నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

 

 

- సుబ్రమణ్యం బత్తల, రోచెష్టెర్ హిల్ల్స్, మిచిగన్


అర్థ శాస్త్రమందు అధికులైన వారు
అధిక పదవులనుండి అవకతవకలు జేయ
అర్థ రంగము నేడు అల్లలాడుచు నుండంగ
నడి వీధి (1) జనమునకు నాధుడెవ్వండు?

లెక్క పత్రములు లేక లెక్కకెన్నగ రాని
తప్పులెక్కలు జూప తలలు మారుచునుండ
గోడవీధిని (2) జనులు గగ్గోలు గాగ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

వేల డాలర్లు వ్యయము జేసెండొకడు
మిలియనుల డాలర్లు మెక్కినాడొకడు
బిలియనులు కొందరికి భోజనంబగు వేళ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

బ్యాంకు వారిని బిలిచి బుజ్జగింపులు జేసి
బేళ్ళ కొలదిగ పైకమ్ము బేషరతుగా నిచ్చి
ఖర్చు జమలను జెప్పనగ ఖాతరే లేనపుడు
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

ప్రైవేటు జెట్లలో పయనించినారనుచు
పదిమందిలో నాడు పరుషములు బలికి
బ్యాంకు వారల జెట్లు బాగు బాగనుచుండ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

అప్పులిచ్చు వారు ఆదమరచిన యపుడు
అడుగు వారెవరు అగుపించలేదగు గాని
వాహనమ్ముల గట్టు వారి చేతి మీదను గొట్ట
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

ప్రజల ధనమును పణముగా నోడిన పిదప
చేయగలిగినదేమనుచు చేతులెత్తిన వారిని
ఎవరబ్బ సొమ్మనుచు యెదిరించి నిలదీయ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

కొద్ది కొద్దిగ చేర్చి కూడబెట్టగ మేము
దాచి పెట్టినదంత దోచుకోబడుచుండ
అప్పు యిచ్చెడి వారెవరు యగుపించనపుడు
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

ఇంటి ధరలు తరిగి విలువ యింకి పోయి
కడతేర్చు నిధి (3) కూడ కరగిపోవుచు నుండ
చరమ దశలోన చేయూత యేదని వగచు
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

తిమ్మి బమ్మిని జేసి తీర్థమాడించెడి వారు
తిరుగుచుంటిరి నేడు తిరువీధిలోన
తెర వెనుక జరిగేటి తిరకాసు తెలియని
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

పదవియందుండి పదవులమ్మెడి తీరు
పన్నులెగుర వేసి పదవి గోరెడి వారు
రాజకీయపు రంగు యీరీతి రచ్చ కెక్కుచునుండ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

సొమ్ము నిచ్చిన గాని శ్వాశ రాదని జెప్పి
ప్రజల ధనమును గైకొన్న ఫైనాన్ సు జగతి
ప్రజల యూపిరి మరచి పండుగల మునుగ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

అదుపులధికమైన అభివృద్ధి లేదనుచు
అదుపులెన్నిటినొ యణచి అవకాశమివ్వగ
అదుపు దప్పిన వారినదుపు చేయుటకొరకు
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

అప్పు దెచ్చి నాడు యైశ్వర్యమును సాధించి
ఆస్తులను జూపించి యప్పు దెచ్చితిమీనాడు
అప్పు పెరిగిపోయి తెప్ప తిరగబడుచుండ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?

ప్రగతి కారణమైన పెట్టుబడిదారీ తనము
నంటు కొన్న నేటి యంటు వ్యాధులనణచి
కుంటుతున్న స్థితిని మరల మింటి కెగయ జేయ
నడి వీధి జనమునకు నాధుడెవ్వండు?
(1) మెయిన్ స్ట్రీట్ (2) వాల్ స్ట్రీట్ (3) పెన్ షను ఫండు / 401కె 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech