మానవ బలం
 


              -చొక్కాపు వెంకట రమణ


ఆనందపురం దేశానికి శత్రువుల బెడద ఎక్కువయ్యింది. శత్రురాజుల నుంచి నగరాన్ని రక్షించుకునేందుకు రాజు నిక్షేపరాయుడు తగిన చర్యలు తీసుకున్నాడు. నగరం చుట్టూ కొండరాళ్ళతో ఎత్తయిన గోడ కట్టించాడు. ముఖద్వారానికి ఇనుప తలుపులు పెట్టించాడు.

రాతిగోడ గట్టిదనం, ఇనుప తలుపుల బలం పరీక్షించేందుకు రాజు వాటిని ఏనుగులతో కుమ్మించాడు. ఫిరంగులతో కొట్టించాడు. ఏమీ చెక్కుచెదరలేదు.

నిక్షేపరాయుడు పరమానందం చెందాడు. సైన్యాధిపతి, మంత్రుల వైపు గర్వంగా చూశాడు.

ఈగోడ, ముఖద్వారం శత్రువులకు దుర్భేద్యం. నగరంలో వాళ్ళు కాళ్ళు మోపలేరు. అన్నాడు.

ఆ మాటలకు మంత్రి నవ్వి ఊరుకున్నాడు.

ఇది జరిగిన ఒకనాటి రాత్రి రాజు, మంత్రి మారువేషాల్లో నగర పరిసరాలు తిరిగి, నగర ముఖద్వారం దగ్గరకి వచ్చారు. అక్కడ కాపలా ఉన్న భటుల నాయకుడిని తలుపులు తెరవవలసిందిగా కోరారు.

అందుకు భటుల నాయకుడు అంగీకరించలేదు. సైన్యాధిపతి అనుమతి పత్రం లేనిదే సూర్యాస్తమయం తరువాత ఎవరూ నగరంలోకి ప్రవేశించటానికి వీలు లేదు అన్నాడు.

మంత్రి వివేకుడు భటుల నాయకుడిని పక్కకు తీసుకుపోయాడు. అతడి చేతిలో ఇరవై బంగారు నాణేలు పెట్టాడు.

మాకు నగరంలో చాలా అవసరమైన పని ఉంది అన్నాడు.

భటుల నాయకుడు కాపలా భటులను తలుపులు తెరవవసిందిగా ఆజ్ణాపించాడు.

జరిగింది చూసి ఆశ్చర్యపడుతున్న రాజు నిక్షేపరాయుడితో మంత్రి ఇలా అన్నాడు.

ప్రభూ! ఏనుగుల కన్నా, ఫిరంగుల కన్నా బలవత్తరమైనదేమిటో తెలిసింది కదా!

నిక్షేపరాయుడు నిర్ఘాంతపోయాడు.
 


చొక్కాపు వెంకటరమణ :

స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్ రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని లో నెల నెలా వెన్నెల..
 


 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech