తెలుగు పద్యాల్లో హాస్యం

 

-మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు

తెలుగు పద్యాల్లో హాస్యం హాస్యం మనిషికే కాదు, భగవంతుడికి కూడా చాలా ఇష్టం. అందుకే మన కవులు తొలి దైవమైన వినాయక ప్రార్ధనలో కూడ హాస్యం జోడించారు. ఈ కాలం పద్య కవుల్లో గురుపీఠం అనదగిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు కాస్త ప్రౌమైన భాషలోనే అయినా ఎంత హాస్యరసస్ఫోరకంగా వినాయకుని స్తుతించారో చూడండి.

"గండ ప్రస్రవదంబుపారణ రటత్కలాళి వైధూననోద్దండ ప్రక్రియనోడి పోవుట, కకుబ్దంతీంద్ర కర్ణామయోచ్చండంబౌగతి ఘీంకరింప గజవక్త్ర స్వామి షద్వక్త్రవాహోఅండే జోత్తము నృత్తముల్ బహువిధామ్హస్తాడనైకాఢ్యముల్ "

వినాయకుడు గజముఖుడు కదా! ఆయన దవడల నుంచి మదజలం స్రవిస్తోందిట. ఆ మదజలం మధువు కావడం చేత దానికోసం తుమ్మెదలు విపరీతంగా వాలుతున్నాయట. అవి పెద్ద రణగొణ ధ్వని చేస్తున్నాయట. దాంతో చిర్రెత్తిన వినాయకుడు చేటల్లాంటి చెవులతో వాటిని తోలేసే పనిచేసినా అవి పోవడంలేదట. అంతటితో ఆ చికాకు ఇంకా ఎక్కువై పోయి "అమ్మా " అంటూ పెద్దగా ఘీంకారం చేశాడట. ఆ దెబ్బకి అష్టదిక్కుల్లో ఉండే దిగ్గజాలకి చెవుడు వచ్చినంత పనైందట. ఈ హడావుడి అంతా చూసి కుమారస్వామి వాహనమైన నెమలి బహుసుందరంగా నృత్యం చేస్తోందట. ఇటువంటి రమ్యమైన కైలాస దృశ్యం మన పాపములను పోగొట్టు గాక ! అంటూ ప్రార్ధన ముగించారు బేతవోలు వారు. వినాయకుడి మీద పద్యాలిలా ఉంటే ఆయన తల్లి పార్వతీ దేవి పేరు మీద మరో రకం చమత్కార పద్యం ఉంది. తిరుపతి వేంకట కవులను లక్ష్మీ పార్వతుల సంవాదాన్ని వర్ణించమని కోరారట. అప్పటి పద్యం ఇది..

"గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియె నెద్దునెక్కును నీదు నెమ్మికాడని నవ్వ గ్రద్దనెక్కును నీ మగండటనియె నాట్యమ్ముసేయు నీ నాయకుండన, హంగు కావైంచు వెన్ కనీ కాంతుడనియె వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ నడి సంద్ర ముల్లు నీ నాధుడనకనె ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన బలిముఖంబునకేగెనో లలన యనియె ఇట్టులన్యోన్య మర్మంబు లెంచు కొనెడు పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు.. "

లక్ష్మి : మీ ఆయన గంగాధరుడట గదా ! పాపం, నీళ్ళు మోసుకొనే అవతారమా ఆయనది !

పార్వతి : ఔను. ఏదో కుటుంబ పోషణ కోసం మా ఆయన గంగాధరుని వేషం వేశారనే అనుకొందాం. మరి మీ ఆయన దశావతారాలు ఎత్తారట కదా ! అది కూడా చేపగా, తాబేలుగా, వరాహంగా చెప్పుకొంటే సిగ్గుకూడాను..
 

లక్ష్మి :  అది సరేలే. మీ ఆయన వాహనం ఎద్దట కదా ! పాపం ఆ ముసలి ఎద్దు మీద ఎలా కూర్చుంటున్నావో ఏమో!

పార్వతి : మీరెక్కే గ్రద్ద కంటే మేమెక్కే ఎద్దే నయం. ఇష్టం లేక పోతే దిగి పోవచ్చు.

లక్ష్మి : నీ మొగుడు నటరాజ గదా! అంటే అస్తమానూ తైతక్కలాడుతూ ఉంటాడా?

పార్వతి : ఔను. మా ఆయన తైతక్కలాడుతూ ఉంటే మీ ఆయన వెనకాల డప్పు కొడుతున్నాడుగా!

లక్ష్మి : పాపం. మీకు ఇల్లు కూడా లేదట. వల్లకాట్లో మకాం పెట్టారట! నిజమేనా!

పార్వతి : నిజమే . తప్పేముంది ? మీరుండే నడి సముద్రం కంటే మా వల్లకాడే నయం. రోజూ రెండు శవాలూ, వాటితో పాటు పది మంది మనుషులూ వస్తారు. నడిసముద్రం లోకి నారదుడు తప్ప ఎవరూ రారు.

లక్ష్మి : చాల్లే బడాయి. నీ మొగుడు ముష్టెత్తుకుంటాడట. ఈ పూట ఎవరింటికి వెళ్ళాడేమిటి?

పార్వతి :మరేనమ్మా! బల్లి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడట. అక్కడికి భిక్ష కోసం వెళ్లాడు.

ఇలా ఒకరి నొకరు దెప్పుకొనే లక్ష్మీ పార్వతులను మనం స్తోత్రం చేస్తామని జంట కవులు హాస్యరసభరితంగా పద్యం చెప్పారు. కవుల ఇంట్లో సరస్వతి ఉంటుంది కానీ లక్ష్మి నిలవదని ప్రతీతి. ఎందుకు నిలవదో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు సరదాగా ఊహించారు.

"కూరకు, ఉల్లిపాయలకు, గుమ్మడి పిందెకు, చల్ల నీళ్ళకును, నారకు, కట్టెపుల్లల, కనాధలకున్ కృతులీయ రోసి ఆ భారతి పోయి లక్ష్మికి నుపాయం చెప్పెను కైత గూటికిన్ చేరకు మమ్మనేబడిన చిక్కులు పెక్కులటంచు నిచ్చలున్ "

" ఈ కవుల ఇంట్లో ఉండి నేను నానా పాట్లు పడుతున్నాను. వీళ్ళు కవితా రూపంలో ఉన్న నన్ను కూరకి, నారకి, అప్పడాలకి, వడియాలకి అమ్మేస్తున్నారు. నువ్వు ఉంటే నిన్నూ అమ్మేస్తారు. అందువల్ల కవుల ఇంట్లోకి మాత్రం రాకు " అని సరస్వతి లక్ష్మికి హితోపదేశం చేసిందట. ఇదీ తెలుగు పద్యాల్లో హాస్యం

-మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు

 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech