(గత సంచిక తరువాయి)
కం. ఈ విధి తర్జనభర్జన
లావేశముతోడ చేసి అభినీతముతో
భావంబున నిన్నాళ్ళుగ -
నే వచ్చితినొక ముగింపు నిర్ణయమునకున్.
కం. ఎలుగెత్తి పలికి విషయం
బుల నన్నియు మొదటినుండి ముగిసెడువరకున్
తెలుగు జనానీకమునకు
పొలుపారగ చాట దలతు పొందికతోడన్.
తే.గీ. అటుల చాటి నే నిర్దోషి ననుచు నంద
ఱనుకొను నటుల ప్రయత్న మొకటి
ఎంచి చేయంగ తలతును మించు వేడ్క -
కాని ఆ అవకాశమే లేని కతన.
కం. జరిగిన దంతను నిచ్చట
వరుసగ రచియించితి మఱువని ఒక కథగా -
సరసత పఠించి తెలుపుం
డెఱిగిన తగవరులు దోషు లెవరీ గాథన్.
తే.గీ. నేర్పుతోడను మీ తీర్పు నిర్ణయించు
ముందు కథను మొదటినుండి ముగియువరకు
మరల నొక మాఱు చదువుడు నిరతి గొనుచు,
అచ్చటచ్చట దాగు సాక్ష్యముల కొఱకు.
ఉ. ఈ విషయమ్ములన్నియు సహేతుక చర్చ యొనర్చి, వీటిలో
నేవి నిజాలొ కల్ల్లలొ అహీన కుశాగ్ర మనీషులైన ఆం
ధ్రావని పౌరులార! బహుధా పరిశీలన జేసి చెప్పు డో
భావుకులార! ఈ తరిని పావను లెవ్వరొ, దోషులెవ్వరో!
కం. కథలో పాత్రలు, మారుతి
వ్యథతో వేలెత్తి చూపినట్టి వ్యవస్థల్,
పృథివిన్ సంఘద్రోహుల
పృథక్కరించి తెలుపిడిట వృజినాత్మకులన్.
కం. అన్నట్లు మీకు జ్ఞాపక
మున్నదొ లేదో నిశీధి నుద్రిక్తుండై
నన్నుగని మరుత్సుతుడా
పన్నుని పూజరిని బ్రోవ ’వాకట్ట’ మెనెన్.
కం. ఆనాటి నుండి నేనిక
నా నోరు తెరచి పలుకగ నాలిక కదుపం
గా నేరకుంటి - అందుల
కై నే వ్రాసితిని దీని కథగా నిచటన్.
ఆ.వె. ఆంజనేయమూర్తి ఆనతిచ్చిన యట్లు
ప్రగతి కడ్డు వచ్చు భ్రష్టజనుల
పట్టి తగిన శిక్ష పరగ విధించిన
నాడె గళము విప్పు వాడ తిరిగి.