సుజననీయం
                                                                                                    
-తల్లాప్రగడ
 

   

        ఆత్మరోదనే విరోధి రోధస్సు

 

 

సీ|| రోధించనేల విరోధి నామముజూచి; ఏమెంతటి విరుద్ధనామమైన!

ఉచ్చ నీచస్థితుల్ వచ్చిపోవునట బృహస్పతి కృపలకైన!

మిత్రవిరోధాలు చిత్రంబు మిత్రమా, తప్పవు ఎవరెంత గొప్పయైన!?

విరోధియు లేక ఎవ్వాడు గెలిచేడు భూమిపైనేనాడు రామచంద్ర!?

 

.వె.|| క్రోధమేలనోయి!  కొత్తవత్సరమునా

క్రోశమేలనోయి!  క్లేశమాపు!,

నారుపోయు సత్యనారాయణుడె యుండ

ఏమితక్కువవ్వు రామచంద్ర!?

 

 

కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరూ కొత్తకొత్త ఆశలతో మళ్ళీ చిగురిస్తారు. కానీ కొంతమంది సంవత్సరం విరోధినామ సంవత్సరం అంటే విరోధాలు కలుగుతాయోమోఅని భయపడి పోతున్నారు. అలాగే మరికొందరు సంవత్సరం బృహస్పతి మకర రాశిలో ఉన్నాడు కాబట్టి, శుభగ్రహం నీచస్థితిలో ఉందనీ, అందుకని శుభాలేవీ జరుగవనీ అనుకుంటున్నారు. వీరికితోడు అంతర్జాతీయ ఆర్థిక మాంధ్యం ఒకటి తోడవ్వడంతో నమ్మకాలకు తగిన వత్తాసు దొరికింది.

 ఏం చేస్తాం, ఎంత నమ్మకూడదు అనుకున్నా, జరిగే దానిని చూస్తే అందరిలోనూ ఒక అనుమానం రావడం మాత్రం సహజమే. ఇంత మందిని కాదని ఒప్పించడంకూడా కష్టమే. ఏది ఏమైతేనేమి ప్రపంచానికి మంచిరోజులు నడవడంలేదు. అలా అని భయపడి కూర్చుని మనం చేసేదేముంది? పోఠీలోనైనా సరైన విరోధి (లేక ప్రత్యర్థి ) లేకపోతే మజాలేదు. అంతేకాదు అసలు విరోధి అన్నవాడే లేకపోతే విజయమన్న మాటకి కూడా అర్థంలేదు. అసలు ఎంత మంచి విరోధివుంటే మన గొప్పతనం అంత చక్కగా బయటకు వస్తుంది. ఒక అవకాశం, ఆవశ్యకత, ఆదరణ లభిస్తుంది. ఒక పెద్దాయన చెప్పారు కష్టాలే మనిషిని మనిషిగా చేస్తాయట. అవి లేకుంటే మనిషి భగవంతుడినికూడా మరిచిపోయి మానవత్వలేకుండా బతికే ప్రమాదంవుందట. అందుకే బృహస్పతితోపాటు మనకు శనిగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు.

 

అసలు ఏగ్రహానికైనా రోజూ పూజలుచేయాలంటే అది శనిగ్రహమే అని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకంటే గ్రహానికి భయపడి పూజలుచేయమని కాదు. శని మనకు కష్టాలను ఇవ్వటమేకాకుండా, కష్టపడి సంపాదించడం నేర్పుతాడు. "కష్టే ఫలి". కష్టపడకుండా ఏది సంపాదించినా అది మనదికాదు. అలాగే ఏ ఫలితం నేను ఆశించను, అని మనమందరమూ చెప్పే దొంగమాటలను శని తుంచుతాడు. ధైర్యంగా మనం ఆశించేదానిని  పైకి చెప్పగలిగేటట్లు చేస్తాడు. అంటే ముందు మనకు మనం నిజం చెప్పుకుంటామన్నమాట.

అంటే నాకు డబ్బులక్కరలేదు, నాకు ఏమీ పేరు అక్కరలేదు, నాకు ఏమీ పదవులక్కరలేదు, నేను చేసేదంతా స్వచ్చంద నిస్వార్ధ సేవే --- మనిషి ఇలాంటి భూటకపు మాటలు తనకు తానే చెప్పుకొని,  చివరకి అది నిజమని నమ్మేసి, మిగితా వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. నిజానికి తమను తామెంతగా వంచించుకుంటున్నారో తెలియాలి అంటే వారినే లై డిటక్టర్ ముందుంచినా ఆ యంత్రం కనిపెట్టలేదు. ఎందుకంటే ఆ అబద్ధం చెబుతున్నట్టు వారికే తెలియదు కాబట్టి. ఆ అమాయక స్థితిలోనుంచీ బయటకురావాలీ అంటే మనిషి చాలా ఆత్మావలోకనంచేసుకో గలగాలి.  తను “ఏపనిని ఎందుకు నిజంగా చేస్తున్నాడు” అని తనను తాను అడగుకోవాలి. ఊరికే ఏమీ ఆశించడంలేదు అని పక్కకు తోసేసేవాడివల్ల ఈ పని ఎప్పటికీ అవదు. వాడెప్పుడూ ఎప్పటికీ నిస్వార్ధమైనవాడిననే అనుకుంటూవుంటాడు.

నిజానికి నిస్వార్థమన్న మాటకు అర్థమేలేదు. కానీ వాడితో వివాదమెందుకులే అని అందరూ ఒప్పేసుకుంటారు. అదిచూసి మనం ఇంకా రెచ్చిపోయి మనం చాలా మంచోళ్లమని ఇంకా నమ్మేసుకుంటాం. ఇది ఆత్మ వంచన. (బ్రహ్మ, తానుపుట్టగానే బ్రహ్మాండాన్ని సృష్టించడం మొదలు పెట్టాడట. ఆ సృష్టిలో మనుషల మంటే ముందుగా, "ఆత్మవంచన, మరణభీతి, క్రోదాక్రోశాలు, నాది అనే భావాన్ని, శరీరమే నేను అనే భావాన్ని" ముందు సృష్టించాడట. ఆ తరువాత ప్రాణులనను అంటే మనలను సృష్టించాడట. ఇలా ఈ గుణాలతో తయారైన మనం, మనగుణాలను  గుర్తించకపోతే, మనజీవనం కల్మషభూయిష్టమై సాగుతుంది.). మనని మనం తెలుసుకోవడమే సిద్ధి లేక self-realisation.

నీలాంజనసమభాసం

రవిపుత్రం యమాగ్రజం

ఛాయ మార్థాండసంభూతం

తం నమామి శనైశ్చరం

(నల్లగా,నీలంగా ఉండేటి, సూర్యపుత్రుడై యమునికి సోదరుడైనట్టి, సూర్యునికీ నీడకీ పుట్టినట్టి అంటే (లేక మంఛిచెడ్డలకు సంబంధించినటువంటి) శనీశ్వరునికి నమస్కరిస్తున్నాను.)

 

శనిదేవుడు చీకటినుంచీ మనలను వెలుగులోకి తేగలిగినవాడు.   ఆత్మ వంచనవంటి గుణాలను అదుపులోకి తెస్తాడు. అంటే మనం వేరే వారిని ఎన్ని వంచనలు చేసినా కూడా, కనీసం మనకు మనం ముందుగా నిజం చెప్పుకుంటాం. మనం చేసే పనుల వల్ల మనం ఆశించేంది ధనముకావచ్చు, పదవులుకావచ్చు, కొద్దిపాటిగుర్తింపు కావచ్చు, మిత్రులమధ్య కాలరెగరేయగలగడమే కావచ్చు, అలాగే అది స్వర్గమేకావచ్చు, ఆత్మానందమే కావచ్చు, కానీ అవి ఆశిస్తున్నానూ అని మనకు మనం చెప్పుకుంటే చాలు.  అలా ధైర్యంగా తనకుతాను చెప్పుకోగలిగితే మనిషి చాలా ఎదిగినట్లే.  ఈలా శని మనలోని అంతర్గతంగా పాతుకుపోయిన దుర్గుణాలను వెలికి తీసి, మనలకే చూపించి, మనకుమారే అవకాశాన్ని కలిగిస్తాడు.

 

ఇప్పుడు బృహస్పతులవారు కూడా శనిగ్రహ స్వగృహం లేక  స్వస్థానం నుంచీ, అంటే మకర రాశినుంచీ శనిదేవుని  పనే చేస్తున్నారు. నెత్తిమీద చిన్న మొట్టికాయకొడుతున్నారు. ఒక పాఠం నేర్పుతున్నారు. ఇది ఒక అవకాశం. మన కష్టం ఫలిస్తుంది, మన ఇష్టం ప్రకటితమౌతుంది. మన నష్టం వేస్టుకాదు. అన్నిటికన్న అతిముఖ్యమైన మనదుష్టవిరోధం (అంటే మన ఆత్మవంచనే) తొలగి దుష్టనాశం జరుగుతుంది. కానీ మనలోని అలాగె మనబయటవున్నటువంటి మంచిచెడులని మనం గమనించగలిగి వాటిని సృష్టిలోని అంశాలుగా గుర్తించగలిగి మనలోనే సృష్టిని చూసుకోగలిగితే అదే ముక్తి, దానినే మనం self-realisation అని అనుకోవచ్చు.   

యత్ పిండే తత్ బ్రహ్మాండే

 

ఇన్ని జరిగితే మనం నిజంగా మంచోళ్ళమయ్యిపోయినట్టే! బాబోయ్ ఇప్పుడు కొంచెం భయవేయ్యడంలేదూ!?

 

ఇలా కొత్త సంవత్సరం మన విరోధులనీ, సర్వ రోధనలనీ, సర్వరొగాలనీ నివారించి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ, మంచితో  అందరూ సిలికానాంధ్ర చేపట్టే అన్ని మంచి పనులలో పాలుపంచుకోవాలని స్వార్ధంతో (మా స్వార్థమేమిటో మేము గ్రహించేశాం) కోరుకుంటూ, సుజనరంజని కోరుకుంటోంది. కొత్తసంవత్సరం సందర్భంగా  సుజనరజని సరికొత్త రూపు దిద్దుకొని మా అనేక విన్నూత్న శీర్షికలతో, ముస్తాబయ్యి మీ ముందుకి వస్తోంది. ఆనందించడి, ఆదరించడి, ఆస్వాదించండి.

 

అందరికీ మరొక్కసారి  మా విరోధినామసంవత్సర శుభాకాంక్షలు!

విరోధిని ఒక రొదగా, లేక రోదనగా కాకుండా, ఒక రోదస్సుగా గ్రహించి ఆహ్వానిద్దాం!

 

మీ

 

తల్లాప్రగడ

 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech