కథా భారతి  - 2

 ‘ కుప్ప తొట్టెమ్మ బిడ్డ!?’

- రచన : ఆదూరి హైమవతి
 


 

అర్ధరాత్రి, అమావాస్య చీకటి. " ఈ ఎదవ తాగి యాడ పడున్నడో పెతి రేత్రీ ఈ యదవను ఎతుక్కుంటా తిరగాలి సొత్తుండాది.యదవని యదవ.. ఈడులాపోతే అందరి సూపూనాపైనే !ఆయదవలందరూ కాల్సేత్తరు సూపుల్తో యదవ లోకమని,యదవలోకం.తనకి ఎర్రతోలూ అందం ఇయ్యతం ఆబగమంతుడుసేసినతప్పే! , అదినాకు ముప్పవు తన్నాది . “తనలో తాను అనుకుంటున్నట్లు పైకే మాట్లాడుకుంటూ ,కళ్ళు చికిలించి చీకట్లోకి చూస్తూ ,తాగిఎక్కడో పడుండే తనభర్త వెంకన్నని వెతుక్కుంటూ సారాయంగడి నుండీ తన ఇంటివరకూ ఉన్నపది సందులూ రోజూ అర్ధ రాత్రి పూట తిరగటం తులసికి దినచర్యల్లో చివరిది .

సోమేశ్వరస్వామి గుడిగోడ దగ్గర ఆమెమొగుడు వెంకన్నపడి ఉండటం చాలా మార్లు చూసి వున్నందున, తులసి అక్కడ వెతక సాగింది ,అమావస్య చీకటిలోగుడి ముందు వెలుగుతున్న వీధి దీపం చిరు వెలుగులో చుట్టూ చూసి వచ్చింది తులసి. దేవుని నిర్మాల్యం [మార్చిన పూల దండలూ, పూజించిన పూలూ] రాత్రి పూటగుడి మూసి ఇంటికి వెళ్ళేప్పుడు పూజారి గుడిముందుండేకుప్పతొట్లో వేసి వెళతాడు. తులసి సరిగ్గా ఆ తొట్టిపక్క నుండీ వెళుతుండగా కుప్ప తొట్లోంచీ ఏదో శబ్దం విన వచ్చింది. చప్పున వెనక్కుతిరిగి చూసింది తులసి. పూలమధ్య నుండీ పసిబిడ్డఏడ్పు అది! వెంటనే వంగి బయటకు తీసింది!అప్పుడే పుట్టినబిడ్డ! అమ్మ కడుపు లోంచీ బయటికి వచ్చినరక్తంకూడా కడగ లేదు ! బొడ్డు కూడా కోయలేదు. కళ్ళు తెరవకుండానే’ తనను ఇక్కడవేసిన దెందుకో? ఎవరో ?’ తెలీక ఏడుస్తున్నట్లు, అనిపించింది తులసికి, ఆపసి గుడ్డును చూశాక, కడుపుపండక పోయినా తులస లోని ‘అమ్మతనం’హృదయంనుండీ పొంగింది. మాతృమూర్తి ప్రేమ తొంగి చూసింది. మమత పురివిప్పింది. ఆబిడ్దడ్ని గుండెలకు హత్తుకుంది.

' మగబిడ్డ!! ఆడబిడ్డైతే కుప్పతొట్టో పడీసీటం ఈ దేసంలో అలోటే! మగబిడ్డనూ ఇట్టా పడేసి పోయిన్రంటే! పాపం ఆయమ్మఎట్టాగన్నదో ఈగుంటగాన్ని!ఆయమ్మకెవురో అన్నాయం సేసుంటరు , లాపోతే ఇట్టంటి బిడ్డ నెందు కొగ్గేస్తది? ఈడ్నిడవను ఆపేగెంతఅల్లాడిపోనాదో గందా!?" బిడ్డడ్నిగుండె కదుము కుని, గుడి చుట్టూ చూసింది ఎవరైనా కనిపి స్తారని, ఎవ్వరూలేక పోడంతో గబగబా తన గుడిసె కేసి అడుగులేసింది తులసి . పక్కగుడిసె పద్దును నిద్రలేపిoది , విషయం చెప్పిపొయ్యెలిగించినీళ్ళు కాచిస్నానంచేయించారిద్దరూ కల్సి. పద్దు బిడ్డడి బొడ్డుకోసి దూదిపెట్టింది.


"ఏవే!పద్దూ ! కడుపు పండని నాకు ఆచోమేచ్వరుడే ఈ మగబిడ్డనిచ్చిండు ,ఈడు ఆకలి కేడుత్తన్నట్టున్నడే! నీ సను బాలుకాత్త పడతవా?యావనుకో బాకే పద్దూ! ఈడునాకు దేవుడిచ్చిన బిడ్డే! " అందిగారంగా వాడ్ని ముద్దుచేస్తూ . అసలుతల్లి వదిలేసినా కొసరుతల్లి గుండెకు హత్తుకున్నందుకేమో బిడ్డడు ఏడ్పుమానేసి కుడిచేతి బొట్టన వ్రేలు నోటి వద్దకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకలికి వెతుక్కుంటున్న బిడ్డను తులసి చేతుల్లోoచీ లాక్కునిపైటవెనక్కు చేర్చుకునిరొమ్మందించిందివాడినోటికిపద్దు.‘ పేదతల్లిదేపెద్దమనస్సేమో!‘


"అక్కా! ఈడూ నాబిడ్డ ‘రాంబాబు’ లాంటోడే ననుకో ! ఈడికి నేనే పేరెట్టేసినా!’చోమేచ్వర సామి ‘ గుడికాడ దొరి కిoడు గందా అందుకే ,’సోంబాబు’ అనెట్టా! ఎట్టా ఉందక్కా? రాంబాబూ , సోంబాబూ ఇద్దరూ మన బిడ్దలక్కా! నీవేం పరేసాన్పడమాక , ఇద్దరికీ నారొమ్ముపాలు పడతాన్లేయే అక్కా!ఎట్టాగో ఈడు బతికి బట్టగడితే నాకంతే సాలు. నీ కొడుకే అక్కా!ఈడు! నీకు బిడ్డనిట్టాఇచ్చిండే చోమేచ్వరసావి." వాడి కడుపు నింపుతూ తలనిమురుతూ అంది పద్దు . చనుబాలు కుడిపిస్తున్నపద్దును ముద్దాడింది తులసి " పిల్లలుగలతల్లివి! నీవు పేరెట్టడం సుబవే పద్దా! నిజంగానీవు నాసెల్లివే! ఇయ్యాలనుండీ నీకు అరలిటేరు పాలు తెచ్చిత్త , అవినీవుదాగి ఈ నాబిడ్డడికి నీ రొమ్ముపాలు పట్టాల , యా వంటవే పద్దా!"

" నాసనుబాలమ్ముకోమంటా వేంటే అక్కా! ఆకలైన పసోడిపేనం కాయనిచ్చేపాలకు తిరిగి బదుల్తీసు కోనా " అంది బాధగా పద్దు.

" అదికాదు పద్దూ నాయాల్నే నీవూ పన్లకెడతవ్ గందా ! నీకూ బలంగావాలేనా వద్దా?ఇంకోమాట పద్దా!కొన్నాల్లు నీవు ఇంటికాడే ఉండి ఈల్లిద్దర్నీసూసుకో , నాకేటీ తెల్దుగందా బిడ్ద డిసయం?నీ ఇంటి పన్లూ నేనేసూత్తా కొన్నాల్లు. పిలగాడు కాత్తంతకోలు కోనియ్యే!" బ్రతిమాలింది తులసి. అలా తులసి , పద్దూల కిద్దరికీ’ ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడయ్యాడు సోంబాబు’ దేవుడెంతదయామయుడు! అసలు తల్లి దక్కలేదని మరిద్దరు తల్లుల్ని చూపాడు వాడికి! రాంబాబూ, సోంబాబూ ఇద్దరూ కవల పిల్లల్లా ఆడుతూ పాడుతూ పెరగ సాగారు. ‘బిడ్డొచ్చిన వేళ , గొడ్డొచ్చిన వేళ’ అన్నట్లు తులసి మొగుడు వెంకన్నతాగుడు మాని,పనిచేసి ,సోంబాబును చదివించాలని సొమ్ము దాయసాగాడు. వాడికున్నబాధ ‘బిడ్దలుకలక్కపోడవేనీ, అందుకే తాగు తున్నాడనీ ‘ తెల్సుకుంది తులసి. ఏదేమైనా తన మొగుడు ఆ’పాడు తాగుడు’ మానినందుకు బిడ్డల్లేని తనకు ఆసొమేశ్వరుడు బిడ్డనిచ్చి నందుకూ మహా ఆనందపడి , దీని కంతటికీ కారణమైన సోంబాబును చూసుకుని మురిసి పోసాగింది .

**

వీధి బళ్ళో చదువుతున్న సోంబాబు తెలివికి మెచ్చిఆస్కూల్ పెద్దపంతులు వాడిని హైస్కుల్లో వేయించి, ఇల్లు దూరం గా ఉన్నందున హాస్టల్లో పెట్టాడు, అలావాడి చదువు,కాలేజ్ నుండీ ,యూనివర్శిటీకి వెళ్ళి,విదేశాలకుపోయింది. రాంబాబు మాత్రం వీధి బడి చదువే ఎక్కు వై తండ్రిలా పనులకు పోతూ మరో బాలకార్మికుడయ్యాడు. పచ్చని పసిమి రంగుతో మిసమిసలాడుతూ,పెద్ద పెద్దకళ్ళతో, చదువుల నిచ్చెన సులువుగా ఎక్కిపోతున్న, ఆరడుగుల అందగాడైన సోంబాబును చూసుకుని మురిసిపోయే వెంకన్న, సోంబాబు పై చదువులకై అమెరికా వెళుతున్నాడని తెలిసిన రోజు నుండీ, వాడిని వదలి ఉండలే ననుకునిఆతండ్రికానితండ్రి ,తాగుడు కుమళ్ళీ బానిసైనాడు. ఆమైకంలో వాడు వాగిన వాగుడు సోంబాబుకు నిజాన్ని తెలిపింది. తాగిన వాడి కడుపులో ఏమీ దాగదని రుజువు చేశాడు వెంకన్న.

" ఇదే కన్న కొడుకైతే మనల్నిట్టా వదిలెల్లో వోడా?’ కుప్పతోట్లో ’ దొరికి నోడు గనకే ఇట్టా యెల్తుండు,తెల్సుకోయే తులిసెమ్మా!’ పేగుబందం ‘ కాదుగదే! నెత్తినెట్టుకుని పెంచినా ఏటైనాదే !!"అంటూ ఏడుస్తున్నవెంకన్నను,
"నోర్ముయ్యసే యాం మాటలయి!? మనోడే ! మనబిడ్డ ! బంగారవే ! బంగరం ! ఆడు ఇంత బాగా సదుంకుని పైపై కెదిగి నందుకు సంతోసించాల , ఈడి తోటే రాంబాబునూ సదవేసినం ఏటైంది? ఆడు ఈ ఊరి యీది బడి తోనే ముగి చ్చలా? " అని తులసి మొగుడ్నిమందలించినా, తండ్రిమాటలు విన్న సోంబాబు “అమ్మా! నిజంచెప్పు" అని అడిగాక నిజం చెప్పక తప్పింది కాదు తులశమ్మకు.

**

అమెరికాలో చదువుపూర్తై పెద్ద ఉద్యోగంలో చేరిన ఈశ్వర్, అదే సొంబాబు, కొలీగ్ సుందరి ని వివాహం చేసుకు నేప్పుడు తులసిని, వెంకన్నను ఎంత పిలిచినా రానే రామన్నారు, " సోoబాబూ! నీవు బాగా సదివినౌ, పెద్ద నౌకరీసేత్త న్నవ్ ,నీ పెల్లన్ని ఎన్నడూ ఈడికితేబోకు, మా గురింసెన్నడూ ఆపెకు సెప్పబోకు,మమ్మల్నిసూసినిన్నుసిన్నసూపు సూత్తేనేబరించలేను."అనిమరీమరీచెప్పిందితులసి.చదువేలేనిఆమెసంస్కారానికిఆశ్చర్యపోయాడుసోoబాబు.

’తల్లి మనస్సింత సున్నితమా !మరిఆతల్లి?!పసి బిడ్డనై ననన్న లాకుప్పతొట్లో పడేసి ఎలావెళ్ళింది? ‘ ... జవాబు రాని ఆ ప్రశ్న సోంబాబు నిరంతరం వేసుకుంటూనే ఉంటాడు.

**

సోమేశ్వరుని ఆలయం ముందున్న’ కుప్పతొట్టి ‘ చుట్టూ ష్యామియానాలు వేసి అందంగా అలంకరింపబడి ఉంది. పేద వాడలవారంతా వారి పిల్లలందరితో అక్కడికి చేరి షామియానాలక్రింద కుర్చీల్లో కుర్చుని ఉన్నారు. ఆ’కుప్పతొట్టి’కి పూలమాలలు వేసిపూజ చేయించి, ధూప దీప నైవేద్యాలు అర్పించి అక్కడి వారందరికీ కొత్త బట్టలుపంచాడుసోంబాబు, రాంబాబు సాయంతో.తులసికీ, తనకు స్తన్య మిచ్చి కాపాడిన పద్మకూ వారి భర్తలతో కలిపి సన్మానం చేసి ఆనలుగురి పాదాలకూ నమస్కరించాడు సోంబాబు భక్తిగా ,ఆ పరమేశ్వరుడు సతీ సమేతంగా రెండు జంట లుగా వచ్చినట్లు భావించి. కార్యక్రమ మంతా దగ్గరుండి జరిపించిన పూజారి , ఆసక్తిగా సోంబాబు తో ”సార్ ! మీరెవరో తెలీదు, బాగా చదువుకున్న వారిలా ఉన్నారు ! ప్రతి ఏడాదీ గత ఐదేళ్ళుగా ఇలా ఈ’ కుప్పతొట్టి ‘ కి పూజలెందుకు చేయిస్తున్నారో? ఈ నలుగురికీ సన్మానం, పాదనమస్కారాలూ , ఇదంతా ఎందుకోసo చేస్తున్నారో , చెప్తారా?? నాకు ఈరోజే తెలిసిన విషయం దీనికోసం మీరు అమెరికానుండీ వస్తారని ! " అని అడిగాడు. " ఔను ! జన్మదినాన నా ’జన్మస్థలి ‘ ని దర్శించి , పూజించను అమెరికా నుండీ వస్తాను .’జనని’ఎవరో తెలీదు, కనీసం’ జన్మస్థలి ‘నైనా దర్శించను వస్తాను." భక్తిగా ఆ’కుప్పతొట్టి ‘ని కళ్ళ కద్దుకుని చెప్పాడు సోంబాబు.

సోంబాబు మనస్సులో గతరాత్రి రాంబాబు చెప్పిన విషయం మెదిలింది వెయ్యోమారు. ఆ యాడాది షామియానాలు వేయించి క్రింద శుభ్రం చేయించి, బ్లాంకెట్లూ పరిపించి, అలసటతో అర్ధరాత్రి , ఒక మూల చీకట్లోకూర్చుని, కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్న రాంబాబు ఒక వింత దృశ్యంచూశాడు. సోంబాబు అమేరికా నుండీ రాగానే " సోంబాబూ ! నీకో ఇసయం సెప్పాల్రా ! " సంశయంగా అన్నాడు రాంబాబు.

" ఏమావిషయం? సంశయ మెందుకురా ! రాంబాబూ! చెప్పు. ఏర్పాట్లకు మరికొంచెం డబ్బేమన్నాకావాలా?"

" డబ్బిసయం కాదు సోంబాబూ! అదోకొత్తి సయం! ఏం లేదురా! ! ఆగుడికాడ రేత్తిరి నేను సామియానా లేయించినాంక పేనం అల్సిపోయి ఓమూల శారగిల బడ్డాన్రా!యవరో ఒకాపె నలపై యాపైఏల్లుంటయేమోరా!!ఆ ’కుప్పతొట్టె’ కువొంటరి గొచ్చిపూజలు సేత్తుంటే,అంత రేత్తిర్కాడ ఎవురై వుంటారాని సూసినాన్రా! పాపం కుప్పతొట్టికాడ కూకునిఏడ్చుకున్నాది రా! ఆచ్చర్యమేసినాది .దూరంగా దొంగలాగా ఆపె ఎనకాల్నుంసెల్లిసూసినా ! ఆయమ్మ పెద్దింటి మడిసిరా ! "

"ఆ! ఐతే ఆమే నన్నుకన్న తల్లై ఉండ వచ్చేమోరా! ఇల్లు గుర్తు పడతావురా రాంబాబూ! !" ఆదుర్దాపెరిగిన సోంబాబు అడిగాడు.
" ఆ! మా బాగా గుర్తెట్టు కన్నన్లేరా ! నీకు సూపాల్నే!పోదా రేంట్రా! సూపిత్తా ఆయమ్మిల్లు?" .
" ఆలోచించి చెప్తాన్లేరా! ముందు పని కానీ." గొంతు పూడుకు పోయి మాట రాలేదు సోంబాబుకు . గుండె చప్పుడు ఎక్కువైంది. వళ్ళంతా చెమటలుపోశాయి.’ వెళితేమాత్రం ఆమె నన్ను గుర్తుపట్టి ఏం చేస్తుంది? నేనేం చేస్తాను?’ అనుకున్నాడు మనస్సులో.

నాల్గు నాప బండలు భూమిలోకి దించి తొట్టెలా చేసిన,ఆ’ కుప్పతొట్టి’ ఉండ బట్టే తాను బతికి బట్ట కట్టాడు . ఈసోమేశ్వరుని నిర్మాల్యం వెసే ఈకుప్పతొట్టే నాకు కవచమైంది. పైగా ఆరోజున తాగుబోతైన భర్తను వెతుక్కుంటూ తులశమ్మ అక్కడికి ఆసమయంలో రాకుంటే ఏకుక్కలో చీల్చి తినేసి ఉండేవి. తనను పుట్టగానే బొడ్డు కూడాకొయ్య కుండానే వదిలేసిన తల్లిని తెల్సుకుని, కల్సుకుని ఈ వయస్సు లో ఆమె పరువుతీయడం రాంబాబుకు ఇష్టం లేక పోయింది. అందుకే ”ఒరే !సోంబాబూ రారా! ఆఇల్లు సూపిత్తా !" అనిపిలిచినా, వెళ్ళకపోగా, రాంబాబు దగ్గర మాట తీసు కున్నాడు. ’ఆరహస్యా’ న్నిరాంబాబుకూ తనకూ తప్ప మరెవ్వరికీ తెలీకుండా జాగ్రత్త పడ్డాడు కూడా సోంబాబు- సోమేశ్వర్ - ఈశ్వర్ -అనే ఈష్ . సోంబాబు ప్రతి ఏడాదీ ఇండియాకువచ్చి ఆ’కుప్పతొట్టి’ పూజ చేస్తూనే ఉన్నాడు.

ఆరోజే తన పుట్టిన రోజుకనుక తనలాంటి వారికి భోజనం పెట్టి బట్టలు పంచి, పేదలై ఉండి చదువుమీద ఆశక్తి ఉన్న వారికి పై చదువులు చదువుకోను, తన ఇద్దరమ్మలనూ ట్రస్టీలుగా పెట్టి సొమ్ము ఇచ్చే ఏర్పాటుకూడా చేసి, తృప్తిగా వెళుతుంటాడు. దూరంగా జనంలోంచీ చాటుగా తలపై ముసుగు వేసుకుని తనను చూస్తున్న ‘శోకమూర్తి’ ని చూడ కున్నాఆమె పరువు నిలిపాడు ఆ ‘ కుప్ప తొట్టెమ్మ బిడ్డ!’

**

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)