కథా భారతి - అనగనగా ఓ కథ
కృష్ణ
- జీడిగుంట రామచంద్రమూర్తి

"నేను పరీక్ష ప్యాసయ్యా నన్నయ్యా:"

పేపరు చదువుకుంటున్న రాఘవరావు తలఎత్తి చూశాడు. ఎదురుగా కృష్ణ నిలబడి వున్నాడు. స్కూలునుంచి పరుగున వచ్చినట్టున్నాడు కాబోలు - వగరుస్తున్నాడు చెదరిపోయిన జుట్టు నుదుటిమీద పడుతోంది.

"వెరీగుడ్ : అయితే మూడో తరగతిలోకి వచ్చావన్నమాట :"--- రాఘవరావు అన్నాడు ఉత్సాహంగా.

"అవునన్నయ్యా : మరి పుస్తకాలు ఎప్పుడు కొంటావ్?.... అప్పుడే వాళ్ళ మధు కొనేసుకున్నాడు"--- కొత్త పుస్తకాలు కొనిక్కోవాలనే వాడి ఉత్సాహం వెనుక ఆతృత కూడా వుంది.

"అలాగే : నేనూ కొంటానులే :... ముందు నువ్ ప్యాసయిన సంగతి మీ వదినకు కూడా చెప్పిరా"-- అంటూ మళ్ళీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు...

కృష్ణ గబగబా - పెరట్లో పని చేసుకుంటున్న లక్ష్మిదగ్గరకు పరుగు తీశాడు. పేపరు చదువుతున్న రాఘవరావుకు - అప్రయత్నంగా ఏవేవో జ్ఞాపకాలు స్మృతిపధంలోకి వచ్చాయి... కళ్లల్లో నీరు నిలచి పేపరులోకి అక్షరాలు కనిపించటం మానేశాయి...

* * * *

వెంకట్రామయ్యది కలిగిన కుటుంబం కాదు. ఏటా పది బస్తాల పంట ఇంటికి వస్తూంటే - దానికి సాయంగా అక్కడా అక్కడా పద్దులు రాసి మరో పదిరాళ్లు తెస్తూ - పదిమందిలోనూ పరువుగా బ్రతికేవాడు.

శాంతమ్మ కూడా పేరుకు తగిన మనిషి... భర్త తెచ్చినదానితో గుట్టుగా సంసారం సాగిస్తూ - నలుగురితోనూ నవ్వులు పంచుకునేది.

శాంతమ్మ కాపురానికి వచ్చిన నాలుగో ఏట పుట్టాడు రాఘవరావు... అతని తర్వాత మరో ముగ్గురు పిల్లలు పుట్టి ముద్దు ముచ్చటలు తీర్చుకొనకుండానే - శాంతమ్మకు గర్భశోకాన్ని మిగిల్చిపోయారు... రానురాను ఆ మనోవ్యాధి తీవ్రమై - ఆమెకు గుండె నొప్పికూడా ప్రారంభమయింది...

గట్టిగా మాట్లాడితే నీరసం వచ్చేది. ఒకరోజు ఎక్కువగా ఇంటిపనులు చేసుకుంటే నాలుగురోజులు మంచం దిగలేకపోయేది... అక్కడికి వున్నంతలో మంచి డాక్టర్లకు చూపించి, టానిక్కులూ, ఇంజక్షన్లూ ఇప్పిస్తూనే వుంటేవాడు వెంకట్రామయ్య...

"నీ కొడుకు డాక్టరయి వస్తేగానీ-- నీ రోగం పూర్తిగా తగ్గదేమో ?"- అని అప్పుడప్పుడూ అంటూండేవాడు వెంకట్రామయ్య.

"ముందీ ’ఎస్సెల్సీ’ అవనీయండి!... డాక్టరు సంగతి తర్వాత చూడచ్చు"- అనేది శాంతమ్మ...

అనుకున్నట్లుగానే ’ఎస్సెల్సీ’ మంచి మార్కులతోనే ప్యాసయ్యాడు రాఘవరావు...

"నువ్ ఇంటర్మీడియట్‍లో క్లాసు తెచ్చుకుంటే - ఎలాగో అలా కష్టపడి మెడిసిన్ చదివిస్తాను" _ అన్నాడు వెంకట్రామయ్య - రాఘవరావును కాలేజీలో చేర్పించిన నాటి రాత్రి...

అందుకే రాత్రింబగళ్లు కష్టపడి చదివాడు రాఘవరావు...

ఇంటర్మీడియట్‍లో ’క్లాసు’ కూడా తెచ్చుకున్నాడు.

కానీ ఏం లాభం?....

అతని పరీక్షా ఫలితాలు నాలుగు రోజుల్లో వస్తాయనగా ఒక రాత్రి - మంచం మధ్య కూర్చుని మంచినీళ్లు త్రాగుతూ - మరో లోకానికి వెళ్లిపోయాడు వెంకట్రామయ్య...

అప్పటికి రాఘవరావుకు పడుహేడేళ్లు...

శాంతమ్మకు మూడో నెల!...

మేడిసిన్ చదవాల్సిన రాఘవరావు మేనమామ సాయంతో సెకెండరీ గ్రేడు ట్రైనింగ్‍లో చేరాడు... భర్తలేని జీవితం నిస్సారమనిపించినా - కడుపులో వున్న ప్రాణికోసం - వేళకు ఇంత తిని రోజులు లెక్కపెట్టుకునేది శాంతమ్మ... భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకునేది...

చివరకు ఆ రోజు రానేవచ్చింది... శాంతమ్మకు మళ్లీ కొడుకు పుట్టాడు...

పొరుగూళ్లో ట్రైనింగవుతున్న రాఘవరావుకు తమ్ముడు పుట్టినట్లు కబురు అందగానే - అద్దె సైకిలుమీద ఆత్రతగా ఇంటికి చేరుకున్నాడు. మంచానికి బల్లిలా అతుక్కొని వున్న శాంతమ్మను చూశాడు.... దగ్గరకు వెళ్లటానికి సంశయిస్తూ - అలా గడప దగ్గరే నిలబడిపోయాడు...

"నాయనా : రాఘవా:... ఇలా దగ్గరకు రారా" - అనిపిలిచింది శాంతమ్మ ... నెమ్మదిగా వెళ్లి తల్లి మంచం దగ్గరగా _ ముక్కాలి పీటను లాక్కుని కూర్చున్నాడు....

"చూశావా తమ్ముణ్ణి?... నీ లాగా తెల్లగా లేడు కదూ?... గోపాల కృష్ణుడు:... నల్లగా వున్నా - వీడి కళ్లు ఎంత అందంగా వున్నాయో చూశావా?... అచ్చం మీ నాన్నగారి పోలికే కదూ?" - అని శాంతమ్మ అంటూంటే ఆమె గొంతు గాద్గదికమయింది. రాఘవరావు కళ్లల్లో కూడా నీళ్లు నిలిచాయి.

"కడుపునపడి మీ నాన్ననూ - నేల మీద పడి తల్లినీ - దూరంచేసుకున్నాడు." - అని రెండు క్షణాలు ఆగి కన్నీరు తుడుచుకుంది శాంతమ్మ... ఆమెను ఓదార్చే వయసు రాఘవరావుకు లేదు.... శాంతమ్మ మళ్లీ అంది...

"బాబూ రాఘవా : నల్లగా వున్నాడని వీడ్ని అసహ్యించుకోకేం:.... నువ్ డాక్టరు కావాలని మీ నాన్న ఎంతో ఆశపడేవారు... వీడినైనా డాక్టర్ని చేస్తే - ఆయన ఆత్మ శాంతిస్తుంది" - అంటూ రాఘవరావువైపు ఆశగా చూసింది...

"అమ్మా :" ... తల్లి గుండెలమీద వాలిపోయి - పసిపిల్లాడిలా విలపించాడు రాఘవరావు. అప్యాయతగా తల నిమిరింది శాంతమ్మ...

"మనసులో ఏ దిగులూ పెట్టుకోకుండా చదువుకోవాలి: ... నువ్ వృద్దిలోకి వచ్చి - తమ్ముడ్ని డాక్టర్ని చెయ్యాలి ... మీ నాన్నగారి ఆశీస్సులూ - నా దీవెనలు - మీకు ఎప్పుడూ వుఁటాయి"--- అది శాంతమ్మ చివరి దీవెన...

అంతటితో ఆ ఇంటి దీపం ఆరిపోయింది. తాను తల్లి భౌతికదేహం మీద పడి ఏడుస్తూంటే ఎవరెవరో వచ్చి ఓదార్చారు. రావలసిన బంధువులందరూ వచ్చి చేయవలసిన విధులన్నీ - తనచేత చేయించారు. రాఘవరావు ఓ యింటి వాడయ్యేవరకూ - కృష్ణుడ్ని తన దగ్గర వుంచుకుంటానని మాట యిచ్చారు- అతని మేనమామ... తన కూతురు లక్ష్మిని - ఎప్పటికైనా రాఘవరావు చేసుకోవాలని అతని నిర్ణయం...

గత స్మృతుల ప్రవాహంలో కొట్టుకపోతున్న రాఘవరావు చేతిమీద చల్లని స్పర్శ కలగటంతో వాస్తవానికి వచ్చి చూశాడు.

"ఏడుస్తున్నావా అన్నయ్యా"- అంటూ తన కళ్లల్లోకి చూస్తున్న కృష్ణుడ్ని ఎత్తుకుని - నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.

"ఏం ? తమ్ముడుగారు ఎమ్మే పరీక్ష ప్యాసయ్యారనా, అంత ప్రేమ ఒలకపోస్తున్నారు?" - అంది లక్ష్మి అప్పుడే పెరట్లోంచి వస్తూ...

"నా కృష్ణ ఎమ్మే చదవడు లక్ష్మి: ..... మెడిసిన్ చదువుతాడు.... పేద్ద డాక్టరవుతాడు"--

" ఆ: ఆ: కావల్సిందే : ....

ఆ యోగమే వుంటే - తల్లితండ్రులిద్దర్నీ ఎందుకు పొట్టను పెటుకుంటాడు ?"--

"లక్ష్మి :" - గట్టిగా అరిచాడు రాఘవరావు. అతనిలోని కోపాన్ని చూసి మెల్లగా ప్రక్కగదిలోనికి వెళ్లిపోయాడు కృష్ణ...

"అవును : నేనన్నది తప్పా ? వాడు నష్టజాతకుడు కనుకనే తల్లితండ్రుల ప్రేమకు నోచుకోలేదు...." - మళ్లీ అదే మాటను మరి కొంచెం మార్చి అన్నది లక్ష్మి ... అంతే : ... ఆమె చెంప చెళ్లుమంది.

ఏడుస్తూ పడకగదిలోకి వెళ్లిపోయింది లక్శ్మి....

* * * *

"కృష్ణ అంటే అంతద్వేషం ఎందుకో నాకర్థంకావటంలేదు"-- అన్నాడు రాఘవరావు. ఆ రాత్రి కృష్ణ నిద్రపోయిన తర్వాత....

లక్ష్మి బదులు చెప్పలేదు...

"అయినా వాడికి నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? ... వాడు తల్లీ తండ్రి లేని నష్టజాతకుడన్నమాట నిజమే కావచ్చు.... కాని మనం వాడికి ఆ లోటు కనిపించనీయకూడదు... అమ్మ తన చివరి ఘడియల్లో నన్ను ఏం కోరిందో తెలిసా ?... నల్లగా వున్నాడనీ - తల్లితండ్రుల్ని పొట్టను పెట్టుకున్నాడనీ అసహ్యించుకోకుండా - వీడ్ని డాక్టరు చదివించమని నన్ను అర్థించింది లక్ష్మీ... ఇవాళ వీడు పరీక్ష ప్యాసయినందుకు మా అమ్మే బ్రతికి వుంటే ఎంత ఆనందించేదో తెలుసా ? వాడికి ఇష్టమయిన పిండివంటలు కూడా చేసిపెట్టేది..." - ఈ మాటలు అంటూంటే రాఘవరావు కళ్లు ఆర్దృలయ్యాయి.

"ఇప్పుడుమాత్రం ఎవరు కాదన్నారు?. ప్రొద్దున్నే చెప్పివుంటే ఓ పిండివంట నేనూ చేసేదాన్నిగా ? ఈ మాత్రానికే అంత కష్టపెట్టుకోవాలా?" - లక్ష్మి మాటలలో ప్రేమా వాత్సల్యమూ కంటే - విసుగే ఎక్కువ వినిపించింది రాఘవరావుకు... అందుకే ఆమెకు బదులుచెప్పి ప్రయోజనం లేదనుకున్నాడు.

గతాన్నీ, వర్తమానాన్నీ, భవిష్యత్తుతో పోల్చి చూసుకుంటే అతనికెందుకో ఒక్కసారిగా భయం వేసింది : ...

తాను ఆశించిందేమిటి ? ...

లక్ష్మి కాపురానికి వచ్చి అప్పుడే ఆరుసంవత్సరాలయిపోయింది. అయినా తమకు పిల్లలు పుట్టనేలేదు... తాను ఎంతో బాధపడ్డాడు. అంతకుమించి లక్ష్మి మనోవేదన కూడా గ్రహించాడు... ఎలాగో గుండె దిటవుచేసుకుని - తమకు పిల్లలు లేని లోటును కృష్ణ తీర్చగలడని విశ్వసించాడు.

మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ...

తన మాతృప్రేమని పంచి ఇవ్వకపోగా చీటికీ మాటికీ కృష్ణను చివాట్లు వేయటం లక్ష్మికి అలవాటయిపోయింది ... అయినా వదినంటే వాడికి వల్లమాలిన అభిమానం... దానికి తోడు భయం : ... నిజమే : కడుపున పడి తండ్రినీ - నేలమీద పడి తల్లినీ కోల్పోయాడు... దానికి తోడు తమ నీడన వాడుంటున్నందుకే తన కడుపు పండలేదని లక్ష్మి నమ్మకం : .... ఏది ఏమైనా, నష్టజాతకుడనే భయంకరమైన నీడ వాడిమీద పడకూడదు... ఎలా? ...

* * * *

లక్శ్మికి వంట్లో నలతగా వుందంటే లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించాడు రాఘవరావు. పరీక్షించిన తరువాత లేడీ డాక్టరు నిజంగా శుభవార్తే చెప్పింది... తాను తండ్రి కాబోతున్నాడు... అసలు ఆ నిజాన్ని వింటాడని రాఘవరావు అనుకోలేదు. ఆ క్షణాన అతని కళ్లల్లో కలిగిన గర్వం అంతా ఇంతాకాదు... లక్ష్మి ఆనందానికయితే హద్దే లేకపోయింది.

కృష్ణ నీడనే అసహ్యించుకునే లక్ష్మి - రేపు తాను ఓ బాబుకో పాపకో తల్లి అయిననాడు - ఈ మాత్రం కూడా కృష్ణను లక్ష్యపెట్టకపోవచ్చు...

కృష్ణ భవిష్యత్తును తలచుకుంటూంటే రాఘవరావుకు భయంవేసింది... ఏమైనా తాను తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి .... : అది తన ఏకైక నిర్ణయం ... అందుకు అవసరమయిన శక్తినీ - అవకాశాన్నీ ప్రసాదించమని, దైవాన్ని మనసులోనే ప్రార్దించుకున్నాడు రాఘవరావు....

* * * *

బాబు ఎంతో అందంగా వుంటాడు... వాడి నోరు చాలా చిన్నది.... మనుషులు దగ్గరకు వస్తే ఇప్పుడిప్పుడే కళ్లు గుండ్రంగా తిప్పి చూస్తున్నాడు.

వాడి సంరక్షణలో లక్ష్మికి ఇప్పుడు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు... రాఘవరావుకు కూడా బాబుతో కాలక్షేపం బాగా జరిగిపోతోంది...

కృష్ణకు బాబు పంచప్రాణాలు... బడినుంచి రాగానే వాడు పడుకున్న మంచంమీద కూర్చుని వాడ్ని నవ్విస్తూ కబుర్లు చెబుతాడు... లక్ష్మి సీసాలో పాలుపోసి ఇస్తే - వాటిని బాబుకు పడుతూ - వాడు తాగుతుంటే తాను మురిసిపోతాడు.....

"బాబు పెద్దయ్యాక మే మిద్దరం కలిసి బడికి వెళ్ళచ్చు కదూ - "

"నా పుస్తకాలు బాబుకి పనికొస్తాయి - జాగ్రత్తగా దాస్తాను" - అని కృష్ణ అప్పుడప్పుడు అంటూంటే నిండుగా నవ్వుకునేవాడు రాఘవరావు...

"ఏమండీ : బాబు పుట్టినరోజు పండగ ఇంక పదిరోజులే వుంది" - అని గుర్తుచేసింది... లక్ష్మి - ఓ రోజు రాత్రి... :

పరీక్ష పేపర్లేవో దిద్దుతూన్న రాఘవరావు ’అలాగా’ - అన్నాడు మామూలు ధోరణిలో...

"వాడి పుట్టినరోజు పండుగ ఘనంగా చేయాలి : ... మన స్నేహితులందరికీ ’ టీ పార్తీ’ కూడా యిద్దాం..." లక్ష్మి చెప్పుకుపోతుంటే వినటం రాఘవరావు వంతైంది....

ఆ మర్నాటినుంచీ బాబు పుట్టిన రోజు పండుగ ఏర్పాట్లు భారీ ఎత్తున ప్రారంభమైనాయి. కృష్ణ ఆనందానికయితే అంతులేదు. పుట్టినరోజు పండుగను అంత ఘనంగా జరుపుతారని వాడికి తెలియనే తెలియదు... కానీ వాడి మూగ మనస్సులో ఎక్కడో అనిపించింది... తనకూ అమ్మ వుంటే అలా పుట్టినరోజు వేడుక జరిపివుండేదేమోనని : ...

అందుకే ఆ రాత్రి అన్నం తింటూ - పక్కనేవున్న అన్నయ్యను అడిగాడు - "అమ్మ లేకపోతే పుట్టినరోజు పండుగ చేయకూడదా అన్నయ్యా?" - అని.

"ఎందుకు చేయకూడదూ?" అన్నాడు రాఘవరావు పరధ్యానంగా.

"మరి నాకు ఎప్పుడూ పుట్టినరోజు పండుగ చేయలేదేం?" - వాడి అమాయకమైన ప్రశ్నకు రాఘవరావు ఖంగారు పడ్డాడు.

"పిచ్చి ప్రశ్నలు వేయక త్వరగా లే :" - అంటూ కృష్ణ కంచంలో మజ్జిగపోసి విసుక్కుంది లక్ష్మి...

వాడి పుట్టినరోజునే - తామిద్దరూ తల్లిలేని వాళ్లమయ్యామని రాఘవరావు చెప్పలేడు : ... అందుకే అన్నం సహించక -చేయి కడుక్కొని లేచిపోయాడు...

ఆ రాత్రి బాబుకూడా సరిగా పాలు తాగలేదు... రాత్రంతా ఒకటే ఏడుపు వాడిని సముదాయించటంతోనే ఆ రాత్రి గడిచిపోయింది.

ప్రొద్దున్న బాబుకు జ్వరం తగిలితే డాక్టర్ని తీసుకొచ్చాడు రాఘవరావు. ఆయన పరీక్షచేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు... ఆ సాయంత్రానికి బాబుకు జ్వరం మరింత తీవ్రమయింది. మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు. ఎందరు దేవుళ్ళకో మ్రొక్కుకుంది లక్ష్మి...

మెల్లగా వచ్చిన ’అమ్మవారు’ చల్లగా జారిపోతే నైవేద్యాలు పెడతానన్నది...

"ఊళ్లో ఇంతమంది పిల్లలుంటే లేక లేక పుట్టిన నా బాబుమీద ఎందుకమ్మా ఇంత కక్ష ? ... అంతకీ నీ కక్ష తీర్చుకోవాలంటే - ఆ నష్టజాతకుడు కిష్టిగాడ్ని పట్టుకోలేకపోయావా ?" --

అప్పుడే బడినుంచి వచ్చి, బాబు గదిలోకి రాబోతున్న కృష్ణ వదిన మాటలు విన్నాడు... బాబు మంచం మీద - శోకమూర్తిలా కూర్చున్న వదినను చూశాడు. ఆమె కళ్ళనుంచి ఏకధారగా ప్రవహిస్తున్న కన్నీటిని గమనించాడు... వాడి పసి మనసు బాధతో మూలిగింది... లోపలకు రాకుండా పుస్తకాలు అక్కడే వున్న కుర్చీలో పెట్టి వీధిలోకి పరుగెత్తాడు...

* * * *

పుట్టినరోజునాటికి బాబు పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు ఉదయమే బాబుకు తలంటుపోసి - హారతి ఇచ్చి కొత్తబట్టలు వేసింది లక్ష్మి.

"ఓ పక్కన కృష్ణకు ఒంట్లో బాగాలేదు కదా - ఈ రోజు పిండివంటలూ అవీ ఎందుకులెద్దూ" - అన్నాడు రాఘవరావు.

"కృష్ణ మాత్రమే కాదు : ... ఊరంతా అల్లాగే వుంది... రెండు రోజులుండి అదే తగ్గిపోతుంది. ఈ మాత్రానికి మన బాబు పుట్టినరోజు వేడుక మానుకుంటామా ?" - అన్నది లక్ష్మి ’మన’ అనే మాటను మరింత ఒత్తి పలుకుతూ...

ఆ సాయంత్రం పేరంటమూ - తేనేటి విందూ - అన్నీ ఘనంగానే జరిగిపోయాయి... వచ్చిన అతిథులందరూ బాబును ఆశీర్వదించారు...

"వదినా : బాబును ఒకసారి తీసుకరావూ ? ... కొత్తబట్టలు వేసుకుంటే ఎలా వున్నాడో చూస్తాను" ... గదిలో మంచంమీద పడుకున్న కృష్ణ - పేరంటం అయిపోయిన తర్వాత వదినను పిలిచాడు. బాబును అయిష్టంగానే కృష్ణ దగ్గరకు తీసుకువెళ్లింది లక్ష్మి.

"బాబుకు కొత్త బట్టలు వేస్తే - ఎంత ముద్దొస్తున్నాడో చూశావా వదినా ?... పెద్దవాడయిపోయినట్లు లేడూ ?... నా పుస్తకాలూ, పలకా అన్నీ బాబుకు ఇచ్చేయ్ వదినా : ... బాబు అన్ని క్లాసులూ చదువుకుని డాక్టరవుతాడు... ఇంకెప్పుడూ బాబుకి జబ్బు చేయదులే : ... దేవుడికి చెప్పేశాను" - కృష్ణ మాటలు అర్థంకాక, అయోమయంగా చూసింది లక్ష్మి...

"ఏమని చెప్పావ్ దేవుడికి ?" - అడిగింది లక్ష్మి...

"మా బాబు ఎంతో అందంగా వుంటాడు... వాడంటే మా వదినకు ప్రాణం... అంతగా నీ కక్ష తీర్చుకోవాలంటే - బాబుకి వచ్చిన రోగాన్ని నాకు ఇచ్చి, బాబుకి నయం చెయ్యి తల్లీ - అని ఆ రోజున దుర్గ గుడిలో దఱ్ఱం పెట్టుకున్నానుగా ... : అందుకే బాబుకి జొరం తగ్గిపోయి నాకు వచ్చింది. ఇంక వాడికి ఎప్పుడూ జబ్బు చేయదు వదినా :" - కృష్ణ తృప్తి నిండిన కళ్లతో బాబువైపే చూస్తూ అలా మాట్లాడుతూంటే అమాయకమైన వాడి మాటలకు లక్ష్మి హృదయం ద్రవించిపోయింది. ఆమెలోని మాతృప్రేమ ఒక్కసారిగా కట్టలుత్రెంచుకుంది.

"అలా అనకు కృష్ణా : నీకూ జ్వరం తగ్గిపోతుంది : ... మీరిద్దరూ నాకు రెండు కళ్లు... అంటూ కృష్ణను నుదుటిమీద ముద్దుపెట్టుకుంది లక్ష్మి...

కృష్ణ - ఆ క్షణంలో - వదినలో తన తల్లిని చూడగలిగాడు...

అప్పుడే గదిలోకి వచ్చిన రాఘవరావు ఆ దృశ్యాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చాడు...

"ఏమండీ : ఇకనుంచీ బాబు పుట్టినరోజుతోపాటే కృష్ణ పుట్టినరోజు కూడా చేద్దామండీ" - అన్నది లక్ష్మి - ఆ రాత్రి రాఘవరావు భోజనం చేస్తూంటే...

"అలాగే :" అని పైకి సమాధానం చెప్పిన - రాఘవరావు---

"నీ కోరిక తీర్చగలననే నమ్మకం నాకిప్పుడిప్పుడే కలుగుతోందమ్మా :"- అని మనసులోనే అనుకున్నాడు : ....

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)