మంత్రానికి శక్తి ఉందా

సర్ప సాధన - సుబ్రహ్మణ్య ఆరాధన

రచన: ప్రఖ్యా మధు

  శ్రీ కాళహస్తిలో ఈ మధ్యకాలంలో రాహుకేతువుల పూజ చేయిస్తున్నారు. సర్పదోషాలున్నవారు, కాల సర్పదోషం వున్నవారు, పెళ్ళికావాల్సిన వారు, పెళ్ళై పిల్లలు కావాల్సిన వారు ఎందరో జపాలు చేయించుకుంటున్నారు. సర్పాలను గురించి వాటికి సంబంధించిన ఆరాధనను గురించి కొంచెం తెలుసుకుందాం.

 పాములంటే సహజంగా ఎవరైనా భయపడతారు. అలాంటిది పాములని పూజించటం ఏమిటి? ఇది ఎప్పటినించి ప్రారంభమైంది అని అనుమానం వస్తుంది. నాగ దేవతలను ఆరాధించడం భారతదేశంలో ఈనాటిది కాదు. ప్రపంచ చరిత్రలోనూ సర్ప పూజ చూస్తాం. ఈజిప్టు పిరమిడ్ల మీద నాగదేవతల బొమ్మలు ఆశ్చర్యం కలిగించగా, మనదేశంలో నాగాలాండ్ అని ఒక ప్రాంతమే వుంది. నాగాలు ఒక ప్రాంతీయులు కూడా. అంధ్రులలో అనేక నాగా నామం వున్న ప్రాంతాలు వున్నాయి. నాగులవంచ, నాగేశ్వరం, నాగులకోన ఇలా ఎన్నో... ఇక ఇంటి పేర్లు చూస్తే నాగభైరవ, నాగా ఇలా వున్నాయి. ఇక నాగ నామం వున్నవాళ్ళ సంఖ్యని లెక్కపెట్టలేమేమో! నాగేంద్రుని అనుగ్రహం వల్ల పిల్లలు కలుగుతారని అనేకులు నాగోపాసన చేస్తూనే ఉన్నారు తరతరాలుగా.

నాగేంద్రుడిని సుబ్రహ్మణ్యేశ్వరునిగా ఆరాధిస్తారు. ఇందులో అంతరార్ధాన్ని యోగులు ఇలా వివరిస్తారు. శివ పార్వతులు ఆది దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. వినాయకుడు, కుమార స్వామి. వినాయకుడు వ్యోమానికి (స్పేస్) కి అధిపతి. అందుకే వినాయకుడిని నలుగుపిండితో (పరమాణు రేణువులతోనా?) చేసినట్లు వర్ణిస్తారు. కుమార స్వామి కాలానికి అధిపతి. కాలాన్ని సర్పంతో పోలుస్తారు. విషాన్ని చెడు కాలంగా, దాన్ని హరించే హరుడు, శివుడ్ని నీలకంఠుడుగా కీర్తిస్తారు.

మంత్రశాస్త్రంలో నాగసాధనలకున్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. ఇంద్రజాల విద్యలు, కనికట్టులు సిద్ధించాలంటే నాగ సాధనలు చేయాలిసిందే అని రుద్రయామళ తంత్రం చెపుతోంది. "ఓం నమో వాసుకీ నాగపూర్ణ......." అనే మంత్రం ద్వారా చిత్రమైన భ్రమలని చూపొచ్చునని అందులో చెపుతున్నారు. అంతేకాదు విషాన్ని హరించే అనేక మంత్రాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. అవిిపనిచేసిన అనేక నిదర్శనాలు చరిత్రలో వున్నాయి. భారతంలో పరీక్షిత్ మహారాజు ఒక సర్పం కాటునుండి తప్పించుకోవాలని ప్రకటించగా అనేక పాము మంత్రవేత్తలు వచ్చినట్టు వుంది. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వున్న పాముల నరసయ్య గారిని గురించి రీడర్స్ డైజెస్ట్ లో వ్రాసారుట. ఒక తెల్లదొర గారికి పాము కాటేస్తే వెంటనే మంత్రంతో ఆ విషాన్ని హరింప చేస్తే ఆయన నరసయ్య గారిని ఒక రైల్వే మాష్టారుగా ఉద్యోగం వేయించారుట. ఎందుకంటే ఆరోజుల్లో రైల్వే స్టేషన్ లలోనే ఫోన్ సౌకర్యం వుండేదిట. ఎక్కడినించైనా పాముకాటేసిన వారు ఎవరైనా ఫోన్ చేస్తే వారు ఫోన్ లోనే మంత్రం వేసి రక్షించేవారుట.

ఈరోజుల్లోకూడా ఎవరికైన సయాటిక్ నొప్పి, లేక నడుం నొప్పి వుంటే పాము కుబుసాన్ని చిన్న ముక్క తీసుకుని తాయెత్తులో ధరించాలని మంత్రవేత్తలు చెపుతున్నారు. దాని వల్ల ఆ నొప్పి తగ్గుతుందిట. పిల్లలు లేని వారు, కుజ దోషం వున్నవారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య సాధన చెయ్యాలిట. వల్లి భౌతిక దేహాన్ని, దేవసేన అమ్మ వారు ఆదిభౌతిక సూక్ష్మ దేహన్ని సూచిస్తారుట.

     నాగులచవితికి పుట్టలో పాలు పోయడం ఆంధ్రుల ఆచారం. పాములు పాలు తాగుతాయా అన్నది ఇప్పటికి మనకి తెలియని హేతువాదం! ఏది ఏమైనా కృష్ణుడు కాళిందిలో సర్పం మీద నాట్యమాడాడు. నారాయణుడు ఆదిశేషునిపై పవళించాడు. శివుడు సర్పాన్నిధరిస్తాడు. వినాయకుడు పొట్టకి బెల్టులా పాముని చుట్టుకున్నాడు. రాహు, కేతువులు అనే చాయా గ్రహణాలని కలిగిస్తాయి. అనేక మంది దేవతలు నాగాభరణాలని ధరిస్తారు. కొన్ని వందల సంవత్సరాల వయసున్న పాముల శిరస్సులలో స్ఫటికాలవలే మణులు ఏర్పడతాయిట. వాటిని నాగమణులుగా సేకరించి పూజించేవారు. సంస్కృత వ్యాకరణం మనకి అందించిన పాణిని నాగలోకానికి చెందిన వాడని ప్రతీతి. ఆయన వ్యాకరణం బోధించేటప్పుడు ఒక తెర వుంచే వారుట. ఒక సారి ఆసక్తితో ఏముందో అని ఒక శిష్యుడు తెర తీస్తే అనేక తలలతో ఒక మహా దివ్య సర్పం కనిపించిందిట.

యోగ శాస్త్రంలో సర్పం ఒక చిహ్నం, కుండలిని ప్రతిరూపం. ఆ నిక్షిప్త శక్తి ప్రతి మానవుడిలో మూలాధారం నుండి సహస్రారం దాకా ప్రయానించి మోక్షాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రాణశక్తిని ప్రాణాయామంతో నియంత్రించి ఆరోగ్యాన్ని, మోక్షాన్ని పొందవచ్చునని స్వరశాస్త్రంలో వివరించారు. ఆర్ధర్ ఎవలాన్ రచించిన 'ది సర్పెంట్ పవర్ ' అన్న గ్రంధం ఎంతో ఖ్యాతి గాంచింది, కుండలిని విశేషాలని వివరించింది.

శివుడిని నాగమల్లి పూలతో పూజిస్తే మంచిదని సాధకులు చెపుతారు. నాగేంద్రుడు లేనిదే శివుడు లేడు. క్షీర సాగరంలో వాసుకిని తాడుగా వాడారు. నాగేంద్రుడి పడగలో మహాత్ములని చూపుతారు. థాయ్ లాండ్ లో బుద్ధుడిని ఇలాగే చిత్రిస్తారు. నాగేంద్రుడిని కొంచెం భిన్నంగా డ్రాగన్ గా చైనాలో ఆరాధించారు. ఈనాటికి డ్రాగన్ వారికి ఎంతో పవిత్రమైన దైవం, అదృష్ట చిహ్నం. మలేషియా లో అతిపెద్ద సుబ్రహ్మణ్య విగ్రహం వుంది, అతిపురాతనమైన పెద్ద గుహలో, బతుక్ కేవ్స్ లో ఆయన దేవాలయం కూడా వుంది.ఈ అధునిక యుగంలో పాము విషాన్ని యవ్వన సాధనంగా చర్మానికి క్రీముగా వాడడం విచిత్రంగా వుండొచ్చు. అన్నికంటే ఆశ్చర్యం ఆర్గానిక్ కాంపౌండ్ అణు నిర్మాణం తెలియడానికి మూలం, కెకూలే అనే ఒక శాస్త్రవేత్తకి వచ్చిన కల -తన తోకని తానే కొరుకుతున్న పాము. సృష్టిలో ఎన్ని విచిత్రాలో! అయితే మంత్ర శాస్త్రంలో ఈ విశేషాలని మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం.

శ్రీ గురుభ్యో నమః

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.