పద్యం-హృద్యం

"సమస్యాపూరణం"

నిర్వహణ:  తల్లాప్రగడ  

ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!


ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వాక్యాన్ని యదాతధంగా వాడుకుంటూ ఒక పద్యంలోకి ఇమిడ్చి  రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఫిబ్రవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.


ఈ మాసం సమస్య
" ఆ.వె.|| ఎంత వారలైన వింత వారె! "

క్రితమాసం సమస్య
" కం.|| కారుల తిరిగేటి కుర్రకారులు వీరే! ! "

ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా

చెడిపోయినవారి గురించి:
కం|| బారున బీరులు త్రాగుచు
పోరిల చుట్టూ తిరుగుతు పోకిరిమూకై
వీరుల మేమనుకొని బే
కారుల తిరిగేటి కుర్రకారులు వీరూ


మంచివారి గురించి:
కం|| జోరుగ చదువులవి చదివి
చేరారొక జాబునందు చేతులనిండా
ధారగ డబ్బులు కురియగ
కారుల తిరిగేటి కుర్రకారులు వీరూరెండవ పూరణ - కృష్ణ అక్కులు, శాన్ హోసే, కాలిఫోర్నియా

కం|| ఓరిమిగ రేయిపగలును
తీరుగ చదవగ సివిల్సు ధీరుల వోలెన్
పేరులు మొదట నిలవ అధి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే


కం|| భారంగ బ్రతుకును తలచి
నేరం పాలకు లనబడు నేతల దనుచున్
చేరి అడవులను విప్లవ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే


కం|| బారెడు జుట్టును నిక్కరు
మూరడు కల్లరు టిషర్టు బూటులు నైకీ
తీరుగ ధరించి జోరుగ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే


కం|| కోరికగ సాప్టు వేరున
చేరియు డాలరులు కోరి చేరి అమెరికా
భారీగ గడించిగ షౌ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే

కం|| గారాభము చేయటచే
గౌరవముగ ఎదుగలేక కౌరవులవలే
దారుణములు చేయుచు బే
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే


కం|| స్టారుకు అభిమానియనుచు
ఊరునపడి రేయిపగలు ఊరశునకమై
వూరక గొడవలుచేసి బి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే


కం|| తారలమించిన పిల్లకు
దోరగ చూపులు విసరగ దొరయని తలచీ
దారికి వచ్చి వలచిన షి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే

మూడవ పూరణ - ఎం.వి.సి రావు, బెంగుళూరు
కం|| దొరకగ టాటా చౌకగ
జొరుగ విహరించి మిగుల చొద్యము జూపన్
కొరిన రంగుల నానొ
కారుల తిరిగెతి కుర్ర కారులు వీరే


నాల్గవ పూరణ - తల్లాప్రగడ

కం|| బీరుల బారులు తిరుగుచు
కోరిక గుఱ్ఱములనెక్కి కేకలు పెడుతూ
ఊరకె ఊరికి బరువై
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.