సంఘంతో కలవక మానవుడు జీవించలేడు. తోటివారితో కలసి సహజీవనం చేయడం అతడికి తప్పనిసరి అవసరం. 'నేను ఎవ్వరితో కలవను; నాకా అవసరం లేదు' అనుకోవడం వట్టి భ్రమ.
కలయికలోనే జీవితం మిళితమై ఉంది. కలయికకు భావప్రసారం నాంది, ప్రస్తావన కూడా. మౌనంగాను, మాటల్లోనూ భావప్రసారం జరగవచ్చు. మౌనప్రసారం జరగాలంటే ఆ వ్యక్తులు ఉత్తమస్థాయికి చెందిన సాధకులై ఉండాలి. సామాన్య మానవులు మాటల ద్వారానే తమ భావాలను ప్రసారం చేస్తారు.
కాబట్టి మాట అనేది మానవ జాతిని కలిపి ఉంచే వంతెన వంటిది.
మాట్లాడటం చాలా తేలిక అని మనందరికున్న ఒకానొక పొరపాటు అభిప్రాయం. నిజానికి అది ఒక గొప్ప కళ.
'నాన్యో2నాతిరిక్తో' అన్నారు శంకర భగవత్పాదులు. అంటే నీవు చెప్పదలచుకున్న భావాన్ని తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా పదబద్ధం చేయగల్గాలి. ఆదికవి రామాయణాన్ని, వ్యాసుడు భగవద్గీతను అదే ఒరవడిలో వ్రాశారు. షేక్స్పియర్ కూడా హేమ్లెట్ నాటకంలో, Brevity is the soul of Wit, సంక్షిప్తత విజ్ఞతకు నిదర్శనం అన్నారు.
వ్యైద్యశాస్త్రపరంగా చూచినా మనం చాలా తేలికగా పలికే పలుకుల వెనుక మన శరీరంలో జరిగే సంక్లిష్ట ప్రక్రియలను గనక అర్థం చేసుకోగల్గితే, మాట అనేది ఎంత విలువైనదో తెలుస్తుంది.
ఎవరైనా తెలిసినవారు ఎదురయ్యారు; లేదా మనింటికి వచ్చారు; లేక కొంతమందిమి ఏదైనా సందర్భంగా ఒకచోట కలవడం జరిగింది. అప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? మాట్లాడుకుంటారు.
ఏం మాట్లాడుకుంటారు?
వాళ్ళ కష్టసుఖాలు, మన కష్టసుఖాలు, ఇతరుల మంచి, చెడ్డలు, మన గొప్పలు, పక్కవాళ్ళ తప్పులు - ఇవేగా? తొంభై శాతం కలయికలు ఇలాగే వ్యర్థ కాలక్షేపాలుగా అంతమైపోతున్నాయి. అసలు కాలక్షేపం అంటే అర్ధమే అది. కాలము అంటే మన ఎదుట సాగిపోయే సంఘటనల పరంపర. 'క్షిప్' అనే ధాతువుకు 'పాతిపెట్టబడిన ' అని అర్థం. కాలాస్ఫురణను మరచిపోయేలా, రకరకాల కాలక్షేపాల మత్తుల్లో మునిగిపోవటం, మనల్ని మనం భరించలేక వ్యసనాల్లో మునిగిపోవటం, మనిషి మృగ్యమైపోవటం కాలక్షేపం.
మరైతే ఏం చేయాలి?
ఎవరినీ కలవకూడదా? కలిసినా ఏమీ మట్లాడకూడదా?
ఖచ్చితంగా కలవాలి. ఈ వ్యాసారంభంలో మనం చెప్పుకొన్నదే అది. కలయిక అనివార్యం. అందుకనే దానిని సద్వినియోగం చేసికొని, మన జీవితాలను ఉత్తమంగా మలచుకొనేందుకు దోహదపడేలా జాగ్రత్తపడాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే సత్సంగం జరగాలి.
సత్సంగమంటే ఉన్నాడో, లేడో తెలియని భగవంతుని గూర్చి, అర్ధం కాని వేదాంత పరిభాషలో నాలుగు మాటలు చెప్పుకొని, తామేదో గొప్పవారమైపోయామని ముసలివాళ్ళు, పనీపాటా లేక సమయం వృధా చేస్తున్నరని కుర్రకారు విశ్వసిస్తున్నరు. ఈనాటి అధిక శాతం విద్యావంతుల అభిప్రాయం కూడా ఇదే. కాని, సత్సంగం అంటే భగవంతుడు, మహాత్ముల గురించే చెప్పుకోనక్కర్లేదు.
సత్సంగం - సత్ అంటే మంచి, సంగం అంటే కలయిక. మొట్టమొదట సత్సంగం నీలోంచి, నీతోనే జరగాలి. అంటే, నీతో నీవు ఎంత బాగున్నావో తెలియాలి.
దానికి గుర్తేంటి?
మనతో మనం కంఫర్టబుల్ గా ఉంటే పగలు, రాత్రి విరామం లేకుండా మనింట్లో టి.వి. మాట్లాడదు. రోజులో అధిక గంటలపాటు చెవిలో సెల్ ఫోన్ మోగదు. మనల్ని మనం సృజనాత్మకంగా మలచుకోవడానికి చేసే కృషి మొదట అర్థమయ్యేది మనకే.
ఇక ఇతరులతో సత్సంగం అంటే ఏమిటో చూద్దాం?
ఇతరులతో కలసినపుడు పరస్పర క్షేమవిచారాలు జరిగాక, మనం పంచుకోదగిన విశేషాలు ఇలా పేర్కొనవచ్చు.
1. మన జీవితానుభవంలో ఎదురైన విశిష్ట సంఘటనలు
2. చదివిన విశిష్ట గ్రంథాలు
3. ఎదురైన విశిష్ట వ్యక్తులు
వీటి గురించే ఎందుకు ప్రస్తావించాలంటే,
1. అటువంటి సంఘటనే మనలో ఎవరికైనా మరలా ఎదురైతే సరియైన ప్రతిస్పందన ఏదో తెలియడానికి
2. పుస్తకం గొప్ప మితృడు. గ్రంథాల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకొని, మన జీవితానికి అన్వయించుకోవచ్చు. పదిమంది పది పుస్తకాలు చదివి, వాటిలోని ముఖ్యాంశాలను, నేర్చుకోదగిన, అన్వయించుకొని, ఆచరించదగిన సూత్రాలను చర్చించుకొంటే, కొద్దికాలంలోనే ఎక్కువ జ్ఞానం సముపార్జించవచ్చు.
3. గొప్ప వ్యక్తులు సంఘటనల కంటే గొప్పవారు. ఎలా అంటే, వేయి వైద్య గ్రంథాల కంటే వైద్యుడు గొప్పవాడు; సకల యోగశాస్త్రాల కంటే యోగి గొప్పవాడు; ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నిటి కంటే ఆధ్యాత్మికవేత్త గొప్పవాడు.
అందుకని మన జీవితాలలో మనకు ఎదురుపడ్డ విశిష్ట వ్యక్తులు, గ్రంథాలు, సంఘటనలు ఇతరులతో పంచుకోవడం మానవుని సమిష్టి జీవనంలో అభివృద్ధిదాయక ప్రయత్నమని నా విశ్వాసం. అప్పుడే కలయిక సార్థకం అవుతుంది.
స్వామి వివేకానంద అంటారు, "విదేశాల్లో సమావేశాల్లో మాట్లాడిన రోజుల్లో నాలోని శక్తంతా క్షీణించినట్లౌతుంది. మళ్ళీ నా శక్తిని పునరుజ్జీవింప చేసుకోవటానికి ఎన్నో గంటలు ధ్యానం చేసుకోవాల్సి వచ్చేది." కొన్ని తరాలకి సరిపోయే స్ఫూర్తిని, శక్తిని ప్రపంచానికి అందించిన పలుకులవి. మాటకున్న శక్తి అలాంటిది.
మరి వ్యర్ధంగా, యధాలాపంగా నిత్యం మనం మాట్లాడే మాటల వల్ల ఎంత శక్తిని మనం కోల్పోతున్నామో, దుర్వినియోగం చేస్తున్నామో యోచించండి.