పెరియాళ్వార్ అనబడే విష్ణుచిత్తులు పాండ్యరాజ సభకు వెళ్లి, సవ్య సాచిలా వాదప్రతివాదనలు చేసి శ్రీమన్నారాయణుడొక్కడే పరదైవమని నిరూపిస్తాడు. పైన ఏర్పరచిన ‘ వాదశుల్కము’ దానంతట అదే విష్ణుచిత్తుల పాదాలవద్ద పడుతుంది. అశరీర వాణి కూడా విష్ణుచిత్తుడే గెలిచినట్లు ప్రకటిస్తుంది. అప్పుడు రాజుతోసహా అందరూ విష్ణు భక్తులుగా మారిపోయి, విష్ణుచిత్తులను ఏనుగుపై ఎక్కించి ఊరేగిస్తారు. తన భక్తుని విజయోత్సవం చూ డటానికి సాక్షాత్ శ్రీహరి గరుడవాహనంపై వచ్చి దర్శనమిస్తాడు. ఆ స్వామిని చూసిన విష్ణుచిత్తులు ‘ పులకితగాత్రుడై’ నమస్కరించి స్వామికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని “ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు, పలకోటి నూరాయిరం” అని మంగళం పాడుతాడు. (ఆ పాశురాలే నేటికీ విష్ణ్వాలయాలలో మంగళహారతి ఇచ్చేటప్పుడు పారాయణ చేస్తారు.)
ఆ తరువాత విష్ణుచిత్తులు సామాన్యుని వలే శ్రీవిల్లిపుత్తూరు చేరుకొని పుష్ప మాలా కైంకర్యం చేస్తూ జీవిస్తూ ఉంటారు. జనకునికి సీత లభించి నట్లు విష్ణుచిత్తుల వారికి తులసి వనంలో చిన్ని పాప లభిస్తుంది. దైవకటాక్షంగా భావించి ‘ గోదా’ అని పేరు పెట్టి పెంచుకొంటుంటారు. ఆండాళ్ అనిపిలువబడే గోదాదేవి చిన్నప్పటినుండి విష్ణు కథలు వింటూ, ఆస్వామినే ఆరాధిస్తూ, ఆ స్వామికొరకు తండ్రి తయారుచేసిన పూమాలలను తాను ముందు ధరించి, బాగున్నాయో లేదో చూసిన తరువాత స్వామికి సమర్పించేది. కనుకనే ఆండాళ్ “ అముక్త మాల్య ద” అయింది. అదే శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ‘ ఆముక్తమాల్యద’ కావ్యం. “ సాహితీసమరాంగణ సార్వభౌముని” కవితా విన్యాసాలని పరిశీలిద్దాం- ఈ కావ్యం ఎక్కువగా ‘ నారికేళపాకం’ లో అంటే కొంచం కష్టంగా సాగుతుంది. ఈ పద్యం ఇష్టదేవతా ప్రార్థనలో శ్రీవేంకటేశ్వర స్వామిని స్తుతించిన పద్యం.
శ్రీ కమనీయ హారమణి
జెన్నుగ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియును
దారత దోప పరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ
యాకృతు లచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన
శోభిలు వేంకట భర్త గొల్చెదన్
కౌస్తుభమణి హారంతో వక్షస్ధలమందు లక్ష్మీదేవిని ధరించిన వేంకటేశ్వరునికి నమస్కారం. అని ఇంకా
శ్రీవిల్లిపుత్తూరు పురవ ర్ణన ---
“ లలితోద్యాన పరంపరా పికశుకాలాప ప్రతి ధ్వానము
ల్వలభీ నీల హరిన్మణీ పికశుక స్వానభ్రమం బూన్ప మి
న్నులతోరాయు సువర్ణసౌధములనెందుం జూడజెన్నొంది శ్రీ
విలుబుత్తూరు సెలగు బాండ్య నగరోర్వీ రత్న సీమంత మై”
శుక, పికములతో కూడిన చక్కని ఉద్యాన వనాలతో, ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద మేడలతో పాండ్య నగరానికే తల మానికంగా శ్రీవిల్లిపుత్తూరు ప్రకాశిస్తూ ఉంది అని వర్ణిస్తూ, తులసి వనంలో గోదాదేవి లభించగా విష్ణుచిత్తులు “ సంతానంలేని నాకు ఆ ముకుందుడు ప్రసాదించిన వరం” అని భావించి ఆనందించిన తీరు వర్ణించిన పద్యం ---
“ కనుగొని విస్మయం బొదవగా గదియంజని సౌకుమార్యముం
దను రుచియు న్సులక్షణ వితానము దేజము జెల్వు గొంత సే
పనిమిష దృష్టి జూచి యహహా!యనపత్యున కమ్ముకుందు డే
తనయగ నాకు నీ శిశువు దా గృప సేసె నటంచు హృష్టుడై “
ఈ మహాప్రబంధాన్ని కొద్దిగానే పరిచయం చేస్తున్నాను. ఇది రుచి చూసి, పూర్తి గ్రంథాన్ని చదివి ఆనందించ గలరు.
మధుర భక్తితో శ్రీ కృష్ణుని వ్రజ గోపికలు కొలిచి తరించి నట్లు, గోదాదేవి శ్రీరంగనాధునే పూజించి, వివాహం చేసుకొని,తనని తాను భగవదర్పణం గావించు కొన్న తీరు భక్తికి పరాకాష్టగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆమె రచించిన తిరుప్పావై పాశురాలు, (పాటలు) పారాయణ చేయడం, ఆమె ఆచరించిన ధనుర్మాస వ్రతం ( మార్గళి వ్రతం) ఆచరించడం ఆమె అచంచలమైన భక్తికి నిదర్శనం. ఆళ్వారులలో ఆండాళ్ అగ్రగామి అనుటలో సందేహమే లేదు. మంగళ సూత్ర ధారణ పద్యంతో ఈ వ్యాసాన్ని మగళంగా ముగిస్తాను.
“ గళమున కట్టెను హరి మం
గళ సూత్రము పులక లతివ గాత్రము బొదువన్
నేలతయు బతియును గరముల
నలవరిచిరి కంకణంబు లన్యోన్యంబున్” శుభం.
( వచ్చేనెల విప్రనారాయణ చరిత్ర తెలిపే ‘ వైజయంతీ విలాస’ కావ్యాన్ని ఆస్వాదిద్దాం.)
( సశేషం)