పరదేశి కథలు 

ఇదో రకం 'తెగులు'

రచన: తాటిపాముల మృత్యుంజయుడు

 

ఎవరండీ తెలుగుభాష ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నదని అంటున్నది? అసలు ఎవరండీ అంటున్నది, ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే తప్పక ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారని? అహా, నాకు తెలియక అడుగుతాను, హైద్రాబాదులో తెలుగు అస్సలే వినబడదని ఎవరండీ అన్నది? అలాంటివారిని ఇక నేరాసింది చదవమనండి. నాలుక్కరుచుకొని తప్పయిందని చెంపలేసుకుంటారు. లేకుంటే నేను తప్పుని ఒప్పునొని కలం సన్యాసం చెస్తాను, అదే రాయడం మానుకుంటాను.

అదేంటో నా జీవితంలో ఈరోజుకి ఒక ప్రత్యేకతుంది. నా చెవులకింపైన తెలుగు ఉదయం నుండి సాయంత్రంవరకు వింటూనే ఉన్నాను. తెలుగు ఇంత మధురంగా మాట్లాడుకోవచ్చని, రాసుకోవచ్చని నాకిన్ని రోజులనుండి తెలియదు.

ఏపాటు తప్పిన సాపాటు తప్పదు కనుక, యథావిధిగా హడావుడిగా నిద్రలేచి పొద్దున్నే ఆరింటికే మీటింగుకి ఫోను చేసాను. ఫోనుకు ఆవల ఉన్నది ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు. ఇటుపక్క నేను. ముగ్గురం సాఫ్ట్ వేర్ ప్రాబ్లెం గురించి చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నాము. ఆ ఇద్దరిలో ఒకతను కొత్తగా పనిలో చేరాడు.

ఇంతలో అటుపక్కనుండి, 'అదికాదు బాబాయ్!....' అన్న మాట వినబడింది.ఆ కుర్రాళ్ళలో ఒకరి బాబాయి ఉన్నట్టుండి ఆఫీసులో దూరాడేమోననుకొని, అతనితో మాట్లాడుతున్నాడేమోనని నేను ఊరికుండిపోయాను. కొన్ని క్షణాల తర్వాత నా దగ్గరనుండి జవాబు లేదేంటని ఆశ్చర్యపోతూ 'హలో, ఆర్ యూ దేర్?' అంటూ గట్టిగా అరిచారు. 'బాబాయ్' నన్ను సంబోధించాడని అప్పుడర్థమయ్యింది నాకు. 'ఆంటే మా అన్నయ్యల అబ్బాయిలు ఎవరైనా నాకు తెలియకుండా చేరి, నన్ను ఇలా సర్ ప్రైజ్ చేస్తున్నాడెమో. నిన్నటివరకు వాళ్ళతో ఫోన్లలో మాట్లాడాను గదా, ఛాటింగు చేసాను గదా! హారినీ, ఒకమాటైనా చెప్పలేదే' అని ఆశ్చర్యపోవటానికి సమాయత్తమవుతుంటే... 'సారీ, వెరీసారీ!...' అని అభ్యరించాడు ఆ కుర్రాడు. ఏంజరిగిందో తెలియక నేను తికమక పడుతుంటే వాళ్ళే చెప్పారు. ఈమధ్యకాలంలో కుర్రాళ్ళు ఒకరినొకరు 'బాబాయ్' అని సంబోధించుకొంటున్నారని చెప్పారు. అలా పిలుచుకోవడం చాలా మాములై పోయిందనీ మరీ చెప్పారు. నేను 'సరే' అని చెప్పి లోలోన ఈకొత్త పోకడకు నవ్వుకొంటూ మళ్ళీ మా డిస్కషన్ లోకి దిగిపోయాము. అంతలో 'అదికాదండి, రావుగారు...' మాటలు వినబడ్డాయి. 'అరె నా పేరులో రావులేదే? తప్పుగా పిలుస్తున్నాడెమో? నన్ను గౌరవంగా పిలుస్తున్నాడేమో?' అనుకొంటూ తెగఫీలయ్యి 'నా పేరు రావుకాదు ' అన్నాను. 'ఈసారి మళ్ళీ సారీ! వెరీవెరీ సారీ...' అంటూ 'బాబాయ్ అని ఒకే వయసు వాళ్ళను పిలుచుకుంటారని, వయసులో తమకంటే పెద్దవాళ్ళని 'రావుగారు ' అని సంబోధిస్తారని, అదే తప్పు ఇక్కడకూడా దొర్లిందని ' చెప్పుకొచ్చారు. ఈ కొత్తమాటల ట్రెండ్ కి నవ్వుకొంటూ మా మీటింగ్ పూర్తి కానిచ్చాము.

త్వరగా తెమిలి ఆఫీసుకు చేరాను. తల తిప్పుకోలేనంత పని. సాయంత్రం నాలుగయ్యింది. 'నా తెలుగుతల్లి భూమిలో విశేషాలు ఏమి జరుగుతున్నాయబ్బా' అంటూ రోజువారీ అలవాటుగా ఇంటర్నెట్లో వార్తలు చదవడం మొదలెట్టాను. 'అసెంభ్లీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి మధ్య వాగ్యుద్ధం' అన్న వార్తను చదవడం మొదలెట్టాను.
'మీరేమి ప్రజలకు సేవ చెయ్యటం లేదు. మీకు సిగ్గు, నీతి, లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేయాలి ' - ప్రతిపక్ష సభ్యుల ఆరోపణ. ఆ మాటలు విన్న ప్రభుత్వంలోనున్న ఒక ఎమ్మెల్యే 'కబడ్దార్, ఏమనుకున్నవో, ఇంతకుముందు వరకు ఏ గాడిదకొడుకు చేయని అభివృద్ధి నేను చేసాను ' అంటూ ముందుకు దూకాడు.

'మీరంతా చచ్చిన పీనుగలు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కిలోమీటరు లోతున బొందపెడతాం.' ఇంకో పార్టీ సవాలు.
'రే, రే, మీరు మీ అమ్మకు పుట్టిన వాళ్ళయితే, మీరిప్పుడే రాజీనామా చేయండి. ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ' ఇంకో ప్రజాప్రతినిధి వీరంగం.

దేవాలయం కంటే పవిత్రమైన అసెంబ్లీలో వరదలా పొంగింది తిట్ల పురాణం.


అహా! చదవటానికి నోటినిండా, వినటానికి అమృతంకన్నా మధురంగా ఉన్న ఈ మాటలు విన్న తర్వాత, 'ఎవరండీ అనేది? అజంతమైన తెలుగుభాష నిరాదరణకు గురి అవుతున్నది ' అని అడుగుతున్నాను. 'ఇలా ప్రభుత్వం తెలుగును పోషిస్తుంటే ఇక తెలుగు ఎలా అంతరించి పోతుంది?' అని నేను నిగ్గదీస్తున్నాను. పని అయిపోయింది. లాప్ టాప్ కట్టేసి ఇంటికి వెడుతూ ఓ తెలుగు సినిమా తీసుకెడదామని షాపు దగ్గర ఆగాను.

ఓ క్యాసెట్ తీసుకొంటూ 'ఈ సినిమా ఎలా ఉంది?' అని అడిగాను. వెంటనే 'కేక ' అని క్లుప్తంగా అనేసి తనపని తను చూసుకోవడం మొదలెట్టాడు. 'అంటే ఇది బాగున్నట్టా? లేనట్టా?' అన్న సంగ్దిద్ధంలో పడ్డాను. మళ్ళీ అడిగాను. మళ్ళీ అదే జవాబు - 'కేక అండీ బాబు '

నా నిస్సహయతను అర్థం చేసుకున్న నా వెనకాల ఉన్నతను నవ్వుతూ 'అంటే చాలా బాగున్నదని అర్థం. 'కేక ' ఈ మధ్య ఓ సినిమాలో వచ్చిన ఊతపదం లెండి ' అని చెప్పాడు.

'ఈ కొత్త పదప్రయోగం బాగుందే' అనుకొని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెడుతుంటే అనుమానమొచ్చింది - 'నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందా? మైసూరుబొండా మైసూరులోనే చెయ్యబడుతుందా? అలాగే తెలుగులో మంచిసినిమా వస్తుందా?' అని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. భోజనం అయిన తర్వాత సినిమా పెట్టాను. సినిమా మొదలుకాగానే మూడు మాటలు మాట్లాడగానే 'ఐటం సాంగ్ '. 'షరా మాములే' అనుకొంటూ సినిమా చూస్తున్నాను. ఇంతలో నా తలమీద ఎవరో ఠపీమని దుడ్డుకర్రతో బాదారు. కళ్ళు బైర్లు కమ్మాయి. నేను స్పృహనుండి తప్పి పోవటం నాకు తెలుస్తూనే ఉంది. తలమీద చెయ్యి పెట్టుకొన్నాను. రక్తమేమి లేదు. కాని తెలివి తప్పింది. అలా కొన్ని నిమిషాలున్నానేమో. మళ్ళీ తెలివి వచ్చింది. ఈ వింత అనుభూతికి కారణమేమిటా అని ఆలోచించాను. ఈ సంఘటనకు ముందు జరిగిన విశేషాలను అవలోకనం చేసుకోవటం మొదలెట్టాను. ఈ సినిమాలోనే ఏదో ఉంది అనుకొని రివైండ్ చేశాను. అప్పుడు తెలిసింది నేను తెలివి తప్పటానికి కారణం. 'అసలెందుకు ప్రేమించావ్ నన్ను, భరత్?'  హీరొయిన్ ప్రశ్న. 'ప్రేమనేది జీవితమనే క్వొశ్చన్ పేపరులో సమాధానం లేని ప్రశ్నలాంటిది, సుజా' హీరో జవాబు. అద్గదీ, నా మతి తప్పిపోయింది ఇందుకన్నమాట. హీరోగారి గొప్ప తెలుగు డైలాగ్ తో నేనుకాస్తా కిందపడిపోయానన్న మాట.

'ఇంతేలే, తెలుగు సినిమా సంగతి ఇంతేలే' అని పాడుకొంటూ లాప్ టాప్ ఓపెన్ చేసాను. సినిమా కబుర్లు ఏమైనా ఉన్నాయని అని చదవడం మొదలెట్టాను. ఒక హీరోగారి సినిమాకి ఏం పేరు పెట్టాలని నిర్మాత, దర్శకుడు, హీరో యమగా ఆలోచించి, చించి, ఒక బ్రహ్మాండమైన పేరును సెలెక్ట్ చేసారట. అది 'కోతి నా కొడుకు '. 'ఇప్పుడు చెప్పండి. మనవాళ్ళు, ఆధునికతను పుచ్చుకున్న కుర్రాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు ఇలా 'స్వచ్చమైన ' తెలుగును కాకున్నా 'అచ్చమైన ' తెలుగును వాడుతున్నారు కదా! మరింక తెలుగుకి వచ్చిన ఢోకా ఏంటీ?' అని కుండబద్దలు కొట్టినట్టు అడుగుతున్నాను. మీ దగ్గర సమాధానముంటే చెప్పండి.

వస్తుంటే ద్వారంవద్ద లింగం, జంగం ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. 'మన చార్టర్ ప్లేన్ అయిడియాతో హీరో బాగా ఇంప్రెస్ అయ్యిండు. ఇంకొంక్క యాభై మందిని విమానంలో తోలుకొస్తే బాగుండేది. అప్పుడు ఏదోఒక పదవి గ్యారంటీ అయ్యేది...' గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.