విరాట పర్వం - వేదాంత దర్శనం

 

 -సహస్రావధాని గరికపాటి నరసింహరావు

క్రీ.శ. 11వ శతాబ్దంలో ప్రారంభమైన భారత రచన ఆంధ్రదేశంలో రెండు వందల ఏండ్లు ఆగిపోవడం ఆశ్చర్యకరమే కాదు, ఆందోళన కారకం కూడాను.

రెండు శతాబ్దాముల్ హరి హరీ! మృదులాక్షరమొండు వ్రాయలే
కుండిన దాంధ్రజాతి, మనమున్నది ఉన్నటు లొప్పుకోవలెన్
పండిన పంట భారతము పట్టదుగా కవివీరులేరికిన్
గుండెలు తీయుబంట్లు మత కూటములన్ ఘటియించినందునన్

(సాగర ఘోష - గరికిపాటి)


ఒక ప్రక్క వీరశైవులు మరో ప్రక్క వీర వైష్ణవులు పోగై శివకేశవులకి ఎంత అప్రతిష్ట తేగలరో అంతా తెచ్చారు. అటు శివ పారమ్యాన్నో, ఇటు విష్ణు పారమ్యాన్నో బోధిస్తూ కవిత్వం రాయాల్సిందే తప్ప, ఈ ఇద్దరు సమానమని ఎవరైనా అంటే ఇరువర్గాల వారు సమానంగా వచ్చి ఆ కవిని చితకగొట్టేసే పరిస్ఠితులవి.

చక్కని మాట చెప్పగల సాహసి లేడొక వేళ చెప్పుచో
దక్కదు జీవితమ్ము, సరదాకయినన్ మత సామరస్యమన్
వాక్కు వినంబడంగ కరవాలము లాలము చేయు నట్టిచో
తిక్కల పుట్టినాడు ఋషి తీర్ధము పంచిన వాడు జాతికిన్

(సాగర ఘోష - గరికిపాటి)


ఆయన పంచిన ఋషి తీర్ధమే హరిహరాద్వైతం. నిజానికి ఆయన సిద్ధాంతం శివకేశవుల మధ్య అద్వైతం మాత్రమే కాదు. సమస్త సృష్టిలోనున్న అద్వైతాన్ని దర్శించడ్మే. మన దృష్టిలో భేదం ఉంది కానీ సృష్టిలో భేదం లేదన్న విషయాన్ని ఆ ఉభయ కవి మిత్రుడు అనేక సందర్భ్హాల్లో తన పద్యాల ద్వారా నిరూపించాడు.

విరాట పర్వంలో కీచకుడు తనను ఘోరంగా అవమానించిన తరువాత ద్రౌపది రాత్రికి రాత్రి నర్తల శాలలో భీముణ్ణి కలుసుకుంటుంది. తల బాధలు ఏకరువు పెట్టేముంది పాండవుల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతుంది. ఎటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. అన్నట్లుగా ఉంటుందా ఓదార్పు. ఆ మాటల్లో మాటగా అంతకుముందెప్పుడో పన్నెండేళ్ళ క్రితం అరణ్య వాసానికి బయలుదేరేటప్పుడు కుంతి సహదేవుణ్ణి గురించి తనతో చెప్పిన మాటలు గుర్తు చేస్తుంది.

కడు బసిబిడ్డ వీడొకటి గాదవునానెరుగండు ముందరె
య్యెడ నొక పాటెరుంగ, డెద యెంతయు గోమల మెప్పుడైన నే
గుడువగ బిల్తు గాని తనకుంగల యాకటి ప్రొద్దెరుంగ డీ
కొడుకిటు వోకకున్ మనము గుందెడు నిన్ గని యూరడిల్లెడున్
(విరాట - 2-213)


ఇవి ఒక తల్లి అందరిలోకి చిన్నవాడైన కొడుకుని విడిచిపెట్టి ఉండలేక అంటున్న మాటలు. అందుకే పద్యం అంతా కరుణారసమయంగా నడిచింది. అన్నీ అచ్చ తెలుగు మాటలే. కోమలం అనే ఒకే ఒక మాట తత్సమం. అదీ మృదుఐన మాటే. ఎక్కడా సంస్కృత పదాలే లేవు.
ఇదీ తల్లి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే ఏ కవియైనా వాడవలసిన భాష. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. అందుకే పెద్దవాడై పెళ్ళయి కాపురం చేస్తున్న కొడుకును కూడా చాలా అమాయకుడనీ, ఏదైనా అడిగితే అవును, కాది అనడం కూడా తెలియదనీ, ఇంతకు ముందెప్పుడూ ఎటివంటి కష్టమూ ఎరుగడనీ, తాను పిలిచి పెట్టే వరకు కనీసం అన్నంపెట్టమ్మా అని అడగడం కూడా చేతకాని వాడనీ విచిత్రంగా మాట్లాడుతోంది. అంతలోనే కోడలితో మాట్లాడుతున్నాననే విషయం గుర్తుకు వచ్చిందేమో! అందుకే ఇటువంటి పసివాడు అడవులి పట్టుకొని పోతూ ఉంటే మనస్సు అతలాకుతలమైపోతోంది అయినా నువ్వున్నావు కాబట్టి కొంత నిశ్చింతగా ఉంది. అని ద్రౌపది పట్ల అఖండమైన విశ్వాసం ప్రతటించింది. ఇదీ సంభాషణా నైపుణ్యం అంటే. (Communication Skills)

అదే సహదేవుణ్ణి గురించి అదే సందర్భంలో ద్రౌపది తన సొంత అభిప్రాయాలు చెబుతుంది. పై పద్యానికి నాలుగు పద్యాల వెనుకనే ఆ పద్యం కూడా ఉంది.

ఆరూపం బవికార, మాభుజబలం బత్యంత నిర్వహ, మా
శూరత్వంబు దయారసానుగత, మా శుంభ త్ర్కియాజ్ణాన మా
ర్యారంభ ప్రతికూల వాద రహితం, బాయీగి సమ్మానవి
స్తారోదాత్తము మాద్రి పిన్నాకొడుకేతన్మాత్రుడే చూడగన్
(విరాట - 2-209)


ఈ పద్యాన్ని కుంతి పలికిన పద్యంతో చూడండి. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భావాలు, భాష కూడా చాలా తేడాగా ఉన్నాయి. ఎందుకంటే అది కుమారుని గురించి తల్లి భావన. ఇది భర్త గురించి భార్య భావన. ఏ భార్యయైనా తన భర్తని అమాయకుడని, వెర్రిబాగుల వాడని అంటే ఒప్పుకోదు. అలా ఉండాలని కోరుకోదు. భార్యకు కావలసింది ముంది భర్త రూపం. అందుకే ఆరూపంబవికారము అని సహదేవుని రూపం బాగుంటుందని చెప్పింది. తల్లికి రూపంతో నిమిత్తం లేదు. అందుకే అక్కడ కడు పసిబిడ్డ భార్య భర్తలో గొప్ప నాయకత్వ లక్షణాలన్నీ ఉండాలని కోరుకుంటుంది. అందుకే అతని భుజబలం గురించి ప్రశంసించింది. బలం ఉంటే మంచిదే కానీ గర్వం ఉండకూడదని భార్య కోరుకుంటుంది. ఉంటే తనకీ ప్రమాదమే. అందుకే సహదేవుని నిర్గర్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పింది. భర్త శూరుడు కావాలని కోరుకొనే భార్య కూడా మరి రౌడీలా ఉంటే సహించలేదు. అందుకే అతడు శూరుడే కాని, దయారసానుగతుడని చెప్పింది. తన భర్త పదిమందీ మెచ్చుకొనేలా అన్ని పనులు నిర్వహించగలగాలని (Managing Ability) భార్య కోకుకొంటుంది. అంతే కానీ మా ఆయనకి ఔను, కాదు అనడం కూడా తెలియదు. బొత్తిగా నోట్లో వేలు పెడితే కొరకలేడు. అని ఏ భార్యా చెప్పదు. అలా చెబితే వెర్రాడి పెళ్ళాం వాడకెల్లా వదిన అన్నట్లుగా చుట్టు ప్రక్కల వాళ్ళకి ఆమె లోకువై పోతుంది. అందుకే సహదేవుని క్రియా జ్ణానం (Working Knowledge) గొప్పదని చెప్పింది. మొత్తం మీద సహదేవుడు అసాధారణ ప్రజ్ణాశాలి అని తేల్చింది. తల్లి మాటలకి భార్య మాటలకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా ఆ స్థానాల్లో ఉన్న స్త్రీల మనోభావాలను బట్టే ఏర్పడుతుంది. ఈ భేదాన్ని భావంలోనే కాదు భాషలో కూడా చూపించడం తిక్కన గొప్పదనం. పద్యం మొత్తం సంస్కృత సమాన భూయిష్టంగా నడిచింది. ఈగి, పిన్నకొడుకు, చూడగన్, వంటి మాటలు తప్ప మిగిలిన పద్యమంతా సంస్కృత సమాస బంధురమై గంభీరమైన శైలిలో నడిచింది. ఈ శైలి భార్య భర్తను గురించి వ్యక్తం చేసే ఉదాత్త గంభీర భావాలకు సరిగ్గా తగినది. సందర్భాన్ని బట్టి భాషలో ఈ భేదాన్ని అడుగడుగునా చూపించి సంస్కృత ప్రేమికులైన కవి పండితులను, ఆంధ్రాభిమానులయిన రసజ్ణులను ఇద్దరినీ మెప్పించబట్టే తిక్కనను ఉభయ కవి మిత్రుడన్నారని పెద్దలు పేర్కొన్నారు.

ఈ ఉభయ భాషా ప్రావీణ్యం ఇంతటితో ఆగలేదు. రెండు భాషల పదాలు సమానంగా కలిసిన మిశ్రశైలిలో కూడా ఈయన సహదేవుని గుణగణాలు చెప్పించాడు. అలా చెప్పడానికి తగిన పాత్రగా అన్నగారైన ధర్మరాజుని ఎంచుకున్నాడు. విరాట పర్వంలోనే ఈ పద్యం కూడా ఉండటం విశేషం. అజ్ణాత వాసానికి ముంది చిన్నవాడైన సహదేవుడు ఇతరుల దగ్గర సేవకునిగా ఎలా బ్రతకగలుగుతాడోనని ధర్మరాజు చింతిస్తూ పలికిన సందర్భం అది.

అకుటిలు డార్య సమ్మతుడహంకృతి దూరుడు నీతి నిర్మలా
త్మకు డనవద్య శీలుడు సధర్ముడు దాంతుడు గొంతి పెద్దసే
యు కొడుకు, మేనులేత దానయుల్లము మెత్తన యిట్టి ఈతడె
ట్లొకొ యొరు నాశ్రయించు విధియోపదె యెవ్వరి నెట్లు సేయగన్
(విరాట - 1-98)


ఈ పద్యంలో ఒక అన్నగారు తమ్ముడి నుండి ఏ లక్షణాలు ఆశిస్తాడో అవన్నీ ఉన్నాయి. తమ్ముడి బుద్ధి మంచిదై ఉండాలి. అందుకే అకుటిలుడు అనేమాట. తమ్ముడు పదిమందిలో ఔననిపించు కోవాలి. అందుకె ఆర్య సమ్మతుడు అనేమాట. ఏమనిషయినా ఇంట్లో భార్య సమ్మతుడవడం ఎంత ముఖ్యమో బయట ఆర్య సమ్మతుడవడం అంత ముఖ్యం. తమ్ముడు ఎంత గొప్పవాడయినా గర్వం ఉండకూడదనీ అన్నగారుగా తనను గుర్తించి గౌరవిస్తూనే ఉండాలని ప్రతి అన్నగారు కోరుకుంటాడు. మనం మన అన్నగారి కంటే ధనవంతులం కావచ్చు. అందమైన వాళ్లం కావచ్చు. పండితులం కావచ్చు. పదవుల్లో ఉండవచ్చు. కాని వయసులో ఆయన్ని మించలేము. అది అసాధ్యం. అందుకే సందర్భం వస్తే మనమే అన్న గారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి కానీ ఆయన మనకు నమస్కారమ్ చెయ్యకూడదు కదా! (అది ఆయుక్షీణం కూడాను!) ఇందుకోసమే అహంకృతి దూరుడు అని ప్రయోగించాడు. ఇలాంటివే నీతి నిర్మలాత్మకుడు, అనవద్యశీలుడు. సధర్ముడు, దాంతుడు,మొదలయినవన్నీ. ఇంతవరకు సంస్కృత పదాలు ఉపయోగించిన తిక్కన ఒక్కసారిగా అచ్చ తెలుగులోకి దిగి గొంతి పెద్దసేయు కొడుకు మేను లేత, తన యుల్లము మెత్తన అంటూ సుతి మెత్తగా మాట్లాడాదు. వాళ్ళ అమ్మ అస్తమానం ఈ సహదేవుణ్ణే ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుందనీ ప్రత్యేకంగా చెప్పాడు. ఇక్కడ ఛందః పరమైన అవసరాలు, ఇబ్బందులు ఏమీ లేకపోయినా కుంతి అనకుండా గొంతి అని వికృతి పదం వాడటం కూడా ధర్మరాజు మనస్సులో తమ తల్లికి తమపై కంటే సహదేవుడిపైనే ప్రేమ ఎక్కువ అనే కించిన్మాత్రమైన అసూయను వ్యక్తం చేయడానికే కావచ్చు. (ఇది కేవలం నా ఊహ. మన్నించండి) ఇంక మా వాడి శరీరమూ మెత్తనే మనస్సు కూడా మెత్తనే అనడం మనసః శిఖరాణాంచ సదృశీతే సమున్నతిః అనే కుమార సంభవ ప్రయోగం లాంటిది.

ఈ పద్యంలో గంభీర భావ వ్యక్తీకరణకు తత్సమ పదాలు వాడి సుకుమార భావాలు చెప్పడానికి అచ్చ తెలుగు పదాలు వాడటం కూడా ఆయనలోని ఉభయ కవితా ప్రౌఢినే సూచిస్తుంది. సరిగ్గా పద్యంలో రెండు పాదాలు ఒక శైలిలో, రెండు పాదాలు మరో శైలిలో నడపడం దృష్టిభేదానికి తగినట్లుగా కవితా సృష్టి భేదాన్ని చూపించడమే.

ఒకే సహదేవుడు ముగ్గురికి మూడు విధాలుగా ఎందుకు కనిపించాడు? ఈ విషయం కాస్త లోతుగా ఆలోచిస్తే భారతంలో తిక్కన దర్శింప చేసిన అద్వైతం అర్ధమవుతుంది. వ్యక్తి ఒక్కడే. అతన్ని చూసిన వాళ్ళు మాత్రం ముగ్గురు. ముగ్గురికీ మూడు విధాలుగా ఎందుకు కనబడ్డాడు? అది వాళ్ల దృష్టిల్ భేదం. అసలు అతనిలో వీళ్ళ ముగ్గురూ చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయా! అన్నీ ఉన్నాయి. పరస్పర వ్యతిరేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అతడు ఔను, కాదు అని చెప్పలేనంత అమాయకంగానూ ఉండేవాడు. పెద్దలందరు భేష్ అనేంత కార్యజ్ణానమూ కలిగి ఉండేవాడు. కాకపోతే ఎవరిదగ్గర ఏ లక్షణం ఏ మోతాదులో ప్రదర్శించే వాడో అంతే ప్రదర్శించేవాడు. అందుకే అందరికీ ప్రేమ పాత్రుడయ్యాడు. ఇదే యోగి లక్షణం. ఏ లక్షణాన్ని అతిగా ప్రదర్శించకుండా (ఓవర్ యాక్షన్) నిగ్రహంగా ఉంటే జీవితంలో నెగ్గుకు రాగలుగుతాం. ఆత్మ సాక్షాత్కారం కూడా పొందగలుగుతాం. మొత్తం మీద కుంతి, ద్రౌపది, ధర్మరాజులు ఏ దృష్టితో సహదేవుణ్ణి చూశారో ఆ రకమైన అభిప్రాయాలే చెప్పారు. ఈ దృష్టితో చూస్తే ప్రపంచంలోని ప్రతి వస్తువు మన దృష్టి భేదం వల్లనే వేర్వేరుగా కనిపిస్తోందని అర్ధమవుతోంది. ఇంకొకరికి మంచిగా కనిపించిన వాడు మనకి చెడ్డగా కనిపిస్తున్నాడంటే మన దృష్టిలో నైనా భేదం ఉండాలి. అతడు మన పట్ల భిన్నంగానైనా ప్రవర్తిస్తూ ఉండాలి. మొత్తం మీద మన దృష్టి భేదం వల్లనే ఇంత సృష్టి ఇన్ని రకాలుగా కనబడుతోందనీ నిజానికది ఒక్కటే అనీ తెలియజేయడమే మన మహాకవుల ఆశయం.

ఇదే రకమైన దృష్టి భేదం విరాట పర్వం చివరలో కూడా తిక్కన గారు కౌరవ సైన్య వర్ణన రూపంలో ప్రదర్శించారు. బృహన్నల సారధ్యంలో బయలు దేరిన ఉత్తరుడు ప్రగల్భాలు పలికాడు కానీ భయపడుతూనే బండెక్కాడు. అతని మనస్సు నిండా భయమే. మన మనస్సును బట్టే ప్రప్రంచంలోని దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అతని మనస్సులో ఉన్న భయమే కౌరవ సైన్యాన్ని భయం కరంగా చూపించింది. ఉత్తరుడు దర్శించిన కౌరవ సైన్యాన్ని కవి బ్రహ్మ ఏ విధంగా వర్ణించాడో చూడండి.

భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరా భీలంబు, ధుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మ సాభర చతుర్విధోజ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వా కలితంబు సైన్యమిది యే జేరంగ శక్తుండనే!

(విరాట - 4 - 52)


భీష్మద్రోణకృపాశ్వత్థామాది విలుకాండ్రతో ధుర్యోధనుడనే గ్రీష్మాదిత్యుని చండ ప్రచండ ప్రతాపంతో వేడు ఆవిరులు గ్రక్కే ఆయుధాలతో, కళ్ళు మిరుమిట్లు గొలిపె జెండాల కాంతులతో భయంకరంగా ఉందట. ఇంత భయంకరమైన సైన్యాన్ని వర్ణించాలి కాబట్టే సోమ యాజిగారు ష్మకార ప్రాసతో పద్యం ఎత్తుకున్నారు. సుదీర్ఘ్హ సంస్కృత సమాసాలతో ఎత్తుగడ నుండి క్రిందికి దింపె వరకు ఒకే కరమైన నారి బిగింపులా పద్యం నడిపించారు. ఇలాంటి రచన ఒక్క ఉభయ కవి మిత్రునకే సాధ్యమేమో!

ఉత్తరుడి దృష్టికి ఇంత భీభత్సంగా కనబడిన కౌరవ సైన్యం అసలైన భేభత్సుని దృష్టికి మరో రకంగా కనబడింది. అక్కడ తిక్కన గారి పద్య నిర్మాణ ధోరణే వేరు.

ఇది యొక పెద్ద గట్టిమొన, ఈ మొనముందట గోగణంబుతో
నదియొక యల్పసైన్యములు, యాతల వేరొక కొంతసేన, యల్లదె ఇటు పంచిపెట్టజను, నంతటిలోన వృధాభిమానదు
ర్మద బహు భాషియైన కురురాజెచటన్ జనుచున్న వాడొకో!


ఇది అర్జునుని దృష్టి మామూలు అర్జునుని దృష్టి కాదు. మాయాబజార్ చిత్రంలో లక్ష్మణుడు చెప్పినట్లు, అర్జున ఫల్గుణ పార్ధ కిరీటి బీభత్స బాబాయి గారి దృష్టి. ఆయన ఇదివరకే ఆసైన్యాన్ని మూడు నాలుగుసార్లు ఎదుర్కొని మట్టి గరిపించిన వాడు. అందుకని ఆయన దృష్టిలో అది అల్పసైన్యం. పెద్ద లెక్కలోది కాదు. అందుకే తిక్కన గారు పద్యం మొదట్లో చాలా మామూలు పదాలను ఇది యొక పెద్ద గట్టి మొన, అంటూ ప్రయోగించారు. భీష్మద్రోణకృపాదిధన్వి అనేంతటి బీభత్సం ఇక్కడేమి లేదు. అంతే కాదు, అర్జునుడు ఆ సైన్యాన్ని మొత్తంగా ఒక్కసారిగా చూడలేదు. ముక్కలు ముక్కలుగా చూస్తున్నాడు. అందుకే అతనికి భయం వెయ్యకపోగా ఆ ముక్కల్ని ఇంకా ముక్కముక్కలు చేసెయ్యగలననే ధైర్యం పెరిగింది. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యలయిలా అంతే. సమస్యను భాగాలుగా చేసి చూస్తే ఏ ముక్కకు ఆ ముక్కనే విడిగా సులభంగా ఛేదించవచ్చు. మనలో చాలా మందిమి అలా చూడం. సమస్య ఏర్పడగానే దానికి చిలువలు పలవలు కల్పించి దాన్ని భూతద్ధంలో చూస్తాం. ఎన్నడో మరుగున పడిన గతకాల ఘట్టాలతో ఆ సమస్యను ముడిపెట్టి మరింత పెద్దది చేసేస్తాం. మన మనస్సులో ఉండే భయాల కారణంగా అది పరిష్కరించలేనంత పెద్దదిగా మనకి కనిపిస్తుంది. దాంతో భయం మరింగ ఎక్కువవుతుంది. ఉత్తరుని పరిస్థితి సరిగ్గా అదే. అంతఃపురంలో ఉండగా గవాధ్యక్షుడు వచ్చి కౌరవ సైన్యం గోవర్ణాన్ని ముట్టడించింది అన్నప్పుడు ఉత్తరుడు ఆ సైన్యాన్ని తక్కువ అంచనా వేశాడు. అదొక భ్రమ. ఆ భ్రమలో పడి అనఅసరపు గర్వం ప్రదర్శించాడు. తీరా యుధ్ద రంగానికి వచ్ఛేసరికి సైన్యాన్ని దూరంగా మొత్తంగా చూసి ఎక్కువ అంచనా వేశాడు. కాబట్టి అధైర్యానికి లోనయ్యాడు. కాని పార్ధుడు అంతఃపురంలో బృహన్నలగా గాని, అహవరంగంలో అర్జునినిగా గాని భ్రమల్లో పడలేదు. అందుకే అక్కడ గర్వమూ లేదు, ఇక్కడ అధైర్యము లేదు. అందుకే సైన్యాన్ని భాగాలు భాగాలుగా చూసి ఇదొక పెద్ద సైన్యమే, కాని ముక్కలు ముక్కలుగా విడిపోయినట్లుంది. అదిగో! గోవులను తీసుకొని పోతున్నదో భాగం. ఆమూల మరోభాగం. ఆ భాగంలోంచి కొంగభాగాన్ని మనల్ని ఎదిరించడానికి ఇటు పంపిస్తున్నారు. అంటూ శత్రువుల బలహీనతను గుర్తించి నవ్వుకున్నాడు. ఇదంతా ఇత్తరార్జునుల మధ్య దృష్టి భేదమే తప్ప మరోటి కాదు. దాడి చేసినప్పుడు, అంతఃపురంలో చర్చలప్పుడు, ఉత్తర బృహన్నలలు బయలుదేరినప్పుడు, ఉత్తరుడు చూసినప్పుడు, అర్జునుడు చూసినప్పుడు అక్కడ ఉన్న కౌరవ సైన్యం ఒక్కటే. క్రొత్తగా ఒకడు చేరిందీ లేదు. పాతవాడొకడు పోయిందీ లేదు. కాని అదే సైన్యం విషయంలో ఒకడు ఒకసారి నిర్లక్ష్యం చూపడానికి, ఇంకోసారి భయపడడానికి, మరొకడు ఒక్సారి ఉదాసీనంగా ఉండటానికి, మరోసారి ఉత్సాహపడటానికి కారణం ఆయా వ్యక్తుల దృష్టి భేదమే తప్ప సృష్టి భేదం కాదు. ఇదే వేదాంత దృష్టి. ఆదృష్టిని కలిగించడమే కవిగ్రహ్మ లక్ష్యం.

ఇది యొక పెద్ద గట్టి మొన, అనే పద్యంలో చివరి వరకు తేలికైన తెలుగు పదాలు వాడిన ఉభయ కవి మిత్రుడు నాలుగో పాదంలో ఒక్కసారిగా శైలి మార్చేసి వృధాభిమాన దుర్మద బహుభాషియైన కురురాజెచటన్ జనుచున్న వాడొకో అంటూ ఠక్కున సంస్కృఅ సమాసం అందుకున్నాడు. ఇది గొప్ప మనో విశ్లేషణాత్మకమైన ప్రయోగం. కౌరవ సైన్యాన్ని ముక్కలుగానే చూస్తూ చిద్విలాసంగా ఉత్తరునికేసి చూస్తూ నవ్వుతున్న అర్జునునికి ఒక్కసారిగా ఈ యథాస్థితికి కారణమైన దుర్యోధనుడు గుర్తు వచ్చాడు. అంతే! ఒక్కసారిగా అర్జునునికి ఒళ్ళు మండిపోయింది. తోక త్రొక్కిన త్రాచులా కస్సుమని బుసకొట్టిన మనస్సుకి వాగ్రూపం కల్పిస్తే పై వాక్యం ఉంటుంది. అదీ కవిబ్రహ్మ పలుకుబడి. ఇదే నాటకీయత అంటే. ఎప్పటికప్పుడు పాత్రల మనః ప్రవృత్తులలో కలిగే మార్పుల్ని చురుకుగా పసిగట్టి దానికి తగిన పద్య నిర్మాణం చెయ్యటం ఆయనకు గంటలో పండించే పంట.

ఒకే అర్జునునికి ఒకే సైన్యం. ఒక సమయంలో చాలా లోకువగా ముక్కముక్కలుగా కనిపించడం, ఒక్క క్షణం అంతా దృష్టి పథంలోంచి చెదిరిపోయి మొత్తం సైన్యం ఒక్క దుర్యోధనుడి రూపమే ధరించినట్లయి అతన్ని రెచ్చగొట్టడం, అలా రెచ్చిపోయిన ఫల్గుఉడు కస్సుమని లేవడం ఇదంతా దృష్టి భేదమే.

విరాటపర్వ్హమే కాదు, మొత్తం భారతాన్ని ఈ దృష్టిలో పరిశీలిస్తే ఆ గ్రంధం ఒక అద్భుత అద్వైత దర్శనమ్గా కనబడుతుంది. అందుకే ఆదికవ్ర్ ఆదిలోనే అధ్యాత్మ విదులు వేదాంతమనియు భారత మహేతిహాసాన్ని భావిస్తారని పేర్కొన్నాడు. సృష్టిలో భేదం లేదనీ, మన దృష్టిలోనే అంతా ఉందనీ గ్రహించగలిగితే ఆ దృష్టిని మార్చుకోవడం మన చేతిలో పనే. అలా దృష్టిని మార్చుకోగలిగితే కొన్నాళ్ళకి ద్రష్త - దృశ్యము - దర్శనం ఒక్కరే అని అర్ధమవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. అందుకే ఈ కావ్యాలు, కథలు అన్నీను.

చూచెడి దెల్ల మిధ్య, కనుచూపును మిధ్యయె, నిన్ను నీవుగా
చూచెడిదాక ఈ జగతి జూచెడిదెల్ల వృధా, వృధా, వృధా
చూచెడి చూపు వెక్కగల చూపును శోధన చేయుమయ్యదే
చూచిన నింకలోకమున చూచెడిదేమి సమస్త మయ్యదే

 

          (సశేషం)

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech