పట్టాభిరామాయణం

 

-డా. బి.వి. పట్టాభిరాం

   అందమైన కాపురానికి ఆరు సూత్రాలు


మనిషి అన్నాక మనసు ఉంటుంది అంటారు పెద్దలు. మానసిక సమస్యలు సరే సరి. భార్యాభర్తల మధ్య, అత్తా కోడళ్ల మధ్య, మామా అల్లుళ్ళ మధ్య , కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, మూతివిరుపులు, మౌన వ్రతాలు వచ్చినప్పుడు వారు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రఖ్యాత సైకియాట్రిస్టు, హిప్నోథెరపిస్టు డాక్టర్ ఎరిక్ ఎరిక్సన్ అంటారు..మనం ఎంతకాలం జెవిస్తామో తెలియదు. వచ్చే జన్మ ఉందో లేదో నమ్మకం లేదు. అందుకే ఈ జన్మలో ప్రతి నిమిషాన్ని ప్రశాంతంగా గడపగలిగిన వారు అదృష్టవంతులు. చీటికి మాటికి పోట్లాడుకుంటూ మనశ్శాంతి పోగొట్టుకుని మాట్లాడుకోవడం మానేసి మానసిక సమస్యలు తెచుకుంటున్నారు దానివలన కోపం ఉద్రేకం, ఉద్వేగం అధికమౌతున్నాయి. తద్వారా కనీసం 40 రకాల శారీరక వ్యాధులను ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించటం జరుగుతోంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఎసిడిటి, ఇరిటౌలు బవెల్ సిండ్రోం,, ఆందోళన, చివరకి బ్లడ్ ప్రెషర్ పెంచుకుంటున్నారు. ఇటువంటివారి కొరకు డాక్టర్ ఎరిక్సన్ ఆరు బంగారు సూత్రాలు సూచించారు.

డాక్టర్ ఎరిక్సన్ సూచించిన ఆరు బంగారు సూత్రాలు పాటించిన వారు మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు, అందరూ అభిమానించేలా, ఆదరించేలా, అనుసరించేల, ఆదర్శంగా తీసుకునేలా మారారు. ఈ సూత్రాలను పాటించి విడాకుల ప్రయత్నాలువిరమించిన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఐతే అది అక్షరాలా నిజం. భార్యా భర్తలే కాదు..మామని ద్వేషించే అల్లుళ్ళు, అత్తను అసహ్యించుకునే కొడళ్ళు కూడా మారి, తమ జీవితాలను నందనవనం చేసుకున్నారు. నోటి కొచ్చినట్ట్లు మాట్లాడటం మానేసి పదాలను పొదుపుగా వాడి ప్రశాంతంగా ఉంటున్నారు.

ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన మూర్తిమత్వం ఉంటుంది. దానినే personality అంటారు. వయసుని బట్టి కొన్ని మార్పులు తీసుకురావలసిన బాధ్యత ఆ వ్యక్తి పై ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయసు, వృద్ధాప్యపు స్థితులలో పరిస్థితిని బట్టి మారాలి. గ్రీకు భాషలో persona అంటే ముసుగు
అని అర్ధం. అంటే మనం అవసరాన్ని బట్టి తప్పనిసరిగా అవసరమైన ముసుగు ధరించడం శ్రేయస్కరం అంటారు డాక్టర్ ఎరిక్సన్. ఉదాహరణకి ఒక సంగీత కచేరికి వెళ్ళారనుకోండి. గాయనికి అనుభవం లేదు . ప్రచారం మాత్రం బాగా ఉంది. కచేరీ మీకు నచ్చలేదనుకుందాం.కార్యక్రమం అనంతరం ఆవిడ వచ్చి నా కచేరీ ఎలా ఉండండీ అని అడిగితే వెంటనే ఒక నవ్వు ముసుగు తగిలించుకుని చాలా బాగుంది కంగ్రాట్యులేషన్స్ అని అక్కడ నుంచి జారుకోవడం తప్ప చీ చీ అసలు ఇది సంగీతమా? ఇలాంటి వాళ్ళు నలుగురుంటే ఈ కళ అంతరించిపోతుంది. అన్నారనుకోండి. వేరే చెప్పేదేముంది.? ఆవిడ పెట్టవలసిన నాలుగు శాపనార్ధాలు పెట్టి, తరువాత 210 మందికి మీగురించి చెడుగా చెప్తుంది. వాళ్ళూ తలో 175 మందికి చెప్పరని గ్యారంటీ ఏమిటీ? ఇంతమంది దగ్గర కళాద్రోహి అసూయపరుడు అనే బిరుదులుు పొందడం కన్నా ఆనాడే మీ సంగీతం బాగుంది అని మీలో మీరే కుమిలిపోతూ అని ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా! ముక్కుకు సూటిగా ఉండడం మంచిదే కానీ, అన్ని విషయాలలో పనికి రాదు. కొన్ని సందర్భాలలో నొప్పింపక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనేది బెస్ట్ పాలసీ.

ఇకపోతే సైకాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఆరు సూత్రాలను పరిశీలిద్దాం . ఈ ఆరు సూత్రాలలో అన్ని మత గ్రంధాలలో నొక్కి చెప్పిన మంచి మార్గాలు ఉన్నాయి. ఐతే ఆచరించినపుడే అందులోని ఆనందం అనుభవించగలుగుతాము.

1.సారీ
2.థాంక్యూ
3.విల్ యు ప్లీజ్
4. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్
5. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్
6. ఐ ఎడ్మిట్ ఐ మేడ్ అ మిస్టేక్


ఈ ఆరు సూత్రాలలోని విశేషమేమిటంటే మొదటి సూత్రంలో ఒకటే పదం రెండవదాంట్లో రెండు అదాలు..ఇలా ఆరవ సూత్రంలో ఆరు పదాలు ఉన్నాయి. ఈ ఆర్ సూత్రాలను పాటించిన వారికి జీవితంలో్లో తిరుగులేదు అని గంట బజాయించి ఎరిక్సన్ చెప్పినప్పుడు మొదట్లో అందరూ పరిహాసం చేశారు కానీ, చివరకది మంత్రోపదేశంగామారింది.

'సారీ ' అనే మాటను అనుటవలన ఎన్ని కలహాలను అరికట్టవచ్చో అనుభవం మీదనే అవగతమవుతుంది. ఇకపోతే థాంక్యూ అనే రెండవ సూత్రాన్ని అక్షరాలా అల్లగే ఉపయోగించనవసరం లేదు. ఎదుటివారి సహాయాన్ని అందుకున్నాట్లుగా కృతజ్ఞత ను కళ్ళలో చూపగలిగినా చాలు. ఉదాహరణకు మీ ఇంట్లో వారు మీకు కాఫీ కలిపి తెచ్చారనుకోండి. మీలో ఎంతమంది ఆ కప్పును చేతిలోకి తీసుకుని థాంక్స్ అంటారు? నాకు తెలిసినంతమటుకు 25శాతం కన్నా ఎక్కువ మంది ఉండరు. కాఫీ తీసుకువస్తే అక్కడ పెట్టు అనో సరేలే అనో అనేవారు ఎక్కువగా ఉంటారు. వారు ఎంతో ప్రేమతో కలిపి తెచ్చినది చేతో కూడా అందుకోలేని మహానుభావులు ఈ నాటి నుండి పద్ధతి మార్చుకోవాలి. అలాగే భర్త లేదా తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చినా, ఒక పని చేసినా ఆ పని చేసినందుకు ఇంట్లో స్త్రీ సంతోషంగా అభినందించ్చాలి తప్ప ఆ చాల్లే బడాయి అని తప్పించుకోకూడdదు.


ఇక మూడవది విల్ యు ప్లేజ్ అంటే దయచేసి నువ్వు చేస్తావా ? మీకు టీ కాఫీలు కావాల్సినప్పుడు మర్యాదగా ఇలా అడిగినప్పుడు ఎంత కోపం లో ఉన్నవారైనా తప్పక ఇస్తారు. అలా కాకుండా ఏయ్ కావీ అంటే అపాలు లేవు! అనే సమాధానం రావచ్చు. కావాలని పాలు పారబోయవచ్చు. అందువలన మర్యాదగా అదగడం మంచిదని సైకాలజిస్టుల సలహా. ఇది కేవలం భార్యా భర్తలే కాదు..అత్తలూ, మామలూ, మొండి పిల్లలు కూడా ఆ వైఖరి మానేయడం మంచిది.

వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనే నాల్గవ సూత్రాన్ని మనం తెలుగులో నాలుగు పదాలూ, దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అనుకుందాం. కుటుంబంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినా కుటుంబ పెద్ద ఇతరులను కూడా సంప్రదించడం శ్రేయస్కరం. ఒక వస్తువు కొనాలన్నా, పిల్లల స్కూలు మారాలన్నా, వ్యాపారంలో చేసే మార్పులు చేర్పుల గురించి భార్యతో సంప్రదించడం మంచిదంటారు సైకాలజిస్టులు . దానికి వారెలాగూ మీ ఇష్టం అనొచ్చు. లేదా ఇంకా మంచి సూచనలు చేయవచ్చు. ఇలా వారిని సంప్రదించకుండా చేసిన పని. ఒక వేళ విఫలమైతే వారి సానుభూతి లభించదు. పైగా మీ ఖర్మ అని మనసులో అనుకుంటారు. పైకి మాత్రం సానుభూతి చూపించినట్లు నటిస్తారు.

ఐదవ సూత్రం యు డిడ్ అ గూడ్ జాబ్ అంటే నువ్వు ఒక మంచి పని చేశావు. ఇది అద్బుతమైన సన్మోహన మంత్రం లాంటిది. ఎదుటివారు చేసిన పనిని అభినందించడం ఒక అందమైన ఆచారం. దాని వలన ఎదుటివారు ఇంకా బాగా పని చేయవచ్చు. తమ పనిని గుర్తించినందుకు తృప్తిపడి మరింత ఉత్సాహంగా చురుకుగా ఉండవచ్చు. ఉదాహరణకి ఇంట్లో వండిన కూర బాగుందనుకోండి. గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కు మనిపించకుండా కూర బాగుంది అంటే మంచిది. ఈ రోజు కూర చాలా బాగుంది వెరీ గుడ్ అంటే ఇంకా మంచిది. ఈ రోజు కూర మార్వలెస్ ..మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ అంటే అది తిరుగులేని బానం (ఐతే వారం రోజులూ అదే కూర చేసే ప్రమాదం ఉంది సుమా). నిజం చెప్పాలంటే నా సలహా ఏమిటంటే కూర బాగున్న రోజుకన్నా బాగాలేని రోజున మెచ్చుకుంటే మంచిది ఐతే అది వ్యంగ్యంగా అన్నట్లుగా ఉంటే కొంప మునుగుతుంది. దేనికైనా కొంత ప్రాక్టీసు తప్పదు. నా ఉదేశ్యమల్లా ఒకటే - భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు ఉండకూడదు, ఇద్దరూ బద్ధ శతృవుల్లా ప్రవర్తించడం వలన అనక సంస్యలు తలెత్తుతాయి.

ఇక చివరి సూత్రం ఐ ఎడ్మిట్ ఐ మేడ్ ఎ మిస్టేక్ ..అంటే నిజమే నేను చేసినది పొరపాటే..అది ఒప్పుకుంటున్నాను. అని ఆరుపదాల్లో అనుకోవచ్చు. ఈ ఆఖరి సూత్రం ఆచరణలో పెట్టగలిగినవారు నిజంగా అదృష్టవంతులు. అలా ఆచరించినవారికి విడాకుల ఆలోచనలు, మనస్ఫర్ధలు ఉండవు. భార్యాభర్తల్లో ఎవరైనా తప్పు చేసి విడిపోయే ప్రమాదం సంభవించినప్పుడు ఇలా అంటం మచిది. అలాగే చీటికి మాటికి అలిగే అత్తగారితో కూడా కోడలు ఇలా అంటే ఆవిడ అదిరిపోతుంది. ఆపైన కోడలి అడుగులకి మడుగులొత్తుతుంది. అందుకే కోడళ్ళుకొంచెం మొండి వైఖరి విడిచి అత్తను కాకా పట్టి తీరాలి. దానివలన భర్త సంతోషిస్తాడు. ఆడపడుచు ఆటలు సాగవు. కుటుమం సజావుగా సాగుతుంది. ఎరిక్సన్ ఈ ఆరవ అస్త్రం గురించి చెప్తూ ఇది అన్ని సందర్భాలఓ ఉపయోగించనవసరం లేదు. మన్మ్ ఎవరితో కలిసి జీవించాలని అనుకుంటున్నామో, ఎవరితో కలిసి పని చెయ్యాలనుకుంటున్నామో వారితో మాత్రమే అంటే చాలు అంటాడు..


ఉగాది పచ్చడిలో ఆరు రుచులుంటాయి ...అలానే మనజీవితంలో ఈ ఆరు సూత్రాలు (దారాలతో)పాటిస్తే సంసారం లో రోజూ ఉగాదే...రోజూ ఆనందమే...ఉగాది శుభాకాంక్షలతో

- పట్టాభిరామ్.

హెచ్చరిక :

ఆరు బంగారు సూత్రాలు ఒకే సారి ఇంట్లో ప్రయోగించకండి వాళ్ళు పెద్ద షాక్ కి గురి కావచ్చు . ఒక్కో బాణం నెమ్మది నెమ్మది గా ప్రయోగించండి..


బీ వీ పట్టాభి రాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బీ వీ పట్టాభిరాం రచనల సమాహారం --------- ఈ "పట్టాభిరామాయణం".


 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech