కథా భారతి

కథ :  కర్తవ్యం

రచన: శైలజామిత్ర.

 


సాయంసమయం... మబ్బులతో కప్పబడి...అస్తమిస్తున్న సూర్యుడ్ని తనలో దాచుకున్నవేళ... సముద్రంలో కెరటాలు కాంతిలేక నెమ్మదిగా.. ప్రవహిస్తూ... వాతావరణాన్ని కాస్త సందిగ్ధంలో ఉంచుతున్నవేళ... తమ చుట్టూ ఏర్పరుచుకున్నట్టి కాంతులతో పిల్లల అల్లరులు... వేడివేడిగా వ్యాపారాలు సాగుతున్న వేళ... సన్నని చిరుజల్లులు ఆత్మీయంగా పలకరిస్తున్నవేళ ... అవేవీ పట్టనట్లు ఒంటరి అలలా కూర్చంది లహరి..ఆ ముఖంలో ఏ ఆశలేదు..ఏ విధమయిన ఆశయం లేదు...గాలికి స్వేచ్ఛగా ఎగురలేని తడి ఇసుకలాంటి స్తబ్ధత వుంది..ప్రశాంతంగా వున్న చీకటిలాంటి నిశ్శబ్థం దాగుంది... ప్రకృతిని తిలకించాల్సిన ఆ కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి...పలకరించాల్సిన పెదవులు మౌనంగా వున్నాయి...మెదడంతా ఆశ్చర్యంగా వుంది..ఇలా ఎందుకు జరిగిందనే సంశయం దాగుంది...అంతలో...

"లహరీ...ఇక్కడున్నావా? ఇంటికెళదామా ?" అంటున్న అన్నయ్య శ్రీహరి గొంతులో కర్కశం దాగుంది.
వెళదాం...అని అనకున్నా అక్కడ్నించి కదిలింది...

"చూడు లహరి.. నీవేమీ చిన్న పిల్లవి కావు...చెబితే అర్థం చేసుకోకపోవడానికి..
ఏదిచెప్పినా నీ మంచి కోసమే చెబుతామనేది గుర్తుంచుకో...." అన్నాడు కార్ డోర్ తెరుస్తూ...
........................................................

"నిన్నే మాట్లాడుతూంటే సమాధానం ఇవ్వవేం ? నీ మూలంగా అమ్మ నాన్న , నేను వారం రోజులుగా తిండి, నిద్ర లేకుండా బాధపడుతుంటే నువ్వేమో.. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటూ అప్పటికేదో మేమేదో అన్యాయం చేస్తున్నట్లు ఇంటి పట్టున లేకుండా ఇలా అర్థరాత్రి, అపరాత్రి లేకుండా ఒంటరిగా తిరుగుతున్నావు... అమ్మ ముందర అంటే అమ్మ బాధపడుతుందని ఇక్కడ అంటున్నాను... ఏంటి వినబడుతోందా ? " అంటూ కార్ డ్రైవ్ చేస్తూ అరుస్తున్నాడు...

" నా గురుంచి ఎవ్వరూ బాధపడక్కర్లేదు... నా జీవితాన్ని నిర్ణయించుకునే ధైర్యం నాకుంది.... మీకు నామీద ప్రేమ లేదని నేనంటే మీకు కోపం రాదా ? అలాగే నామీద ప్రేమలేదని మీరందరూ అంటూంటే నా అభికి కోపం రాదా" అంది కోపంగా...

" అభి... అభి... అభి... నువ్వా మాట అనడం మానవా ? ... రెండేళ్లక్రితం ఈ మాటంటే మేము నీకు అడ్డు చెప్పామా... ? ఇప్పుడు తెలిసి తెలిసి అతనికి అలా ఉందని తెలిసి ఇంకా ప్రేమ అంటూన్న నిన్ను చూసి ఏమనుకోవాలి ? ఎలా చెబితే నీకు అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు.... చీ..ఛీ..."

"అన్నయ్యా... నువ్వెంతగా నన్ను అసహ్యించుకున్నా నా నిర్ణయంలో మార్పుండదు..... మీమీద నాకేమీ కోపం లేదు... అలా అన్నా మీరు నమ్మరని నాకు తెలుసు... అయినా నాకు నా మీద నా నిర్ణయాలపైనా నమ్మకం వుంది అంతే ... ఇంతకంటే నన్ను ఎక్కవగా మాట్లాడనీయకండి... " ఇల్లు రావడంతో లోపలికి విసురుగా వెళ్ళింది.

" ఏరా...దాని నిర్ణయంలో ఏదైనా మార్పుందా " అడిగింది తల్లి మెల్లగా...

"లేదమ్మా... ఇక దాని గూర్చి మాట్లాడకండి... అది అసలు మన ఇంట్లో పుట్టలేదనుకుందాం...!! వెళ్ళి వెళ్ళి గోతిలో పడతానంటే మనం మాత్రం ఏమి చెయ్యగలం?.. నాన్నా... మీరు కూడా...దాన్ని ఇక ప్రాధేయ పడకండి.. అది అందర్నీ మించిపోయింది.. జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకునేటంతగా ఎదిగిపోయింది... ఇక మీరు నేను చెప్పితే మారిపోయే మనస్థత్వంలో వున్న చిన్న పిల్ల కాదు... పైగా మేజర్.. " అంటూ గట్టిగా అరిచిచెప్పాడు.. శ్రీహరి..

"ఒరేయ్ శ్రీ హరీ ఆవేశం తగ్గించుకోరా నేను నచ్చచెబుతాగా... నువ్వూరుకో..." అన్నాడు తండ్రి రాఘవయ్య కండువా భుజంపై వేసుకుంటూ..

"ఆహా...మీకా నమ్మకం వుంటే అలాగే కానీయండి..అంతా మనం అనుకున్నట్లే జరిగితే నాకూ సంతోషమేగా...." అంటూ...తనగదిలోకి వెళ్ళాడు విసురుగా...

"లహరీ...కాస్త ఎంగిలి పడుతల్లీ... నా బంగారువు కదూ... కోప్పడితే మాపైన పడు... అన్నమీద ఎందుకే..." అంటూ అన్నం కలుపుకొచ్చి ఇచ్చింది... నవ్వుతూ తల్లి కామాక్షి..
"నాకు ఆకలిగా లేదమ్మా..తర్వాత తింటాలే... " అంది కోపంగానే...లహరి..
"ఆకలి ఎందుకుండదు...మనసులో బాధలకు మనసుతోనేగా పని ...మరి తిండిదగ్గర చూపుతావెందుకు" అంటూ బలవంతంగా రెండు ముద్దలు తినిపించింది...
"అమ్మా....నాకు అభి అంటే చాలా ఇష్టం" అంది మెల్లగా...
"ఇష్టం అన్నావనే మేము పెళ్ళికి సిద్దపడ్డాం... ఎపుడైనా మీమాట కాదన్నామా? చెప్పు...కానీ...ఇలా కానిరోగం వచ్చినవాడిని చేసుకుంటానంటే ఎలాగమ్మా... !!"
"అలాగని నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్న మేము విడిపోవాలా? " అంది కోపంగా..
" లహరీ...నువ్వేమీ చిన్నపిల్లవి కావు.. అభిరామ్ కు వచ్చింది ఏ కాన్సరో... గుండె జబ్బో కాదు.. ఎయిడ్స్...దీనికి మందులు లేవు...కాకపోగా నీ జీవితం చిన్నతనంలోనే నాశనం అవుతంది...మేము ఏంచెప్పినా నీ మంచి కోసమే చెబుతాం కదా...మాకున్నది నువ్వొక్కదానివే కదా నిన్ను దూరం చేసుకుని ఎలా బతకాలి నువ్వేచెప్పు... " అంది కంటనీరు పెడుతూ...కామాక్షమ్మ...
"నేను లేకుంటే అభి బతకడమ్మా.... "
" నీముఖం... అసలు ఆ అబ్బాయికి అంత ప్రేమే వుంటే ఈ రోగం ఎందుకు తెచ్చుకుంటాడు... నీకు బుద్దిరాదు... " అంటూ ఆవేశంగా అక్కడ్నించి వెళ్ళిపోయింది..
అసలు ఎందుకు ఎవ్వరికీ నా బాధ అర్థంకాదు...అసలు నేనేం తప్పుచేసాను? అయినా ఈవ్యాధి...ఇలాంటి సంబంధాలున్నావారికే వస్తోందా? కాదే..ఆరునెలల క్రితం యాక్సిడెంట్ అయింది..అప్పుడే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది...తన అభి ఎలాంటి వాడో తనకు తెలుసు..ఇక లాభం లేదు ఒకసారి అభిని చూసిరావాలి... " అనుకుంటూ బయలుదేరింది...లహరి..

"అభి వున్నాడా రామూ?" అడిగింది అక్కడున్న పనివాడిని..
"లేడమ్మా...ఫ్రెండ్స్ ఎవరో వస్తే... " అంటూ ఆగాడు..
"ఫ్రెండ్స్...నాకు తెలిసీ అభుకి ఇలా బయటకు పిలుచుకు వెళ్లేవారులేరే... " అని ఆలోచిస్తూ పైకి చూసింది...మేడమీద రూమ్ లో అభి వున్న రూమ్ లో ఎవరో ఉన్నట్లు కనబడింది..

వెంటనే "రామూ..అభి ఇంట్లోనే వున్నాడుగా...లేడని ఎందుకు చెప్పావు? " అడిగింది కోపంగా.. అంటూనే లోపలికి విసురుగా ఎంతగా వెనుకగా పిలుస్తున్నా వినకుండా వెళ్లింది..

మేడమీదకు విసురుగా వెళ్లిన లహరికి లోపలి దృశ్యం చూడటం తోటి మాటరాకుండా ఒక్కక్షణం నిర్ఘాంత పోయింది...అభి..మరొక స్త్రీతో...చూడలేకపోయింది...
తనకు ఏంచెయ్యాలో తెలియటం లేదు...ఒకవైపు ఏడుపురావడం లేదు..కోపం రావడం లేదు..మెదడంతా స్తబ్ధుగా తయారయ్యింది...ఒక్క ఉదుటున ఇంటికి వచ్చింది...రావడం తోనే తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది..ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది...

కూతురు గదిలోకి వెళ్లడం అలా ఏడవటంతో ఇంట్లోవారందరూ కంగారు పడ్డారు...లహరీ...లహరీ అంటూ తలుపును తట్టారు... చాలాసేపటివరకూ ఏడ్చి మెల్లగా తలుపు తీసింది.. కామాక్షమ్మ... మెల్లగా లహరి దగ్గరగా కూర్చుంది...

"అమ్మా...మీరు చెప్పినట్లే వింటాను...కానీ రెండేళ్ళదాకా నాకు పెళ్ళిమాట వద్దు... నన్ను నా చదువును పూర్తిచేయనీయండి..." అంది స్థిరంగా...
"ఆ మాట వినడంతోటి అందరి కళ్లల్లో ఆనందం... " అలాగేరా...తల్లీ...నీ ఇష్టం..నీ మాట ఎప్పుడైనా కాదన్నామా ? అన్నారు తల్లితండ్రులు ముక్తకంఠంతో...
ఒక గండం గడిచి నట్లు అన్నయ్య శ్రీహరి ముఖంలో నవ్వు కనిపించింది...

"లహరీ..నువ్వు అనుకన్నట్లే... నువ్వు మ్యాథ్స్ పోస్టుగ్యాడ్యుయేషన్ యూనివర్సిటీ ఫస్టు వచ్చావురా...చూడు.. " అంటూ శ్రీహరి ఆనందంగా చెప్పాడు..
"నాకు తెలుసు..నా కూతురు బంగారం...దానికేం తక్కువని...? అనుకుందంటే సాధించడం దానికి అలవాటు... " తండ్రి వంతపాడాడు...
" అన్నీ మా అన్నయ్యలానే... వాడూ అంతే చిన్నప్పటినుండి ఏది పెట్టినా అందులో ఎప్పుడూ ఫస్టే...అంతా మేనమామ పోలిక ..." అంటూ సాకు దొరికిందని తన పుట్టింటి గొప్పల పర్వంలో తల్లి...అంది...కాఫీకాస్తూ...
లహరి మాత్రం మౌనంగా వుంది... ఒకవైపుభయంగా వుంది...తనకు ఇక పెళ్లి అంటారని ... ఏమ్మా..ఇక నీ ఆలోచన .. అంటూ తండ్రి అడగనే అడిగాడు..
" నాన్నా..ఏదైనా ఉద్యోగం..అంటే కాలేజీ లెక్చర‍ర్ టెంపరరీగా చేస్తూ పి.హెచ్.డి చేయాలని..." అంది మెల్లగా...
"మరి నువ్వు..రెండైళ్ళు అన్నావని..మన లక్ష్మణ రావు అంకుల్ కొడుకుతో నీకు పెళ్ళి చేయాలని నిర్ణయించాము... అయినా వాళ్ళు మన మాట కాదనరు... పెళ్ళి అయినా నీ చదువు మన ఇంట్లోనే నిన్ను చదివిస్తామని చెబుతాను... వారు ఒప్పుకుంటేనే...సరేనా..అంటూ తండ్రి పడుతున్న ఆత్తకు లహరికి నవ్వు వచ్చింది.. పాపం... వీళ్ళు నిత్యం ఎంత బాధపడుతున్నారా " అనిపించింది... అందరూ లహరి ముఖంలోకి చూస్తూన్నంతలో... "సరే...మీ ఇష్టం" అంది మెల్లగా....

ఇక వారి ఆనందానికి హద్దులు లేవు... ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు...స్వీట్లతో తెగ హైరానా పడుతున్నారు... తన గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు.... అన్నీ గమని స్తున్న లహరి మనసులోన ఏ మార్పులేదు.. కేవలం స్తబ్థత తప్ప... "మనిషి బతికితే తనకోసం అది చెయ్యిదాటిపోతే ఎదుటివారికోసం" అనే మాటను అనుసరిస్తున్న తీరులో వుంది లహరి తీరు...

"లహరి...పెళ్లికి ఇక నెలకూడా లేదు... మనం బట్టలు కొనుక్కుని వద్దాం... " అంది కామాక్షి... ఆనందంగా....
"బట్టలా...నువ్వు, పిన్ని వెళ్ళి తెచ్చేయండి...." అంది నవ్వుతూ...
"అదేమిటే....అవ్వ...నవ్విపోతారు...ఎవరేనా...ఇప్పటికే చాలమంది ఇదేంటి లహరి ముఖంలో నవ్వులేదు....పెళ్ళి కళ లేదు అంటూన్నారు.... మేమే దాటవేస్తున్నాము....రేపు నీకు కాబోయే అత్తగారూ మావగారూ వస్తారు... ఇలాగే వుంటే ఏమనుకుంటారు ? పెళ్ళికావాల్సిన పిల్ల... " అని పూర్తి కాకుండానే...

"అమ్మా...ప్లీజ్....నన్ను విసిగించకు...నేనేమీ మీమాటను కాదనటం లేదుగా... ఇంకా ఎందుకు నన్ను విసిగిస్తున్నారు.... నన్ను ఇలా వదిలేయండి..." అంది కటువుగా...
"అమ్మా...అది మారిందనుకుంటున్నారు కానీ దాని మనసులో ఇంకా ఆ రోగిష్టి వాడే వున్నాడు... " అన్నాడు శ్రీహరి మరింత ఉద్వేగంగా...
"విన్నావుగా...అమ్మా...అన్నయ్య చెబుతున్నది...అయితే ఏంటి? నా మనసుతో మీకేం పని" మీకు కావాల్సింది నేను కదా అంది..మరింత కోపంతో..
"చూసావామ్మా..దానికెన్ని మాటలు వస్తున్నాయో...ఊరుకుంటున్నామని.."
అంటూ చెయ్యిలేపేంతలో...
"హరీ..పెళ్ళికావాల్సిన పిల్లపై చెయ్యి చేసుకుంటావా ? నీ ఆవేశంలో అర్థం లేదు" అంటూ వారించింది.. తల్లి కామాక్షమ్మ....
" అసలు తన తీరులో ఎక్కడైనా పెళ్ళి చేసుకునేలా కనబడుతోందా? మొదట ఎందుకు కావాలందో...తర్వాత మన మాట ఎందుకు విందో మనకు తెలియదనుకుంటోంది.. ఎందుకులే చిన్నపిల్లవని చూస్తుంటే.... "
"అదే మీకేంతెలిసింది..... ? నేనేమీ ఇప్పటివరకు మీకేమీ చెప్పలేదే.... " అంది లహరి
"అంటే చెప్పకపోతే తెలియదనుకంటున్నావా?"
"అదే ఎలా తెలుసు"....అంది మరింత గట్టిగా లహరి....
"ఎందుకు తెలియదు ? వాడి ప్రవర్తన"....అనే లోపే..
"నీకెలా తెలుసు అన్నయ్యా..."
"అది నీకనవసరం...."
"అది చెప్పడానికి ఇంత సంకోచం ఎందుకు ? చెప్పు... నువ్వే అభి ఇంటికి వెళ్ళావని.. నా దారికి అడ్డం వస్తం ప్రాణాలు తీస్తానని లేదా మా ఇంటిల్లిపాదీ ప్రాణాలు తీసుకుంటామని.. భయపెట్టి తనకు మత్తు మందిచ్చి ఎవరో అమ్మాయితో అలా వుండేలా చేసి నువ్వేదో సాధించావని నువ్వు అనుకుంటున్నావు.. !!కానీ...నాలుగేళ్ళ ప్రేమ తర్వాత కూడా తాను ఎలాంటివాడో తెలియకుంటే నేను నా ప్రేమ పనికిరాని చెత్తతో సమానం... ప్రేమ పొందండం ఒక వరం... అభి అమాయకుడు... నాకున్న పాటి జ్ఞానం కూడా లేనివాడు... పదిమంది గొడవపడుతుంటే ఆ వైపు కూడా చూడలేనంత భయస్తుడు... అలాంటి ఒక్కరోజుతో అంతటు విలన్ అయిపోయాడంటే వెనుక నీ మేధస్సు తప్పక వుండి వుంటుందనుకున్నాను అక్కడ పని చేసే రాము ద్వారా నిజమని తెలుసుకున్నాను... అసలే అభికి ఆరోగ్యం బాగులేదు... నేను ఇంకా అభినే తలుస్తూంటే ఏదో అనర్థం జరుగుతుందని నేనే దూరంగా నిందను భరిస్తూ ఇప్పటిదాకా వున్నాను.. మీకు తెలియనిది ఒకటుంది..

రెండున్నర సంవత్సరాల క్రితం కారు యాక్సిడెంట్ కు కారణం నేనే... అభి ఏమయిపోతాడో తెలియని స్ధితిలో అక్కడే వున్న ఒక హాస్పిటల్ లో చేర్చాను.. ప్రస్తుతం వాడేసిన సిరంజీలు చెత్తబుట్టల్లో పడేస్తున్నారే గానీ హాస్పిటల్ యాజమాన్యం వాటిని నాశనం చేయటంలేదు...దానివల్ల వాటిని చెత్త ఏరుకునే పిల్లలద్వారా తెప్పించుకుని కడిగి మళ్ళీ వాడుతున్న ఆసుపత్రులు లేకపోలేదు... అలాంటిదే అభికి ఎదురైంది... దురదృష్టవంతుడు అన్నయ్యా.. అంటూ కళ్ళు తుడుచుకుంది... ఈ రెండు సంవత్సరాలు అభి ఏంచేస్తున్నాడో తెలుసా? తనలాగా ఎవ్వరూ చేయని తప్పుకు బలికాకూడదని అందరిని ఒక విధంగా రిహేబిలిటేషన్ సెంటర్ లో చేరి తెలియజేస్తున్నాడు... అక్కడే అమకు ఏదో జరిగిందని వెలివేసిన కుటుంబంనుండి వచ్చిన వారందరిని ఆప్యాయంగా చూసుకుంటూ ధైర్యం చెబుతున్నాడు... నిజమే.. మీరన్నట్లు నేను అభిని పెళ్ళి చేసుకుంటే మీరందరికీ బాధే నాకు తెలుసు...కానీ...మనసు అనేది పిండి మర కాదుకదా అన్నయ్యా... మొన్నటి సంఘటన నాకు జరిగి వుంటే అభిలాంటి పరిస్థితి నాకు వచ్చివుంటే... నాస్థానంలో వున్న అభిని వారి తల్లితండ్రులు వారించేవారే...కానీ... "అని ఇంకా చెప్పేంతలో... శ్రీహరి వారిస్తూ....

"వద్దమ్మా.. నువ్వింకేమీ చెప్పద్దు...నాకు అర్థమయింది... నీకు పెళ్ళికేంతొందరలేదు... నువ్వు కోరుకుంటున్నట్లు పి.హెచ్.డి పూర్తిచేయి"...

"నువ్వు ముందు అభికి దైర్యం చెప్పు... మానసికంగా తోడుగా వుండు... చిన్నపిల్లవి నీకు తెలిసింది కేవలం తొందరపాటే అని అనుకున్నానే తప్ప... నీ పాటి జ్ఞానం నాకు లేకపోయింది... ఇకపై నువ్వే కాదు... మన కుటుంబం మొత్తం అభికి తోడుగా వుంటుంది... హెచ్.ఐ,వి రాగానే అది ఎయిడ్స్ తో సమానం కాదు... ఈలోగా తన ట్రీట్‍మెంట్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటాం... అందరం అతని పట్ల శ్రద్దగా వుందాం"... అంటూ బయటపడ్డాడు..

"అభీ...నన్ను క్షమించవూ.."
"ఊరుకో లహరీ... నాకు తెలియదా నీవు ఎలాంటి దానివో అని"
"ఆడపిల్లవి... నీపై తల్లితండ్రుల వత్తిడి ఎంతగా వుంటుందో నాకు అర్థంకానిది కాదు.. నన్ను నువ్వే మొదట ప్రేమించానని చెప్పావు గుర్తుందా?"
"నాకు తెలిసి స్త్రీ ఎంతగానో ప్రేమిస్తే తప్ప తనంతట తానుగా బయటకు చెప్పదు.. అలాంటిది... నేను ఎలా నీ గురించి వేరే విధంగా ఆలోచిస్తానని అనుకున్నావు ? "
"థ్యాంక్స్ అభీ..."
"ఇదిగో... ఈ థ్యాంక్స్‍లు, సారీలు ప్రేమకు నిషిద్దం" అంటూ నువ్వే అనేదానివిగా... నిజంగా నేను ఇప్పుడు ఏమీ బాధపడటంలేదు... పదిమందిని బాధపడకుండా చేస్తున్నాను.. లహరీ... సృష్టలో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే... కాకుంటే కాస్తముందు ... వెనక.... అంతే"... అనే సరికి లహరికి కన్నీళ్ళు ఆగలేదు..
"ఊరుకో.. లహరీ... ఏడవటం, నవ్వటం అనేది అందరూ చేస్తారు...
ఆలోచించడం కొందరే చేస్తారు... ఆ కోవలోకి మనం వెళ్ళి... తెలియని అమాయక ప్రజలకు తెలియజేద్దాం... నలుగురికీ సహయపడదాం... ఎవ్వరినీ ఈ ఉచ్చులోకి రానీయకుండా కాపాడదాం.. " అంటూ చెయ్యి చాపాడు.... ఆ చేతిలో సంతోషంగా చెయ్యి వేస్తూ ముందుకు వెళ్ళడానికి సంసిద్దమయింది లహరి... తమద్వారా కొంతమందయినా బయటపడతారనే తృప్తితో... సాధిస్తామనే నమ్మకంతో తమవంతు కర్తవ్యం తాము చేద్దామన్న నిర్ణయంతో.

దాదాపు పదేళ్ళు గడిచాయి... లహరికి తనను అర్థంచేసుకున్న తండ్రి తెచ్చిన వ్యక్తితోనే వివాహం అయ్యింది.. వారికి అభినయ అనే పాప కూడా... ఇప్పుడు లహరికి సమయమే వుండదు... అభినయ ఎయిడ్స్ రిహాబిటేషన్ సెంటర్ ద్వారా ఎందర్నో ఆదుకుంటోంది... వ్యాధి వట్ల అందరికీ అవగాహన కల్గిస్తోంది. తన సెంటర్ లో పేరు కింద ఆ మాటల్ని కూడా జతచేర్చింది....

"ఏడవటం, నవ్వటం మనుషులందరూ చేస్తారు..
ఆలోచించడం మాత్రం కొందరే చేస్తారు..
అందుకే మనం ఆలోచిద్దాం...."


ఆ అక్షరాలలో "అభి" ని చూసుకుంటూ తాను తమ మధ్య లేకున్నా తనలో ఉన్నట్లే భావిస్తోంది...లహరి...

   

       

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.