సారస్వతం  
     వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 2 పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు  
“అంబరసీమఁ దారలు ...” పద్యం శ్రీనాథునిదా?
 

ఉ. అంబరసీమఁ దారలు, జటాటవి మల్లెవిరుల్, భుజాంతరా

ళంబున హారసంతతు, లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ

నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళిగం

గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్.

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన శివస్తోత్రం ఇది. పరమశివుని గుణకర్మప్రశంస రూపుదాల్చి ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షకు, గమ్యమానౌపమ్యంతో తుల్యయోగితకు స్వతఃప్రమాణమైన ఈ హృద్యమైన పద్యాన్ని అధర్వణ భారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం లోనిదిగా నేటికొక శతాబ్ది క్రితం ముమ్మొదటిసారిగా సుగృహీత నామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వెలుగులోకి తెచ్చారు. 1909లో వల్లభరాయని క్రీడాభిరామం ప్రకటించినప్పుడు తత్పీఠికలో వారు దీనిని ఉదాహరిస్తూ -

“మాకు దొరకిన (క్రీడాభిరామ) ప్రతిలో నాంది పద్యములు లేవు గావునఁ జదువువారల కొఱకు మొదటి [పైని పేర్కొన్న “అంబరసీమఁ దారలు”] పద్యమును అధర్వణుని భారత విరాట పర్వమున మొదటి యాశ్వాసమునుండి … గ్రహించి యిందుఁ బొందుపఱిచితిమి.”

అని ప్రస్తుతీకరించారు.

అధర్వణుని   దొరకలేదు. రామకృష్ణకవిగారు అధర్వణుని ఆ భారత విరాటపర్వ పద్యం తమకెక్కడ లభించినదీ చెప్పలేదు. అధర్వణ భారతం నుంచి లక్షణగ్రంథాలలోనూ, సంకలనగ్రంథాలలోనూ మనకిప్పటివరకు దొరికిన పద్యాలలో వా రుదాహరించిన పై పద్యం లేదు. అందువల్ల తథ్యమిథ్యావివేచన తప్పనిసరి అయింది.

అయితే, రామకృష్ణకవిగారు అధర్వణ భారతం లోనిదని ఉదాహరించిన పద్యం - వారప్పుడు చెప్పకపోయినా - తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిలో దామరాజు సోమయ రచించిన భరతము లోనిదిగా ఉదాహరింపబడి ఉన్నదని విమర్శకులు ఆనాడే గుర్తించారు. ప్రబంధరత్నాకరం అవతారికలోని ఈశ్వరస్తుతిపరకపద్యావళిలో 41-వ పద్యంగా పెదపాటి జగ్గన దానిని నిమిత్తీకరించాడు. జగ్గన ప్రబంధరత్నాకరాన్నీ, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తులోని ఉదాహరణ పద్యములు అన్న సంధానగ్రంథాన్నీ 1918లో ప్రబంధరత్నావళి అన్నపేరిట సంయుక్తంగా పరిష్కరించిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు జగ్గన నిర్దేశానుసారం దానిని `దామరాజు సోమయ్య భరతము' లోనిదిగా పేర్కొని, తమ సంధానంలో 483-వ పద్యంగా చేర్చుకొన్నారు. 1909లో రామకృష్ణకవిగారు ఆ పద్యం అధర్వణ భారతం లోనిదని పేర్కొన్న వివాదాస్పద విషయాన్ని వారు తమ పీఠికలో ప్రస్తావింపలేదు. గ్రంథాదిని సంకలనించిన అధర్వణాచార్యుల భారత పద్యసంచయంలో దానిని స్వీకరింపలేదు.

పై పద్యం దామరాజు సోమయ్య భరతము లోనిదని గాక అధర్వణ భారతం లోనిదని పేర్కొన్నందువల్ల తంజావూరి గ్రంథాలయంలో అప్పటికింకా పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిని మానవల్లి రామకృష్ణకవిగారు చూచి ఉండరని అనలేము. 1894కు పూర్వమే వారు ఆ కృతిని సాకల్యంగా పరిశీలించారు. 1895 మే 19వ తేదీనాడు చెన్నపురి పురశవాకం హిందూ యూనియన్ భాషాభివర్ధినీ సమాజంలో వారు చదివిన ఆంధ్రభాషను గూర్చిన యుపన్యాసములో అందుకు నిదర్శనాలు కనబడతాయి. 1908లో ప్రకటించిన నన్నెచోడుని కుమార సంభవం ప్రథమభాగం అనుబంధంలో వారు జగ్గనను పేర్కొనకపోయినా, ప్రబంధరత్నాకరంలో నుంచి లెక్కలేనన్ని ఉదాహరణల నిచ్చారు. అంతకు పూర్వం విమర్శకులెవరూ కనీ వినీ యెరుగని అపూర్వగ్రంథాలలోనుంచి ఆ అనుబంధంలోనూ, 1914లో ప్రకటించిన ద్వితీయభాగం అనుబంధంలోనూ వారిచ్చిన పద్యోదాహరణలు జగ్గన ప్రబంధరత్నాకరంలో గాక మరెక్కడా లేవు. అందువల్ల పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిని మానవల్లి రామకృష్ణకవిగారు చూడలేదని అనలేము. అయితే, జగ్గన తన కృతిలో ప్రస్తావించిన భరతము సంగతిని ప్రమాదవశాన రామకృష్ణకవిగారు గుర్తింపలేదా? అంటే, అదీ వారికి పరిచితమేనని 1923లో భారతిలో వారు ఉపవేదములు-గ్రంథసూచిక వ్యాసంలో వ్రాసిన

`1350 (?) కాలమున దామిరాజు సోమన భారతీయమంతయుఁ దెనిఁగించినట్టు కానవచ్చుఁ గాని యది సంపూర్ణముగా లభింపదయ్యె.'

అన్న వాక్యం వలన స్పష్టపడుతున్నది. ఐనా, `అంబరసీమఁ దారలు ...` అన్న పద్యం జగ్గన పేర్కొన్నట్లు దామరాజు సోమయ్య భరతము లోనిదిగా ఉదాహరింపక అధర్వణ భారతం విరాటపర్వం మొదటి ఆశ్వాసం లోనిదని వారు ఏ విధంగా నిశ్చయించారో క్రీడాభిరామం పీఠికలో కారణం తెలుపలేదు.

ప్రబంధరత్నాకరంలో పెదపాటి జగ్గన ఉదాహరించిన ఐదు పద్యాలు గాక దామరాజు సోమన రచన భరతము అంటూ కావ్యమేదీ మనకింతవరకు లభింపలేదు. అధర్వణ భారతం నుంచి లభిస్తున్న ఉదాహృతులలో పై పద్యం లేదు. అందువల్ల స్థితగతిచింతనగా ప్రాకరనిర్దేశం ఆవశ్యక మవుతున్నది.

పద్యస్థితిస్థాపన విషయం:

సోమన కృతి భరత నాట్యశాస్త్రానువాదం కాబట్టి కావ్యారంభంలో శంభుదైవతస్తుతి భావ్యమే కాని, `అంబరసీమఁ దారలు ...' పద్యాంతంలోని `శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్' అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం లోనిదన్న నిర్ణయానికి ప్రతిబంధకంగా ఉన్నది. సోమన కృతి నాట్యశాస్త్రలక్షణకావ్యమే కాని నాట్యప్రబంధం కాదు. ఈ విమర్శ అధర్వణుని భారతానికీ వర్తిస్తుంది. అధర్వణుని భారతం కావ్యసామాన్యమే కాని నాట్యనిబంధం కాదు. ఆశీరర్థకమైన మంగళం లూణ్మధ్యమంలో అక్కడా విధాయకం కాదు. అదీగాక జైనుడని చెప్పబడుతున్న అధర్వణుడు కావ్యావతారికలో శంభుస్తుతి కావిస్తాడా? అన్న సంశయం ఒకటీ, భారత విరాటపర్వంలో శంభుస్తుతికి తావలమైన ఘట్టం వేరొకటి లేనందున ఇది అన్యపర్వాలలోని పద్యం కావచ్చునా? అన్న సంశయం ఒకటీ ఉదయిస్తాయి. రామకృష్ణకవిగారి వద్ద మనకిప్పుడు లభ్యం కాని అధర్వణ భారతం ఒకటుండినదని విశ్వసించటానికి ఆధారాలు లేవు. అధర్వణ భారతం నుంచి లక్షణగ్రంథాలలోనూ, సంకలనగ్రంథాలలోనూ లభించిన పద్యాలలో పై పద్యం లేదు. ఈ పద్యానికి తర్వాత సోమన కృతిలోనుంచి పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరంలో 83-వ పద్యంగా ఉదాహరించిన వినాయక ప్రార్థన యుష్మదర్థకంలో లేదు. కావ్యావతరణికకు తగినట్లు కవిప్రార్థితోపపన్నంగా ఆత్మార్థకంలో సలక్షణంగానే ఉన్నది. ఆ పద్యపాఠం ఇది:

ఉ. నందిమృదంగరావము ఘనస్తనితం బని మ్రోల నున్న యా

స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్య మాడ భీ

తిం దన హస్తరంధ్రముగతిం జొరు నాభరణాహిరాజి వో

వం దలయూచు విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్.

అని. ఇందులో `... విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్' అని ఉన్నట్లే పై పద్యాన్ని 'శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్' అని సవరించి చదువుకోవచ్చును గాని, ఆ పరిష్కరణం సమంజస మనిపించలేదు. అందువల్ల ప్రాకరాదికనిర్దిదిక్ష కలిగింది.

పద్యార్థవిశదిమ

ఈ విధంగా - వివాదపరిష్కారానికి గ్రంథాంతరసంవాదం లేనందున - అర్థవల్లిని బట్టి పద్యస్థితిస్థాపన సాధ్యమేమో పరీక్షింపవలసి ఉన్నది. `ఆడెడు శంభుఁడు' అన్న రూపణ వల్ల శివతాండవమూ, `సత్కృతాంజలి' అన్నందువల్ల రెండు సర్పశీర్షాలనూ అధోముఖంగా చిటికెనవ్రేళ్ళతో జోడించిన పుష్పపుటహస్తమూ చిత్రితాలన్న విషయం స్పష్టమే. `సర్పశీర్షో మిళద్బాహ్యపార్శ్వః పుష్పపుటో భవేత్, ధాన్యపుష్పఫలాదీనా మపాం చ గ్రహణే'ర్పణే, కార్యః పుష్పాఞ్జలౌ' అని శార్ఙ్గదేవుడు సంగీతరత్నాకరంలో నిర్వచించాడు. ఆ `సత్కృతాంజలి' పుష్పాంజలి సమర్పణవేళ అయితే, సర్పశిరోహస్తాల సంశ్లేష వర్ణిత మన్నమాట. `వ్యక్తం సంశ్లిష్టకరభావుత్తానౌ సర్పశీర్షకౌ, హస్తః పుష్పపుటో నామ పుష్పాఞ్జలివిసర్జనే, ధాన్యపుష్పాఫలాదీనాం గ్రహణే దేవతార్పణే, అర్ఘ్యదానే గురునృపప్రసాదగ్రహణే తథా, పాణిపాత్రాశనే తోయానయనే చ ప్రకీర్తితాః' అని విప్రదాసుని సంగీతచంద్రం. నాట్యశాస్త్రానుసారం పుష్పాంజలి హస్తం కూడా సత్కృతాంజలి వేళ ప్రయోక్తవ్యమే. `ప్రణతోన్ముఖకోదండసమానముకులాకృతిః, శ్లిష్టాఙ్గులికరద్వంద్వం పుష్పాఞ్జలి రితి స్మృతమ్' అని ఔమాపత్యంలో ఉమాపతినిర్వచితం. `ఆడెడు శంభుఁడు' అన్న రూపాన్వితకరణమూ నాట్యార్థంలో కవిప్రయోగరూఢమే. `ఆడు=నర్తించు అని ధాత్వర్థం. `ఆడెం దాండవ మార్భటీపటహలీలాటోపవిస్ఫూర్జిత, క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు' అని భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. `స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్య మాడ; అని దామరాజు సోమయ్య భరతము లోనిదే, ఇందాక చూపిన ప్రయోగం.

పద్యప్రతిపాదితార్థం ఏమిటి? ఆకాశంలోని తారకలు, జటాజూటంలోని మల్లెపువ్వులు, వక్షఃస్థలాన అలంకరించుకొన్న విరిదండలు, కైలాస రంగభూమిపై దేవతలు కురిపిస్తున్న పూలవానలు పరమశివుని కరాంజలిపుటంలోని అర్ఘ్యతోయంలో ప్రతిబింబించి పూజార్థం సమర్పింపబడుతున్న పుష్పములో అన్నట్లుగా తోచాయి. అంతవరకు ఉత్ప్రేక్ష సలక్షణంగా ఉన్నది. అయితే, `మౌక్తిక-తుల్య-గంగా-అంబుకణంబులు ఉట్టిపడ'గా శంభుడు ఆడుటకు సాంగతికమైన స్పష్టార్థప్రతీతి లేదు. జలకణాలకు మౌక్తికోపమానం కవిప్రయోగసిద్ధమే కానీ ప్రాకరణికార్థంలో గంగాంబుకణాలకు మౌక్తిక-`తుల్య'-త్వాన్ని చెప్పటం వల్ల కలిగిన ప్రయోజనం సువ్యక్తం కాలేదు. ఇందుకు ప్రత్యుదాహరణగా 'గీ. సతులు చల్లుఁబోరాడుచో జలకణములు, నెఱికురులమీఁద నిండి క్రిక్కిఱిసి చెలువ, మమరెఁ గనుఁగొన నింద్రనీలముల తోడఁ, గలయఁ గ్రుచ్చిన మౌక్తికంబులును బోలె' అన్న చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనంలోని పద్యం పరిశీలనీయం. జలకణాలు నాయిక కబరీభరంలోని ముత్యాలగమి వలె భాసిల్లటాన్ని అక్కడ కవి శోభావహంగా చిత్రీకరించాడు. ఒత్తైన శిరోజాల నీలిమ వల్ల కేశపాశాన్ని అంటుకొని పైనిండిన నీటితుంపరలు ఇంద్రనీలమణుల లాగానూ, క్రొత్తగా చల్లిన జలకణాలు ఆ నల్లని మణులతో కలిసి మెరుస్తున్న ముత్యాల జల్లు లాగానూ చిత్రవర్ణకిర్మీరితమై ఉండటం నిరూపితమై చిమ్మపూడి అమరేశ్వరుని పూర్ణోపమ కళాపూర్ణోదయంగా అమరింది. పుష్పపుటాంజలి హస్తంలో పరమశివుని శిరోలంకృతమైన గంగాజలకణగణం ఉట్టిపడినందుకు, అది మౌక్తికతుల్యమైనందుకు సార్థకత సువిశదంగా లేదు.

అందుకు కారణం ఈ పద్యానికి మూలమైన శ్లోకాన్ని చూస్తేనే కాని బోధపడదు. అది వేమభూపాలుడు సంకలనించిన ప్రాకృత సప్తశతీసారం లో ఉన్నది!

ఆ గాథ ఇది:

`పసువఇణో రోసారుణపడిమాసంకంతగోరిముహఅందం

గహిఅగ్ఘపంకఅం విఅ సంఝాసలిలాంజలిం ణమహ.'

అని. ఇది వేమభూపాలుని ప్రాకృత సప్తశతీసారం సంకలనంలోని తొలి గాథ. దీనిపై పెదకోమటి వేమభూపాలుని భావదీపికా వ్యాఖ్య ఈ విధంగా ఉన్నది:

`అథ శాలివాహననరేన్ద్రో నిర్విఘ్నగ్రన్థసమాప్త్యర్థ మిష్టదేవతానమస్కార మాదౌ నిబధ్నాతి. పసువఇణో – 'పశుపతే రోషారుణప్రతిమాసఙ్క్రాన్తగౌరీముఖచంద్రమ్, గృహీతార్ఘ్యపఙ్కజ మివ సంధ్యాసలిలాఞ్జలిం నమత.` గోరిముహఅందం - ఇత్యత్ర 'గభీరగ ఇత్` ఇతి ఇత్వమ్. పశుపతేః సంధ్యాసలిలాఞ్జలిం నమత. కథమివ స్థితమ్. రోషారుణప్రతిమాసఙ్క్రాన్తగౌరీముఖచంద్రం సద్గృహీతార్ఘ్యపఙ్కజ మివ స్థితమ్. అత్ర గౌర్యా రోషస్య కారణం సన్ధ్యావనితావన్దనమ్. యతః స్త్రీణామ్ అన్యాసఙ్గమవశా దీర్ష్యమానో భవతి. అర్ఘ్యాఞ్జలౌ పుష్పం వా ఫలం వా నిక్షేప్తవ్యమ్. అత్రోత్ప్రేక్షాలఙ్కారః. “అన్యథావస్థితా వృత్తి శ్చేతనస్యేతరస్య వా, అన్యథోత్ప్రేక్ష్యతే యత్ర తా ముత్ప్రేక్షాం విదు ర్బుధాః.'

అని. శాలివాహనకృతమైన ఈ గాథ తాత్పర్యార్థం ఇది: పరమశివుడు కర్మరతుడై సంధ్యావందనానికి ఉపక్రమించాడు. సంధ్యాదేవి (పితృదేవతలకు తల్లి అయిన) బ్రహ్మపత్ని కదా! భర్తకు పరకాంత యందు సంగమాభిలాష కలిగిందని పార్వతీదేవికి అసూయ పైకొని, రోషావేశం వల్ల చంద్రబింబాన్ని పోలిన ఆమె ముఖం ఎఱ్ఱబారింది. పరమశివుడు అర్ఘ్యప్రదానానికై దోయిలించినపుడు ఆ నీటిలో ఆమె ఎఱ్ఱని ముఖం ప్రతిబింబించి, అది ఆయన కరకమలగృహీతమైన పువ్వువలె భాసించింది. దేవతాపూజకు ఉపక్రమించినవారు అర్ఘ్యతోయంలో పుష్పమో ఫలమో నిక్షేపించటం ఆచారం. ఆ విధంగా మనోజ్ఞపుష్పభరితమై తోచిన పశుపతి యొక్క జలాంజలికి ప్రణమిల్లుతారు గాక! అని.

వేమభూపాలుడు జగద్విఖ్యాత వ్యాఖ్యాత. గాథాలక్షణమైన వస్తుధ్వనిని ఆయన వలె గుండెలకు హత్తుకొనిపోయేట్లు విప్పిచెప్పగలవారు సాహిత్యరసికులలో ఏ కొద్దిమందో ఉంటారు. ఇందులోని ఉత్ప్రేక్షను వేమభూపాలుడు ప్రకాశ్యార్థప్రకాశనగా అద్భుతావహంగా నిర్వచించాడు. పార్వతీదేవి రోషానికి కారణం పరమేశ్వరుని సంధ్యావనితావందనమన్న భావాన్ని చక్కగా వివరించాడు. శీలార్జవం కలిగిన నాయికకు నాయకుని అన్యాసంగమం పట్ల అసహిష్ణుతను ప్రణయినీసహజమైన మనోధర్మంగా నిరూపించాడు. మల్లెమొగ్గ వంటి గాథాహృదయం ఆయన వ్యాఖ్యానం మూలాన ప్రఫుల్లంగా వికసించి అర్థవత్త నెత్తావులను దిగంతాలకు విరజిమ్మింది.

వేమభూపాలుని కంటె మునుపు వ్యాఖ్యాతృశిరోమణి భువనపాలుడు తన గాహాకోస టీకలో రసాద్యర్థాన్ని మరికొంత వ్యాఖ్యానించి, సద్వస్తువునందు అసద్వస్తువు ఆరోపితమైనందున వస్త్వంతరోపపత్తి మూలాన వస్తూపక్షేపరూపంగా ఈర్ష్యా విప్రలంభశృంగారం ప్రతీయమానమని ఇందులోని భావధ్వనిని విశదీకరించాడు. ఇది హాల సాతవాహనకృతమని, సాక్షాన్మహేశ్వరసమర్పితమైన సంధ్యాసలిలాంజలి వర్ణితమైనందున సకలవిఘ్నప్రతిబంధసిద్ధిదాయకమని గాథయొక్క నాందీముఖత్వాన్ని సమర్థించాడు.

హాలుని సప్తశతకం కావ్యాన్ని 1881లో సర్వపాఠాంతర సమాకలనపూర్వకంగా పరిష్కరించి జర్మన్ భాషానువాద విపులవ్యాఖ్యాసమేతంగా అచ్చువేసిన మహాపండితుడు ఆల్బ్రెహ్ట్ వెబర్ ఈ గాథలోని భాషావైభవాన్ని ప్రాకృత వ్యాకరణాధారితంగా చర్చించి, దీనిని కాళిదాస కుమారసంభవం ప్రథమసర్గలోని `చన్ద్రం గతా పద్మగుణా న్న భుఙ్క్తే', `పుష్పం ప్రవాలోపహితం స్యా, న్ముక్తాఫలం వా స్ఫుటవిద్రుమస్థం' (1 - 43, 44) అన్న రెండు శ్లోకాల కల్పనలతో పోల్చిచూడమని సూచించాడు. ఆ తులనీయశ్లోకానుశీలనం గాథాహృదయావిష్కరణకు నిస్తులదోహదకారిగా ఉండటం విశేషం. వెబర్ వ్యాఖ్య ఆ మహావిద్వాంసుడు కావించిన అపూర్వమైన మహాకృషికి, అసామాన్యమైన ఆయన వైదుష్యసంపదకు, శాస్త్రీయమైన పాశ్చాత్యపరిశోధన తీరుతెన్నులకు నిదర్శకమై పరిష్కర్తలకు పథప్రదర్శకంగా విరాజిల్లుతున్నది. ఆ విద్వత్సార్వభౌముడు పైని పేర్కొన్న గాథకు సమాంతరంగా గంగాధర టీక తోడి పాఠంలో 697-వదిగా ఉన్న `సంఝాగహిఅజలాంజలిపడిమాసంకంతగోరిముహకమలం, అలిఅం చిఅ ఫురిఓట్ఠం విఅలిఅమంతం హరం ణమహ` అన్న మరొక గాథను `అథ సమాప్తౌ హరనమస్కారరూపం మఙ్గలం ఆచరతి. హరస్యాపి గౌరీముఖకమలప్రతిబింబం దృష్ట్వా సన్ధ్యారూపనిత్యకర్మాఙ్గమన్త్రలోపో భవతి. కిం పున రస్మదాదే ర్లోకస్య ప్రియాసాంనిధ్యే వ్యాకులచిత్తతేతి సర్వథా స్త్రీసఙ్గ్రహః పరిహరణీయా ఇతి' అన్న గంగాధర వ్యాఖ్యతోపాటు తులనాత్మకంగా పరికించి నిగ్గుతేల్చమని నిర్దేశించాడు.

ఈ నైపథ్యానుసంజనతో పరిశీలించినప్పుడు ఉపర్యుదాహృతపద్యార్థం మరింత స్ఫుటగోచరం అవుతున్నది. అంబరసీమలోని తారలు, ఈశ్వరుని జటాటవిలోని మల్లెపువ్వులు, ఆయన వక్షఃస్థలాన్ని అలంకరించిన విరిదండలు, కైలాస రంగభూమిపై దేవతలు కురిపిస్తున్న పూలవానలు కరాంజలిపుటంలోని అర్ఘ్యతోయంలో ప్రతిబింబించి పూజాసమర్ప్యమాణపుష్పములో అన్నట్లుగా తోచాయి. వేణీబంధమందు విరాజిల్లుతున్న గంగాంబుకణాలు ముక్తాఫలముల వలె జీవకళ ఉట్టిపడుతుండగా ఆ అంజలిబంధంలో ప్రతిబింబించి, పుష్పములతోపాటుంచిన ఫలములో అన్నట్లుగా ప్రకాశించా యన్నమాట. ఆ విధంగా నర్తిస్తున్న పరమేశ్వరుడు మిమ్ము కాపాడును గాక! అని ఆశీస్సు.

శ్రీనాథుని శాలివాహన గాథాసప్తశతి లోనిదని ఊహనీయం

ఈ విధంగా అర్థవల్లిని బట్టి కల్పన సాగిన తీరుసౌరులను పాఠకులు గాథాసప్తశతి ప్రాకృతమూలాన్ని, వేమభూపాలుని భావదీపికా వ్యాఖ్యను దగ్గరుంచుకొని అనుశీలించితేనే గాని బోధపడదు. అందువల్ల ఈ పద్యం క్రీ.శ. 13-వ శతాబ్ది నాటి అధర్వణునిదీ, క్రీ.శ. 1350(±?) నాటి దామరాజు సోమనదీ గాక వేమభూపాలుని ఆస్థానిలో శ్రీనాథుడు కేవలం తద్వ్యాఖ్యాధారితంగా క్రీ.శ. 1375 – 1380 ప్రాంతాల పదహారేళ్ళ నూనూగు మీసాల నూత్నయౌవనంలో నుడివిన శాలివాహన గాథాసప్తశతి లోనిది కావచ్చునని ఈ లఘుప్రస్తావిక మూలకంగా నేను ప్రతిపాదిస్తున్నాను.

పద్యం పరమేశ్వరుని దక్షిణనాయకత్వానికి నిదర్శకంగా ఉన్నది. మూలంలో పార్వతీదేవి యందు చిత్రితమైన ఈర్ష్యామానం అనువాదంలో పరిహరింపబడింది. సదాశివుడు నాట్యకోవిదుడైన ధీరలలితుడు. స్థావరజంగమాత్మకమైన జగత్తు సర్వం ఆయన నాట్యసంగ్రహానికి అంగోపాంగప్రత్యంగసహితమై ఉన్నది. అంబరసీమలో ఉన్మేషించిన తారాదులు ఆహార్యమై అమరాయి. ఆ మహాదేవుడు పుష్పాంజలిహస్తుడై సంధ్యాదేవికి ప్రణమిల్లుతున్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి భర్తృశిరోలంకృతయై ఉన్న గంగను చూడటం సహజం. ప్రణమిల్లుతున్నది సంధ్యాదేవికి; ఆయన శిరసుపై ఉన్నది గంగాదేవి. ఆమె మనస్సులో అన్యాకాంతాసంగమరూపమైన శంకాలేశం ఉదయింపక మునుపే ఆయన పుష్పాంజలిహస్తపుటాన్ని శీర్షదేశాన నిలిపాడు. అది దేవతావందనరూపమైన కరణం. `సత్కృతాంజలి' అని కవి వాక్యం. దానితో పార్వతీదేవి సందేహం తొలగిపోక తప్పదు. అప్పుడు మౌక్తిక-తుల్య-గంగాంబుకణాలు ముక్తాఫలముల వంటివై అర్ఘ్యతోయంలో ఉట్టిపడ్డాయి. అది గంగాదేవికి గర్వకారణం. ఆ ప్రణామం పార్వతికి సపత్నీజయసంకేతం.

మౌక్తికములంటే ముక్తాఫలములని అర్థం చెప్పటం వల్ల పద్యంలో అంజలిపుటంలోని ఫలములన్న నిరూపణ సాధ్యమయింది. ఆ అభిప్రాయం ఉన్నదువల్లనే కవి మౌక్తిక-తుల్య-గంగాంబుకణములు అని తుల్యయోగితను పరికరింపజేశాడు. ఇది కవిసమయనిరూఢమైన అర్థమే. ఇప్పుడంటే ముత్తెపు చిప్పలోనుంచి వెలువడుతున్నాయి కానీ ఒకప్పుడు ముత్యాలు తీగెలకే అంకురించి, ఆపై పండ్లయేవట.

`గతః స కాలో యత్రాసీ న్ముక్తానాం జన్మ వల్లీషు

వర్తతే సామ్ప్రతం తాసాం హేతవః శుక్తిసంపుటాః.

- ఇత్యాదిదర్శనాత్ వల్లీజ మ ప్యస్తి మౌక్తికమ్.'

అని వోపదేవుని భాగవతసార ముక్తాఫలం పైని కైవల్యదీపికా వ్యాఖ్యను రచించిన మహనీయుడు హేమాద్రి పండితుడు ఆ అతీతకథానకాన్ని స్మరించాడు. కాదంటే, ముత్యపు చిప్ప పగిలినప్పుడు తత్ఫలమై వెలికి వచ్చేది కాబట్టి ముక్తాఫలమని చెప్పవచ్చునని కూడా ఆయనన్నాడు.

ఈశ్వరునికి ఆహార్యమైన తారకల కాంతిసముల్లాసం ఆయన అనుగ్రహానికి సూచకం. వేణీబంధంలోని మల్లెపువ్వులు, వక్షఃస్థలాలంకృత హారసంతతులు, మౌళిని ధరించిన గంగ భక్తుల అభీష్టసిద్ధిసమృద్ధికి సంకేతాలు. శివతాండవం లోకమంగళదాయకం. వేమభూపాలుడు చెప్పినట్లు ఇందులో పూజానిర్వహణకు ఆవశ్యకాలైన ఫలం, పుష్పం, తోయం ఉన్నాయి. మూలంలోని ఉత్ప్రేక్షాలంకారం గంగాంబుకణ ముక్తాఫలాల గమ్యమానౌపమ్యం వల్ల ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షానుప్రాణిత తుల్యయోగితగా తెలుగులో మరింత అందగించింది.

పద్యశైలిని బట్టి చూసినా ఇది శ్రీనాథోపజ్ఞంగానే ఉన్నది. కొంత దూరాన్వయమైనప్పటికీ గంగాధర టీకలోని విశేషార్థాన్ని గ్రహించి వచ్యర్థంలో కూడా దీనిని అన్వయించటానికి అవకాశం లేకపోలేదు. ఆ ప్రకారం ఇది బహుముఖీనమైన అనువాదమని నిరూపింపవచ్చును. ప్రబంధరత్నాకరంలో పెదపాటి జగ్గన ప్రాకరనిర్దేశంలో విపర్యాసానికి లోనైన తావులనేకం ఉన్నాయి. శ్రీనాథుని పద్యాన్ని ఆయన సోమన రచనగా భ్రాంతికి లోనై ఉండవచ్చును. లేదా శీర్షికారచనలో ప్రతివిలేఖకుల దోషం కావటానికి ఆస్కారం ఉన్నది.

అందువల్ల నిరూఢప్రమాణాధారితమైన ఈ స్థితిస్థాపనపై పెద్దల అనుమోదాన్ని కోరుతున్నాను. శ్రీనాథ మహాకవి వాఙ్మయకలశరత్నాకరంలోనుంచి లభించిన మరొక్క పెన్నిధిని హృదయపూర్వకంగా స్వీకరింపగలరని ప్రార్థిస్తున్నాను.

అనుబంధ జ్ఞాపికలు

1. శ్రీనాథుని పద్యంలో చిత్రితమైనది తలపుష్పపుట హస్తం కాదు; సాంప్రదాయిక పుష్పాంజలి హస్తమే. దేవతావందన వేళ ప్రయుక్తం కనుక భుజాంతర వామపార్శ్వాన గాక శివుడు అంజలిబంధాన్ని శీర్షదేశాన నిలిపాడు. అందువల్ల మౌక్తికతుల్య గంగాంబుకణాల బింబసంపాతమూ, పార్వతీ రోషపరిహారమూ ఏకకాలంలో సంభవించినట్లు ప్రతీయమానం.

ఈ ప్రయోగం పట్ల ఆసక్తి గలవారు కుంభరాణా నరేంద్రుని సంగీతరాజం లోని చతుర్థఖండమైన నృత్యరత్నకోశం పరీక్షణాధ్యాయంలో 43 నుండి 50 వరకు గల శ్లోకాలను పరిశీలింపవచ్చును.

2. వేమభూపాలుని పాఠంలోని హాలుని `పసువఇణో రోసారుణపడిమాసంకంతగోరిముహఅందం' ఇత్యాది గాథకు; హాలునిదే, తత్సదృక్షమైన గంగాధర టీకతోడి `సంఝాగహిఅజలాంజలిపడిమాసంకంతగోరిముహకమల' గాథకు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి అనురణనాలివి (1932 ముద్రణ నుంచి):

తే. అలుకమెయిఁ జేవురించిన యాదిశక్తి

మోముఁజందురు నీడలోఁ బొలిచియుండఁ

బూజతామరఁ దాల్చిన పోల్కిఁ బొలుచు

హరుని సంధ్యాజలాంజలి కెరగుఁ డీరు. ౧

తే. సంధ్యవార్పఁగ దోసిట జలమువట్టి

నపుడు గౌరీముఖాంబుజ మందుఁ దోఁప,

మంత్ర మంతయు నొకమాఱ మఱచి, వట్టి

మోవిని గదల్చు శివునకు మ్రొక్కు లిడుఁడు! ౩౯౫

3. ఈ వ్యాసాన్ని పూర్తిచేసిన తర్వాత నమిసాధువు టిప్పణంతో కూడిన రుద్రటుని కావ్యాలంకారసంగ్రహం (1-40)లో ఈ క్రింది గాథ కనుపించింది:

`సేల(అ?)సుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం

సీసపరిట్ఠిఅగంగం సంఝాపణఅం పమహణాహం.'

అని. ఇదే భోజుని శృంగారప్రకాశంలో

`సేలసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం

సీసపడిచ్ఛిఅగంగం సంఝాపణఅం పమహణాహం.'

అన్న పాఠభేదంతో ఒకసారి, ఆయనే రచించిన సరస్వతీకంఠాభరణ(1-40)లో

`సేలఅసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధభుగ్గససిలేహం

సీసపరిట్ఠిఅగంగం సంఝాపణఅం పమహణాహం.'

అని మఱొకసారి; సంస్కృతాలంకారికగ్రంథం కల్పలతావివేకంలో

`సేలసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం

సీసపడిచ్ఛిఅగంగం సంఝాపణఅం పమహణాహం.'

అన్న భోజుని శృంగారప్రకాశ పాఠంతోనూ ఉదాహృతమై ఉన్నది. ఇది హాలుని గాథాసప్తశతిలో లేదు. అందువల్ల గాథాసప్తశతికి పూర్వకాలపుదో, ఉత్తరకాలరచితమో చెప్పలేము. పరమశివుని సంధ్యాప్రణామవస్తువు ఆ కాలంలో చాలామంది కవులను ఆకర్షించినదని మాత్రం దీనిని బట్టి ఊహించటానికి వీలవుతున్నది.

ఆసక్తి కలవారు భట్టుమూర్తి కావ్యాలంకారసంగ్రహంలోనూ, రామరాజభూషణుని వసుచరిత్రలోనూ పై ఉభయకల్పనలను ఆధారం చేసికొని వెలువడిన ఈ ఛాయలను పోల్చి చూడవచ్చును. శ్రీనాథుని అనువాదంలో వ్యంగ్యమై వెలసిన భావం ఈ పద్యాలలో విశదమై విలసిల్లింది.

`శా. గంగం దాల్చితి వుత్తమాంగమున నం గైకోలు గావించి త

ర్ధాంగీకార మనం, బురంధ్రి! నిను వామాంగంబునం దాల్పనే

శృంగారోన్నతిఁ జూడు మంచు గిరిజన్ శీర్షాపగాబింబిత

స్వాంగానందితఁ జేయు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్.' కావ్యా. (1-5)

 

`శా. ఆ మందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి తౌ

నౌ మేల్మేలని యార్య యల్గఁ బ్రణతుండై తత్పదాంభోజయో

గామర్షంబున గంగయు న్మొఱయఁ జూడాభోగసమ్యక్క్రియా

సామర్థ్యంబున వేఁడు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్.' వసు. (1-5)

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech