అన్నమయ్య అత్మనివేదనమ్

రచన: జి.బి.శంకర్ రావు 

 


తాళ్ళపాక వంశఖ్యాతికి మూలపురుషుడైన అన్నమయ్య క్రీ.శ. 1408 లో వైశాఖమాసం, విశాఖ నక్షత్రంలో మచ్చటైన మూడు గ్రహలు ఉన్నత స్థానంలో అలరారుచుండగా జన్మించారు. అన్నమాచార్యుల వారు దాక్షిణాత్య తొలి వాగ్గేయకారులు. పల్లవి , చరణాల పాటకు ప్రాణప్రతిష్ట చేసినవాడు. జయదేవుని రాధామాధవ తత్త్వం స్పూర్తితో మధురభక్తి మార్గం లో అలివేలు మంగా శ్రీనివాసుల అమలిన శృంగారాన్ని పారమార్థక తత్త్వంలో సంకీర్తనలుగా వెలయించిన మధురభక్తి శృంగార శిల్పి, విష్ణు భక్తి ప్రచారకుడు, సంఘ సంస్కర్త, సమతావాది, స్త్రీ , పురుషుల సమానత్వాన్ని ఐదు శతాబ్దాలకు పూర్వమే తన కీర్తనల ద్వారా చాటి చెప్పిన ఫెమినిస్టు.

ఈ విశాల విశ్వంలో సర్వాంతర్యామియైన భగవంతుడొక్కడే పరమపురుషుడు తక్కినదంతయూ స్ర్తీ ప్రాయమే అందుకే వైష్ణవంలో పుమాన్ విష్ణురితిఖ్యాతః స్ర్తీ ప్రాయమితరం జగత్ అంటారు. జనన మరణ చక్రభ్రమణం లో తిరుగులాడే ఈ జీవాత్మ చివరికి శాశ్వతుడైన పరమాత్మలో
లయం కావాల్సిందే. లౌకిక బంధాలను పరిశీలిస్తే, భార్యాభర్తల బంధం అరమరికలు లేనిదై, అనురాగ వాత్సల్యములతో కూడినదై, మిగిలిన బంధాల కంటే ఉత్కృష్టమైనది గాను, బలమైనది గాను మనకు కన్పిస్తుంది. అదే రీతిలో శాశ్వతుడైన పరమాత్మడిని (పరమాత్మ) నాయకుడిగా బావించి, భక్తుడు (జీవాత్మ) తాను నాయికగా మారి శృంగారభక్తి మార్గంలో వేదాంత సోపానాలను అధీరోహించటం మధుర భక్తి సిద్ధాంతం లోని ప్రధానాంశం.
ఈ క్రమంలో జీవాత్మ పరమాత్మలో అనురాగ ప్రణయం సాగిస్తుంది ఇది మధురమైన భావనతో కూడినది కాబట్టి మధురభక్తి అని అంటారు.

భారతీయ వాజ్ఞయంలో మొదటగా ఈ మధుర భక్తిని మనం భాగవతంలో దర్శిస్తాం. పరమాత్ముడైన శ్రీకృష్ణుని సాన్నిధ్యం కోసం గోపికలు తమ దేహ, మాన, ప్రాణాలను సైతం అర్పిస్తారు. ఇక రాధామాధవ తత్త్వంతో అమలిన శృంగారాన్ని భక్త జయదేవుడు అందించగా, తమిళనాడుకు చెందిన పన్నెండు మంది ఆళ్వార్లు నాయికాభావంలో ప్రణయభక్తి మార్గంలో నాలుగువేల పాశురాలతో కీర్తించి తరించారు. వీరి రచనలను ద్రవిడ వేదం, నాలాయిర దివ్యప్రబంధం అంటారు. అన్నమయ్య. ఈ దివ్య ప్రబంధాన్ని తన సంకీర్తనలలో తెనిగించాడు. తత్ఫలితంగా తెలుగువేదం సృష్టించబడింది.. అన్నమయ్య శృంగార సంకీర్తనల రాశి మధురభక్తిచే ఓతప్రోతమైనది నవవిధ భక్తులలో చివరిదైన ఆత్మనివేదనమే మధురభక్తిగా రూపాంతరం చెందినది. మురారి పాదార్పిత చిత్త వృత్తి గల భక్తులు భౌతిక ప్రపంచాన్ని మరచి, సర్వకాల సర్వావస్ధలలోనూ, భగవంతుని సామీప్యమందారోపించుకుని స్వామి సన్నిధిలో నిరంతరం తరించాలనే తపన ఇందు గాఢంగా ఉంటుంది.

అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలలో స్వామి వారి లీలావైభవం, ఉత్సవ విశేషాలు, భక్తి తత్త్వం, సామాజిక సందేశాలు, ప్రజాచైతన్యం, సమకాలీన చరిత్ర మొదలైన అంశాలు వెల్లడి చేశాడు. ఇక శృంగార సంకీర్తనలలో వేదాంత సోపానాలను అధిరోహించిన అన్నమయ్య ఆత్మతత్వంతో స్వామికి నివేదించాడు. శృంగార సంకీర్తనల రాశిని పండించాడు. అన్నమయ్య తన శృంగార సంకీర్తనల పరమార్ధాన్ని.
ఇది గాక సౌభగ్యమిది గాక తపము మఱియిది గాక వైభవంబిక వొకటి గలదా అని పేర్కొన్నాడు.
అన్నమయ్య శృంగార సంకీర్తనల లోని పారమార్ధిక రహస్యాలను, ఆధ్యాత్మక విశేషాలను అన్నమయ్య ఆత్మనివేదనమ్ అను శీర్షిక ద్వారా ధారావాహికంగా వచ్చే సంచికలలో తెలుసుకుందాం!!
|| శ్రీవేంకటేశార్పణమస్తు ||
 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.