ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 12

దేవులపల్లి తామ్రశాసనం: జైమిని భారతము అవతారిక

 సాహిత్య చారిత్రి విశేషాలు

(4 వ భాగము)

 

                                             పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

   పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కాలనిర్ణయానికి అత్యంత ముఖ్యాధారం కాగల ఈ దేవులపల్లి తామ్రశాసనాన్ని మొదట రాబర్ట్ సీవెల్ గుర్తించి, తమ Lists of Antiquities (Vol. I., పు. 134) లో ప్రకటించారు. ఆ తర్వాత శ్రీ జయంతి రామయ్య పంతులు గారు 1902లో దీనిని పరిష్కరించి, ఎపిగ్రాఫియా ఇండికాలో (7-వ సంపుటం; Devulapalli Plates of Immadi-Narasimha, పు. 74-85) సద్విమర్శనపూర్వకంగా ప్రకటించారు. శాసనం భౌతికవివరాలన్నీ అందులో ఉన్నాయి. శాసనభాష సంస్కృతం. అందులోని “శాకేబ్దే పరిసంఖ్యాతే గిరినేత్రయుగేందుభిః” అన్న చరణంలో గిరి (7), నేత్ర (2), యుగ (4), ఇందు (1) - సంజ్ఞలు శక సంవత్సరాన్ని; “రక్తాక్ష్యాఖ్యే భాద్రపద పౌర్ణమాస్యాం రవే ర్దినే” అన్నది రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద శుక్లపక్ష పౌర్ణమీ భానువాసరాన్ని; “చంద్రోపరాగసమయే మహాపుణ్యఫలప్రదే” అన్నది ఆనాటి చంద్రగ్రహణ పుణ్యకాలాన్ని సూచిస్తున్నాయి. ఆంగ్లమానంలో ఇది క్రీ.శ. 1504 ఆగస్టు 25-వ తేదీతో సరిపోతున్నది. ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు కీల్‌హార్న్ ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణమని, ఇండియాలో మధ్యాహ్నం ఒంటి గంట, నలభైమూడు నిమిషాలనుంచి సాయంకాలం ఐదు గంటల పదమూడు నిమిషాల వఱకు కనబడిందని నిర్ణయించారట. నృసింహరాయల కొడుకు ఇమ్మడి నృసింహుడు పెనుగొండ మహారాజ్యం మార్జవాడ సీమలోని గుండ్లూరు (నేటి కోన ముష్టూరులోని ఎఱ్ఱకోటపల్లి) ప్రాంతీయులైన దేవులపల్లి బ్రాహ్మణ కుటుంబికులకు చేసిన దానశాసనం ఇది. ఈ కుటుంబం వారు మొదట వ్యాల్పాటి (?వాయల్పాటి) వారై ఉండగా, కొంతకాలానికి బొల్లాపిన్ని వారు; ఆ తర్వాత గొల్లాపిన్ని వారు అయి; చివఱికి దేవులపల్లి వారైనందున ఆ గ్రామం దేవులపల్లి గ్రామం అయిందని జయంతి రామయ్య గారు వ్రాశారు. 

        చారిత్రికంగా ఎంతో విలువైన ఈ శాసనంలో నుంచి ప్రస్తుతానికి ఉపకరించే కొన్ని ముఖ్యమైన విశేషాలను మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాను.

        శాసనపీఠికలో జయంతి రామయ్య గారు సాళువ వంశవృక్షపరిశీలనకు శబ్దరత్నాకర నిఘంటుకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు గారు పరిష్కరించిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి జైమిని భారతము క్రీ.శ. 1893 ముద్రణ (1883 ముద్రణ అని ఉండటానికి మాఱుగా 1893 అనటం బహుశః అచ్చుతప్పు కావచ్చును), అప్పటికింకా అచ్చుకాని నంది మల్లన-ఘంట సింగన కవుల వరాహ పురాణము తమకు ఉపకరించాయని పేర్కొన్నారు. ఆ కృతులపై ప్రధానంగా ఆధారపడి ఆలోచించినందువల్ల రామయ్య పంతులు గారు దేవులపల్లి తామ్రశాసనం పినవీరభద్రకవి కాలనిర్ణయానికి ముఖ్యోపస్కారకమని ఊహింపలేకపోయారు.

          జైమిని భారతము యదువంశావిర్భావంతో మొదలై సాళువ గుండరాజుతో (జైమిని. 1-29) చరిత్రాదికానికి ఉపక్రమిస్తుంది. ఆ గుండరాజుకు గౌతన, వీరయౌబళుడు, మాదయ్య, గుండ బమ్మడు (జైమిని భారతము ముద్రితప్రతిలో ఉన్న పాఠాన్ని గుండ బొమ్మడు - అని సరిదిద్దుకోవాలి), సాళ్వ మంగురాజు, సావిత్రి మంగడు - అని కొడుకులు (ప. 30). సాళ్వ మంగురాజు కన్నడదేశంలోని శ్రీరంగపట్టణం వద్ద ఘోరయుద్ధంలో దక్షిణ సురతానును (మధుర పాండ్యరాజును) ఎదిరించి, అతనిని చెఱపట్టి, “మీసరగండ”, “కఠారి సాళువ” “తెలుంగురాయ” డని ఖ్యాతి వహించిన సంపరాయనికి అప్పగించి, “సంపరాయ ప్రతిష్ఠాపనాచార్య”  అన్న బిరుదాన్ని వహించిన వీరుడు. మహాకవి శ్రీనాథుడు “కస్తూరికా భిక్షాదానము సేయరా!” అని అర్థించిన సాంపరాయని తెలుంగాధీశుడు ఆ రాజే.

        సాళ్వ మంగురాజుకు సింగరాజు, గుండరాజు, గౌతరాజు, సావడి (?), హనుమరాజు, మల్లినాథుడు అని ఆఱుగురు కొడుకులు (ప. 33). వారిలో గౌతరాజుకు మళ్ళీ గుండరాజు, సాళువ, బొప్పరాజు, తిప్పరాజు అని కొడుకులు నలుగురు (ప. 35). గుండరాజు, బొప్పరాజు గొప్ప పరాక్రమవంతులని (ప. 36 – 38), తిప్పరాజు అజేయ్యవీరుడని (ప. 39 – 40); వీరిలో గుండరాజుకు మల్లాంబ యందు సాళువ తిమ్మరాజు, అహోబలేశ్వరుని అంశతో చరిత్రప్రసిద్ధుడైన సాళువ నరసింహరాయలు జన్మించారట (ప. 43). ఈ సాళువ నరసింహరాయలను మఱి మూడు పద్యాలలో అభివర్ణించి (ప. 44 – 46), పినవీరన జైమిని భారతములో రాజుకు అంకితంగా ఐదు “షష్ఠ్యంత” పద్యాలను చెప్పాడు.

        ఇది జైమిని భారతములోని చరిత్ర సంగతి. నరసింహరాయలు “తిగుళ” దేశంలోని భూములను కైవసం చేసికొన్న విషయం (“తిగుళ” - “తమిళ” శబ్దానికి కన్నడదేశవ్యవహారం అని కిట్టెల్ నిఘంటువు), “ఒడ్డీని” (ఉత్కళ రాజును) జయించిన ప్రస్తావం, చంద్రగిరికి సమీపాన కపాలదుర్గాన్ని ఆక్రమించిన గాథ (ముద్రిత ప్రతులలో ఈ అన్వయం అర్థం కానందువల్ల పరిష్కర్తలు “పఱతెంచి చక్కుగఁ బాలదుర్గము మెట్టి” అని అచ్చువేశారు. అది “పాలదుర్గం” కాదు. కపాలదుర్గం. అందువల్ల దానిని “పఱతెంచి చక్కఁ గపాలదుర్గము మెట్టి” అని సరిదిద్దాలి), అతను పెనుగొండకు రాజైన ఉదంతం - జైమిని భారతములోని ప్రథమాశ్వాసం 45-వ పద్యంలో ఉన్నాయి. ఇవన్నీ చారిత్రికసత్యాలే. షష్ఠాశ్వాసంలో “బోనగిరి చెంచీ కొమ్మధారాపురీ (ప. 271)” అన్న చోట “బోనగిరి” నేటి హైదరాబాదు వద్ద ఉన్న భువనగిరి అని; “చెంచి” నేటి “చెంజి మండలం” అని; “కొమ్మ ధారాపురి” ఎక్కడిదో గుర్తింపలేకపోయామని జయంతి రామయ్య గారు వ్రాశారు. అయితే, సందర్భాన్ని బట్టి “బోనగిరి” జయంతి రామయ్య గారు చెప్పినట్లు హైదరాబాదు సమీపాన ఉన్న భువనగిరి కాదని, తమిళ కర్ణాట తమిళదేశాల ఉపకంఠంలో కోయంబత్తూరు నుంచి కర్ణాటకకు వెళ్ళే దారిలో ముదుమలైకి దగ్గఱ ఉన్న “పు(<భు)వనగిరి (నేటి పోనగిరి)” కావచ్చునేమో అనిపిస్తున్నది. అది నరసింహరాయల పరిపాలనాక్షేత్రమే కనుక. “చెంచి” నరసింహరాయల కాలానికి తమిళదేశంలో చెంగల్పట్టు, ఉత్తరాన అధికభాగం, ఇక నెల్లూరు, చంద్రగిరి ప్రాంతాల కూడలి అయిన సెంజి మండలం. “కొమ్మ ధారాపురీ” పాఠం సరికాదు. “కొంగు, ధారాపురీ” అని ఉండాలి. “కొంగు” నేటి కోయంబత్తూరు మండలం. “ధారాపురి” అంటే అమరావతీ నదీ పరీవాహమై ఉన్న నేటి తిరుపూరు జిల్లాలోని “ధారాపురం”. ఒకప్పుడు “రాజరాజపురం” అని పేరొందిన సుప్రసిద్ధమైన ప్రదేశం. కొంగునాడు చేరరాజుల అధీనంలో ఉండిన రోజులలో వారి రాజధానికి “వంచీపురం” అనిపేరు. ఆ పాఠాన్ని పురస్కరించికొని “వంచీ - కొంగు - ధారాపురీ” అని భావించటంకంటె ప్రకృతోపయోగంగా “చెంజీ - కొంగు - ధారాపురీ” అని ఉండటం భావ్యమే కాని, వ్రాతప్రతుల పాఠాన్ని అనుసరించి “చెంచీ - కొంగు - ధారాపురీ” అని చదువుకొంటే సరిపోతుంది. మూడూ నరసింహరాయల పాలనలో ఉండినవే కనుక ఈ అన్వయమే భావ్యం. వంచీ మండలంలోని అధికభాగం నరసింహరాయల పాలనలోనిది కాదు కనుక ఆ పాఠమూ అంగీకారయోగ్యం కాదు. “పోనగిరి” నరసింహరాయల పరిపాలనక్షేత్రమే. మొత్తంమీద ఉత్తర ఆర్కాడు, చెంగల్పట్టు, నెల్లూరు, కొంతమేరకు దక్షిణ ఆర్కాడు, కడప, కృష్ణా మండలాలు; కర్ణాటకంలో కొంత, మైసూరు, చివఱికి విజయనగర సామ్రాజ్యాధిపతిత్వం - అని చరిత్రకారుల భావన. ఈ వివరాలలో కొన్ని పాశ్చాత్య యాత్రాచరిత్ర రచనలతో సంవదించటంలేదని మునుపటి సంచికలో చర్చించుకొన్నాము.

        సాళువ నరసింహరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినది శక సంవత్సరం 1408 కాబట్టి అది ఆంగ్లమానంలో క్రీ.శ. 1486-87 సంవత్సరాల నాటికని; ఆ పైని పదేళ్ళకు ఇమ్మడి నరసింహరాయల శాసనం ప్రకటితమైనందున శక సంవత్సరం 1418లో (రాక్షస) - అంటే, క్రీ.శ. 1495-96 నాటికి సాళువ నరసింహరాయల పరిపాలన ముగిసిందని; అప్పట్లో Dr. Hultzsch దొర బారుకూరులో గుర్తించిన (ఆర్కియోలాజికల్ సర్వే వారి సంచయంలోని 1901-వ సం., 166-వ సంఖ్య గల) ఒక శాసనాన్ని బట్టి సిద్ధార్థి నామ శక సంవత్సరం 1421లో (క్రీ.శ. 1499-1500) మహామండలేశ్వర, మేదినీ మీసరగండ, కఠారి సాళువ ఇమ్మడి నరసింహరాయలు విజయనగరంలో అధీశ్వరుడై ఉండగా నరస(న్)న నాయకుడు (బహుశః, ఈశ్వర నరసా నాయకుడు) ఆయన మంత్రిగా ఉన్నాడని తెలుస్తున్నది. Dr. Hultzsch దొర ఆ తర్వాత బారుకూరులో కనుగొన్న (శక 1424: క్రీ.శ. 1501-2 నాటి) దుర్మతి నామ సంవత్సరంలో “మహారాజాధిరాజ”, “రాజపరమేశ్వర” విశేషణాలతో వీరప్రతాప వీరనరసింహరాయల పేర ప్రకటితమైన శాసనాన్ని బట్టి ఈశ్వర నరసా నాయకుడు విజయనగరంలో ఇమ్మడి నరసింహరాయలను పదవీచ్యుతుణ్ణి చేసి సింహాసనాన్ని అధిరోహించాడని ఊహింపవలసి ఉంటుంది.  
 
        క్రీ.శ. 1500 నాటికి సాళువ నరసింహరాయల స్థితిగతులు ఏమైనట్లు? ప్రస్తుతం మనము చర్చిస్తున్న దేవులపల్లి తామ్రశాసనం ఇమ్మడి నరసింహరాయలు పెనుగొండలో ఉండగా వేయింపబడినది కాబట్టి,  అప్పటికి - అంటే, క్రీ.శ. 1504 నాటికి ఇమ్మడి నరసింహరాయలు విజయనగరాన్ని విడిచి పెనుగొండకు చేరుకొన్నాడనుకొంటే, సాళువ నరసింహరాయల సంగతేమైనట్లు? క్రీ.శ. 1495 నాటికి సాళువ నరసింహరాయల మరణం సంభవించినదన్న చరిత్రకారుల వ్రాతలకు నిజంగా ఆధారం లేదని ఇంతకు మునుపే పెక్కు పర్యాయాలు వ్రాశాను. క్రీ.శ. 1500 నాటికి ఇమ్మడి నరసింహరాయల హత్య జరిగి ఈశ్వర నరసా నాయకుడు ఆధిపత్యాన్ని చేపట్టాడని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసినది విశ్వసనీయం కాదని ఈ దేవులపల్లి శాసనం చెప్పకనే చెప్పుతున్నది. ఆ ఉభయకాలాలలోనూ సాళువ నరసింహరాయల కలిమిలేముల విషయమై నిర్ధారకసాధనాలేవీ ఇప్పటివఱకు లభింపలేదు.

        ఈ సమస్య పరిష్కారానికి దేవులపల్లి శాసనాన్ని జైమిని భారతము అవతారికతో సరిపోల్చితే నాకు స్ఫురించిన కొన్ని విశేషాలను చర్చిస్తాను.

జైమిని భారతము దేవులపల్లి తామ్రశాసన రచనకు అనంతరీయమా?

       స్థలాభావం వల్ల దేవులపల్లి శాసనాన్ని ఇక్కడ పూర్తిగా ఉదాహరించటానికి వీలులేకపోయినా, తత్తత్సంబంధితశ్లోకాలను, జైమిని భారతములోని పద్యభాగాలను మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. పినవీరన ఆ శ్లోకాలను చదివి తన పద్యాలను అనువదించికొన్న తీరును వివరిస్తాను. శాసనంలోని శ్లోకాలు ఎవరో సామాన్యకవి రచించినవి కావని, కావ్యానుభవరసజ్ఞుడైన విద్వత్కవి విరచించినవని, అందులోని కల్పనలు సాళువాభ్యుదయ రామాభ్యుదయ కావ్యాలలోని శ్లోకభావాలకు అనుసరణలు కావని గుర్తుంచుకొంటే చాలు.

        ఈ క్రింది శ్లోకాలన్నీ శాసనంలోని అక్షరదోషాలకు శ్రీ జయంతి రామయ్య గారు చేసిన సవరణలతోడి పాఠాలు:

1
             గుండ బోమ్మో గుణాఢ్యః శ్రీ మాదిరాజో మహాయశాః
                గౌతయో గీతసత్కీర్తి ర్వీరః శ్రీ వీరహోబలః
                సావిత్రి మంగిభూపశ్చ తథా సాళువ మంగిరాట్.

మ.    జననం బందిరి గుండభూవిభునకున్ సంధాకబంధారి గౌ
         తనయున్, శ్రీనిధి వీరయౌ(?హో)బలుఁడు, నుద్యత్కీర్తి మాదయ్యయున్,
         ఘనతేజోనిధి గుండ బ(?బొ)మ్మఁడును, సంగ్రామస్థలీపార్థ స
         జ్జనమందారులు సాళ్వమంగనృపుఁడున్ సావిత్రిమంగాంకుఁడున్.                జైమిని.(1-30)
2
        నృసింహరాయోయ మహోబలశ్రీ నృసింహదేవస్య వరప్రసాదాత్.
ఉ.    శ్రీమదహోబలేశ్వర నృసింహుని యంశమునన్ నృసింహుఁడున్.                           
                                                           జైమిని. (1-43)
3
       తస్మా దుదభవన్నన్యే షడేతే చక్రవర్తినః.
గీ.     చక్రవర్తులతోడుత సవతు వచ్చు
        వీర లార్వుర లోపల …                           జైమిని. (1-24)
4
        దేవులపల్లి తామ్రశాసనం, జైమిని భారతముల తులనాత్మక పరిశీలనకు కీలకాధారమైన దళం ఇది: 

               ఆసీ ద్ధరావరాహో యః ఖలాబ్ధే రుద్ధరన్ ధరాం
                సాళువః శత్రుసంఘాతం పక్షిఘాతం నిహత్య చ
                కిణీకృతమహాబాహో రర్థిప్రత్యర్థిదానతః
                యస్య బర్బరబాహుత్వం యథార్థ మభవత్ పరమ్
                యః పంచశాఖశాఖాభి ర్జిత్వా పంచామరద్రుమాన్
                పంచఘంటానినాదోభూత్ పంచఘంటానినాదనాత్
                సత్యసత్త్వేషుసంధానరూపలావణ్యధీగుణైః
                జిత్వా యః పాండవాన్ పంచ ప్రాపదైవరగండతామ్.
                ప్రతాపేనార్కవద్వైరితమఃస్తోమం నిరస్య యః
                ప్రకాశయ న్నిమా ముర్వీ ముర్వరాదిత్యతాం గతః
                చౌహత్తమల్లో ధరణీవరాహ శ్చాళుక్యనారాయణ ఇ త్యమీభిః.

          ఈ శ్లోకాలకు అనువాదం:

          సీ.     తన భుజాపరిఘ చేత ధరావరారోహ
                                        భరియించి బర్బరబాహుఁ డయ్యె
                దన ప్రతాపంబు చేత దిగంతరంబుల
                                        దీపించి యంబరాదిత్యుఁ డయ్యె
                దన దానగరిమ చేత సురాగముల పెంపు
                                        దండించి యైవరగండఁ డయ్యె
                దన మహత్త్వంబు చేతఁ బురాణపురుషుని
                                        మఱపించి చౌహత్తమల్లఁ డయ్యె
        గీ.     రాజమాత్రుండె ధరణీవరాహ బిరుద
                వర్ణఫలకాయమాన దుర్వారగర్వి
                తాహితోర్వీశ విపుల దోరంతరుండు
                సాళ్వ గుండయ నరసింగ జనవిభుండు.      జైమిని. (1-14)

          అని. ఇందులో మూలశ్లోకాన్ని యథాతథంగా తెలుగు చేసినా, జైమిని భారతము కథాసందర్భాన్ని బట్టి పినవీరనకొక అనూహ్యమైన ఆటంకం వచ్చింది.  శాసనంలోని

                “సత్యసత్త్వేషుసంధానరూపలావణ్యధీగుణైః
                జిత్వా యః పాండవాన్ పంచ ప్రాపదైవరగండతామ్.”

          అన్న శ్లోకంలో సాళువ నరసింహరాయలు పాండవపంచకంలో 1) ధర్మరాజును తన సత్యసంధత చేత, 2) భీమసేనుని తన సత్త్వసంపద చేత, 3) అర్జునుని శరసంధానం చేత, 4) నకులుని రూపలావణ్యాల చేత, 5) సహదేవుని ధీగుణం చేత ఓడించి, “ఐవరగండడు” (ఆ పాండవులు ఐదుగురికంటె మహావీరుడు) అన్న బిరుదాన్ని వహించాడన్న తత్తద్గుణనిరూపణపూర్వక తన్నిరసనపూర్వక ప్రకృతాప్రకృతాలు రెండింటికి సమానధర్మత చేత ఔపమ్యాన్ని గమ్యమానం చేస్తున్న కల్పన దీపకానుప్రాణిత  యథాసంఖ్యాలంకారశోభితమై, ప్రాకరణికార్థం సుమనోమనోహరంగా ఉన్నది. అయితే ఆ పాండవ మహావీరుల విజయగాథాపరంపరనే ప్రస్తుతీకరిస్తున్న జైమిని భారతమును తాను వ్రాస్తూ - పాండవులను అధఃకరించి, నరసింహరాయలను ఉరరీకరించి వ్రాయటం సమంజసమెలా అవుతుంది?  అని శంకించి, పినవీరన ఆ ఔపమ్యాన్ని మార్చి,  మూడవ పాదంలో

“తన దానగరిమ చేత సురాగముల పెంపు దండించి యైవరగండఁ డయ్యె”

          అని ఏదో తత్కాలోచితంగా కల్పింపక తప్పలేదు. తన దానగరిమ చేత ఐదు కల్పవృక్షాల పెంపును అధఃకరించేందుకు “దండించి” అన్న క్రియారూపాన్ని వాడటం వల్ల ఐదు కల్పవృక్షాలకు అన్వయించే క్రియారూపసమానధర్మభేదం లేకపోయింది. పైగా ఎంత దండి వృక్షమైనా వృక్షాన్ని దండించి, “గండడిని”, “ఐవరగండడిని”  అని చెప్పుకోవటం సమంజసంగా లేదు. మూలశ్లోకాన్ని ఏదో ఒకవిధంగా రాచవారి సంతృప్తికోసం తెలుగు చేసే ప్రయత్నమే కాని భావయుక్తికోసం అంతగా పట్టించుకోలేదేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది.

        పైగా, మూలంలో
“యః పంచశాఖశాఖాభి ర్జిత్వా పంచామరద్రుమాన్
పంచఘంటానినాదోభూత్ పంచఘంటానినాదనాత్.”

అన్న శ్లోకం మఱొకటున్నది.  నరసింహరాయలు తన చేతివ్రేళ్ళు అయిదింటితో తన శరణుజొచ్చిన ఆర్తులకు చేసిన దానాలకు సూచకంగా మ్రోగిన అయిదు ఘంటానినాదాలు అయిదు కల్పవృక్షాల దానపరంపరల కంటె అమోఘములై, ఆయనకు “పంచ ఘంటానినాద” బిరుదాన్ని ఆర్జించిపెట్టాయనటంలో సొగసున్నది. “పంచఘంటానినాద”, “ఐవరగండ” బిరుద సందర్భాలను కలగాపులగం చేసి వ్రాయటం మూలాన పినవీరన పద్యంలో “తన దానగరిమ చేత సురాగముల పెంపు దండించి యైవరగండఁ డయ్యె” అన్న అపార్థకల్పన చోటుచేసుకొన్నది.    

        మఱొక సంగతి: శ్లోకం మొదటి పాదంలో “ఆసీ ద్ధరావరాహో యః ఖలాబ్ధే రుద్ధరన్ ధరాం” అన్న చోట దుష్టులనే జలధిగర్భం నుంచి వరాహారూప శ్రీ  మహావిష్ణువై భూమిని పైకి లేవనెత్తి నరసింహరాయలు “ధరణీవరాహుడు” అయ్యాడన్న బిరుదనిరూపణం సార్థకంగా ఉన్నది.  ఆ తర్వాత ఉన్న “కిణీకృతమహాబాహో రర్థిప్రత్యర్థిదానతః, యస్య బర్బరబాహుత్వం యథార్థ మభవత్ పరమ్” అన్న శ్లోకంలో నరసింహరాయల “బర్బరబాహు” బిరుదసార్థకత కూడా చెప్పబడింది. ఆ రెండింటిని ఏదో ఒకవిధంగా సంగ్రహించే ప్రయత్నంలో పినవీరన

“తన భుజాపరిఘ చేత ధరావరారోహ భరియించి బర్బరబాహుఁ డయ్యె”

          అన్న పాదాన్ని వ్రాసినా అందులో “బర్బరబాహు”త్వమే గాని “ధరణీవరాహ” బిరుద సామంజస్యం ప్రస్ఫుటం కాలేదు. “ధరావరారోహ” (భూకాంత) అన్నంత మాత్రాన “ధరణీవరాహత్వం” స్ఫురింపదు. పైగా, సముద్రంలో నుంచి భూమిని పైకి లేవనెత్తటం అన్నది పౌరాణికమైన ఉదంతం. ఖలసముద్రంలో నుంచి భూమిని పైకి లేవనెత్తటం అన్న తాద్రూప్యం “ధరణీవరాహ” నామాంకనానికి మూలాధారం. “భుజము అన్న పరిఘ (గడియ మ్రాను లేదా, ఇనుప గుదియ) చేత ధరావరారోహను భరించటం” అసలు ఊహకే అందని కల్పన. భూమిని బుజాని కెత్తుకోవటంలో ఔచిత్యధారణం ఏముంటుంది? అది “బర్బరబాహు”త్వానికి ఉపస్కారకం ఎలా అవుతుంది?

        ఏదో విధంగా బిరుదాల ప్రస్తావమే కాని - కవి ఈ పద్యంలో కల్పన గుఱించి సాంతం పట్టించుకోలేదేమో! అనిపిస్తున్నది. అంత తొందఱ తొందఱగా అవతారికను కూర్పవలసిన ఆవశ్యకత ఏమి కలిగిందో!

        జాగ్రత్తగా ఆలోచిస్తే, రెండవ పాదం తీరు కూడా ఈ విధంగానే ఉన్నది. మూలశ్లోకంలో -

                   “ప్రతాపేనార్కవద్వైరితమఃస్తోమం నిరస్య యః
                ప్రకాశయ న్నిమా ముర్వీ ముర్వరాదిత్యతాం గతః.”

          అని చిత్రితమై ఉన్నది. కృతిపతి నరసింహరాయలు తన ప్రతాపంతో సూర్యుని వలె శత్రువులనే చీకట్లను పటాపంచలు చేసి, భూలోకసూర్యుడై, “ఉర్వరాదిత్య” అన్న బిరుదాన్ని వహించటం సముచితం. వంశక్రమానుగతమైన బిరుదమే అయినప్పటికీ, ఆ బిరుదం నరసింహరాయలకు ఎంత సార్థకంగా అన్వయిస్తున్నదీ మహాకవి కవితాత్మకంగా అభివర్ణించాడన్నమాట.  పినవీరన పద్యంలో

“తన ప్రతాపంబు చేత దిగంతరంబుల దీపించి యంబరాదిత్యుఁ డయ్యె”

          అన్న రూపణం సముచితంగా లేదు. తన ప్రతాపం మూలాన దిగంతాలలో దీపించి, ఆకాశంలోని ఆదిత్యుడు కావటంలో ఆలంకారికత ఏముంటుంది? పైగా, సాళువ వంశీయుల బిరుదు “ఉర్వరాదిత్య” అనే గాని, “అంబరాదిత్య” కాదు కదా.
        అందుచేత పై పాదాన్ని సందర్భోచితంగా

“తన ప్రతాపంబు చేత దిగంతరంబుల దీపించి యుర్వరాదిత్యుఁ డయ్యె”

దిద్దుకోక తప్పదు. తన ప్రతాపం చేత దిగంతరాలలో దీపించి, లేదా, తన ప్రతాపం చేత దిగంతరాలను వెలుగొందజేసినవాడై నరసింహరాయలు భూలోకసూర్యు డయ్యాడని అన్వయించుకోవాలి.

        నాలుగవ పాదం తీరు ఇందుకేమీ భిన్నంగా తోపదు. పినవీరన ఇందులో

“తన మహత్త్వంబు చేతఁ బురాణపురుషుని మఱపించి చౌహత్తమల్లఁ డయ్యె”

          అని మూలంలోని “చౌహత్తమల్ల” అన్న ప్రాకృత భాషాధారితమైన బిరుదాన్ని కొంత వ్యాఖ్యానపూర్వకంగా అనువదించాడు. “చౌహత్తమల్లుడు” అంటే - “చతుర్ - నాలుగైన, హస్త - చేతులు కలిగిన, మల్లుడు - యోధుడు = శ్రీమహావిష్ణువు” అని అర్థం. “తన మహత్త్వంబు చేతఁ బురాణపురుషుని మఱపించి చౌహత్తమల్లఁ డయ్యె” అనటం కంటె “తన మహత్త్వంబు చేతఁ బురాణపురుషునిఁ దలఁపించి చౌహత్తమల్లఁ డయ్యె” అని వ్రాయటం భావ్యమే కాని, ఉపరి పాదాలలో వలె విశేషణ నిరోధం లోపిస్తుంది. నరసింహరాయలు పురాణపురుషుని మఱపించాడనటం శ్ర్రీకృష్ణ జగన్నాయకత్వప్రతిపాదనపూర్వకమైన కావ్యాదిని సమంజసం కాదు. పైగా, చతుర్భుజుని మహత్త్వాన్ని మఱపింపజేసే మాహాత్మ్యనిర్వర్ణనకు ప్రాతిపదికం ఏమిటో వర్ణించేందుకు సీసదళంలో అవకాశం లభింపనే లేదు.

        ఈ విధంగా పరిశీలించి చూస్తే - దేవులపల్లి తామ్రశాసనం (దీనికి నవీసుగా ఆ రోజులలో ఎఱ్ఱకోటపల్లి గ్రామంలో ఒక శిలా శాసనం కూడా వేయింపబడినదేమో తెలియదు) జైమిని భారతము అవతారికలోని కృతిస్వీకర్తృవర్ణనాత్మకాలైన కొన్ని ముఖ్యపద్యాలకు ఆధారకల్పమై ఉండినదని సులభంగానే ప్రతీయమానమై ఉన్నది.

        ఈ ఉపపత్తులను పురస్కరించికొని దేవులపల్లి తామ్రశాసనం ప్రకటితమైన నాటికి - అంటే, క్రీ.శ. 1504 ఆగస్టు 24-వ తేదీ నాటికి పెనుగొండలో ఇమ్మడి నరసింహరాయల పరిపాలన వేళకు - సాళువ నరసింహరాయలు జీవిత చరమసంధ్యాగతుడై ఉన్నాడని, ఆ సంవత్సరంలోనే - అంటే క్రీ.శ. 1504లో జైమిని భారతమును పినవీరన ఆయనకు వినిపించాడని భావింపవలసి ఉంటుంది.

రాజ్యపతనానంతరం సాళువ నరసింహరాయల స్థితిగతులు 

        వయోభారం వల్ల, ఎడతెఱపి లేని యుద్ధశ్రాంతి వల్ల, అనివార్యంగా సంభవించిన రాజకీయ విపరిణామాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై పట్టుతప్పి, శరణ్యాంతరం లేక, సత్తువ దక్కి ఉన్న సాళువ నరసింహరాయలు విజయనగర సింహాసనాన్ని క్రీ.శ. 1501 -1502 నాటికి ఈశ్వర నరసా నాయకుడు అధిరోహించిన కాలంలో తన కొడుకు ఇమ్మడి నరసింహరాయల క్షేమస్థేమాల కోసం మూకీభావం స్వీకరించి ఏకాంతంలో ఉన్నాడో, పెనుగొండకు తఱలి వెళ్ళి అక్కడే తురీయాశ్రమాన్ని గడిపాడో చెప్పటం కష్టం. కావ్యాన్ని ఆసాంతం వినిపించే అవకాశం తనకు దక్కుతుందో! దక్కదో! అన్న భయంతో పినవీరన జైమిని భారతము అవతారికను వడివడిగా ముగించి, మొత్తంమీద ఆయనకు వినిపించి, కృతిసమర్పణను నిర్విఘ్నంగా నెఱవేర్చుకొన్నాడనే భావింపవలసి ఉంటుంది. జైమిని మహర్షి విరచించిన భారతాశ్వమేధపర్వమును సలక్షణంగా, మూలనిర్నిరోధంగా, రసవంతంగా తెలుగు చేసినవాడు ఈ అవతారికా రచనావేళ కొంత తొట్రుపడి, ఏదో విధంగా ముగించివేయాలని ప్రయత్నించినట్లు అందదుకులుగా ఉన్న ఆ కూర్పు తీరే చెబుతున్నది. ఎంతో అపురూపంగా అవతారికను నిర్మింపగల మహాకవి - ఈ వ్యగ్రత వల్ల రాజనాథ డిండిముని సాళువాభ్యుదయము, సాళువ నరసింహరాయల పేర వెలసిన రామాభ్యుదయము కావ్యాల నుంచి కొన్ని కొన్ని శ్లోకాలను, దళాలను యథోచితంగా వినియోగించుకొన్నాడు. సాళువ గుండరాజు కొడుకులలో సాళ్వ మంగరాజును వర్ణిస్తున్న పద్యాలలో “వీరలలో నుతికెక్కెను, వీరాగ్రేసరుఁడు” అన్న కందపద్యం (1-31) “తేషాం మధ్యే సాళువాది మంగిదేవో మహాభుజః” అన్న రామాభ్యుదయము లోని శ్లోకానికి అచ్చమైన అనువాదం. ఆ తర్వాత, “దురములో దక్షిణ సురతాను నెదిరించి, కొనివచ్చి సంపరాయనికి నిచ్చె” అన్న సీసపద్యం (1-32) “ఆశా విజిత్యాపి చ దాక్షిణాత్య మసౌ సురత్రాణ మగా జ్జిగీషుః” అన్న సాళువాభ్యుదయములోని శ్లోకానికి అనురణనం. “శివరాత్రిప్రమదావలోకన” అన్న మత్తేభం (4-149) సాళువాభ్యుదయములోని “శివరాత్రిదత్తధనతృప్తమృత్యుజిత్” అన్న శ్లోకానికి అనువాదమని గతసంచికలో సవిస్తరంగా నిరూపించాను. “సత్కవుల త్రుప్పు డుల్చు వసంతవేళ” అన్న సీసపద్య శ్లేషానుప్రాణితరూపకం సాళువాభ్యుదయములోని “వస్త్రాద్యఞ్చ వసంతదానవిషయే దత్తం” అన్న శ్లోకభావం తెలిస్తేనే కాని అర్థం కాదు.

మఱొక అపురూపమైన సన్నివేశకల్పన

        జైమిని భారతము గ్రంథాంతంలో పినవీరన ఇంతకు మునుపు ఏ తెలుగు కావ్యంలోనూ ఏనాడూ లేని తీరున - కథాగతంగా శ్రీకృష్ణ పరమాత్మ చేత ధర్మరాజుకు -

క.      ఆ సమయంబున, ధర్మజ!
          నే సోమకులంబునను జనించి, కుటిలులన్
        శాసించి, ధరణిపాలన
        చేసెదఁ దగ - సాళ్వ నరసింహుఁడ నగుచున్.     జైమిని.(8-214)

        అని ప్రబోధింపజేశాడు. ఇది ఏ కావ్యంలోనూ మనము కానీ వినీ ఎఱుగని వింత ప్రయోగం. సంస్కృత జైమినీయాశ్వమేధపర్వములో దీనికి మూలం లేదు.

“కుటిలులన్, శాసించి ధరణిపాలన, చేసెదఁ దగ సాళ్వ నరసింహుఁడ నగుచున్”

        అని ఈ విధంగా అపూర్వమైన ఆశ్వాసనాన్ని జగన్నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ నోట చెప్పించటం - పూర్వవైభవాన్ని కోల్పడి చింతావ్యాకులితుడై ఉన్న కృతిపతి నరసింహరాయలకు ధైర్యం నూఱిపోయటానికే అని స్పష్టం.

        విశ్వసాహిత్యంలోనే అరుదైన ఘటనమిది.      

        ఆ ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వీడ్కోలు పలికి, ద్వారకకు బయలుదేరిన సన్నివేశంలో పినవీరన మఱొక పద్యాన్ని కూడా వ్రాశాడు -  
         
చ.     అని వినిపించి; శౌరి శమనాత్మజుఁ డర్మిలి నిచ్చు పూజఁ గై
        కొని, సకుటుంబుఁ డై నృపతికోటి భజింపఁగ ద్వారకాపురం
        బున కనురక్తితో నరిగి, పూర్వపదంబుల నిల్పె రాజులన్;
        జననుతుఁ డా యుధిష్ఠిరుఁడు సర్వధరిత్రియు నేలె నున్నతిన్.                                                     జైమిని. (8-215)
        శ్రీకృష్ణుడు ధర్మరాజు చేసిన పూజలన్నిటినీ గ్రహించి, ద్వారకకు తరలి వెళ్ళిన తర్వాత

“పూర్వపదంబుల నిల్పె రాజులన్”

అన్న దళం కూడా పినవీరన నరసింహరాయలకోసం స్వతంత్రించి వ్రాసినదే కాని సంస్కృత జైమినీయాశ్వమేధపర్వములో దీనికి మూలం లేదు. అక్కడున్నదల్లా -

                “తతః కృష్ణాదయః సర్వే ధర్మరాజేన ధీమతా
                పూజితా యాదవా స్తత్ర నృపాశ్చ బహుమానితాః.
                నరనారీమహీపాలాః స్వాని సౌఖ్యాని భేజిరే
                హర్షప్రముదితా లోకా హ్యాసన్ ధర్మేణ పాలితాః.”                               జైమినీయాశ్వమేధము.(68-1,2)
        అని మాత్రమే. కనుక, ఇదంతా కృతిపతి నరసింహరాయల కుశలస్థేమాకాంక్షానిమిత్తమే కాని కేవలానువాదమాత్రం కాదన్నది స్పష్టమే.

        విశ్వసాహిత్యంలో కావ్యాంతర్గతమై ఇటువంటి అరుదైన సంఘటన వేఱొకటి ఉంటుందని నేననుకోను. కృతిపతి యెడ ఒక కవియొక్క భక్తికి, అనురక్తికి, ఆశీర్యుక్తికి, ఆత్మీయతకు, నిఃస్వార్థశ్రేయోభిలాషకు, శుభాకాంక్షకు, విద్యాసార్థకతకు, హృద్యసంవాదానికి, చరితార్థతకు - ఇంతకంటె ఉదాహరణీయమైన ఉదాహరణ వేఱొకటి ఉంటుందా?

        అందుకే, పినవీరన నరసింహరాయలను ఉద్దేశించి మళ్ళీ ఒక సీసపద్యాన్ని చెప్పాడు.

        “సీ.   నీకును మల్లమాంబాకుమారునకు సో
                                మకులాంబునిధి పూర్ణిమావిధునకు
                భరతకీర్తికిఁ దులాపురుషాది దానాంబు
                                జంబాలితాస్థానసౌధునకును
                బరరాజభీకర ధరణీవరాహున
                                కాత్రేయ గోత్ర పవిత్రునకును
                గుండయ నరసింహ మండలేశ్వరునకు
                                నభ్యుదయ పరంపరాభివృద్ధి
        గీ.     కరముగా భారతీ తీర్థ గురు కృపా స
                మృద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
                కుకవిమల్లకషోల్లసత్ కులిశ (?కుశల) హస్త
                పల్లవుఁడు చెప్పె పినవీరభద్ర సుకవి.         జైమిని. (8-219)

        అని! ఇది కూడా ఆంధ్రకావ్యశ్రేణిలో “నీకు” అని ఆశీర్వాద రూప సంబుద్ధిగా గ్రంథాంతంలో కవి పద్యరచన చేయటం అపురూపమైన సంఘటనమే.

జైమిని భారతము రచనా కాలం
        దేవులపల్లి తామ్రశాసనాన్ని బట్టి, ఇతరాధారాలను పురస్కరించికొని - శ్రీకృష్ణదేవరాయల తండ్రి తుళువ ఈశ్వర నరసా నాయకుడు అందరూ అనుకొంటున్నట్లు సాళువ నరసింహరాయలను కాని; ఇమ్మడి నరసింహరాయలను కాని - క్రీ.శ. 1502కు పూర్వం తుదముట్టింపలేదని స్పష్టపడుతున్నది. విజయనగర సామ్రాజ్యచరిత్రలోని ఒక చీకటికోణం దీని వల్ల చెల్లాచెదరవుతున్నది. క్రీ.శ. 1504 నాటికి ఇమ్మడి నరసింహరాయలు పెనుగొండలో రాజ్యం చేస్తుండగా తండ్రి సాళువ నరసింహరాయలు బ్రతికే ఉన్నాడని, ఆయన యందలి విశ్వాసంతో పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి తన జైమిని భారతమును ఆయనకే అంకితం చేశాడని, కావ్యాంతంలో రాజుకు మళ్ళీ రాజ్యప్రాప్తి కలగాలని ఆకాంక్షించాడని పైని వ్రాశాను. రాజు వృద్ధావస్థలో ఉండగా రచిత-సమర్పితమైన కావ్యం కాబట్టి పినవీరన రాజుకు పరిపరి విధాలా ఆశ్వాసనం పలికి ఆశీర్వదింపవలసి వచ్చింది. అదే కారణం వల్ల కొంత త్వరత్వరగా అవతారికను ఏదో ఒకవిధంగా ముగించివేసే ప్రయత్నం జరిగినట్లు కనబడుతుంది.

        ఈ ప్రయత్నాన్ని ఇంకా మఱొక తీరున నిరూపించే ప్రయత్నం చేస్తాను.

        జైమిని భారతము కావ్యాదిపద్యమే విచిత్రంగా సాగింది. శ్రీనాథుని వలెనే పినవీరనకు సంస్కృతంలోని సంధానగ్రంథాలలోనూ, విద్వత్పరిషత్తులలోనూ ప్రస్తావనకు వచ్చే చాటూక్తులంటే అమితమైన అభిమానం. ఈ అభిమానం ఆయన కొంత స్వతంత్రించి వ్రాసిన శాకుంతల శృంగారకావ్యములో  అధికంగానూ, బహుకథానిర్భరమై, కేవలం మూలవిధేయంగా నడిచిన జైమిని భారతములో పరిమితప్రాయంగానూ ప్రస్ఫుటించింది. ఏమైనప్పటికీ, మంగళాద్యాశీర్ముఖనిర్వహణకు పినవీరన వంటి మహాకవి స్వతంత్రంగా కల్పనను నిర్వర్తింపక ఏదో పూర్వమహాకవి రచితాన్ని అనువదించాడంటే - ఆశ్చర్యంగానే ఉంటుంది.

        పినవీరన ఆ పద్యం ఇది:  

శా.    శ్రీలావణ్యపయోనిధిత్రివళివీచీమధ్యరోమావళి
        వ్యాళానల్పసుఖైకతల్పుఁడు జగద్వ్యాపారలీలావతా
        రాలంకారవిహారి శౌరి సదయుండై సాళ్వ గుండక్షమా
        పాలాగ్రేసరు నారసింహుని నదభ్రశ్రీయుతుం జేయుతన్.జైమిని. (1-1)

        విమర్శకులు ఇంతవఱకు గుర్తింపని హరికవి రచించిన దీని మూలశ్లోకం ఇది:

             “లావణ్యపుణ్యసలిలౌఘమహార్ఘతీర్థే
                తస్యా వలిత్రయతరఙ్గిణి మధ్యదేశే
                నిర్వాణ మృచ్ఛతి మనఃసహజైకతాన
                మస్మి న్ముహుః కి మనుభావయతీవ దృష్టిః.”

        అని. మూలంలోని సరస శృంగారభావాన్ని సాళ్వ నరసింహరాయల రాజసానికీ అతోధిక బహుళ సంపత్పరంపరాభివృద్ధికీ నైపథ్యంగా సమకూర్చుకొని ఆశీరూపమైన మాంగళికాన్ని అద్భుతంగా నిర్వహించాడు.  “లావణ్యపుణ్యసలిలౌఘమహార్ఘతీర్థే, తస్యా వలిత్రయతరఙ్గిణి మధ్యదేశే” అన్నప్పటి చూపును నాయికాశృంగారంనుంచి భక్తిపథానికి మళ్ళించి, “శ్రీలావణ్యపయోనిధిత్రివళివీచీమధ్యరోమావళి, వ్యాళానల్పసుఖైకతల్పుఁడు” అన్న శ్రీమహావిష్ణుస్వరూపనిర్వర్ణనకు పరికరింపజేశాడు.

        ఇదే సమయంలో వీర్యమిత్రాచార్యుని శ్లోకంకూడా పినవీరన మదిలో మెదలుతున్నది:

             “లావణ్యామృతసింధుసాంద్రలహరీసంసిక్త మస్యా వపు
                ర్జాత స్తత్ర నవీనయౌవనకలాలీలాలతామణ్డపః
                తత్రాయం స్పృహణీయశీతలతరచ్ఛాయాసు సుప్తోత్థితః
                సంముగ్ధో మధుబాంధవః స భగవా నద్యాపి నిద్రాలసః.”

        అని. నాయికా వయస్సంధి వర్ణనలో ప్రసక్తమైన ఈ శ్లోకం జైమిని భారతములో భక్తినివేశం వల్ల భగవానుని సుఖైకతల్పతకు, జగద్వ్యాపారలీలావతారాలంకరిష్ణుతకు మూలకందం అయింది.

        పద్యశోభ మాట అటుండగా - తొలి పద్యమే అనువాదం కావటం ఇక్కడ ప్రసక్తింపబడుతున్న విశేషం.

        ఇది విఘ్నేశ్వర స్తుతి; వాసుకల్పుని శ్లోకానికి యథారూపానువాదనం:

మ.   తొలుమ్రొక్కుల్ గొను వేల్పుఁ గొల్తు శశభృత్కోటీరుఁ, గోటీరట
        త్కలభూషాంకితగాత్రు, గాత్రమరసంఘస్తోత్రవేళానిర
        ర్గళధారాళకటప్రదానతటినీరంగద్విరేఫాలికా
        కలికాలోలవిచారుఁ, జారుహరిభృత్ప్రాలంబు లంబోదరున్.                                  జైమిని.(1-4)
         వసుకల్పుని శ్లోకం:
             “కపోలా దుడ్డీనై ర్భయవశవిలోలై ర్మధుకరై
                ర్మదామ్భఃసంలోభా దుపరిపతితుం బద్ధపటలైః
                చలద్బర్హిచ్ఛత్త్రశ్రియ మివ దధానోఽతిరుచిరం
                అవిఘ్నం హేరంబో భవదఘవిఘాతం ఘటయతు.”
        జైమిని భారతము అవతారికలోని పద్యాలన్నీ ఇంచుమించుగా అనువాదకల్పాలే.
        క్రీ.శ. 1500 - 1501 ప్రాంతాల వెల్లంకి తాతంభట్టు కవిచింతామణిని రచించాడు. అందులో పినవీరన శృంగార శాకుంతలము నుంచి ఒక లక్ష్యోదాహరణం ఉన్నది. జైమిని భారతము నుంచి లేదు. క్రీ.శ. 1504 ఆగస్టు 25 నాటి దేవులపల్లి తామ్రశాసనంలోని శ్లోకాల అనువాదం జైమిని భారతములో ఉన్నది. ఇంకా క్రీస్తుశకం 1495 – 1500 ప్రాంతాల వెలసిన అనేక సంస్కృతరచనల అనువాదాలు జైమిని భారతములో ఉన్నాయి. ఈ సాక్ష్యాలన్నింటిని బట్టి పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి క్రీ.శ. 1504-వ సంవత్సరాంతం వఱకు జీవితుడై ఉన్నాడని, సాళువ నరసింహరాయల మరణానంతరమో, అంతకు మఱికొంత కాలానికో కర్తవ్యకర్మలు నెరవేరి కర్మశేషం తీరిన తర్వాత భగవత్సన్నిధిరూపమైన పెన్నిధికి నోచుకొన్నాడని సంభావిస్తూ ఆ సరస్వతీ పుంభావమూర్తికి, ఆ మహాకవిత్వదీక్షాదక్షునికి సాహిత్యికులం వినయవినమితశిరస్కులమై భక్తిపూర్వకంగా ప్రణమిల్లుదాము.     
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech