ్ధకం
బధ్ధకం రెండు రకాలు : శారీరకం, మానసికం, మొదటి దాన్ని అలసట (టైర్ సమ్), రెండోదాన్ని విసుగు (బోర్ డమ్) అంటారు. చాలామంది ఈ రెండింటి మధ్య కన్ ఫ్యూజన్ అవుతూంటారు. అరగంట చదివిన్ కుర్రాడు ’అలసిపోయాను మమ్మీ’ అంటాడు. కాస్త రెస్ట్ తీసుకొమ్మంటే వెళ్ళి టీవీ చూస్తాడు. అలసిపోయిన కళ్ళకి టీవీ చూసే శక్తి ఎలా వచ్చింది? అలసటకీ విసుగుకీ తేడా అదే!!
మనిషికి రోజుకి దాదాపు 2500 క్యాలరీలు కావాలి. వంద గ్రాముల చిప్స్ పాకెట్ (250), బట్టర్ కుకీ (450)చాక్ లెట్ బార్ (300), ఐస్ క్రీమ్ కప్ (350), పిజ్జా (600), చిన్నకోక్ కాలరీలు శరీరానికిస్తాయి. చదువుకు గంట ముందు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కేకులు తినకూడదు. మనం తినే కొవ్వునీ, షుగర్ నీ, గ్లూకోజ్ గా ప్రేవులు మారుస్తున్నప్పుడు, ఆక్సిజన్ విపరీతంగా ఖర్చు అవుతుంది. అందుకే ఆ సమయంలో నిద్ర, బధ్దకం, కాస్త తలనొప్పి, దాహం ఎక్కువగా ఉంటాయి. పరీక్షల ముందు పదిహేను రోజుల్నుంచి వీటిని పూర్తిగా మానెయ్యడం మంచిది.
మాంసాహారులైన విద్యార్ధులకు కోడికన్నా, ఫిష్ మంచిది. చదువుకు ముందు పాలు, అరటి పళ్ళు తీసుకోకూడదు. అవి నిద్రకి మంచివి. పడుకునే ముందు గ్లాసు పాలు శ్రేయస్కరం.
మన శరీరానికు దాదాపు 22 అమినో ఆసిడ్స్ కావాలి. ’సోయాబీన్ పౌడర్’ అని బజార్లో దొరుకుతుంది. రోజుకి రెండుసార్లు మజ్జిగలో కలుపుకుని సాగాలి. అదేవిధంగా రొట్టెలో గోధుమపిండితోపాటు ఇది కూడా కలిపి (75 : 25 నిష్పత్తిలో ) తింటే మరీ మంచిది.
సాధారణంగా మనం పొద్దున్న అన్నం, రాత్రిళ్ళు చపాతీలు తింటూ వుంటాం. అన్నం తొందరగా జీర్ణం అవుతాయి. అందుకని (ముఖ్యంగా విద్యార్ధులు) పగలు రొట్టెలు, రాత్రిళ్ళు అన్నం తినడం మంచిది.
’ఆహార నియమాలు’ అంటే తక్కువ తినడం, రుచిలేని తిండి తినడం కాదు. సరి అయిన సమయంలో, సరి అయిన నిష్పత్తిలో తినడం.
ఎప్పుడూ ఒకే టైములో తినడం శరీరానికి మంచిది. చిరుతిళ్ళు తగ్గించండి.
నిద్ర
మీకు తెలుసా? నత్త మూడు సంవత్సరాలు ఏకబిగిన నిద్రపోగల్గుతుంది. మనం నిశ్చయంగా నత్తలం కాము. రోజుకి సగటున ఏడుగంటల నిద్రచాలు మనకి.
చదువుకునేటప్పుడు, పక్కనే నీళ్ళ బాటిల్ పెట్టుకుని (మళ్ళీ లేవనవసరం లేకుండా) ప్రతి అరగంటకూ తాగండి. అది ఫ్రెష్ గా ఉంచుతుంది.
పది నిమిషాలయినా పొద్దున్నపూట గాని, సాయంత్రం గాని గ్రౌండ్ లో ఆడాలి. ఆడపిల్లలు కనీసం ఫ్రిజ్ బీ అన్నా ప్రాక్టీస్ చెయ్యాలి. రాత్రి భోజనం అయిన తర్వాత పది నిమిషాలు (ఒంటరిగా) నడవాలి.
తెల్లవారుఝామునే చదవడం మంచిది. పొద్దున్న చదవవలసిన పుస్తకాలూ, నోట్సూ, పెన్నూ మొదలైనవి రాత్రి వుంచుకుంటే పొద్దున్నే శ్రమ, అలసట, ముఖ్యంగా విసుగు ఉండదు.
చదవాల్సినది పూర్తి అయ్యక ఉత్సాహభరిత కార్యక్రమాలు పెట్టుకుంటారు కొందరు. అది తప్పు. ముఖ్య్హంగా చదువు విషయంలో! అందుకే "ఫలానా టైమ్ వరకూ చదువుకుంటే, తర్వాత టీ.వీ. చూపిస్తాను" అని పిల్లల్తో ఎప్పుడూ అనకూడదు. వ్రాత పూర్వక హోమ్ వర్క్ దీనికి మినహాయింపు.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని రేపు ఆదివారమే కదా! అని శనివారం అర్ధరాత్రి వరకూ టీ.వీ. చూడనిస్తారు. ఆదివారం పూట అలా నిద్రపోవడం వలన నిద్ర - సైకిల్ దెబ్బతింటుంది. దాని ప్రభావం రెండుమూడు రోజుల దాకా పోదు. మధ్యాహ్నం నిద్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట (శలవు రోజున) గంటల తరబడి నిద్రపోవడం మంచిది కాదు.
నిద్ర పట్టకపోవడాన్ని ’ఇన్ సోమ్లియా’ అంటారు. పరీక్షల ముందు వచ్చే టెన్షన్ వల్ల ఇది కలగవచ్చు. లేదా కొందరికి జన్మతః ఇది ఉండవచ్చు. ఆహార, మిగతా అలవాట్ల నిబంధన ద్వారా దీన్నుంచి బయటపడొచ్చు.
కొందరికి రాత్రిళ్ళు తొందరగా నిద్రపట్టదు. పొద్దున్న ఆలస్యంగా నిద్రలేవటం జరుగుతుంది. దానివల్ల మరుసటిరోజు రాత్రి తొందరిగా నిద్రపట్టదు. దీన్ని బద్దలు కొట్టడం కోసం అలారం దూరంగా పెట్టుకోండి. తెల్లవార్నే గడియారం వరకూ నడిచివెళ్ళి, మొహం అక్కడ తడిచేసుకోవడం ద్వారా నిద్రనుంచి బయటకు రండి. ఎంత నిద్ర వచ్చినా ఆ రోజు రాత్రి వరకూ పడుకోకుండా ఏదైనా వ్యాపకం కల్పించుకోండి. అయిదురోజుల్లో మీ నిద్ర గాడిలో పడుతుంది.
మధ్యాహ్నం లంచ్ అయ్యాక పది నిముషాలు కనులు మూసుకుని పడుకుంటే, సాయంత్రం వరకూ ఫ్రెష్ గా ఉంటుంది.
పరీక్షల ముంది ఇచ్చే ప్రిపరేషన్ శలవుల్లో మధ్యాహ్నం గంటసేపు పడుకోవాలి. లేచి బ్రష్ చేసుకుని, స్నానం చేసి, గది చీకటి చేసి టేబుల్ లైట్ వేసుకోవటం ద్వారా "తెల్లవారుఝాము" వాతావరణం ఏర్పడుతుంది. ’ఒకరోజు - రెండు ఉదయాలు’ టెక్నిక్ ఇది. తెల్లవారుఝాము సమయాన్ని ’బ్రహ్మ సమయము’ అంటారు. ఆ సమయంలో చదివితే ఏకాగ్రత, జ్నాపకశక్తి పెరుగుతాయి. అంటే సాయంత్రం పూట మనమొక తెల్లవారుఝాముని క్రుత్రిమంగా మన గదిలోనే స్రుష్టించుకుంటున్నామన్న మాట. ఇది చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
భయం - ఆందోళన - దిగులు
పరీక్షలు దగ్గరపడేకొద్దీ వ్యాకులం అయిదు దశల్లో పెరుగుతుంది. పరీక్షలు ఇంకో నెలలో ప్రారంభమవుతాయనగా మొదటి దశ వస్తుంది. ఒక రకమైన అసౌకర్యం, ఒంటరితనం, అభద్రతాభావం ప్రారంభమౌతాయి. పొద్దున్న లేవగానే ఎందుకో దిగులుగా ఉంటుంది. ఎవరైనా మాటల సందర్భంలో చదువు ప్రసక్తి తీసుకొచ్చినపుడు ఒకరకమైన నిస్పృహతో కూడిన నిరాశాభావం మొదలవుతుంది.
పరీక్షలు ఇంకో వారం రోజుల్లో మొదలవుతాయనగా ఏదో తెలీని కలత ఆవరించుకుంటుంది. రాత్రంతా సరిగా నిద్రపట్టదు. అనవసరమైన ఆలోచనలన్నీ మనసును చుట్టుముడతాయి. కొద్దిగా తలనొప్పి, మెడలు లాగడం, అప్పుడప్పుడు చర్మం మీద ర్యాష్ రావడం ఈ కలత తాలూకు లక్షణాలు.
పరీక్ష మరుసటి రోజు ప్రారంభమవుతుందనగా ఒక రకమైన స్తబ్దత మనసంతా పరుచుకుంటుంది. ఇది మూడో దశ. పెదవుల మీద నవ్వు, మనసులో ఆనందం క్షీణిస్తాయి. ఎదురుగా ఎవరు మాట్లాడుతున్నా, ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. అరచేతిలో చెమటలు పడతాయి.
ప్రశ్నాపత్రం తీసుకుంటున్న సమయంలో ఈ టెన్షన్ పరాకాష్టకి చేరుకుంటుంది. దీన్ని సరిగా కంట్రోల్ చేయకపోతే తెలిసిన విషయాలు కూడా మర్చిపోవడమ్ జరుగుతుంది. ఆలోచనా క్రమంలో వివిధ రకాలైన బ్రేక్ లు రావడం, పూర్తిగా అయోమయం చెందినట్లు అనిపించడం - ఈ స్థితి లక్షణాలు.
పరీక్షలు రాస్తున్నంతసేపూ మాత్రమే కాకుండా, ఆన్సర్ షీట్ ఇచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పై స్థితి కొనసాగవచ్చు. గుండె నీరసంగా కొట్టుకోవడం, ఇలా కాక్ ఇంకోలా రాసుంటే బావుండుననిపించడం, చదివినదంతా వృధా అయిపోయిందనే అసంతృప్తి - ఈ స్థితిలో కలగవచ్చు.
ఈ క్రింది పరిణామాలు దిగులుకి ఉదాహరణలు :
ఎ) పక్కమీద చేరిన గంటవరకూ నిద్రపట్టకపోవడం, చాలాసార్లు మధ్యలో మెలకువ రావడం అవసరమైన సమయానికన్నా గంట ముందే మెలకువ రావడం, కలతతో కూడిన ఆలోచనల వల్ల తిరిగి నిద్రపట్టకపోవడం
బి) అంతకుముందు ఉత్సాహంగా ఉండే విషయాలు కూడా ప్రస్తుతం నిరాశక్తంగా తోచడం, ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం
సి) తొందరగా అలసట చెందినట్లు అనిపించడం, కాస్త పనిచెయ్యగానే చేస్తున్నపని పట్ల ఉత్సాహం పోవడం, ’చేసి ఏం లాభం?’ అని తరచు అనిపించడం
డి) ఇంతకు ముందు స్ఫురించినంత తొందరగా ప్రశ్నలకి సమాధానాలు తోచకపోవడం, గ్రహణశక్తి లోపించిందన్న భావన తరచూ కలుగుతూ ఉండడం
ఇ) జీర్ణశక్తిలో విపరీతమైన మార్పు.
ఎఫ్) ప్రతి చిన్న విషయానికీ అకారణమైన దుఃఖం లేదా కోపం కలగడం
ఫెయిల్యూర్ - ఆత్మహత్య : పేపర్లో నెంబర్ కనబడకపోతే, వెంటనే భరించలేనంత నిరాశ, నిస్పృహలు కలగడం సహజమే. దానికి కరణాలు ఇవి :
.. మళ్ళీ పాఠాలన్నీ చదవాలి
.. క్లాస్ మేట్స్ మరో పై తరగతికి వెళ్ళి పోతారు
.. జూనియర్స్ తో కలసి చదవాలి.
.. స్నేహితులు బంధువులు నవ్వుతారు
.. తల్లితండ్రుల ఆశలన్నీ కూలిపోతాయి. ఇవే కారణాలు.
కానీ ఆలోచించి చూడండి. ఇవేమీ ఆత్నహత్న చేసుకుని నిండు జీవితాన్ని బలిపెట్టుకోవలసినంత పెద్ద కారణాలు కాదు. ఆత్మహత్య చేసుకోవాలన్న కసినీ, దుఃఖాన్నీ కాస్త వాయిదా వేసుకోగల్గితే అది తగ్గిపోతుంది.
తెలివి - జ్నాపకశక్తి
’తెలివి’ అంటే తనకు తెలిసిన దాన్ని సరిఅయిన సమయంలో సరిగ్గా ఉపయోగించి, అందరికన్నా తొందరగా ఫలితాన్ని రాబట్టడం! మంచి మార్కులు సంపాదిస్తే తెలివైన అమ్మాయి అంటాం. పాడయిన సైకిల్ చిన్న వయస్సులోనే బాగుచేస్తే తెలివైన కుర్రాడు అంటాం.
కొందరు పిల్లలు కొన్ని క్లాసుల వరకూ మంచి మార్కుల్తో పాసయి, ఆ పైన వెనుకబడిపోతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ’మా అబ్బాయికి మొన్నటి వరకూ మంచి మార్కులు వచ్చేవి. ఎందుకో అకస్మాత్తుగా తగ్గిపోవడం మొదలైంది.’ అంటూ ఉంటారు. ఒక్ కుర్రవాడికి ఏడో తరగతిలో ఎనభై మార్కులు వచ్చి, ఎనిమిదో తరగతిలో ఇరవై మార్కులు వస్తే - అతడి బేసిక్ తెలివి (పునాది) ఏడో స్టాండర్ద్ కి సరిపోయేటంత వరకూ మాత్రమే ఉన్నదన్నమాట. ఆ తరువాతి క్లాస్ కి కావలసినంత తెలివిని అతడు సమకూర్చుకోలేడు.
జ్నాపక శక్తి అంటే, అవసరమైన విషయాల్ని మెదడు పొరల్లో పొందుపరచుకుని, అవసరమైనపుడు తొందరగా వెలికి తీయగలగడం! విషయాలన్నీ తెలిసిన వాడిని పండితుడు అంటారు. దాన్ని తెలివిగా ఉపయోగించగలిగితే వాడిని జ్నాని అంటారు.
సాధారణంగా మనుషులు 40 నుంచి 90 వేల పదాల్ని గుర్తు పెట్టుకుంటారని అంచనా. అందులోనే స్నేహితుల పేర్ల నుంచీ, ఆహార పదార్ధాల వరకూ అన్నీ ఉంటాయి. స్టాండర్ద్ డిక్షనరీలో 70 వేల పదాలుంటాయి. ఒక చదరంగం ఆటగాడు దాదాపు లక్ష ఎత్తుల్ని గుర్తుపెట్టుకుంటాడు.
ఒక పదం గానీ, విషయం గానీ అవసరమైనప్పుడు గుర్తు రాకపోవడాన్ని ’లెథొర్జికా’ అంటారు. అయితే దానికన్నా చిరాకు పరిచే విషయం 'శూన్యస్థితి'
ఏకాగ్రత.. జ్నాపకశక్తి.. ఆందోళన’ అనేవి ఒక వృత్తంలాంటివి. ఆందోళన చెందగానే విద్యార్ధి గ్లూకోజ్ స్థాయిలో మార్పు వస్తుంది. దాన్ని సరిచేయడం కోసం మెదడు కార్టిజాల్ ని విడుదల చేస్తుంది. దాంతో జ్నాపకశక్తి తగ్గిపోతుంది. దాంతో మరింత ఆందోళన పెరుగుతుంది. అందుకే పరీక్షాపత్రం తీసుకునేటప్పుడు, ఇంటర్వ్యూకి ప్రవేశించినప్పుడూ నవ్వుతూ వుండమని సలహా ఇస్తారు. ఆన్సర్ వ్రాయడానికి ముందు గానీ, సమాధానం చెప్పడానికి ముందుగానీ ఒక్క క్షణం ఆగాలి. నవ్వాలి. గుండెల్నిండా గాలి పీల్చుకోవాలి.
మా పిల్లలు బాగానే చదువుతారు. కానీ మర్చిపోతారు. అని ఫిర్యాదు చేస్తారు కొందరు. పూర్తిగా గుర్తుండకపోవడాన్ని ఆల్ జీమర్స్ వ్యాధి అంటారు. స్వంత పేరుని మర్చిపోవడం, ఇల్లు ఎక్కడో గుర్తుకురాకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. కేవలం ఇది సాధారణంగా వృధ్ధాప్యంలో మాత్రమే వస్తుంది. వాలంటైన్స్ డే గుర్తు పెట్టుకున్న పిల్లలు మదర్స్ డే గుర్తుపెట్టుకోలేక పోవడం మతిమరపు వ్యాధి కాదు.
తెలివికీ, జ్నాపకశక్తికీ సంబంధం లేదు. ఆ మాటకొస్తే అత్యద్భుతమైన తెలివితేటలున్న శాస్త్రజ్నుల జ్నాపకశక్తి చాలా తక్కువ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే గొప్పవారు కేవలం అవసరమైన విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు.
ఐన్ స్టీన్ మెదడుకీ, సామాన్య మెదడుకీ తేడా ఏమిటంటే, ఐన్ స్టీన్ అసలేదీ మర్చిపోడని కాదు.. కానీ అవసరమైనది తప్పకుండా గుర్తుంచుకుంటాడు. సామాన్యుడు అనవసర విషయాల కోసం అవసరమైన వాటిని మెదడులోంచి బయటకి తోసేస్తాడు.
చదివింది గుర్తుండాలంటే ఒకటే మార్గం! చదువు ప్రారంభించాక టీ.వీ. చూడడం కానీ, ఇతరులతో మాట్లాడటం గానీ చేయకూడదు.చదువు మధ్యలో భోజనం చేయవలసి వస్తే నిశ్శబ్దంగా చేయాలి. చదువు పూర్తికాగానే వెళ్ళి పడుకోవాలి. లేదా మళ్ళీ తిరిగి చదువుకోవాలి. కష్టమే. కానీ తప్పదు.
ఏకాగ్రత
ఏకాగ్రత అందరికీ ఎందుకు రాదు? దీనికి రెండు కారణాలు :
ఒకటి) చేస్తున్నపని మీద ఉత్సాహం లేకపోవడం.
రెండు) చేస్తున్న పని మీద ఉత్సాహం తగ్గించే విషయాలపై ఎక్కువ ఉత్సాహం ఉండటం.
కొందరు విద్యార్ధులు అనిమేషులై, ఋషుల్లా పుస్తకాల్లోకి చూస్తూ ఉంటారు. కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. కాగితం కలంతో కూర్చుంటారు. కానీ ఒక్క అక్షరం వ్రాయరు. దీన్నే ’డ్వాడ్లింగ్’ అంటారు. పోనీ ఆ విధంగా ఆనందంగా ఉంటారా అంటే అదీ లేదు. ఒకవైపు అపరాధభావంతో ’మనసు నిలవడం లేదే’ అని బాధపడుతూనే ఉంటారు.
చదవవలసిన సబ్జెక్టు పరిమణం పెరిగిపోతున్న కొద్దీ నిరాసక్తత ఏర్పడుతుందని శాస్త్రజ్నుల అంచనా. కాళ్ళూ, చెయ్యులాగే ’మనసాడని’ స్థితి ! ప్రతి వెద్యార్ధి తనకొక ’శక్తి సరిహద్దు’ఉందనుకుంటాడు. అది తప్పు. ఆ సరిహద్దు దాటితే, తిరిగి మరింత శక్తి వస్తుంది.
ఒక విద్యార్ధికి అద్భుతమైన తెలివితేటలూ, అంతులేని జ్నాపకశక్తి ఉండవచ్చు. కానీ అలా ఉన్నట్టు అతలి వారికి తెలియకపోతే ఏం లాభం? అదే ప్రతిస్పందన. ఇది మూడు అంశాలుగా ఉంటుంది. అవతలి వారి ప్రశ్నని సరిగ్గా అర్ధం చేసుకోవడం. మెదడు పొరల్లోంచి సమాధానాన్ని ’తొందరగా’ తీయగలగడం. అవతలవారికి అర్ధమయ్యేలా, అయోమయం లేకుండా చెప్పగలగడం.
తమకి ఏకాగ్రత కుదరడం లేదని ఫిర్యాదు చేసే విద్యార్ధులు అసలు కారణాన్ని వెతికి పెట్టుకోవాలి. ఏ మానసిక వైద్యుడూ తాయెత్తు ఇవ్వలేడు కదా. ’ఆఆఆ’ లంటారు. ఆహారం, అతినిద్ర, అభిరుచి, - వీటిపట్ల దృక్పథం (ఇష్టం) మార్చుకోకపోతే ఏకాగ్రత కుదరదు.
చిన్న వయసులో ప్రేమలో పడటం, ఆకర్షణని ప్రేమ అనుకోవడం - అనవసరంగా కోరి ఇబ్బందులని కొని తెచ్చుకోవడమే! ఉన్న సమస్యలకి ఇది కూడా తోడై, ఏకాగ్రతని దూరం చేస్తుంది.
పూర్వకాలం విద్యార్ధులకి ఆటలూ, చదువూ తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదు. శలవురోజుల్లో చెరువులో ఈత కొట్టడాలూ, సాయంత్రాలు కోతికొమ్మచ్చులే తప్ప, ఇరవై నాలుగ్గంటలూ మనసుని తమవైపే ఎంగేజ్ చేసే చాటింగ్ లూ, సెల్ ఫోన్లూ, క్రికెట్ లూ ఉండేవి కావు. చదువుకీ, ఆటలకీ కంపార్ట్ మెంట్ లు విడిగా ఉండేవి. వ్యాపకాలు ఆ రోజుల్లో జీవితంలో ఒక భాగం మాత్రమే! వ్యాపకమే జీవితం కాదు!! సాయంత్రం ఈతకొట్టి ఇంటికొచ్చిన కుర్రవాడు, రాత్రిపూట చదువుకొనేటప్పుడు తిరిగి చెరువు గురించి ఆలోచించేవాడు కాదు. క్రికెట్ గురించి మాట్లాడుకున్నంతగా, స్నేహితుల మధ్య ’కోతి కొమ్మచ్చి - కబడ్డీ’ ల గురించి చర్చ ఉండేది కాదు. ప్రొద్దున్న బడి, సాయంత్రం ఆట, రాత్రి చదువు అంతే. ఇన్ని అలజడులు లేవు.
అవసరం అయినప్పుడు మాట్లాడటం ఎంత ముఖ్యమో అనఅసరం అయినపుడు మౌనంగా ఉండటం కూడా అంత ముఖ్యమే! మనం మాట్లాడితే అవతలి వారికి జ్నానం రావాలి. లేదా వారు మాట్లాడితే మనకి అయినా లాభం ఉండాలి. లేకపోతే మాటలెందుకు?
చదువుపట్ల ఆకర్షణ పెంచి, దాని ద్వారా ఏకాగ్రత సాధించగలిగే మొట్టమొదటి సూత్రం.. వీలైనంత సేపు అవసరం లేనప్పుదు మౌనంగా ఉండ(గలగ)టం! అదే ఖచ్చితమైన, సులభమైన, ఏకైక మార్గం! స్వీట్లు తింటూ డయాబిటీస్ తగ్గించమనే రోగిని డాక్టర్ ఏవిధంగా ట్రీట్ చెయ్యలేడో, అతివాగుడి విద్యార్ధికి ఏ సైకాలజిస్టూ తెప్పించలేడు.
ఒక సినిమా గురించి గానీ, నటుడి గురించి గానీ తన వాదనని సపోర్ట్ చేయడానికి ఎక్కడో నిద్రపోతున్న జ్నాపకాల్ని (న్యూరాన్స్ ని) మేల్కొలపాలి. దానివల్ల ఆ న్యూరాన్లు తిరిగి ఆక్టివ్ విభాగానికి వస్తాయి. అక్కడున్న (చదువు తాలూకు) న్యూరాన్లు పాసివ్ విభాగానికి వస్తాయి. అవసరమైన విషయాలకి మెదడు ఎక్కువ స్థలం కేటాయించడాన్ని ’గార్బేజిస్పేస్’ అంటారు. మెదడు ఈ విధంగా అనవసర విషయాల్తో ఒక చెత్తకుండీలా తయారవుతుంది. చదువు వెనక్కి వెళ్తుంది.
ఇతరులతో ఆవేశంగా గాని, ఉద్వేగంగా గానీ వాదించేటప్పుడు విడుదలయ్యే అడ్రినల్, మనల్ని హైపర్ ఆక్టివ్ గా తయారు చేస్తుంది. ఇది శరీరానికి కాదు, మనసుకి కూడా హానికరం. బయట అంతా మాట్లాడాక ఇంటికొచ్చి చదివినా పాఠం మనసుకెక్కదు.
కరాటే ఆటగాడు పోటీలోకి ప్రవేశించబోయే ముంది ఏ విధంగా గాలిలోకి పంచ్ లు ఇస్తూ, బలంగా వూపిరితీస్తూ ’మూడ్’ లోకి ప్రవేశిస్తాడో - ఆ విధంగా చదువు ప్రారంభానికి ముందు కళ్ళు మూసుకుని రెండు నిముషాలు బలంగా ఊపిరి పీలుస్తూ వదలండి.దీన్నే ’క్లీనింగ్ ది స్లేట్’ అంటారు.
చదువుకోవడం కోసం ఒక స్థలం పెట్టుకోండి. ఆ స్థలంలో తప్ప వీలైనంత వరకూ మరెక్కడా చదవొద్దు. మంచంమీద, వంటింట్లో అసలొద్దు. అప్పుడప్పుడూ ఆరుబయటా, మెట్ల మూద ఫర్వాలేదు. చదివే స్థలంలో తినడం, ఫోన్ మాట్లాడటం లాంటి పనులు చెయ్యొద్దు. కేవలం చదువు కోసమే ఆ స్థలాన్ని వాడాలి. కొంత కాలానికి మీకూ, చదువుకీ ఆ స్థలానికీ మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది.
పడుకుని చదవొద్దు. గోడవైపు కూర్చుని చదవడం మంచిది. గదంతా చీకటి చేసి, టేబుల్ లైట్ వెలుగులో చదవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఒక సైంటిస్ట్ తన గదిలో ఒక్కడే కూర్చుని ఎలా గంటల తరబడి తన పనిలో లీనమై పనిచేస్తూ ఉంటాడో అలా చదవడం తొందర్లోనే మీకూ అలవాటయిపోతుంది.
సమయానికి లేవడమూ, స్నానమూ, భోజనమూ కరెక్టుగా చేయడం, క్రమశిక్షణకి మొదటి మెట్టు. ప్రతి రోజూ ఠంచనుగా ఒకే సమయానికి చదువు ప్రారంభించే విద్యార్ధి సగం విజయం సాధించినట్లే. అదే విధంగా ఏ యే సబ్జెక్టు ఎంత సేపు చదవాలో ముందే నిర్ణయించుకోవడం మంచిది. అర్ధరాత్రి దాటాక చదవడం అభిలషణీయం కాదు. తెల్లవారు ఝాము చదువు (బ్రహ్మ సమయం) మంచిది.
వర్రీ టైమ్ :
ఇదొక గమ్మత్తయిన ప్రక్రియ. ప్రొఫెసర్ జాన్ క్రోషర్ అనే స్టూడెంట్ మోటివేటర్ ఇచ్చిన సూచన ఇది. సాయంత్రం పూట రోజుకో గంట ’వర్రీ టైమ్’ గా పెట్టుకోమంటాడు. చదువుకుంటున్నప్పుడు ఏదైనా ఆలోచన పక్కదారి పట్టిస్తే దాన్ని ఒక కాగితం మీద వ్రాసుకుని పక్కన పెట్టుకోవాలట. అలా వ్రాసుకున్నాక ఇక ఆ విషయం గురించి మర్చిపోయి తిరిగి మళ్ళీ చదువుకోవాలి. సాయంత్రం తీరిగ్గా కూర్చుని, అలా వ్రాసుకున్న లిస్ట్ లో ఒక్కొక్క ఐటమ్ వర్రీ టైమ్ లో ఆలోచించడం ప్రారంభించాలట. అప్పటికి ఆ విషయం తాలూకూ సాంద్రత తగ్గిపోయి ఆలోచించడానికి ఏమీ మిగలదు.
మీరు గమనించినారా? మనకి బాగా ఉత్సాహం ఉన్నదాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ ఇంద్రీయం యొక్క పవర్ పెంచడానికి, మిగతా ఇంద్రియాల శక్తిని ఆటోమేటిక్ గా తగ్గిస్తాం. పువ్వు వాసన పెంచడానికి, మిగతా ఇంద్రియాల శక్తిని ఆటోమాటిగ్ గా తగ్గిస్తాం. పువ్వు వాసన చూస్తున్నప్పుడు (ముక్కు), సంగీతం వింటున్నప్పుడు (చెవి), ప్రేమతో బుగ్గని స్పర్శిస్తున్నప్పుడు (చర్మం) మన దృష్టి ఎటూ పోకుండా కళ్ళు మూసుకోవడం అందుకే.
కోర్కెని సమూలంగా తొలగించమని బుధ్ధుడు చెప్పిన నిర్వాణ యోగ పూర్తిగా మనకి ఎలాగూ సాధ్యం కాదు. కానీ కోర్కెని వాయిదా వేయడం ద్వారా ఆ స్థితి సాధించవచ్చు. చూసిన సినిమా కథ వెంటనే స్నేహితునికి చెప్పాలనిపిస్తుంది. వెంటనే చెప్పకండి. రెండ్రోజుల వరకు మనసుని కంట్రోలులో పెట్టుకోండి. ఈ రోజు ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఆఖరి నిముషంలో మానెయ్యండి. మరుసటి రోజు వెళ్ళండి.
కోరికని వెంటనే తీర్చుకోకుందా, దాన్ని జయించగలగుతున్నానన్న భావన చాలా బావుంటుంది. క్రమక్రమంగా మీ మీద మీకు అధికారం వస్తున్నట్టు అనిపిస్తున్న కొద్దీ, కోర్కె తీర్చుకోవడం కన్నా దాన్ని అధిగమించడం ఎక్కువ సంతృప్తినిస్తున్నట్టు అనిపిస్తుంది.
పాలకోవా అంటే ప్రాణం పోయేటంత ఇష్టం. దాన్ని ఎదురుగా పెట్టుకొని, చదువు పూర్తయ్యాక తింటారనుకోండి. చదువు పూర్తయ్యక వీలైతే దాన్ని తిరిగి యథాస్థానంలో పెట్టెయ్యండి. మీపై మీకున్న ’కంట్రోల్’ మీకే ముచ్చటేస్తుంది. లెక్చరర్ పాఠం చెప్తున్నాడు. మీరు సీరియస్ గా వ్రాసుకుంటున్నారు. గుమ్మం దగ్గర్నుంచి, ’మె ఐ కమిన్ సర్’ అని వినిపించింది. తలెత్తి ఎవరొచ్చారో చూడకుండా మీ పనిలోన నిమగ్నం అవడానికి ప్రయత్నించండి.
జ్నానేంద్రియాల నియంత్రణ
అభిమాన నటుడి సినిమా చూస్తున్నప్పుడు కన్నార్పకుండా, చెవులు రిక్కించి చూస్తాడు కుర్రవాడు. పక్కవాడు కోక్ తాగుతున్నా ఆ వాసన ముక్కుకి చేరదు. వెనుకవరుసలో వాడు నడుస్తూండగా అతడి మోచెయ్యి తన వీపుకి తగిలినా స్పర్శ తెలీదు. నాలుక కూడా సినిమా చూడడానికి ఉత్సాహపడుతుంది. ఆ విధంగా ’పంచజ్నానేంద్రియాల’తో చూసాడు కాబట్టే ఆ సినిమా కలకాలం గుర్తుంటుంది. అదే జ్నానేంద్రియాల నియంత్రణ.
కళ్ళు : కొంచెం సేపు చదివాక కొందరికి కళ్ళు నొప్పి పెట్టడం, నీళ్ళు కారడం సంభవించవచ్చు కళ్ళజోడు వున్నవారు అద్దాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నోటితో కాకుండా కళ్లతో చదవడం ప్రాక్టీస్ చెయ్యాలి. బిగ్గరగా చదవడం మంచిదే కానీ వయసు పెరిగే కొద్దీ అలవాటు తగ్గించుకోవాలి. పడుకుని చదవొచ్చు. నిటారుగా కూర్చుని చదవాలి.
పగలు చదివేటప్పుడు కూడా వీలైతే గదంతా చీకటిగా వుంచి, టేబుల్ లైట్ వెలుతురులో చదివితే కలిగే ’ఏకాంతం భావం’ ఏకాగ్రతని పెంచుతుంది.
కళ్ళు తొందరగా అలసిపోవడానికి కారణం, చదువుకునేటప్పుడు పుస్తకం వెనుకవున్న బ్యాక్ డ్రాప్!! అన్నిటికన్నా పసుపురంగు కళ్ళకి మంచిది. రీడింగ్ టేబుల్ మీద పసుపురంగు క్లాత్ వేసుకుంటే కళ్ళు తొందరగా అలసిపోవు. చాప మీద కూర్చుని చదివే అలవాటు ఉంటే, దాని మీద కూడా పసుపురంగు గుడ్డపరచాలి.
గంటకన్నా ఎక్కువ చదివేటప్పుడు, మధ్యలో అయిదు నిముషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఇది చాలా ప్రదానమైన, ముఖ్యమైన పాయింటు. ఈ బ్రేక్ లో టి.వి. చూడడం గానీ, కబుర్లు చెప్పడం కానీ చెయ్యకూడదు. కళ్ళమీద తడిగుడ్డ వేసుకుని, తల వెనక్కి వాల్చి అప్పటి వరకూ చదివింది గుర్తు తెచ్చుకోవాలి.
అలా గుర్తు చేసుకుంటున్న ఐదు నిముషాల సమయంలో, కుడి చేతి మధ్య వేలితో ఎడమవైపు ముక్కు మూసుకుని, కుడివైపు నుంచి పీల్చాలి. తరువాత కుడి బొటనవేలితో కుడివైపు నాసిక మూసి, ఎడమవైపు నుంచి వదలాలి. ఊపిరితిత్తులు ఆ విధంగా స్వచ్చంగా, శుభ్రంగా తయారవుతాయి. అంతర్గత శక్తి పెరిగి, కొత్త ఉత్తేజం వస్తున్నట్లు అనిపిస్తుంది. నెలరోజుల్లో దీని ఫలితం మీకే తెలుస్తుంది.
నోరు : రాత్రిపూట చదువుకి ముందుగానీ, మధ్యలో గానీ, స్వీట్లు, చాక్లెట్లు, నూనె వస్తువులూ తినొద్దు. పరీక్షల ముందు నూనె పదార్ధాలూ, స్వీట్లూ పూర్తిగా తగ్గించడం మంచిది.
చదువు ప్రారంభించే ముందు ఒక లవంగం గానీ, యాలుక పలుకు గానీ బుగ్గన పెట్టుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఆలోచనలు ఎటో పోయినప్పుడల్లా దాన్ని నాలుకతో బయటికి తీసి ఒకసారి కొరకాలి. మొదట్లో అది పిప్పి అవుతుంది. క్రమక్రమంగా దాన్ని బయటకు తీసే అవసరమే రాదు. ఏకాగ్రత కుదురుతోందన్న నమ్మకం చాలా ఆనందాన్నిస్తుంది.
చదువుకునేటప్పుడు వీలైనన్నిసార్లు మంచినీళ్ళు తాగడం మంచిది. చదువు మధ్యలో ఒకసారి పంచదార (చక్కెర) కలపని పళ్ళరసం, గంట తర్వాత సోయాబీన్ పౌడర్ కలిపిన్ మజ్జిగ, చెరోగ్లాసు తాగితే నిద్రరాకుండా శక్తి వస్తుంది.
ముక్కు : చదువుకునేటప్పుడు చల్లటి, సువాసనభరితమైన గదిలో కూర్చుంటే, రెండు మూడు రోజుల్లోనే ఆ తేడా మీకు అర్థం అవుతుంది. మింట్ (పుదీనా) వాసన మెదడును ఉత్తేజపరుస్తుంది. చదువు ప్రారంభానికి ముందు పుదీనా వాసన గుండెల్నిండా పీల్చడం వలన ఫ్రెష్ గా ఉంటుంది.
చదువు ప్రారంభానికి ముందు ఒక అగరొత్తి వెలిగించి చదువుకోవాలి. ఆ వాసనకీ, ఏకాగ్రతకీ కొద్ది కాలంలోనే లింక్ ఏర్పడుతుంది. ఆ వాసన పీల్చగానే ఆటోమేటిక్ గా చదువుకోవాలనిపిస్తుంది. దీని ఫలితం అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఒకవేళ మీకు అగరొత్తి పొగ పడకపోతే జవ్వాది, పుసుగు, కస్తూరి, అత్తర్, గోరూ చనాయ్ లలో (ఏది నచ్చితే అది) మెడ దగ్గర వ్రాసుకోవాలి. ఇవి ఏ పెద్ద కిరాణా షాపులోలైనా దొరుకుతాయి. అభిరుచి బట్టి ఎంపిక చేసుకోవాలి.
చర్మం : సాయంత్రం పూట చదువు ప్రారంభానికి ముందు స్నానం చెయ్యాలి. కనీసం మొహం శుభ్రంగా కడుక్కుని ఫ్రెష్ గా చదువు ప్రారంభించాలి. దీనివల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది.
స్టీమ్ మిషన్ ఇన్నట్లయితే చదువుకి ముందు పసుపు నీటితో ఫేషియల్ చేసుకుంటే, ఏకాగ్రతతో పాటు అందమైన నునుపుదనం కూడా పెరుగుతుంది.
చెవులు: వీలైనంత వరకు బయటి శబ్దాలు ముందు స్టడీ రూమ్ లోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోగలిగితే చదువుకునేడప్పుడు ఇయర్ ప్లగ్ లు (చెవులకు పెట్టుకునే ప్లగ్ లు దూది) ఉపయోగించడం కూడా మంచిదే. ఇయర్ ప్లగ్ లు బజార్లో దొరుకుతాయి. ఖరీదు పాతిక రూపాయలు.
నిద్రపోయే ముందు, అంతకు ముందే మీరు రికార్డ్ చేసి ఉంచిన మీ స్వీయ కంఠపు పాఠాన్నివింటూ నిద్రలోకి జారుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి. చదివిన దానికన్నా, దాన్ని వినడం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రొద్దున్న లేవగానే టేప్ లో ఏదైనా ఉదయరాగాన్ని (భూపాలం, మలయమారుతం లాంటివి) వింటూ కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి. అన్నిటికన్నా బెస్ట్ సుప్రభాతం వినటం! స్నానం పూర్తిచేసే వరకూ ఎవరితో మాట్లాడకుండా ఈ విధంగా చేస్తే, దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది.
జనరల్ : చదువుకునే ముందు ఒక టోపీ పెట్టుకోవాలి, లేదా ఒక స్కార్ఫ్ కట్టుకోవాలి. అది ధరించగానే, ఆటోమేటిక్ గా "చదువుకొనే మూడ్" వచ్చేస్తుంది. పావ్ లావ్ థియరీ ఇక్కడ నూరు శాతం వర్తిస్తుంది. ఒక మతస్థులు ప్రార్ధన ముందు టోపీ పెట్టుకునేది అందుకే. అది పెట్టుకుని జోక్ వెయ్యరు. అనవసరంగా మాట్లాడరు. పవిత్రత ఆపాదించేది అది. వినగానే నవ్వొచ్చినా, చదువుకి టోపీని జతచెయ్యండం, ( లేదా తలకి స్కార్ఫ్ కట్టుకోవడం) మూడ్ లోకి తీసుకెళ్తుంది.
జాగ్రత్తగా గమనించండి. పైదంతా గమనిస్తే, మీరు చదువుకునే స్థలాన్ని ఒక గుడి ప్రాంగణంగా తయారు చేసుకున్నారని అర్ధమవుతుంది. స్నానం చేసి చదువు ప్రారంభించడం, నిశ్శబ్ద వాతావరణం, తలని స్కార్ఫ్ చుట్టుకోవడం, మెడకు గంధం(జవ్వాది), చదువుకి ముందు ప్రార్ధన, చదువు పూర్తయ్యాక మౌనంగా నిదుర.. దీంతో మీకు తెలియకుండానే మీలో క్రమంగా మార్పు వస్తుంది. మీ కుటుంబ సభ్యులకి మీ పట్ల "ప్రేమతో కూడిన గౌరవం" ఏర్పడుతుంది. కేవలం అయిదుశాతం పిల్లలకి మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. వారిని ’పెర్ఫార్బర్స్’ అంటారు. అందులో మీరొకరవుతారు.
స్నేహితులు ఆరు రకాలు; ఒకటి)తెలివైనవారు : వీరి కంపెనీలో మన తెలివి పెరుగుతుంది. పనివిలువ తెలుస్తుంది.
రెండు) మంచివారు : వీకు తెలివైన వారు కాకపోవచ్చు. కానీ ప్రాణం ఇస్తారు. ఆపదలో ఆదుకుంటారు.
మూడు) క్రిములు : మనకి తెలియకుందానే సమయం తింటారు. అయినా వీరి కంపెనీ బావుంటుంది. చెడు అలవాట్లు కూడా వీరి వల్లనే అవుతాయి. వీరి ప్రభావం నుండి బయటపడటం కష్టం. నాలుగు) దొంగలు: మన స్నేహితుల్లాగా నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు. వెనుక గోతులు తవ్వుతారు. అవసరనికి వాడుకుని మాయమవుతారు. ఐదు) గడ్డి పరకలు : వీరి వల్ల లాభమూ ఉండదు, నష్టమూ ఉండదు. కబుర్లకి తప్ప మరి దేనికి ఉపయోగపడరు. ఆరు) హీన చరితులు: వీరికన్నా ’దొంగలు’ నయం. ఏ లాభమూ లేకపోయినా వీరు మన గురించి బయట చెడుగా మాట్లాడతారు. మన మనసు కష్టపెడతారు.
చెడు అలవాట్లు వున్నట్లు అనుమానం కలుగుతున్నా, బద్దకం ఎక్కువ అవుతున్నా వెంటనే మీరు చెయ్యవలసింది - మీ గది వాతావరణాన్ని అలవాట్లనూ మార్చడం! దాని కన్నా ముఖ్యమైనది, కష్టమైనది మరొకటి ఉన్నది. మీ స్నేహ బృందాన్నివెంటనే మార్చెయ్యడం! ఒక్కసారి ఆలోచించి చూడండి. కొత్త వాతావరణం, కొత్త పరిస్థితులు, కొత్త స్నేహితులు.. మీ కొత్త నిర్ణయాన్ని అమలు జరపడానికి ఈ మార్పు చాలా సహాయపడుతుంది.
మెడ నరికినపుడు గానీ, బాణంతో కొట్టినపుడు కానీ, జంతువు విలవిలా కొట్టుకుంటూ బాధతో మరణిస్తుంది. ఆ సమయంలో దాని శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, ఆసిడ్ లూ, జ్యూస్ లూ శరీరం అంతా పాకుతాయి. దానివల్ల మాంసానికి రుచి వస్తుంది. అడ్రినల్ రిలీజయ్యే కొద్దే మాంసం రుచి బావుంటుంది. అయితే ఈ విధమైన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. మరణించే ముందు శరీరంలో చేరిన అడ్రినలిన్, దాని తిన్న విద్యార్ధులలో అలసత్వం పెంచుతుంది. వేలైనంత వరకూ మాంసాహారానికి విద్యార్ధి దశలో దూరంగా ఉండడం మంచిది. తర్కానికి నిలబడక పోయినా, శాకాహారుల్లోనే ఎక్కువ మంది పండితులు, మేథావులు ఉండటం మనం గమనించవచ్చు.
క్లీన్ ది బ్రెయిన్

నాలుగు రకాలైన అంశాల ద్వారా బ్రెయిన్ క్లీన్ చెయ్యవచ్చు.
ఒకటి) ప్రతిరోజూ ప్రొద్దున్నే ప్రశాంతంగా ధ్యానించడం
రెండు) తిరిగి నానా చెత్త వచ్చి చేరకుండా చూసుకోవడం. (అంటే అనవసర ఆలోచనలు, స్నేహాలు, ప్రేమలూ, బాధలు)
మూడు) ఎప్పటికప్పుడు మెదడుని సర్వీసింగ్ చేయడం (అంటే గేమ్స్ ఆడటం, మ్యూజిక్ వినడం, ఇష్టమైన వ్యక్తులతో సంభాషణ, మొదలైనవి.
నాలుగు) మెదడుని పాడుచేసే వైరస్ లకి దూరం ఉండటం ద్వారా (అంటే అధిక సినిమాలు, తాగుడు, సిగరెట్ లాంటివి) పై నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే మనిషి మెదడు కంప్యూటర్ కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది.
శరీరాన్ని, నోటినీ శుభ్రం చేసుకున్నట్లే, మెదడునీ క్లీన్ చేసుకోవడానికి పది నిముషాలు రోజూ ఉపయోగించాలి. పడుకోబోయే ముందు చెవి, కన్నులని దిండుతో ఒక నిముషం నొక్కిపట్టి ఉంచాలి. దానివల్ల ఒకరకమైన నిశ్శబ్ద స్థితిలోకి మనసు ప్రవేశిస్తుంది. ఆ తరువాత సుఖస్థితిలో పడుకుని, ఆ రోజు చదివిన పాఠాలను తిరిగి మననం చేసుకుంటూ నిద్రలోకి జారుకోవాలి.
ప్రొద్దున్న లేవగానే మినుషంపాటు ఆ రోజు కార్యక్రమాన్ని స్పష్టంగా ప్లాన్ చేసుకోవాలి. క్రితం రోజు చేసిన తప్పుల్ని తెలుసుకోవాలి. చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి.
మనకన్నా బీదవారి గురించి,లారీ డ్రైవర్లకి అర్ధరాత్రి పూట టీ అందించే కుర్రవాళ్ళ గురించి, ఆస్ప్రత్రిలో ఉన్న దురదృష్టవంతులైన పిల్లల గురించి, పొద్దున్నే లేవగానే ఒక నిముషం పాటు ఆలోచించాలి. దీనివల్ల సానుకూల ఆలోచన, దయ, కరుణ పెరుగుతాయి.
పక్కదిగగానే, చేతివేళ్ళతో కాలి బొటనవేలు పట్టుకోవాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. తరువాత అద్దం దగ్గరికి వెళ్ళి, పది సెకన్ల పాటు తనని తాను చూసుకుని నవ్వుకోవాలి. దానివల్ల రోజంతా సంతోషంగా ఉంటుంది.
ప్రాక్టీస్ చెయ్యండి. ప్రారంభమే కష్టం. ఒకసారి అలవాటు అయితే అద్భుతంగా ఉంటుంది చదువు! ప్రతి ఉదయం సుప్రభాతం అవుతుంది. అదే విజయ రహస్యం.!!
గెలిచే వారితో కాలం గడపండి. బద్దకస్తులు బద్దకస్తులతోనే ఉంటారు. గెలిచే వారిని గమనించండి. వారికంత శక్తి, ఓర్పు, పనిమీద శ్రద్ధ ఎలా వస్తున్నాయో చూడండి. గెలుపు ఇచే సంతృప్తి మరేదీ ఇవ్వదు. గెలుపు పరిమళం అంటే అదే!

 


 

  యండమూరి వీరేంద్రనాధ్

యండమూరి వీరేంద్రనాధ్ కి పరిచయం అవసరం లేదు. దేశవిదేశాల్లో ఆయన నవలలకి, వ్యక్తిత్వ వికాస రచనలకు విశేషాభిమానులున్నారు. తెలుగులో నంబర్ వన్ రచయిత అయిన యండమూరి అన్ని వర్గాల వారికీ వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడలో స్వంత ఖర్చుతో సరస్వతీ విద్యాపీఠం నిర్మించి అక్కడ విద్యార్ధులకు బాగా చదువుకోడంలో మెళకువలు, ఏకాగ్రత, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం వంటి పలు అంశాలలో ఉచిత శిక్షణాతరగతులు అందిస్తున్నారు.
 

   
     
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech