ఆవకాయోపాఖ్యానము

                                                                                  - పుల్లెల శ్యామసుందర్

 

ఆవకాయ:

కం// శ్రేష్టంబిది పచ్చళ్ళన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

 

కం// ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

కం// బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!

 

కం// చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు, మామిడి దిది

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

 

ఆవకాయ ఉపయోగాలు:

కం// ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

 

కం// ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

ఆవకాయ అవతరణ:

కం//  “చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

అంటూ,

కం// ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

 

కం// చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!


 
 
 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech