ధారావాహికలు
మరీచికలు
- వెంపటి హేమ

(గత సంచిక తరువాయి)

"సార్!"

హాల్లో టేబుల్ ముందు కూర్చుని "స్లిప్ టెస్టు" పేపర్లు దిద్దుకుంటున్న మురళీకి గుమ్మంలో ఎవరో పిలిచినట్లై తలెత్తి చూసి నిర్ఘాంతపోయాడు, గడపకు పక్కన యూనిఫారంలో ఉన్న పోలీసు ఒకడు నిలబడి ఉండడం చూసి.

తమ ఇంటికి ఇలా యూనిఫారంలో ఉన్న పోలీసు రావడం అన్నది, ఇబ్బందికరంగా తోచింది అతనికి. బహుశ: ఏదైనా ఎంక్వైరీ కోసం వచ్చి ఉంటాడు - అనుకుని మనసు సరిపెట్టుకోవాలని చూశాడు.

కుర్చీ లోంచి లేచివచ్చి, "ఎందుకు? పనేమిటి" అని అడిగాడు.

శాల్యూట్ చేసి, "ఇనస్పెక్టర్ సాబ్ మీకోసం వచ్చారు సార్!" అన్నాడు పోలీసు.

ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది మురళీకి. పోలీసు ఇనస్పెక్టర్ తన కోసం పనిగట్టుకు ఇంటికి రావడమేమిటి - అని. అయినా అదేమిటో తెలుసుకోవాలి కదా! వెంటనే గుమ్మంలో ఆగి ఉన్న జీపు దగ్గరకి నడిచాడు మురళీ.

మురళీ బయటికి రావడం చూసి, జీప్ దిగాడు సుధాకర్ I.P.S. చిన్న చదువులు చడువుకునీ రోజుల్లో వీళ్ళిద్దరూ పరిచయస్థులే. ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే తరగతిలో ఉండే వారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఒక మాదిరి ఫ్రెండ్షిప్ కూడా ఉండేది. కాలేజి రోజుల్లో ఇద్దరి దారులూ వేరయ్యాయి. ఒకరి నొకరు చూసుకుని చాలా రోజులవ్వడంతో పోలీస్ యూనిఫారంలో ఉన్న సుధాకర్ని గుర్తుపట్టలేకపోయాడు మురళీ.

మురళీకి దగ్గరగా వచ్చి, "హల్లో, మురళీ! హవ్ డు యు డు" అంటూ కరచాలనం కోసం కుడిచెయ్యి ముందుకు చాపాడు సుధాకర్.

కంఠం వినగానే గుర్తుపట్టిన మురళీ వెంటనే, "సుధాకర్! కుశలమా" అని అడుగుతూ, సంతోషంతో చాపి ఉంఛిన అతని చేతిలో చెయ్యేసి, మృదువుగా వత్తి వదిలాడు.

ఆపై , "ఊరక రారు మహాత్ములు" అంటారు. ఇంతకీ మీరు ఎందుకు ఇటు వచ్చినట్లు ? కబురు పంపితే నేనే వచ్చే వాడిని కదా" అన్నాడు మురళీ.

" అవసరం నాది కనుక నేనే రావడం ఉచితం - అనుకున్నాను" అన్నాడు సుధాకర్.

"సుదర్శనం హత్యతాలూకు ఎంక్వైరీయేనా?"

"నిజానికి అతనిగురించిన ఎంక్వైరీయే, గాని కేసుకి సంబంధించినది కాదు, పర్సనల్."

" పర్శనలా!"

" ఔను. పోస్టుమార్టం పూర్తి అయ్యింది, రేఫు డెడ్ బాడీస్ హాండోవర్ చేస్తారుట. సుదర్శనంతో పాటుగా అతని "కీప్" ని కూడా చంపేశారు కదా! ఆమె బాడీని తీసుకెళ్ళడానికి ఆమె తమ్ముడు సిద్దంగా ఉన్నాడు. సుదర్శనం విషయమే ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఈ విషయంలో నీ సలహా, సంప్రదింపుల కోసం వచ్చాను. జీపెక్కు , దూరంగా వెళ్లి మాటాడుకుందాము." అన్నాడు సుధాకర్.

" ఉండు, ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తా. లేకపోతే నువ్వు నన్ను అరెష్టుచేసి పట్టుకుపోయావనుకుని బేజారౌతారు మా ఇంట్లోవాళ్ళు" అన్నాడు మురళీ.

సిగ్గుపడ్డాడు సుధాకర్. "సారీ, బ్రదర్! ఆఫీసునుండి ఇంటికి వెళుతూ, దారేకదాని ఇటు వచ్చేశా. ఇక నుండి గుర్తుంచుకుంటాలే. ఈ యూనిఫారంకి స్నేహాలూ, బాంధవ్యాలూ ఉండవన్న విషయం!"

"నీకింకా ఉద్యోగం కొత్తకదా, రోజులు గడిచినకొద్దీ, సాధకబాధకాలన్నీ నెమ్మదిగా వాటంతటవే నీకు అలవాటౌతాయి" అంటూ ఇంటిలోపలకు వెళ్ళాడు మురళీ.

మురళీ ఇంట్లో చెప్పివచ్చి జీప్ ఎక్కాడు. జీప్ కదిలింది. కొంతసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుని ఉండిపోయారు. తరవాత మురళీయే, " ఇప్పుడు చెప్పు సుధాకర్! సంగతేమిటో" అని అడిగాడు .

" విషయం అదే. కాని నేను దాన్ని గురించి యామినితో సంప్రదించ గలననిపించ లేదు. ఆలోచిస్తే నాకు నువ్వు గుర్తుకి వచ్చావు. చూడు, వాళ్ళు నలుగురూ ఆడవాళ్ళు. ఎలాగా ఈ పని మనం పూనుకుని చేస్తేగాని జరిగేది కాదు. ముందు నీతో ఆలోచించి, ఏం చెయ్యాలో నిర్ణయించి, ఆ తరవాత వాళ్ళకి చెప్పొచ్చు ననిపించి ఇటు వచ్చా, ఏమంటావు?"

ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో సుధాకర్ ఇల్లు వచ్చింది.

మురళీని తన రూంలోకి తీసుకెళ్ళాడు సుధాకర్. వాళ్ళరాక చూసి వెంటనే రెండు కప్పులతో వేడివేడి టీ, ప్లేట్లలో చిరుతిండి ఉంచుకుని తీసుకువచ్చాడు వంటవాడు. సుధాకర్ డ్రెస్ మార్చుకుని వచ్చాక ఇద్దరూ టీ తాగుతూ మాటాడుకోడం మొదలుపెట్టారు.

"సాంప్రదాయం ప్రకారం చెప్పాలంటే, కన్న బిడ్డలు లేనప్పుడు, కనీసం సగోత్రీకుడైనా పూనుకుని కర్మలు చెయ్యడం బాగుంటుంది" అన్నాడు మురళీ.

"సుదర్శనానికి దాయాదులెవరితోనూ సత్సంబంధాలు లేవు. ఎంక్వైరీలో తేలిందేమిటంటే, అతనికి దాయాదులందరితోనూ ఉన్నది శతృత్వమేనని! ఈ సుదర్శనం కడుదుర్మార్గుడు, కుశ్చితుడు! మాటల గారడీతో మనిషిని బోల్తా కొట్టించ గలనేర్పరి, మహా మాయావి! బంధువులందరిలో తానే గొప్ప ధనవంతుడుగా ఉండాలని, దగ్గరి వాళ్ళ నందరినీ ఏదో విధంగా లిటికేషన్లలో ఇరికించీ, ఫోర్జరీలతో, దొంగసాక్ష్యాలతో వాళ్ళ స్వంత ఆస్తులన్నీ కాజేసీ, వాళ్ళని బికారుల్ని చేశాడుట! బోలెడు బలగం ఉంది, కాని అందరూ వీడి చావుకి సంతోషించే వాళ్ళేగాని, ముందుకువచ్చి, వీడికి సద్గతి కలగడంకోసం కర్మలు చేస్తారని అనిపించడంలేదు. ఇలాంటి లుఛ్ఛాగాడి మాయలో యామినిలాంటి టాలెంటెడ్ గళ్ ఎలా చిక్కుకుందన్నది నాకు ఎంతకీ అర్ధంకావడం లేదు" అంటూ, సుధాకర్ బాధతో తల మీద చెయ్యి ఉంచుకుని నిట్టూర్చాడు.

" అదే ఘటనంటే! "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ " అని నానుడి. కాని ఇలాంటి పెళ్ళిళ్ళని చూస్తే మాత్రం, ఇవి "హెల్" లో నిర్ణయించబడ్డాయేమో - అనిపించక మానదు. మనలో మన మాట ... , వీడు పోవడం మంచిదే అయ్యింది. బతికి ఉంటే యామినిని ఇంకా ఎన్ని హింసలు పెట్టీవాడో! తెలిసినవాళ్ళు, ఒక్క గుణం కూడా మంచిది లేదంటారు ఈ సుదర్సనానికి! హంతకు డెవడోగాని, ఒకవిధంగా యామినికి మంచే చేశాడనిపిస్తోంది. దీనంతలోకీ నాకు నచ్చనిది ఒకటే - యామినిని ఈ హత్య కేసులో సస్పెక్టుగా చెయ్యడం! చిన్నప్పటినుండి ఆ కుటుంబం మనకు తెలుసు కదా, ఆమె ఈ హత్య చేసిందన్నది నువ్వు నమ్మగలవా? నువ్వు చెప్పిందాన్నిబట్టి చూస్తే ఈ సుదర్శనానికి శతృవుల సంఖ్యకేమైనా తక్కువా? కక్షకట్టి, వాళ్ళలో ఎవరో ఈ పుణ్యం కట్టుకుని ఉండవచ్చు కదా.....! "

"ఆ నరహరి గాడు మరీ మరీ నొక్కి చెప్పడంవల్ల యామినిని అరెష్టు చెయ్యక తప్పలేదు, సారీ! అదంతా, నిజమైన హంతకుడెవరో తెలిసీ దాకానేలే! ఐనా నేను ఆమెకు చెయ్యగలిగినంత సాయం చేశా. పైకి అది హౌస్ అరెష్టు అనిపిస్తుంది. కాని, అది ఆమెకు పోలీసు ప్రొటెక్షన్ కూడా. నేను ఆనుకున్నట్లు దాయాదులే హంతకులైతే, ఆమెకు కూడా ప్రమాదం ఉందేమో నని నా అనుమానం. ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడప్పుడే చెప్పలేను, ఒదిలెయ్యి. నువ్వే కాదు, నేనుకూడా యామినికి శ్రేయోభిలాషినేనని నమ్ము. కాని నేను ఉద్యోగ ధర్మంగా రూల్సుని పాటించక తప్పదు. డ్యూటీ ఫష్టు కదా !"

"థాంక్సు సుధాకర్! నా కిప్పుడు ధైర్యంగా ఉంది. త్వరలోనే యామిని ఈ కేసునుండి బయటికి వస్తుందన్న నమ్మకం కుదిరింది " అన్నాడు మురళీ.

"ఇది నీకు తెలుసా మురళీ! యామిని లీగల్ గా సుదర్శనం భార్య అయ్యింది కనుక, అతని యావదాస్తికీ ఇప్పుడు ఆమే వారసురాలు! కాని యామిని అవేమీ తనకు వద్దనీ, ఎవరివి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాననీ అంది. తనకి తన రెక్కలు చాలుట! "

" మంచిపనే కదా! యామిని మాట తప్పదు. ఐతే, నాకో అలోచన వస్తోంది, చెప్పనా? ఇప్పుడు మనం వెళ్లి, సుదర్శనం దాయాదుల్ని కలుసుకుని ఈ మాట చెపితే వాళ్ళలో ఎవరైనా సుదర్శనంకి కర్మలు చెయ్యడానికి ముందుకు రావచ్చు. వాళ్ల అడ్రస్లు ఉన్నాయా నీ దగ్గర?"

" కొన్ని ఉన్నాయి. అవసరమైతే తక్కినవీ కనుక్కోగలను. పద, మన మిప్పుడే వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం. ఒకసారి ఆ సుదర్శనం, విశ్వనాధంగారికి అల్లుడని అనిపించుకున్నాక, అతన్ని అలా అనాధ ప్రేతంగా వదిలెయ్యడం, యామినికి అప్రతిష్ట తెస్తుంది. మనమే పూనుకుని అతని కర్మకాండలకి సక్రమమైన ఏర్పాటు చెయ్యాలి ఏదో విధంగా. "

"తప్పకుండా చేద్దాం. ఒకసారి కర్మకాండలన్నీ ముగిసి, సుదర్శనం పార్ధివదేహం పంచభూతాల్లో కలిసిపోతే, అతనితో ఉన్న బంధాలన్నీ పూర్తిగా తెగిపోయి యామినికి పరిపూర్ణ స్వేఛ్ఛ వస్తుంది. పద వెడదాం" అంటూ లేచాడు మురళీ.

సుధాకర్ కూడా లేచాడు. "ఈ మనిషి స్వపర భేదం లేకుండా మోసాల మీద మోసాలుచేసి చాలా డబ్బు సంపాదించేడు. పైగా అది ఏటా ఏటా పెరిగుతూ ఉంటుంది కూడా! ఎవరిది వాళ్ళకి ఇచ్చేసినా ఇంకా చాలా ఉంటుంది. కాని యామిని అది కూడా సుదర్శనం పేరున ధర్మం చేసేస్తానంది!"

"అదే మంచి పని సుధాకర్! అదంతా అన్యాయార్జిత విత్తం! అది అనాధలకు చేరడమే న్యాయం! యామినికి ఆ భగవంతుడు ఒక మంచి దారి చూపించకపోడులే!"

ఇద్దరూ వెళ్ళి జీపు ఎక్కగానే జీపు బయలుదేరింది. వెళ్ళివెళ్ళి అది, ఇకనో ఇప్పుడో కూలిపోతుందన్నట్లున్న ఒక పాత పెంకుటింటి ముందు ఆగింది. కాని ఆ ఇంటివాళ్ళు ఎంత పేదగా ఉన్నాగాని, సుదర్శనం మీద వాళ్ళకున్న ఏవగింపు, వాళ్ళనా పని చెయ్యడానికి ఒప్పుకోనివ్వలేదు.

సుధాకరు, మురళి చాలాచోట్లకి తిరిగారు. దాయాదు లెవరూ సుదర్శనానికి కర్మ చెయ్యడానికి ఒప్పుకోలేదు. యామిని త్వరలోనే వాళ్ళ ఆస్తులు వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యబోతోందని చెపితే విని ఆశ్చర్యబోయారు. ఆమె ఔదార్యానికి వాళ్ళు యామినిని మెచ్సుకున్నారుగాని, తమకు దాయాదియైన సుదర్శనానికి కర్మకాండలు చెయ్యడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదు. ఏవేవో కుంటి సాకులు చెప్పి చక్కగా తప్పించుకున్నారు.

అడ్రస్సులు ఉన్నంతవరకూ ప్రతి గడపదగ్గరా అడిగి అడిగి విసికిపోయారు మిత్రులిద్దరూ. వాళ్ళ ఆస్తి వాళ్ళకి వచ్చేస్తుందన్నాకూడా వాళ్ళకి తమ దాయాది మీద ఉన్న జుగుప్స తగ్గలేదు. ఎంతో కష్టం మీద వాళ్ళు, సుదర్శనం పెదనాన్న మనమడిని, అదనంగా ఏవేవో ఆశలు చూపించి, ఎట్టకేలకు ఒప్పించగలిగారు. అతడు ఏ కళ నున్నాడోగాని, ముందుకు వచ్చి, సుదర్శనం అంత్యక్రియలు చేస్తానని వాళ్లకు మాట ఇచ్చాడు.
.
కొడుకు వరసవాడైన అతని మీదే కర్తవ్యం ఉంచి కర్మకాండలు జరిపించాలి అనుకున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా అతనికి మరికొంత ఆస్తి ఎక్కువగా ఇప్పిస్తామని చెప్పి ఒప్పించారు. ఆ మరునాడు ఆసుపత్రినుండి శవాన్ని తీసుకుని నేరుగా స్మశానానికి వెళ్ళారు.

"తను తప్పుచేసినా నేను చెయ్యలేను. ఆయన ఉన్నంత కాలం ఆయనకు విధేయురాలిగానే ఉండాలి అనుకున్నాను. నేను ఆ మాట నిలబెట్టుకుంటాను" అంటూ యామిని తను కూడా శ్మశానానికి వెళ్ళింది.

వేదమంత్రాలతో అంత్యకర్మలన్నీ యధావిధిగా జరిపించి, శవాన్ని చితిపై ఉంచారు. కొడుకు వరసవాడు చితికి నిప్పు ముట్టించాడు. జ్వలిస్తున్న చితినే చూస్తూ ఎడంగా నిలబడి ఉన్నారు అందరూ. శ్మశానానికి చేరుకున్న యామిని, చితిచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, సుదర్సనం తన వేలికి తొడిగిన పెళ్ళి ఉంగరాన్ని తీసి ఆ చితిలో పడేసి, వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి జనమంతా విస్తుబోయి చూస్తూ ఉండిపోయారు. ఆమె వెంట కాపలాగా వచ్చిన పోలీసు కూడా వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన యామిని తిన్నగా నూతిదగ్గరకు వెళ్ళి చాద తరవాత చాదగా నీళ్ళు తోడి తలమీద పోసుకుంటూనే ఉండిపోయింది. వకుళవచ్చి తనను వారించేదాకా ఆమె అలా చన్నీళ్ళు తలపైన పోసుకుంటూనే ఉంది. వకుళే యామిని బలవంతంగా చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి, ఆమెచేత తడిబట్టలు మార్పించి, ఆ తరవాత పొడి తువ్వాలు తెచ్చి, యామిని తడితల తుడవసాగింది వకుళ. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు .
చాలాసేపు అలా గడిచిపోయాక, యామిని వకుళతో అంది , "వకుళా! నా కిప్పుడు తండ్రి లేడు, మొగుడు లేడు, ఉద్యోగం కూడా లేదు...; సర్వం శూన్యం! ఇక రేపేమిటన్నది ఆ భగవంతుడే నిర్ణయించాల్సి ఉంది! "

* * *

హైదరాబాదులోని మైత్రీ ఫర్నిషింగ్సు ఆఫీసు బొత్తిగా కళతప్పి, వెలవెల పోతోంది. కొత్త రిసెప్షనిష్టు పసి బిడ్డకు తల్లి కావడంతో, ఆమె సరిగా సమయానికి ఆఫీసుకి వచ్చి, ముక్తసరిగా తన పని తాను చేసుకుని, కరెక్టుగా ఆఫీసు మూసీ వేళ అవ్వగానే అన్నీ సద్దేసి ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంటుంది. ఆమెను పరీక్షగా చూసినవాళ్ళకి ఆమె కళ్ళలో, "ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా" అన్న తహతహే స్పష్టంగా కనిపిస్తుంది. తన డ్యూటీ తప్ప, ఆమె ఇతర విషయాలేమీ పట్టించుకోదు.

ఆఫీసుకు వస్తూ, దారిలోఉన్న పూలదుకాణంలో తాజా రోజాలు, ఇంకా అవసరాన్నిబట్టి ఇతరమైన పూలూ, ఆకులూ కొనితెచ్చి, తడవకోవిధంగా ఫ్లవర్ వాజుల్లో అమర్చి, బాస్ టేబులు మీద, రిసెప్షన్ డెస్కు మీద ఉంచే వారెవరూ ఇప్పుడక్కడ లేరు. తొట్టెల్లో కుదురుగా పెరుగుతున్న ఇండోర్ ప్లాంట్సుకు, తీరుగా అదును పదును చూసి నీళ్ళుపొయ్యడం చేతకాక, మొక్కుబడిగా ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ నీళ్ళు పోస్తూ కాలక్షేపం చేస్తున్నాడు రాజు. అవి కూడా దానికి తగ్గట్లే ఈసురోమంటూ చావలేక, బ్రతకలేక ఈడిగిల పడుతూ, కాలక్షేపం చేస్తూన్నాయి. ఫైళ్ళన్నీ చెల్లాచెడురై ఆర్డర్ తప్పి ఇక్కడి వక్కడా, అక్కడి విక్కడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక ఫైల్ కావాలంటే వెతికి పట్టుకోడం గగనమౌతోంది. ఆ ఆఫీసులో ప్రతిక్షణం, ప్రతి ఒక్కరికీ యామినే పదేపదే గుర్తుకి వస్తోంది. ఆమె తన డెస్కు మాత్రమే కాకుండా, ఆఫీసు మొత్తం ఆర్డర్లో ఉండేలా చూసేది - అన్నది ఇప్పుడు అందరికీ బాగా అర్థమయ్యింది.

యామిని రాకపోవడంతో టైప్ మిషన్ కి పని లేకుండా పోయింది. జవాబు రాయాల్సిన ఉత్తరాలు రోజురోజుకీ గుట్టగా పెరిగిపోతున్నాయి. అందరూ యామినిని మిస్సవుతున్నారు. నిజానికి, అందర్లోకీ ఎక్కువగా ఆమెను మిస్సైనది మాత్రం అమరేంద్ర ఒక్కడే! ఆమె అక్కడ లేకపోడంతో ఒక్కొక్క రోజూ గడుస్తున్నకొద్దీ అతనికి కాళ్ళూ, చేతులూ ఆడనట్లుగా, మనసంతా స్తబ్దమైపోయి ఏమీ తోచనట్లుగా అనిపిస్తోంది. "ఎస్ బాస్!", "ఓ .కే. బాస్!", "డిక్టేషన్ ఉందా సర్!", "ఎందుకు పిలిచారు సర్!" అంటూ, ప్రతి పనిలోనూ తనకు సాయపడుతూ, విరబూసిన జాజి పందిరిలా చిరునవ్వులొలికిస్తూ, సతమూ తన వెంట తిరిగే ఆమె ఈ నాడు తనతో లేకపోడం అన్న లోటు, అతనికి భరించరానిదిగా ఉంది. "నాలుగు రోజుల్లో వస్తానన్న మనిషి మరీ ఇన్నాళ్ళ వరకూ రాకపోవడం ఏమిటి? - అన్న ప్రశ్న తరచూ అతని మనసులోకి వచ్చి అతన్ని కలవరపెడుతోంది.

యామిని ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలో గోపాలరావుగారితోపాటుగా తానూ ఆమెకు పని నేర్పించిన వెంకట్రావుగారు కూడా, ఆమె గుణగణాలని మెచ్చుకుని, ఆమె మీద పుత్రికా వాత్సల్యం పెంచుకున్నాడేమో, ఆయన కూడా యామిని రాకకోసం ఎదురుచూస్తూ, ప్రతి నాలుగురోజులకూ ఒకసారైనా, అమ్మాయి కబురు ఏమైనా తెలిసిందా - అని అమరేంద్రని అడుగుతూనే ఉన్నాడు.

"నే నామెకు సెలవిచ్చింది నాల్గురోజులే కదా! ఒక్క నాలుగురోజులకని వెళ్ళి, ఇన్నాళ్ళు రాకపోడమేమిటీ! పోనీ ఒక ఉత్తరమైనా రాయకూడదా" అనుకున్నాడు అమరేంద్ర. యామిని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పోస్టుచేసిన ఉత్తరం చివరకి అతనికి చేరనే లేదు. మధ్యదారిలో ఎక్కడో మటుమాయమైపోయింది! ఆమెపై తనకి వచ్చిన కోపాన్ని అతడు ఎప్పుడో మరచిపోయాడు. ఆమె చెంతలేని వెలితిని మాత్రం ప్రతిక్షణం అనుభవిస్తూ, ఆమె రాక కోసం "స్వాతి చినుకులకోసమై ఎదురుచూసే ముత్యపుచిప్పలా", ఎదురుతెన్నులు చూస్తున్నాడు అమరేంద్ర . అకస్మాత్తుగా ఒకరోజు అతనికి, ఆమె ఏదైనా కష్టంలో చిక్కుకుని రాలేకపోయిందేమో నన్న ఆలోచన వచ్చిఒళ్ళు ఝల్లుమంది. వెంటనే అతని మనసంతా అలజడితో నిండిపోయింది.

మలైక్కాడు గెష్టు హౌస్ లో ఆమెతో కలిసి సరదాగా గడిపిన రోజులు అతనికి తలపుకి వచ్చాయి. ఇద్దరూ వెళ్ళి ఖెడ్డా చూడడం, జామకాయలు కోసుకు తినడం, కింగుకోబ్రాల ఫైటు, అపురూపమైన చందనపు చెట్లను, దగ్గరగా వెళ్లి, కళ్ళారా చూడడం, కొండకాలువ జోరు, ఆమెను తానూ కాపాడడం, నెమిళ్ళ నృత్యం .... ఇలా అన్నీ వరసగా కళ్ళకు కట్టాయి! చివరి రోజుదాకా అక్కడ చక్కగా గడిచిపోయింది. కాని, చివరలో ఆ ఒక్క అపశృతి రాకుండా ఉంటే ఎంత బాగుండేది - అనుకున్నాడు అమరేంద్ర, తన డయిరీలో పదిలంగా ఉన్న యామిని ఫొటో తీసి చూస్తూ.

"నేను ఆమెను ఆ షికారీలకు నా భార్యగా పరిచయం చెయ్యడం తప్పే, కాదనను. కాని అప్పుడు, వాళ్ళ బారినుండి తప్పింఛికుని క్షేమంగా బయటపడడానికి నాకు మరో దారేదీ తోచలేదు మరి! దానికి ఇప్పుడు ఎన్నిసార్లు "సారీ" చెప్పడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అంతే కాదు, అప్పుడన్న ఆమాటను నిజం చెయ్యా లన్నది నా కోరిక! కాని ఆ విషయం ఆమెకు చెప్పే అవకాశం నాకు ఇంతవరకూ రానే లేదు. ఎప్పుడు చెప్పాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది, ఎందుకనో! యామిని ఇప్పుడు ఎలావుందో! ఆమెకు మళ్ళీ ఇక్కడకు వచ్చే ఉద్దేశం అసలు ఉందో లేదో! తనకు రావాలనిపించకపోతే కనీసం రాజీనామా పత్రమైనా పంపాలి కదా? అదీ లేదంటే ఆమెకు ఏమయ్యిందో, ఏమో! అయినా ఎందుకీ సందిగ్ధం , ఒకసారి రాజును పంపి, ఏం జరిగిందో కనుక్కు రమ్మంటే సరిపోదా ఏమిటి" అనుకున్నాడు అమరేంద్ర.

రేపే రాజుని యామినీ వాళ్ళ ఊరుపోయి, అక్కడి సంగతేమిటో కనుక్కు రమ్మని చెప్పి ఆ వూరు పంపించాలి - అనుకున్నాడు అమర్ . కాని అంతలోనే అతనికి మరో ఆలోచన వచ్చింది. కాని ఎన్నో ఊహాపోహల తరువాత, రాజుని పంపినకంటే తనే ఆ ఊరు వెళ్ళడమే అన్ని విధాలా బాగుంటుంది - అన్న నిశ్చయానికి వచ్చి మనసు తెలిక చేసుకున్నాడు.

అతని హృదయాన్ని ఆక్రమించి ఉన్నవి ఆమె స్మృతులే, కళ్ళఎదుట మెదులుతున్నది ఆమె రూపమే! "యామినీ! నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నేను ఇంక ఏ కుశ్శంకల్నీ పెట్టుకోను . ఈసారి నిన్ను కలుసుకున్నప్పుడు తప్పక నీకు నా మనసు విప్పి చెపుతా!. ఐ లవ్ యు, యామినీ! ఐ లవ్ యూ మై డార్లింగ్! త్వరలోనే మనం పెళ్ళిచేసుకుందాం. ఎట్ ఎనీ కాష్ట్, నేను, ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను ఒదులుకోలేను. ఈ వియోగం భరించలేకపోతున్నాను " అనుకున్నాడు మనసులో.

ఆ మరునాడే అతడు, ఆఫీసు వెంకట్రావుగారికి అప్పగించి, కారు తీసుకుని బయలుదేరాదు.

* * *

గుమ్మంలో కారు అగిన చప్పుడు విని, తలతిప్పి చూసిన కాపలా పోలీసు, కారులోంచి దిగుతున్న యువకుడివైపు ఆశ్చర్యంగా చూశాడు.

బుజాన తుపాకితో ఉన్న కాపలా పోలీసు వైపు అంతకంటే ఆశ్చర్యంగా చూశాడు ఆ యువకుడు! దగ్గరగా వచ్చి ఆత్రంగా, "కస్తూరి విశ్వనాధంగారి ఇల్లు ఇదేనా" అని అడిగాడు పొలీసుని.

"ఇదే సార్! కాని ఆయన ఇప్పుడు లేరు, చనిపోయి పదిహేను రోజులయ్యాయి."."

" అదా సంగతి! సారీ ..... ! ఐతే వారి అమ్మయి, యామిని ఎక్కడున్నారు?"

"మేడం ఇక్కడే, ఇంట్లోనే ఉన్నారు. కాని అందరికీ లోపలకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు." అన్నాడు పోలీసు.

"హైదరాబాదు నుండి వచ్చా, ఆమెతో నాకు ఒక ముఖమైన పని ఉంది. ఆమెకు నేను బాగా తెలిసిన వాడినే" అంటూ అతడు లోపలకు వెళ్ళబోయాడు. కాని కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీ అడ్డంగా పెట్టాడు......

"ఆగండి సార్! మిమ్మల్ని పర్మిషన్ లేకుండా లోపలకు వదిలితే నా కొస్తుంది ముప్పు!"

వెంటనే అమరేంద్ర జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అతనికి ఇచ్చాడు. అతడు తలుపు తట్టీ లోగానే, బయటి కలకలమేమిటో చూడాలని వకుళ కిటికీ తలుపు కొద్దిగా తెరుచి బయటకు తొంగిచూసింది. అంతే.....!

సంతోషంతో పెద్ద కేకపెట్టి, భడాలున తలుపులు తెరుచుకుని బయటికివచ్చిన వకుళ , "అన్నయ్యా" అంటూ ఆ ఆగంతకుణ్ణి కౌగిలించుకుని బోరున ఏడ్చేసింది.

అమరేంద్ర చెల్లెల్ని చేరదీసుకుని, తన జేబులోంచి చేరుమాలు తీసి, ఆమె కళ్ళు తుడుస్తూ "ఏడవకురా! వచ్చేశానుకదా" అన్నాడు ఆర్ద్రమైన స్వరంతో ఓదార్పుగా.

"ఇదిగో, వెంకటసామీ! ఈయన నాకు స్వంత అన్నయ్య! ఈయన్ని నిస్సంకోచంగా లోపలకు పంపొచ్చు" అంటూ అతనిని చెయ్యి పట్టుకుని యధేచ్చగా లోపలకు నడిపించుకుని తీసుకెళ్లిపోయింది వకుళ.

కళ్ళనిండా నీళ్ళు, ముఖమంతా నిండిన ఆనందంతో వింతగా కనిపిస్తున్న వకుళను ఆశ్చర్యంగా చూసి, పక్కకి తప్పుకు నిలబడ్డాడు పోలీసు వెంకటసామి.

"ఏమిటి వకుళా! నువ్విక్కడున్నావేమిటి? ఈ ఇంట్లోకి మారారా?"

"నువ్వు ముందు లోపలకు రా అన్నయ్యా ! నీకు తెలియవలసిన విశేషాలు చాలా ఉన్నాయి, ఇటు రా" అంటూ, అతని చెయ్యిపట్టుకుని తిన్నగా తల్లిదగ్గరకు నడిపించింది వకుళ.

తెల్లని విథవరాలి దుస్తుల్లో ఉన్న రాజేశ్వరి రూపం చూసి, తెల్లబోయాడు అమరేంద్ర. దు:ఖంతో అతని గుండె బరువెక్కింది. "అమ్మా! ఏమిటిది? నాన్న మనకింక లేరా" అని అడుగుతూ తల్లి కాళ్ళముందు వాలిపోయాడు. తనుకూడా నేలమీద చతికిలబడి కొడుకుని చేరదీసుకుని, తనూ ఏడ్చింది రాజేశ్వరి, వకుళ కూడా వాళ్ళతో కలిసింది.

"నాన్న నన్నీసరికి క్షమించి ఉంటారనుకున్నానేగాని ఇలా జరుగుతుందని ఎంతమాత్రమూ అనుకోలేదమ్మా! నే నెంత దురదృష్టవంతుణ్ణి" అంటూ ఏడ్చాడు అమర్.

"విశ్వనాధం అంకుల్ పుణ్యమాని, మీ నాన్న తన తప్పు తెలుసుకున్నారు. అంకుల్, కామాక్షి నిజస్వరూపాన్ని వివరించి చెప్పాక మీ నాన్న చాలా పశ్చాత్తాప పడ్డారు. నిన్ను క్షమించమని కోరుతూ ఉత్తరం కూడా రాశారు, కాని ఆ రాత్రికి రాత్రే మాయదారి "గుండెపోటు" వచ్చి ఆయన్ని పొట్టన పెట్టు........" ఇంక మాట్లాడలేక బోరున ఏడ్చింది రాజేశ్వరి.

" ఆ రోజు, క్షమించమని కోరుతూ నీకు ఉత్తరం రాసి, సంతకంచేసి ఇచ్చి మరీ విద్రపోయారు నాన్న ఆ రాత్రి. కాని అప్పుడు నిద్రపోయిన వ్యక్తి మళ్ళీ లేవలేదు" అంటూ తనూ ఏడ్చింది వకుళ.

అమర్, చెంపల వెంట కన్నీరు ధారలు కడుతూండగా తల్లిని అడిగాడు, "అమ్మా! ఈ విషయం చెప్పు, నాన్న నన్ను క్షమించారా?"

"లేదురా కన్నా! తన తప్పేమిటో తాను తెలుసుకున్నారు. తప్పు నీది కాదని తెలియగానే, నిరపరాధికి వెయ్యరాని శిక్ష వేశానే - అని కుమిలిపోయారు. ఏ తప్పూ చెయ్యని నీకు క్షమా భిక్షతో పనేమిటి! ఆయనే అడిగారురా నిన్ను, తనను క్షమించమని - ఉత్తరంలో అదే రాశారు !"

"ఛ్ఛ! నేను నాన్నను క్షమించడం ఏమిటమ్మా. ఒకొక్కప్పుడలా మన ప్రమేయం పెద్దగా లేకుండానే మనకి శిక్షలు పడతాయి. ఐనా వాటిని తప్పించుకోలేము, ప్రారబ్ధమని సరిపెట్టుకోడం తప్ప! అయిష్టంగానైనా వాటిని అనుభవించక తప్పదు కదా!"

"బాబూ! ఇన్నాళ్ళూ ఎక్కడున్నావురా? నీ కబురేమీ తెలియక నేనూ, వకుళా చాలా బెంగ పడుతున్నాము. ఇక మీ నాన్న సంగతి నీకూ తెలుసుగా, అంతా లోపలి స్వయంపాకం! లోలోన తెగ కుమిలిపోయి అనారోగ్యం తెచ్చుకున్నారేగాని, నీ పేరెత్తి మాటాడనియ్యలేదు. మే మిద్దరం నీ గురించి చాటున చెప్పుకుని బాధపడేవాళ్ళం. నువ్వెక్కడున్నా నిన్ను చల్లగా చూడమని ప్రతిరోజూ దేవుణ్ణి వేడుకునీవాళ్ళం!"

"మీ ప్రార్థనలే నన్నుకాపాడాయమ్మా! ఫరవాలేదు, ఒక స్నేహితుడు సాయంచేశాడు. చదువు పూర్తిచేశా. ఇప్పుడు వాళ్ళ కంపెనీలోనే C.E.O.గా పనిచేస్తూ హైదరాబాదులో ఉంటున్నా. ఇక్కడ మీరు బాగుండాలని నేనూ ఎప్పుడూ అనుకుంటూ ఉండీవాణ్ణి!"

"నువ్వు లేనిదే మా బ్రతుకులెలా బాగుంటాయి చెప్పు! ఇప్పుడు మీ నాన్న పోయారు కదా! ఆయనకి అంతిమ సంస్కారం జరపడానికి నువ్వు అందుబాటులో లేకుండా పోయావు" అంటూ అప్పటి విషయాలన్నీ ఏకరువుపెట్టింది రాజేశ్వరి. "విశ్వనాధం అంకుల్ కల్పించుకుని, కర్తవ్యం నీ మీద ఉంచి, తత్కాల కర్మలన్నీ తాను పూనుకుని, జరిపించి ఊరుకున్నారు. పెద్దకర్మ వాయిదా వేశారు, అది ఎప్పటికైనా నువ్వు వచ్చి చేస్తావన్న ఉద్దేశంతో. "

" మరి ఇప్పుడు మీ సంగతి ఏమిటి? ఎలా గడుస్తోంది?"

"మా సంగతి అడక్కు అన్నయ్యా! నాన్న పోగానే, నువ్వుకూడా లేవేమో ఒక్కసారిగా దిక్కులేని వాళ్ళమైపోయినట్లు అనిపించింది మాకు!"

అమరేంద్ర పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. "అమ్మా! నేను కూడా సంతకం పెడితేగాని బ్యాంకులో ఉన్న డబ్బు మీ చేతికి రాదు కదా! అలాంటప్పుడు, మీకు ఇల్లు ఎలా గడుస్తోంది?" ఆశ్చర్యంతో, బాధతో అడిగాడు అమరేంద్ర .

"అయ్యో! నీకిది తెలియదు కదూ! ఇది, మీ నాన్న చిన్ననాటి స్నేహితుడైన విశ్వనాధంగారి ఇల్లు! అన్నింటికీ వీళ్ళే మాకు దక్షతయ్యారు. నువ్వొచ్చి బాధ్యతలు తీసుకునీ వరకూ మమ్మల్ని ఇక్కడే, వాళ్ళతోనే ఉండిపొమ్మన్నారు. నాన్న పొయినదాది వాళ్లకు అతిధులుగా మేము వాళ్ళింట్లో, వాల్లతోపాటుగానే ఉంటున్నాము. వాళ్ళే పోషిస్తున్నారు మమ్మల్ని! వాళ్ళ అండదండలు ఉండబట్టే, మేమింకా ప్రాణాలతో ఈపాటిగా మిగిలి ఉన్నాము" అంది రాజేశ్వరి కొంగుతో కంటితడి ఒత్తుకుంటూ.

"నువ్వెక్కడున్నావో, నిన్నెలా కనుక్కోవాలో తెలియక, నిన్ను ఇంటికి రమ్మని కోరుతూ, మురళీ సాయంతో పేపర్లో ప్రకటన వేయించాము. నాన్నకోపం నీకు తెలుసుగా.... , నీ జ్ఞాపకాలేవీ ఇంట్లో ఉండకుండా చేశారు. నీ ఫొటో కోసం ఇల్లంతా వెతికి, పట్టుకోడం మాకు పెద్ద కష్టమైపోయింది" అంది వకుళ.

" పేపర్లో ప్రకటనవచ్చి వారం అయ్యింది, నువ్వు రావడానికి ఇంత ఆలస్యమయ్యిందేం బాబూ!" అడిగింది రాజేశ్వరి కొడుకుని.

"ఏ పేపర్లో పడిందిట ఆ ప్రకటన?" ఆశ్చర్యంతో అడిగాడు అమర్.

"ఇండియన్ ఎక్సుప్రెస్ లో వేయించాడు మురళీ! నువ్వది చూడలేదా?"

"నాకు "హిందూ" వస్తుంది. నేను ఎక్సుప్రెస్ చూడలేదు. ఆ పేపర్ ఏదీ, ఒకసారి చూపించు" అన్నాడు అమర్.

వకుళ పేపర్ కోసం వెళ్ళింది. అంతలో రమణమ్మ అక్కడకి వచ్చింది. అక్కడ అమర్ కనిపించగానే, ఎవరో చుట్టాలు వచ్చారనుకుని, అతనివైపు ఆశ్చర్యoగా పరికించి చూసి, "చుట్టాలా" అని అడిగింది రాజేశ్వరిని.

"మాకు చుట్టాలు లేరని నీకు తెలుసు కదా అక్కయ్యా ! వీడు మా అబ్బాయి! ఇన్నాళ్ళకు ఆ భగవంతుడు మమ్మల్ని ఈ విధంగా కరుణించాడు, వీడు వచ్చేశాడు " అంది రాజేశ్వరి..

అమర్ వైపు ఆనందంగా చూస్తూ, "ఇక నీ కష్టాలు ఒకవిధంగా గడిచిపోయాయి నువ్వు ఇంక గట్టెక్కినట్లే రాజమ్మా! నీ కొడుకు దొరబాబులా ఉన్నాడు! ఇక మీకేమీ ఫరవాలేదు" అంది రమణమ్మ. ఆపై అమర్ వైపు తిరిగి, "నువ్వొచ్చేశావు, అదిచాలు! బాగున్నావా బాబూ" అoటూ పలకరించి కుశలమడిగింది. .

" మన విశ్వనాధం అంకుల్ కి ఈమె స్వయానా చెల్లెలు" అంటూ ఆమెను కొడుక్కి పరిచయం చేసింది రాజేశ్వరి.
"బాగున్నానండి" అంటూ అమరేంద్ర ఆమెకు నమస్కరించాడు.

"చూడు రాజమ్మా! బాబు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు కదా, కాస్త కాఫీ ఐనా ఇచ్చావా " అని అడిగింది రమణమ్మ.

అప్పుడు గుర్తొచ్చింది రాజేశ్వరికి, తను కొడుక్కి, కాఫీ సంగతి ఆ దేముడెరుగు... , కనీసం పచ్చి మంచినీళ్ళైనా ఇచ్చిన పాపాన పో లేదన్న సంగతి! వెంటనే రాజేశ్వరి కంగారుపడుతూ లేచి వెళ్ళింది రమణమ్మవెంట, వంట గదిలోకి.

వకుళ పేపర్ తెచ్చి అన్నగారి చేతిలో ఉంచింది. ప్రకటన ఉన్న పేజీ పైకితీసి చూసి, " చాలా గొప్పగా ఉంది ఈ ప్రకటన" అంటూ చిన్నగా నవ్వాడు అమర్. "ఈ ఫొటో చూసి, అసలు నన్ను ఎవరైనా గుర్తుపట్ట గలరంటావా ఇప్పుడు? నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు హాల్ టిక్కెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇది! ఆ తరవాత నేను ఇంజనీరింగ్ చేశా. ఆపైన M.B.A! అదికాక రెండేళ్ళకు పైన ఉద్యోగం ..... ! ఎన్నేళ్ళు గడిచి పోయాయో లెక్కెట్టుకో! వయసుతో వచ్చిన మార్పు ఎంతో ఉంటుంది కదా!. ఈ ఫోటో చూసి, ఇప్పుడు నన్ను గుర్తుపట్టడం అన్నది అసంభవం! అనవసరంగా మీరు కష్టపడ్డారు. సర్లే! ఇప్పుడింక దాని సంగతి ఎందుకు, నేను వచ్చాను కదా" అంటూ పేపర్ మడిచి పక్కన పెట్టేశాడు అమర్.. "ఔన్లే, ఇంక దాని సంగతి పట్టించుకో నక్కరలేదు. కాని, అప్పట్లో అదే మాకున్న ఒకేవొక ఏడుగడ అయ్యింది. అది చూసి నువ్వు వస్తావన్న ఆశతోనే అమ్మా నేనూ ప్రాణాలతో మిగిలి ఉన్నాము" అంటూ భావావేశంతో అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుంది వకుళ.

చెల్లెలివైపు ఆర్ద్రంగా చూస్తూ, " వకుళా! నాన్నను తల్చుకుంటే, ఆ రోజు ఆయన కడసారం నావైపు కోపంగా చూసిన చూపులే గుర్తువచ్చి నా మనసంతా వికలమైపోతోంది. ఏదో ఒక రోజు మామధ్యనున్న అపార్ధాలు తొలగి, నాన్నా నేనూ కలుసుకుంటామన్న ఆశతోనే గడిపాను ఇన్నాళ్ళూ! ఇలా జరుగుతుందని నేను కలలోకూడా ఊహించలేదు. ఇప్పుడింక నా ఆశ తీరేది కాదన్న నిజాన్ని నే నసలు భరించలేకపోతున్నాను. వాస్తవం నా గుండెలు కోసేస్తోంది " అన్నాడు అమరేంద్ర దు:ఖంతో.

"చెయ్యని నేరానికి నీకు శిక్ష పడి, మన కర్మమిలా కాలిందిగాని, ఆ రాక్షసికి మాత్రం చక్కగా పెళ్ళైపోయింది, తెలుసా!"

"భేష్! ఐతే పీడ విరగడైపోయిందన్నమాట! విచారించకు వకుళా! కాలం ఎప్పుడూ ఒకేలాగ ఉండిపోదు, మనకీ వస్తాయిలే మంచి రోజులు. కాని నాన్నే మనకింక అందనంత దూరం వెళ్ళిపోయారన్నదే నాకు భరించరాని బాధగా ఉంది! నాన్నదేదైనా ఒక మంచి ఫొటో ఉంటే నాకు చూపించు" అని అడిగాడు అమర్.

వకుళ వెంటనే లేచివెళ్ళి ఒక ఫొటో ఆల్బం తీసుకువచ్చి అన్నగారికి ఇచ్చింది.. అమర్ దాన్ని తెరిచి చూశాడు తొలిపేజీలో ఉంది ముగ్గురు మిత్రులకూ కలిపి తీసిన ఫొటో. తోటివారిచేత మురిపెంగా , "త్రీ మస్కెటీర్శు" అని పిలిపించుకున్న ప్రాణస్నేహితులు ముగ్గురూ నవ్వుముఖాలతో కలిసికట్టుగా నిలబడి తీయించుకున్న ఫొటో అది! కన్నార్పకుందా ఆ ఫొటోని చూస్తూ ఉందిపోయాడు అమర్. వకుళ అన్నగారికి ఎక్సుప్లైన్ చేసింది ......

"చూడు అన్నయ్యా! వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో! ముగ్గురూ ఒకచోట కలిస్తేచాలు, చిన్ననాటి విషయాలు చెప్పుకుని, చిన్న పిల్లల్లా ముగ్గురూ కలిసి కేరింతలు కొట్టే వారు ! నాన్న మనకి తన చిన్ననాటి స్నేహితులను గురించి కథలు కథలుగా చెప్పీవారు, గుర్తుందా? వాళ్ళు ముగ్గురూ అనుకోకుందా ఈ వయసులో మళ్ళీఇక్కడ - ఈ ఊళ్ళో కలుసుకున్నారు. నాన్నకు కుడిపక్క నున్నది విశ్వనాధం అంకుల్, ఎడమపక్కన గురుమూర్తి అంకుల్ ఉన్నారు. నాన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నారో! వీళ్ళు ముగ్గురూ ఒకచోట చేరిన రోజున మా కందరికీ కూడా పండుగలా ఉండేది. బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునీవాళ్ళం అందరం."

పేజీ తిప్పింది వకుళ. ఆ పేజీలో రామేశంగారి ఫొటో, నవ్వుతూ అందర్నీ చూసున్నట్లుగా ఉన్నది ఉంది. అమరేంద్ర ఆ ఆల్బంని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని కన్నీరు కార్చాడు. అతని కన్నీటి చినుకులు ఆల్బం మీద పడ్డాయి. వాటిని తన కొంగుతో శుభ్రంగా ఒత్తింది వకుళ., ఆల్బం పాడవ్వకూడదని.

"నేను నిర్భాగ్యుణ్ణి వకుళా! నాన్న నన్ను ఇంటికి రమ్మని పిలవాలని ఎదురుచూశానేకాని, నాకు నేనుగా రావాలన్న ఆలోచనే రాలేదు నాకు! చివరకెలా జరిగిందో చూడు" అంటూ వాపోయాడు అమర్.

అన్నా చెల్లెళ్ళిద్దరూ తండ్రి ఫొటోనే చూస్తూ కొంతసేపు మౌనంగా దు:ఖిస్తూ ఉందిపోయారు. కొంచెం తేరుకుని పేజీ తిరగేసింది వకుళ. మరో ఫొటో తెరుచుకుంది.

"ఎవరీ పాప, ఇంత ముద్దుగాఉంది" అని ఆశ్చర్యంగా అడిగాడు అమరేంద్ర.

" ఈ పాప మినీ! మురళీ కూతురు."

"మినీయా! అదేం పేరు?"

"పూర్తిపేరు యామినీ పూర్ణతిలక. సాంప్రదాయం ప్రకారం పిల్లకు నాన్నమ్మ పేరు పెట్టవలసి ఉంది. కాని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళీ భార్య మాధవిని విశ్వనాధం అంకుల్ కూతురు యామిని, తన రక్తం ఇచ్చి కాపాడి, ఈ పిల్ల పుట్టుకకు కారణమయ్యింది. ఆ విశ్వాసంతో మాధవి పుట్టిన బిడ్డకి తప్పకుండా యామిని పేరు పెట్టాలని పట్టుపట్టింది. అందుకే, యామిని పేరుతోపాటుగా తన తల్లి పేరు కూడా కలిపి మురళీ పాపకు యామినీ పూర్ణతిలక అని పెట్టాడు పేరు! అంతపేరు పిలవలేక సింపుల్ గా "మినీ" అంటారు. చాలా తెలివైనది. అప్పుడే బడికి వెళ్లి చక్కగా చదువుకుంటోంది." అంటూ ఆ పేజీ తిప్పేసింది వకుళ.

ఈ పేజీలో రెండు ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసి తెల్లబోయాడు అమర్. తన ఊహించినది ఎంత తప్పో అతనికి అర్థమయ్యింది. ఒక ఫొటోలో వకుళ మురళీ చేతికి రాఖీ కడుతూంటే, రెండవ దానిలో యామిని మురళీకి రాఖీ కడుతోంది. అన్నగారు వాటిని దీక్షగా చూస్తూండడం చూసి వకుళ వివరించి చెప్పసాగింది ....

"ఇవి తీసి, సుమారుగా మూడేళ్ళయ్యి ఉంటుంది! అది మేము ఈ ఇంటిలోకి వచ్చిన కొత్తరోజులు. మాకు వీళ్ళతో పరిచయం అవ్వగానే మురళీ వాళ్ళతో కూడా స్నేహం ఏర్పడింది. నువ్వెళ్ళిపోయాక నాకు శ్రావణపూర్ణిమనాడు రాఖీ ఎవరికి కట్టలో తెలియ లేదు. నువ్వు దగ్గర లేవని బాధగా ఉండేది. మురళీ పరిచయం అయ్యాక నిన్ను తలుచుకుని రాఖీ పండుగనాడు అతనిచేతికి రాఖీకట్టి మనసు సరిపెట్టుకునీ ప్రయత్నం చేశా. నన్ను చూసి యామిని కూడా అతనికి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకుంది. నాన్న సరదాగా మాకు ఫొటోలు తీశారు. అదిమొదలు ప్రతి ఏటా అతనికే, నిన్నుతలుసుకుని రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకుంటున్నా."

మానవలోకంలో ప్రేమ భావానికున్న వివిధ రూపాల్లో, తల్లిప్రేమ తరువాత ఎన్నదగిన ఉత్కృష్టమైన ప్రేమ సోదరప్రేమ! దీనిలో త్యాగమేగాని స్వార్ధానికి రవంత కూడా తావులేదు. సోదరీ సోదరులు పరస్పర శ్రేయోభిలాషులు కావడమే దానికి నిదర్శనం. కేవలం పరిచయస్థులైన ఇద్దరు యువతీ యువకుల్ని, ఒకరి మంచికోసం మరొకరు ఆరాటపడే సోదరీసోదరులుగా మార్చెడి పవిత్రబంధమే ఈ రక్షాబంధం! అందరికీ మన దేశపు సాంప్రదాయాన్ని చెప్పకనే చెప్పే అద్భుత ప్రక్రియ ఈ అన్నాచెల్లెలి బంధం! ఆలోచనల నుండి తెప్పెరిల్లి తలెత్తి చెల్లెలివైపు చూసి, "యామిని ఎక్కడ" అని అడిగాడు అమర్. కాని పేజీ తిప్పే సంరంభంలో ఉన్న వకుళకు అతని మాట వినిపించ లేదు.ఆమె నుండి అతనికి ఏ జవాబూ రాలేదు .

ఆ పేజీలో వకుళ తల్లితండ్రుల బుజాలమీద చేతులు వేసి నవ్వుతూ నిలబడి ఉన్నట్లున్న ఫోటో ఉంది. తలతిప్పి చూసిన వకుళకు, అన్నగారి ముఖంలో వేగంగా రంగులు మారిపోవడం తెలిసింది.

వెంటనే అంది ఆమె, "ఈ ఫొటోలో నువ్వు లేవని బాధపడుతున్నావా ఏమిటి అన్నయ్యా! వద్దు! ఈ ఫోటోలో, ఒకచోట కాదు, సరిగా చూస్తే నీకే తెలుస్తుంది, నువ్వు మూడుచోట్ల కనిపిస్తావు, తెలుసా! మా ముగ్గురి హృదయాల్లోనూ పీఠమేసుకుని ఉన్నావు నువ్వు! నీ కొచ్చిన ఆలోచన మాకూ వచ్చిందిలే. ఆ రోజంతా అమ్మా, నేనూ పదేపదే ఆ మాటే అనుకున్నాము. నాన్నది మూగ వేదన! యామిని తనకి కావా లంటూ పట్టుపట్టి మరీ తీసింది ఈ ఫొటో. లేకపోతే మే మసలు ఫొటో దిగాలని ఏ మాత్రమూ అనుకునేవాళ్ళం కాదు."

"సర్లే! ఇంతకీ యామిని ఎక్కడ? కనిపించదేం? నన్నొకసారి ఆమె దగ్గరకు తీసుకెళ్ళగలవా?" చెల్లెలి చెయ్యి పట్టుకుని మరీ అడిగాడు అమరేంద్ర.

" ఉండు, ముందుగా ఆమె అనుమతి తీసుకుందాము. ఇప్పుడు ఆమె మనస్థితి ఏమీ బాగా లేదు. ఔనులే! ఒకటా, రెండా ..... ! మరీ అన్ని కష్టాలు కసిపట్టి ఒక్కసారిగా ఒకేమనిషిమీద విరుచుకుని పడ్డప్పుడు ఎవరికైనా మనోనిబ్బరం ఎలా ఉంటుంది, నువ్వే చెప్పు?" బాధగా నిట్టూర్చిం ది వకుళ .

" అదేమిటి! అసలు ఏం జరిగింది? ఏమిటా కష్టాలు? వివరంగా చెప్పు" అని అడిగాడు అమర్.

"యామిని చందనపు అడవికి ఎస్కర్షన్ కి వెళ్ళింది. అక్కడి నుండి ఆమె ఇంటికి తిరిగి వచ్చిన మరునాడే నాన్న మనల్ని విడిచి వెళ్ళిపోయారు. యామిని నాకు తోడుగా ఉండడం కోసమని తన సెలవు మరో పదిహేను రోజులు పొడిగించమని కోరుతూ ఆఫీసుకి ఉత్తరం పంపింది. కాని దానికి ఏ జవాబూ రాలేదు. ఆమె ఉద్యోగం ఉందా - ఊడిందా అన్న సందిగ్ధంలో పడింది " అంటూ మొదలుపెట్టి, తరువాత ఆమెకు సంభవించిన కష్టాల్ని, ఆమె ప్రస్తుత పరిస్థితిని గురించి ఎంతవరకూ చెప్పడానికి వీలవుతుందో అంతవరకూ జరిగినదంతా ఏకరువుపెట్టింది వకుళ .........

" అలా యామిని నాకోసం ఉండిపోకుండా ఉంటే ఆమె ఉద్యోగం పొయీది కాదు కదా పాపం! తరవాత హైదరాబాదు బయలుదేరుతూ, " ఇంతకీ నా ఉద్యోగం ఉందో, ఊడిందో " అనుకుంది ఆమె.! అక్కడకి వెళ్ళాక ఏంజరిగిందో ఏమో గాని, ఆ రోజుకారోజే రిజిష్టర్ మేరేజ్ చేసుకుని, సాయంకాలానికల్లా భర్తతో కలిసి తిరిగి వచ్చింది.

అది షాక్ లా తగిలి విశ్వనాధం అంకుల్ కుప్పకూలిపోయారు. తరవాత ఒక్క మూడురోజులు మాత్రం కోమాలో ఉండి, ప్రాణాలు విదిచిపెట్టేశారు. ఊరంతా యామిని తిట్టిపోశారు.ఆమె కేవలం స్వార్ధబుద్ధితో, డబ్బుకి ఆశపడి ఈ పెళ్ళి చేసుకుంది, తండ్రిని పొట్టన పెట్టుకుంది - అంటూ లోకం ఆమెను దుమ్మెత్తి పోసింది. ఒక్క మురళీ భార్యమాత్రం అంది, " యామిని అటువంటిది కాదు. ఆమె కసలు స్వార్ధం తెలియదు. సాహసించి ఇలా చేసిందంటే దీని వెనుక కూడా ఏదో పరమార్ధమే ఉండి ఉంటుంది" అని. నాకూ అదే అనిపిస్తోంది. బహుశ: ఆమె ఉద్యోగం పోయి ఉంటుంది, తనమీద రెండు కుటుంబాల భారం ఉంది కదా! అలాంటప్పుడు ఉద్యోగం పోయిందంటే ఎవరికయినా బేజారుగానే ఉంటుంది మరి! ఆ కంగారులో ఆమె ఆసరా కోసమని తొందరపడి ఈ పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇదే నిజమని నా విశ్వాసం! యామిని ఉద్యోగం పోతే ...... ".

ఆమె మాటను ఖండించాడు అమర్. "లేదు, ఉద్యోగం పోలేదు. ఇప్పటికీ ఇంకా అది క్షేమంగానే ఉంది" అన్నాడు .
తెల్లబోయి అతనివైపు బేలగా చూసి, "ఆ సంగతి నువ్వెలా చెప్పగలవు"అని అడిగింది వకుళ "నేనే ఆమెకు బాసుని! ఆమె నేను ఒకే కంపనీకి పనిచేస్తున్నాము. యామిని నా P.A.!"

వకుళ హిస్టీరియా వచ్చినట్లు వెర్రిగా నవ్వడం మొదలుపెట్టింది . దిగ్భ్రాంతితో చెల్లెల్ని చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర. కొంతసేపు అలా నవ్వి, బలవంతంగా నవ్వు అపుకుని , " ఐతే యామిని కొత్తబాసు, అదే - ఆ నస్మరంతిగాడివి నువ్వేనన్నమాట" అంది. అంతలోనే ఆమె మూడ్ మారిపోవడంతో భోరున ఏడవసాగింది. ఏమి చెయ్యడానికీ తోచక అమరేంద్ర చేష్టలుదక్కి చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఇంతలోనే ఎందుకంత హిష్టిరికల్ గా మారిందో అతనికి ఏ మాత్రం అర్థమవ్వలేదు.

కొద్దిసేపు ఏడిచి, అంతలోనే తన్నుతాను సంబాళించుకుని, "చూడు ఈ దుర్దశ! అంత దగ్గరలో నిన్ను ఉంచుకునీ కూడా మేము నిన్ను కనిపెట్టలేకపోయామంటే ఇంకేమనుకోవాలిట! "అమరేంద్ర" అన్న పేరు విని కూడా, పేరుని పోలిన పేర్లు ఎన్నో ఉంటాయి కదా - అనుకున్నామేగాని ఒకసారి పరీక్షించి చూడాలని అనుకోలేదు, చూడు! ఒకసారి మాత్రం నాన్నా, నేనూ హైదరాబాదు వచ్చినప్పుడు, యామిని కొత్త బాసుని చూడాలనిపించి, నాన్న మీ ఆఫీసుకి వచ్చారు. యామినీ కోసం మీ ఆఫీసు తాలూకు "ఇంటీరియర్ డెకరేషన్" కి ప్లాన్లు వేస్తూ నేనూ అప్పుడు అక్కడే ఉన్నా. కాని ఏమిలాభం! సరిగా అప్పుడే నువ్వు ఏదో పనిమీద మీ హెడ్డాఫీసుకి వెళ్ళావు - అన్నారు! ఎలా జరిగిందో చూడు, అంతా విధి" అంది వకుళ, కన్నీరు పైట కొంగుతో ఒత్తి తుడుచుకుంటూ.

గాఢంగా నిట్టూర్చాడు అమర్. "సో సారీ! ఇంక ఆ విషయాలు మనం మాట్లాడుకో వద్దు, ఆవేదనతో నా గుండెలు పగిలిపోతా యనిపిస్తోంది. మన వంతు కొచ్చిన దాన్ని ఎలాగైనా మనం అనుభవించక తప్పదు. పద, వెళ్ళి యామినిని చూసివద్దాం" అంటూ లేచాడు అమరేంద్ర . వకుళ కూడా లేచింది .

"ముందిది చెప్పు అన్నయ్యా! నువ్వు యామినిని మొదట్లో ఎందుకంత టీజ్ చేసీవాడివి? నీ కామె "టీజింగ్ మాస్టర్" అని పేరు పెట్టింది, తెలుసా! యామిని చాలా మంచి పిల్ల! ఎందుకు అలా చేశావు అన్నయ్యా!"

"ఏమోనే! అప్పట్లో, నా మనసేమిటో నాకే తెలిసీది కాదు. నిన్ను చూసి, ఆడవాళ్ళందరూ మంచివాళ్ళనుకుని, కామాక్షి చేతిలో దెబ్బతిన్నా! మళ్ళీ కామాక్షిని తల్చుకుని ఆడవాళ్ళందరూ దుర్మార్గ వర్తను లనుకుని మళ్ళీ బోల్తాపడ్డా! కాని త్వరలోనే యామినిని అర్థంచేసుకుని, నేనే నా ప్రవర్తనని సరిదిద్దుకున్నానులే. యామిని ఎప్పుడూ ఉద్యోగ ధర్మాన్ని తప్పించి, ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. దాంతో ఆమెకూ నాకూ మధ్య చెప్పుకోదగినంతగా స్నేహం లాంటిది ఏమీ ఏర్పడలేదు. నేను బాస్ ని! ఆమె, "య్యెస్ బాస్" అంతే! అదే మా రిలేషన్ షిప్! ఆఫీస్ విషయాలు తప్ప, పర్సనల్ విషయాలకు వస్తే ఆమె ఎప్పుడూ పెడసరంగానే ఉండేది. నేనూ పెద్దగా పట్టించుకో లేదు. ఐనా ఇప్పుడు ఆమెకు ఉద్యోగంతో పనేముంది, పెళ్లైపోయిందిగా!"

"పెళ్ళి! హ్హు" ఈసడించింది వకుళ . ఆ తరవాత యామిని పెళ్ళి తాలూకు వైభోగమంతా వివరించి అన్నగారికి, ఎంతవరకూ చెప్పొచ్చో అంతవరకూ విప్పి చెప్పింది. ఆ పైన అంది," చూడు, అన్నయ్యా! ఆమెకు పెళ్ళి జరిగిందన్న మాటేగాని, అంకుల్ అకస్మాత్తుగా చనిపోవడంవల్ల, వాళ్ళిద్దరూ కొద్దిసేపైనా కలిసి ఒకచోట ఉన్నది లేదు. యామిని ఇక్కడ తండ్రి పోయిన దు:ఖంలో మునిగి ఉంటే, ఆమె కర్మానికి ఆమెను వదలిపెట్టి అతడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంతలో, అంకుల్ పోయిన ఐదవ రోజు రాత్రి, ఇంట్లోనే అతన్ని ఎవరో హత్యచేశారు. అది అక్కడితో అయ్యిపోలేదు, ఆ హత్యా నేరాన్ని యామినిమీద మోపారు. చూడు, ఒక్కసారిగా ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో ఆమె మీద!"

అంతలో, "వకుళా! ఒకసారి ఇటు వచ్చి వెళ్ళవే" అంటూ వంటగదిలోంచి కూతుర్ని కేకేసి పిలిచింది రాజేశ్వరి.

"అన్నయ్యా! ఉండు, తినడానికి ఏమైనా తెస్తా. నువ్వెప్పుడో హైదరాబాదులో చేసిన భోజనం ...... " అంటూ తల్లి దగ్గరకు పరుగెత్తింది వకుళ.

అమరేంద్రకి ఈ జాప్యం విసుకు తెప్పించింది. "యామిని ఈ ఇంట్లోనే కదా ఉండేది! నేను ఆపాటి వెతికి ఆమెను కనుక్కోలేనా ఏమిటి! ఇలా జాగు చెయ్యడంలో అర్థం లేదు" అనుకుంటూ ఆ పని మీద బయలు దేరాడు.

* * *

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)