కళా జానపదం
కులపరమైన జానపద కళారూపం- జ్యోతి నృత్యం

రచన: రాగధేను స్వరూప కృష్ణ మూర్తి

 


జ్యోతి నృత్యం కులపరమైన జానపద కళారూపం. ఇది వ్యష్టి నృత్యం. కానీ సామూహికంగా పాటలు పాడుతుంటే ఒక వ్యక్తి జ్యోతి నృత్యం చేస్తుంటాడు. చేనేత కులానికి చెందిన అనేక తెగలు ఉప కులాలలో ముఖ్యంగా పద్మ సాలె, పట్టుసాలె, తొగట వీర క్షత్రియ, దేవాంగులు మొదలైనవారు ఉన్నారు. ఈ తెగలు, ఉపకులాలు వారి వారి దైవారాధన సంప్రదాయాలను బట్టి విభజించడం జరిగింది. తొగట వీర క్షత్రియులు అన్న చేనేత తెగ చౌడేశ్వరీ దేవతను తమ కులదైవంగా పూజిస్తారు. కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడేశ్వరి అతి ప్రాచీనమైన దేవత.
 

పౌరాణిక చారిత్రక నేపధ్యం:
చౌడమ్మను గురించి పురాణ కథలు, చారిత్రక కథలు వాడుకలో ఉన్నాయి. తొగట వీర క్షత్రియులు చెప్పిన సారాంశం. సృష్టికి ముందు అంతా జలమమేనని.ఈ జలంలోనుండి కోటి సూర్య ప్రభాభాసురముగా జ్యోతి ఉద్భవించినది. ఈ జ్యోతి నుండి ఓం అను మహా మంత్రము పుట్టింది. తరువాత ఈ జ్యోతి ఆది పరంజ్యోతిమందు ఐక్యమై సర్వ శక్తివంతమైనది. ఈ శక్తియే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ , విష్ణు మహేశ్వరులను, సూర్య చంద్రాది దేవతలను, లక్ష్మి ఆదిగా గల దేవతలను సృష్టించింది. ఈమెయే చౌడేశ్వరీ దేవి అని ఈమెయే మహిషాసుర మర్దిని, రాక్షస సమ్హారానికి పుష్పాండజుడు అనే రాజునకు వరపుత్రియై జన్మించి 360 మంది వీర క్షత్రియులను హోమ గుండమ్నుండి సృష్టించింది. తొగట వీర క్షత్రియులకు ఈమె కులదేవత. చౌడేశ్వరి మహిమలను గురించి పద్య , గద్య, ఖడ్గ గేయ రూపాలలో ఆమెను స్తుతిస్తారు.
 

జ్యోతి తయారు చేసే విధానం:
తొగట వీర క్ష్త్రియులు చౌడమ్మ దేవతను ఆరాధిస్తూ జ్యోతులెత్తుతారు. పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పల్లెల్లో జ్యోతుల బోనాలు అని పిలువబడే ఈ నృత్యం ఏడాదికొకమారు మాత్రమే చేస్తారు.ఆవు పేడతో అలికి స్నానంచేసి ఒక్కపొద్దు(ఉపవాసం)ఉండి జ్యోతిని తయారు చేస్తారు. గొధుమ పిండిని ముద్దలాగా కలిపి మధ్య్లో కొత్త గుడ్డ ఉంచి(మైనపు వత్తి) జ్యోతిని తయారు చేస్తారు. క్రింది భాగంలో తలపై ఉంచుకోవడానికి వీలుగా వెడల్పుగా చేస్తారు. పైభాగంలో వత్తికి నెయ్యి పోయడానికి అనువుగా ఉంటుంది. చుట్టూ జ్యోతిని అందంగా తీర్చిదిద్దటానికి అట్టతో అందంగా అలంకరించి దానికి తళుకులు అద్దుతారు. జ్యోతులు రాత్రి పూట ప్రదర్శించడం చేత తళుకులు లోపలి వత్తికాంతికి అందంగా కనిపిస్తాయి. జ్యోతిని తలపై ఉంచుకోవటానికి గుడ్డతో గుండ్రంగా ఒత్తుగా ఉంచుకుంటారు. జ్యోతి నృత్యం చేస్తున్నపుడు జ్యోతికున్న వేలాడ దీసిన తళుకులు కదులుతూ మరింత అందాన్నిస్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. జ్యోతిలోపలి భాగంలోని వత్తులను నెయ్యితో తడుపుతారు. ఈ జ్యోతులను ప్రత్యేకంగా చేసిన కలశము వంటి దీపపు సెమీలో అమర్చుతారు. జ్యోతిని వెలిగించిన తరువాత చౌడమ్మ ముందు రతి పోసి(రతి పోయడం అంటే ముగ్గు తీరిచి అలంకరించడం) జ్యోతిని అందులో ఉంచుతారు. వంశపారంపర్యంగా జ్యోతిని ఎత్తుకొనే వాళ్ళు కడవలతో నీళ్ళు నెత్తిన పోసుకొని జ్యోతినెత్తుకుంటారు.
 

వస్త్రాలంకరణ:
జ్యోతిని ఎత్తుకున్న వాళ్ళు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, పంచెతో, పై వస్త్రము లేకుండా, నడుముకు ఎర్రటి గుడ్డ చుట్టుకొని ఉంటారు. వట్టి పయ్యతో ఉంటారు. అంటే అంగీ లాంటివి ధరించరు. మెడలో హారాలు వేస్తారు. నుదుట బండారు బొట్టు ఉంటుంది. తాళాలు, కంజీరాలు, డప్పు వాయించే వాద్యాలు.
 

జ్యోతినృత్యం పద్దతులు:
జ్యోతి నెత్తుకొన్న వారి చుట్టూ తొగట వీర క్షత్రియులు చాలా మంది నిలబడి తాళాలు, కంజీరలు వాయిస్తూ అమ్మవారికి సంబంధించిన పాటలు పాడతారు. ఒకరు ప్రధానంగా పాట పాడుతుండగా మిగిలిన వారు వంత ఎత్తుకుంటారు. జ్యోతి నెత్తిన యక్తి పాటకు తాళాలకు అనుగుణంగా అండుగులు వేస్తాడు. డప్పు వాద్యాల శబ్ధలకు అనుగుణంగా ఇతని అడుగులుంటాయి. జ్యోతిని తలపై ఉంచుకున్న వ్యక్తి నాట్యం చేస్తూ గిర్రున తిరగడం, చేతులు వదలి గాలిలో ఊపుతూ తలపైనున్న జ్యోతి పడకుండా గిర్రున తిరగడం, నేలపై కూర్చొని లేవడం, నేలపైనున్న నిమ్మకాయలు, డబ్బులు జ్యోతి పడకుండా అందుకోవడం వంటి విన్యాసాలు చేస్తుంటారు. తాళాలు పటకనుగుణంగా ఉంటాయి. తాళాలే కాకుండా చప్పట్ట్లు చరచడం, డప్పులు వాయించడం ఉంటుంది. మొదటగా తాళాన్ని వాయిస్తూ విఘ్నేశ్వరుని ప్రార్థన చేస్తారు. జ్యోతి నెత్తుకున్న వ్యక్తి అడుగులతో పాటు చుట్టు నిలబడి ఉన్న వారంతా అతని చుట్టు తిరుగుతూ అడుగులు వేస్తూ తాళాలు వాస్తూ నృత్యం చేస్తారు. ఫ్రార్థనానతరం చౌడేశ్వరీ దేవిని కొలుస్తూ జ్యోతులు సాగుతాయి. జ్యోతులను సుమారు రాత్రి రెండు గంటల ప్రాంత్జంలో ఎత్తుతారు. ఆంతకు ముందుగా సాయంత్రం చౌడమ్మను పూజించి ఊరేగింపుగా ఉత్సవంగా తీసుకెళ్ళి పురమ్మాను దగ్గర పల్లకీ దింపుతారు. ఇళ్ళలోనుండి జ్యోతులు బయలుదేరి చౌడేశ్వరీ దేవి వద్ద జ్యోతులాడతారు.
 

ఊరేగింపుగా జ్యోతులు వెడుతున్నపుడు తొగట వీర క్షత్రియ కులానికి చెందిన వారింటి దగ్గర జ్యోతులాడిస్తారు. ఆ సమయంలో వీధి వెంబడి జ్యోతి నెత్తుకున్న వారికి కాళ్ళు కడిగి పూజ చేయడం కనిపిస్తుంది. దోవ వెంట నీళ్ళు చల్లుతూ భక్తులు వారి పాద సేవ చేసుకుంటారు. భిన్న ప్రాంతాలనుండి ఆ ఊరిలోని జ్యోతులన్నీ కదిలి వస్తూ కూడలి వద్ద కలిసి నృత్యం చేస్తారు. రాత్రి పూట కావడం చేత చీకటిలో వెలుగుతున్న జ్యోతులతో ఈ నృత్యం చూడ ముచ్చటగా ఉంటుంది. తాళాల చప్పుడులు, చేతి చప్పట్లు, డప్పు వాద్యాల హోరు, తొగట వీర క్షత్రియుల అరుపులు, పాటలు, కేకలు, గజ్జెల నినాదాలతో మొత్తం దృశ్యం రసభరితంగా ఉంటుంది.

చౌడమ్మ కదిలి వచ్చిందన్న పాటలోని దృశ్యం బిరబిర సాగుతుంది. అడుగులు వేగంగా వేయడం, గుండ్రంగా తిరగడం జరుగుతుంది.
కదిలె చౌడమ్మయత తొడను గాభీర్య నాదములతో
గొడుగులు పడిగెలు గోరా శంఖాలు యింతట్ సిద్దులు యిరుజడలు
రంగులునే మగరాడు చౌడమ రానువు కదలెను,
రమ్యముతొ ఎప్పుడు మనకు యిచ్చిన వరములు ఏకొదువాలేదు.
తప్పక కొలువుండి దారుని లోపుల దైవంబనలే చౌడమ్మ ఎప్పుడు మనకు
ఈ పాట చాలా వేగంగా సాగుతుంది. పాటలోని తాళాలు, డప్పు శబ్ధాలలోని వేగం జ్యోతి నృత్యంలో కూడా వేగాన్ని పెంచుతుంది.
 

మరో పాటలో పల్లవి నృత్యానికొక తూగు నిస్తుంది. జ్యోతి నెత్తిన వ్యక్తి పల్లనిని పాడే సమయంలో రెండు చేతులను చాపి ఒక్కొక్క కాలినే నేలపై నిలిపి, పాటలోని భావానికి అనుగుణంగా నాట్యం చేస్తాడు. మిగినిన వారంతా వలయాకారంగా తిరుగుతూనే అడుగులు మార్చుకొంటారు. గేయంలో ప్రారంభంలోని పల్లవి కొన్ని చరణాల్లో వచ్చి మధ్యలో రెండో పల్లవి మొదలవుతుంది. జ్యోతి నృత్యం వేగం పుంజుకొంటుంది. మొదటి తాళ తా-తకిట తాళంలోనూ రెండో పల్లవి తకతక తగి అని నడుస్తుంది.(డా.చిగిచెర్ల కృష్ణారెడ్డి, జానప నృత్య కళారూపాలు, పుట 155)
 

జ్యోతి నృత్యంలో బలులు:
జ్యోతి నృత్యంతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళడాని మెరవణి అంటారు. మెరవణిలో అమ్మవారు వీధి వెంట వచ్చినపుడు బలులిస్తారు. ఇండ్లముందుకు వచ్చినపుడు అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రక్తంతో అమ్మవారిని పూజిస్తారు. ఇది ప్రాచీన ఆచారము. కానీ ప్రస్తుతం ఆ ఆచారం చాలా ప్రదేశాల్లో లేదు. తొగట వీర క్షత్రియుల ఇండ్ల దగ్గర అమ్మవార్ని నిలబెట్టినపుడు, జ్యోతి నెత్తినపుడు బలినిచ్చి ఆ రక్తం బొట్టుతో అలంకరిస్తారు.
 

రాయలసీమలో జ్యోతినృత్యం:
కర్నూలు జిల్లా నందవరంలోని చౌడేశ్వరీ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే జ్యోతి ఉత్సవంలో దాదాపుగా వందలకొద్ది జ్యోతులాడతాయి. అనంతపురం జిల్లాలోని, ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాలలో చేనేతలు అధికంగా ఉనారు. ఈ ప్రాంతాలలో జ్యోతి నృత్యం ఉంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, దొమ్మరనంద్యాల, వేపరల, మోరగుడి గ్రామాల్లోనూ, ప్రొద్దుటూరు పట్టణంలోనూ జ్యోతులెత్తుతారు.
 

  డా. జోగధేను స్వరూప కృష్ణ గారు కడప జిల్లా, ప్రొద్దటురు ఎస్. సి . ఎన్. అర్. కళాశాల లో తెలుగు శాఖలో రీడర్. నెట్ బ్రౌజింగ్, రేడియొ ప్రసంగాలు, కవితలు రాయడం, వెబ్ డిజైనింగ్ వీరి వ్యాసంగం. యు.జి.సి ఢిల్లి ఆర్థిక సహకారంతో రాయలసీమ జానపద కళారూపలు- సాంఘిక, చారిత్రక నేపథ్యము అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు జానపద కళల గూర్చి విశేషమైన పరిశోధన చేసి కనుమరుగువుతున్న మన జన పథాలలోని కళలను వెలికితీసి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా సుజనరంజని ద్వారా ప్రపంచవ్యాప్త తెలుగువారికి తమ అసలైన సంపదను గురించి తెలియజెప్పే ఊహతో పతినెలా తమ పరిశోధనాత్మక వ్యాసాలను అందిస్తున్నారు. అమూల్యమైన విశేషాలు ప్రతినెలా మీకోసం...  


 


 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.