కబుర్లు - సత్యమేవ జయతే
యూఎస్ఎలక్షణాలు!
- సత్యం మందపాటి

“ఏం బాబూ, ఎవరు మనకి తెలుగు నేర్పింది! ఏమిటా దుష్ట సమాసం... మన తెలుగు భాషని ఆ అప్రాత్యపు భాషతో కలిపావు. కామాలూ నామాలూ పెట్టే అలవాటు కూడా లేనట్టుంది...”

ఈ వ్యాసానికి మకుటం చదివితే, రావి కొండలరావుగారు ఖచ్చితంగా పైన చెప్పిన ఇరవైరెండు పదాలతో ఒకదాని తర్వాత ఇంకొక దానితో, ‘సైలెన్స్’ అంటూ నన్ను చితకకొడతారని నాకు తెలుసు.

మరేం చేయను? ఈ మకుటంలో మూడు మాటలు ఇరికించాలని నేను పడిన బాధ ఇది. అమెరికాలో అంటే యూ. ఎస్. ఏ.లో ఎలక్షన్లు జరగబోతున్నాయి కనుక అవి ఎలా వున్నాయో వాటి లక్షణాలు ఏమిటో లక్షణంగా మీకు చెబుదామని చేసే చిన్ని ప్రయత్నం అన్నమాట ఇది!

చూద్దాం.. ఆ ఎన్నికల ప్రచారం, ప్రజల మీద దాని ప్రభావం ఎలా వున్నాయో...

౦ ౦ ౦

ప్రతి నాలుగేళ్లకీ అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ వున్నవి రెండే రెండు పార్టీలు. ఒకటి డెమొక్రాటిక్, మరోది రిపబ్జికన్. లిబర్టేరియాన్ లాటి ప్రజారాజ్యం పార్టీ ఇంకోటి వుంది కానీ, ఆ పార్ట్టీ తరఫున ఎవరైనా ఒకాయన పొరపాటున నుంచుంటే, ఆయన భార్యాపిల్లలే ఆయనకీ ఓటు వేయరు! అమెరికా దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలో నించి బయటికి తీసి మళ్ళీ బ్రతికించిన అధ్యక్షుడు ఒబామా గారు, తన రెండు దఫాల అంటే ఎనిమిదేళ్ళ పదవిని వదలి వెళ్లి పోతున్నారు కనుక, రెండు పార్టీలలోనూ కొత్త వారు పోటీ చేస్తున్నారు. కొత్త వాళ్ళంటే అచ్చంగా కొత్తవాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే కొత్త ముఖంతో ముందుకి వస్తున్నారన్నమాట! అమెరికాలో ముందుగా ప్రైమరీ ఎన్నికల్లో ఒక్కొక్కటీ చొప్పున అన్ని రాష్ట్రాల్లోనూ గెలిస్తేనే అసలు ఎన్నికల దాకా వెళ్ళేది. అంటే ముందు రచ్చ గెలిస్తేనే, తర్వాత ఇంట గెలవటం.

వాళ్ళల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఇద్దరు ముగ్గురు పోటీ చేయలేక తప్పుకుంటే, ఇద్దరు మాత్రం నువ్వా నేనా అంటూ, ఈ వ్యాసం వ్రాస్తున్న మార్చి నెల మధ్య కాలం దాకా మిగిలారు. వారిలో ఒకరు హిల్లరీ క్లింటన్, ఇంకొకరు బర్నీ శాండర్స్. కొంతమంది తెలుగువారు ముచ్చటగా కొండమ్మగారు, ఇసుకపాటివారు అని అంటుంటారు. అదిక్కడ ముఖ్యం కాదు.

అలాగే రిపబ్లికన్ పార్టీలో పదిహేనుమంది రంగంలోకి దిగారు. వారిలో కొంతమందికి తలా తోకా లేదు. అంటే తోకలు ఎవరికీ లేవు, తలలు మాత్రం కొంతమందికి లేవు. అలాటి వారిని ప్రజలు ఇట్టే గుర్తుపట్టేసి, ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించేశారు. మిగిలిన బుర్రలున్న కొంతమందిని ఇంటికి వెళ్లి, వచ్చే ఎన్నికల దాకా ఎన్నో కలలు కంటూ వుండమని ఈ ఎన్నికలలో రోడ్డెక్కించేశారు. చివరికి మూడున్నర మంది మిగిలారు. వాళ్లందరూ, నువ్వా నేనా అని పోటీ చేయకుండా, నువ్వు కాదు నేనే అని పోటీ చేస్తున్నారు. వాళ్ళల్లో ఒకాయన పేకాటలో తురుఫు ముక్కలా ఎంతో ప్రముఖంగా వుంటే, మిగతా రెండున్నర మందీ, ఇవాళా రేపా అంటున్నారు! ఇక్కడ గమ్మత్తేమిటంటే, తురుఫు ముక్కగారు ప్రైమరీ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ముందుకి దూసుకుపోతున్నా, ఆయన్ని రిపబ్లికన్ పార్టీ అధినేతలు పులుసులో ముక్కగా తీసి వేస్తున్నారు. తురుఫు ముక్క మాత్రం న్యూటన్ గారి మూడవ సూత్రం ప్రకారం, ఎంత వెనక్కి తోస్తే అంత ముందుకి వెడుతున్నాడు. రిపబ్లికన్ పార్టీ అధినేతలు మాత్రం ఎవరి బట్టతలలు, బుట్ట తలలు వాళ్ళే గోక్కుంటూ, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.

అసలు ఎంతో ముందు వున్నవాడిని, మన తెలుగువాళ్ళని తెలుగువాళ్ళే తోక్కేస్తున్నట్టు వెనక్కి తోయాల్సిన అవసరం ఏముంది? ఎందుకని?

దానికి ఒకటి కాదు, లక్ష కారణాలున్నాయి. ఇక్కడ లక్షోత్తరానికి సమయం లేదు కనుక సరదాగా కొన్ని మాత్రం చెప్పుకుందాం. సరదాగా అన్నాను కాబట్టి, ఇవి కల్పనలు కాదు. అన్నీ నిజంగా ఆయన నోట వచ్చిన మాటలే! కాలిపోయిన నల్లటి ముత్యాల మూటలే! సరదాగా అని ఎందుకన్నాను అంటే, తురుఫు ముక్కగారు, ఇక్కడ జరుగుతున్న డిబేట్లలో కానీ, టీవీలోనూ, బయట మాట్లాడే చోట్లా ఒక పెద్ద జోకర్ అయిపోయాడు. రిపబ్లికన్ అధిష్టాన వర్గం మాత్రం మధ్యే మధ్యే సమయం దొరికినప్పుడల్లా, ‘అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే, తురుఫుగారి మాటలకూ అర్ధాలు వేరులే.. అర్ధాలే వేరులే.. అర్ధాలు వేరులే’ అని పాటపాడే ధైర్యం లేక, వాళ్ళల్లో వాళ్ళే ‘పైకి’ అనుకుంటున్నారు.

ఇక్కడ అమెరికన్ టీవీలో ప్రతిరోజూ రాత్రి పూట ఎన్నో కామెడీ షోలు. ఆ షోలు నడిపే అందరికీ ఇప్పుడు ప్రతి రాత్రీ వసంత రాత్రే! ఆయన మాట్లాడే ప్రతి మాటా, ఒక అపహాస్య గుళిక! చెప్పే ప్రతి అబద్ధం వెనుకా, వెంటనే అసలు సంగతేమిటో ఋజువులతో సహా నిరూపిస్తూ, ఫాక్ట్ చెక్ అంటూ, ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు. ఈ తురుఫు ముక్క మాటల్ని హేళన చేస్తూ వాళ్ళు హాస్యంగా చెబుతున్నా, ఆయన అమెరికా అధ్యక్షుడు అయితే, అమెరికా దేశానికే కాక ప్రపంచానికే ఎంతో ప్రమాదం వుందని హెచ్చరిక కూడా చేస్తున్నారు.

మరింతకీ ఆయన చెబుతున్నది ఏమిటండీ అంటే... మచ్చుకి కొన్ని చచ్చు తునకలు...

౦ ౦ ౦

“మెక్సికో వాళ్ళు రోజూ డ్రగ్స్ తెస్తున్నారు, నేరాలు చేస్తున్నారు. ఆడవాళ్ళని మానభంగం చేస్తున్నారు. మన దేశంలో వున్న మెక్సికన్లను మెక్సికోకి తరిమేస్తాను. వాళ్ళు మనదేశానికి మళ్ళీ రాకుండా, రెండు దేశాలకీ మధ్య పెద్ద గోడ కట్టేస్తాను. మెక్సికో ప్రభుత్వం ఆ గోడ ఖర్చు భరించేలా చేస్తాను” – తురుఫు.

మెక్సికో వాళ్ళు అమెరికాకి రావటం బాగా తగ్గిపోయింది అని గణాంకాలు చెబుతున్నాయి. వాళ్ళు ఆయన చెప్పినట్టు నేరస్తులు కాదు. కష్టజీవులు. అదీకాక ‘గోడ కట్టుకుంటే నీ డబ్బులతో కట్టుకో. మేము నీకు చిల్లి కానీ కూడా ఇవ్వం’ అన్నాడు ఆ దేశం అధ్యక్షుడు.

“ముస్లిమ్లనందరినీ బయటికి పంపించేస్తాను. ఐసిస్ వాళ్ళని హతమార్చటానికి ముస్లిం దేశాల మీద బాంబులు వేస్తాను” – తురుఫు.

అసలు ఉగ్రవాదులని వదిలి, ఎంతమంది అమాయకులను ఇలా హింసిస్తావు నాయనా!

“అమెరికాలో పుట్టిన ఇమ్మిగ్రెంట్స్ పిల్లలకు అమెరికన్ పౌరసత్వం రద్దు చేస్తాను” - తురుఫు
మరి కెనడాలో అమెరికన్ తల్లిదండ్రులకు పుట్టిన ‘అమెరికన్’ టెడ్ క్రూజ్ మరి అమెరికా అధ్యక్షుడు ఎలా అవుతాడు బాబూ!

“ఇండియానించీ వచ్చి మన ఉద్యోగాలు దోచుకుంటున్నారు. వాళ్ళని బయటికి పంపించేస్తాను” – తురుఫు.

అమెరికా-హిందూ అసోషియేషన్ ‘తురుఫుగారు గొప్ప అధ్యక్షుడు అవుతాడు, ఆయన విష్ణుమూర్తి, అవతార పురుషుడు’ అని ఆయనకీ భజన చేస్తున్నది. ఆయన వాళ్ళందరినీ మిస్సిస్సిపీ తీరాన నుంచోబెట్టి వాళ్ళ చుట్టూ గోడ కట్టేస్తాడని, పాపం వాళ్ళు గ్రహించినట్టు లేదు!

“అమెరికాలో సరైన వీసా లేకుండా పనిచేసే వాళ్ళందర్నీదేశంలోనించీ బయటికి పంపించేస్తాను”

ఈయన నడిపే హోటళ్ళలోనూ, కసీనోలలోనూ ఎంతోమంది ఇలాటి వారికి, కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ మీద డబ్బు చేసుకుంటున్న న్యాయమూర్తి ఇతను.

ఇది వ్రాస్తున్నప్పుడు – ఇప్పుడే అందిన వార్త. తురుఫుగారికి ప్రైమరీ ఎన్నికలలో అడ్డంగా వున్న రెండున్నర మందిలో, ఇంకొకాయన తన స్వంత రాష్ట్రంలోనే ఆహుతి అయిపోయి, తగ్గిపోయాడుష. అంటే ఇప్పుడు తురుఫుగారికి మిగిలిన శత్రు శేషం ఒకటిన్నారే! ఇంతటితో ఇప్పుడే అందిన వార్త సమాప్తం.

“రోడ్ల మీద నడుస్తున్న నల్లవాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టి వుంటాను” – తురుఫు.
నేరస్థులలో తెలుపు నలుపు అంటూ వుండవు. అమెరికన్ జైళ్ళలో తెల్లవాళ్ళే ఎక్కువ వున్నారు.

“ప్రతి పౌరుడికీ ఆత్మ రక్షణ కోసం ఒక గన్ ఇవ్వాలి. ఎక్కువ గన్స్ వుంటే ఎక్కువ శాంతి వుంటుంది”
మళ్ళీ చెప్పు గన్ పాపారావూ! నా చిన్ని బుర్రకి దాంట్లో తర్కం అనేది ఎక్కడా కనపడటం లేదు మరి!

“చైనా వాళ్ళు వాళ్ళ డబ్బు విలువ తగ్గించటానికి వీల్లేదు!”
అమెరికాలోనే నీ మాటఎవరూ వినటం లేదు, ఇహ చైనాలో ఎవరు వింటారు తంబీ!

“ఇప్పుడు అమెరికాలో నిరుద్యోగులు ఒబామా చెప్పినట్టు 4.9 శాతం కాదు. అది 28 శాతం కానీ, 42 శాతం కానీ అయివుండనోపు..”

‘ఒరే బుడుగూ.. అంకెలు చెప్పు’ - ‘ఒకటీ, రెండూ, మూడూ, ఇరవై ఎనిమిదీ, నలభై రెండూ..’

“నా పసుపు జుట్టు నాదే.. నేనేం విగ్గు పెట్టుకోలేదు”

ఇది మాత్రం నిజం. విగ్గు తయారు చేయటానికి విగ్గుల కంపెనీ వాళ్లకి పసుపు రంగు జుట్టు ఎక్కడ దొరుకుతుంది, ఏ కోతుల జుట్టు కత్తిరిస్తేనో తప్ప!

“గ్లోబల్ వార్మింగ్ అన్నది లేనే లేదు. మా న్యూయార్కులో బయట చూడండి ఎంత చలిగా వుందో.. ఇక్కడ సైంటిస్టులు అందరూ మంచులో కూరుకుపోయారు” – అదో జోకులా నవ్వు కూడాను.

గాలిలో దీపం పెట్టి దేవుడా అంతా నీదే భారం అన్నాట్ట ఒక పిచ్చి కిష్టయ్య!

“నేను పదవిలోకి వస్తే ఏ దేశానికీ సహాయం చేయను. నా సహాయం కావాలంటే వాళ్ళే నాకు డబ్బు ఇవ్వాలి”
మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు!

“మా అమ్మాయి ఎంతో అందంగా వుంటుంది. అది నా కూతురు కాకుండా వుంటే, ఎప్పుడో డేటింగ్ చేసి వుండేవాడిని”

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో..

“మానేజ్మెంటులో నాతో పోటీ చేసేవాడు లేడు. నా కంపెనీలన్నీ ఎంతో లాభాలు గడించాయి. అమెరికా అధ్యక్షుడిని అయితే, ఆర్ధిక సమస్యలు వుండవు”

ఎన్నోసార్లు దివాలా తీసి, తను మొదలు పట్టిన కంపెనీలు మూసేసి, అప్పులు ఎగ్గొట్టి డబ్బులు సంపాదించాడన్నది జగమెరిగిన నగ్న సత్యం.

“నేను చాల గొప్పవాడిని. అందగాడిని. అమ్మాయిలు నేనంటే ఇష్టపడతారు. నన్ను మించినవాడు లేడు. ఎందుకంటే నేను ధనవంతుడిని. ప్రపంచమంతా నరకానికి వెళ్ళినా, నేను ఒక్క పైసా కూడా నష్టపోను”

ఆ డబ్బు బస్తాలేవో మోసుకుంటూ, నువ్వూ మాతోపాటూ నరకానికి రావచ్చు కదా!

ఇలా వ్రాసుకుంటూ పొతే.. నేను సేకరించివి చాల వున్నాయి, ఒక పుస్తకమే వ్రాయవచ్చు.

మరచిపోయాను.. ఈయన్ని తెల్లజాతి అహంకారులైన కేకేకే వారు బహిరంగంగా సమర్ధిస్తున్నారు. ఈయన కూడా వారి సహాయం నిరాకరించకపోగా అది సమర్దిస్తున్నాడు.

కాకపొతే ఒక విషయం.

ఇప్పుడు ఇక్కడ రిపబ్లికన్ పార్టీ – ఇండియాలో కాంగ్రెస్ పార్టీలా – నీళ్ళలో పడ్డ కాకిలా, ఒడ్డున పడ్డ చేపలా గిలా గిలా కొట్టుకుంటున్నది.

ఈయనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా తీసుకుంటే, డెమొక్రాట్ కొండమ్మగారి ముందు నిలవటం కష్టం. అదీకాక చాలామంది రిపబ్లికన్లు కూడా ఈయనకి ఓటు వేయరు.

అలాకాక ఈయన్ని పార్టీ అభ్యర్ధిగా ఆపటానికి వీల్లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రైమరీ ఎన్నికలలో ఈయనే మిగతా రిపబ్లికన్ అభ్యర్ధుల మీద గెలుస్తున్నాడు. ఈయన్ని తప్పక సమర్ధించే పరిస్థితిలోకి వస్తున్నారు.

అదీకాక, ఈయన ఉత్తర కుమారుడి వేషంలో రేలంగిలా, ‘నన్ను మీరు రిపబ్లికన్ అభ్యర్ధిగా తీసుకోక పొతే, నేనేం చేస్తానో తెలుసా.. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తాను, జాగ్రత్త!’ అని నిన్ననే తన కుడిచేతి చూపుడు వేలు పైకీ కిందకీ ఆడించాడు.

అంటే ఏమిటీ..

ఇప్పటిదాకా హాస్యరసంతో నడుస్తున్న కథ, ఇంకా ఎన్నో మసాలా దినుసుల రసాలు నింపుకుని, రసవత్తరంగా రజతోత్సవం జరుపుకోబోతున్న సినిమాలా తయారవబోతున్నది.

ఇహ.. మనం చేయాల్సిన పనేమిటంటే..

వచ్చే నవంబర్ నెల దాకా, ప్రతి రాత్రీ కామెడీ షోలలో ఈ ఎన్నికల హాస్యం చూసి ఆనందించటం! నవంబరు నెలలో, ఈ ఎన్నికల ముగింపు ఎవరి ఇంట్లో వాళ్లు, పెద్ద టీవీ వెండితెర మీద చూడటం!

౦ ౦ ౦


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)