విరాట్

 

- పానుగోటి కృష్ణారెడ్డి

 
 

విరాట్ మూల రచయిత గురించిఈ విరాట్ నవలిక రచయిత స్టెఫాన్ త్త్స్వెక్ ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకత్రగా, నాటక రచయితగా, కవిగా సాహిత్యంలో ఆయన స్తానం చిరస్మరణీయమైంది. సుమారు 40 భాషల్లోకి విరాట్ అనువదించబడింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడు పోయాయి.

స్టెఫాన్ త్త్స్వెక్ 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. మన వేదాన్లి, ఉపనిషత్తుల్ని, పురాణాల్ని, భగవద్గీతని అధ్యయనం చేశారు. భగవద్గీత సూక్తుల ఆధారంగా ఈ’విరాట్’ నవలికను వ్రాశారు. ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప మధురానుభూతి.

స్టెఫాన్ త్స్వై 1881 నవంబర్ 28వ తేదీన వియన్నా(ఆస్ట్రియా)లో జన్మించారు. ఆస్టేలియా,ఫ్రాన్స్, జర్మనీలలో విద్యాభ్యాసం చేశారు. జర్మన్ రచయిత. కీర్తికాంక్ష ఏమాత్రం లేని నిరాడంబర వ్యక్తి. గొప్ప ఆత్మాభిమాని. పదవులకు,బిరుదులకు,అద్యక్షతలకు,సభ్యత్వాలకు,సన్మానాలకు జీవితాంతం చాలా దూరంగా వున్నారు.

ఆయన "యూదు" కావడం వల్ల నాజీల నిరంకుశత్వానికి, అణచివేతకు గురైనారు. నాజీ పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి వెతికి తగలబెట్టారు. అక్కడ నుంచి తప్పించుకుని భార్యతో సహా మొదట ఇంగ్లండ్ కు,తరువాత బ్రెజిల్ కు పారిపోయారు. చివరికి 1942 ఫిబ్రవరి 22వ తేదీన తన 61వ ఏట భార్యతోపాటు ఆత్మహత్య చేసుకున్నారు.
త్స్వైక్ రచనలలో’విరాట్’ అపూర్వ కళాఖండం.


ఎందుకీ అనువాదం?
నేను పదోతరగతి చదివే రోజుల్లో’విరాట్’ చదివాను. నాకు ఎంతగా నచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వంద సార్లయినా చదివుంటాను. విరాట్ పాత్ర నా జీవిత దృక్పథం మీద, జీవన విధానం మీద చాలా ప్రభావం చూపింది.

విరాట్ నవలికను చాలా మంది చేత చదివించాను. కొందరు అడిగితే ఫొటోస్టాట్ కాపీలు తీసి ఇచ్చాను. చదివిన వాళ్ళందరిదీ ఒకటే అభిప్రాయం, సబ్జక్ట్ అద్భుతంగా వుంది. అనువాదం ఇంకొంచం బావుంటే బావుండేది అని. రమేష్ అనే అతను 1964 లో దీన్ని అనువదించారు. అతన్ని కలిసి వాక్య నిర్మాణం అంత క్లిష్టంగా లేకుండా సరళమైన తెలుగులోకి తిరగరాయిద్దాం అనుకున్నాను. కానీ అతన్ని గురించి గాని,ఆ పుబ్లిషర్ గురించి గాని ఎంత ప్రయత్నించినా వివరాలు తెలియలేదు. ఆ ప్రయత్నం మానుకున్నాను.

విరాట్ రచయిత స్టెఫాన్ త్స్వైక్ గురించి, అతని ఇతర రచనలు గురించి నాకు తెలిసిన సాహితీ ప్రియుల్ని అడిగాను. ఆయన గురించి తెలియదని చెప్పారు. గురువుగారు శ్రీ నండూరి రమమోహనరావుగారు, శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు త్స్వైక్ గురించి చాలా వివరాలు చెప్పారు. ఛాయాదేవి గారు త్స్వైక్ కథలు కొన్నింటిని 50 ప్రాంతాల్లో అనువదించారు. అవీ కావ్య భాషలో వున్నాయి. ఆమె దగ్గర తీసుకుని వాటిని చదివాను. వాటిలో నాకు నచ్చిన విరాట్ గాని, నండూరి గారికి ఇష్టమైన’ది రాయల్ గేమ్’గాని లేవు. అయినా ఆ కథల్ని సంస్కరించి ప్రచురిస్తే బావుంటుందని కోరాను. ఆమె కూడా అదే ప్రయత్నంలో వున్నట్లున్నారు. కొద్ది రోజుల తరువాత ఆ కథల్ని ఆధునిక ప్రమాణ భాషలోకి మార్చి పునర్ముద్రించారు. అందులో నాకు బాగ నచ్చిన కథ ’అపరిచిత లేఖ’.

ఒకసారి పాత పుస్తకాల షాపులో వెతుకుతుంటే-నా అదృష్టం కొద్దీ స్టెఫాన్ త్స్వైక్ కథల సంపుటి దొరికింది. అందులో విరాట్ తొ పాటు నేను చదవాలనుకున్న కథలు కూడా వున్నాయి.


విరాట్ నవలికను ఇంగ్లీషులో చదివాక ఇంకా చాలా బాగ నచ్చింది. ఎవరిచేతనైనా అనువాదం చేయించి ప్రచురించాలనుకున్నాను. సాధ్యం కాలేదు. మిత్రుల సలహాపై ధైర్యం చేసి మొట్టమొదటిసారిగా ఈ అనువాదం చేశాను.

విరాట్ ని కధగా పేర్కొన్నారు కాని ఆ రచనలోని సంఘటనలు, సన్నివేశాలు, పాత్ర చిత్రణ, వాతావరణంలోని విస్తృతిని బట్టి దాన్ని నేను నవలికగా భావిస్తున్నాను. ఈ నవలికను ప్రచురించమని ప్రోత్సహించిన శ్రీ నండూరి రమమోహనరావు గారికి, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికి, కేతు విశ్వనాథరెడ్డి గారికి, శీలా వీర్రాజు గారికి, ఎల్లూరి శివారెడ్డి గారికి, దుత్తా దుర్గాప్రసాద్ గారికి, కె.ఆర్.కె గారికి కృతజ్ఞతలు. ప్రచురించమని ప్రోత్సహించడంతో పాటు కవర్ పేజీకి కావలసిన ఫొటోలను కూడ అందించి కవర్ పేజీని సూచించిన శ్రీ కె.నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.

 

 

 

 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech