రామాయణ రత్నాలు

1. ధర్మవృక్షం-రామాయణం (4 వ భాగం)

రచన: విద్వాన్ టి.పి.యన్. ఆచార్యులు

 


మానవ జీవనగమనానికి కరదీపికలు, అవశ్యం ఆచరణీయాలు ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు. అర్ధకామాలకి ధర్మం మూలం, ఈ మూడు మోక్షం సాధనకి మార్గాలు. వీటిలో "ధర్మం" అతిముఖ్యమైనది. వేద ప్రతిపాదిత ధర్మం భారత, భాగవత, రామయణాది గ్రంథాలలో సులభంగా వివరించబడింది. వాల్మీకి చించిన రామయణం ధర్మానికి వృక్షం వంటిది. శ్రీమన్నారాయణుడు మానవునిగా అవతరించి, ఆచరించి చూపిన
పురుషార్ధం ధర్మమే. కనుకనే "రామోవిగ్రహ వాన్ ధర్మః" రూపుదాల్చిన ధర్మమే రాముడు అని వాల్మీకి స్తుతించేడు.

ధర్మం వృక్షమైతే దాని శాఖలు (కొమ్మలు) గా పదిగుణాలు చెప్పవచ్చు" దశలక్షణకో ధర్మఃసేవితవ్యః " అని ధర్మము మీమాంసలో చేప్పబడంది. అవి 1. సంతోషం. 2. క్షమ, 3. భుతదయ. 4. దొంగతనం చేయకుండుట 5. శౌచం 6 ఇంద్రియ నిగ్రహం 7. సత్యం 8. శాస్త్రజ్ఞానం 9. శాస్త్రవైదుష్యం. 10. క్రోదరాహిత్యం. ఇవేగాక " శాఖోపశాఖలుగా ధర్మవృక్షం విస్తరించి, మానవాళి మనుగడకు మార్గదర్శకమనే చల్లని నీడని ప్రసాదిస్తోంది. ఈ పది ధర్మగుణాలతోపాటు, మరెన్నో మంచిగుణాలుగల ఆదర్శ పురుషుడుగా శ్రీరాచంద్రుణ్ణి వాల్మికి మనకి చూపుతాడు. రామాయణ ప్రారంభంలో తనవద్దకు వచ్చిన నారదుణ్ణి వాల్మికి మహర్షి యిలా ప్రశ్నిస్తాడు. "కోణ్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్, కశ్చవీర్యవాన్, ధర్మజ్ఞుశ్చ, కృతజ్ఞశ్చ " అని యిలాంటి పదునారుగుణాలు గల మహా పురుషుడువున్నాడా " చెప్పమంటాడు. అపుడు నారదుడు ఇక్ష్వకు వంశ సంజాతుడు, దశరధ పుత్రుడు అయిన శ్రీరాముడనే పురుషోత్తముడున్నాడు. అతని కథనే వ్రాయి అనిచెప్తాడు.


శ్రీరాముడు పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తించి, ఎన్నికష్టాలు వచ్చినా ధర్మ గుణాన్ని వీడక, ధర్మగుణానికున్న ప్రాముఖ్యతని లోకానికి చాటి చేప్పిన మహనుభావుడు. కనుకనే రామయణం "ధర్మానర్ధః ప్రభావతి, ధర్మాతే ప్రభవతే సుఖిం ! ధర్మేణలభతే సర్వం, ధర్మసారమిదం జగతౌ" "ధర్మం వలననే అర్థకామాలు సుఖసంతోషాలు లభిస్తాయని ధర్మం ఈ జగత్తుని నడిపిస్తోంది " అన్న ధర్మసారాన్ని మనకి బోధిస్తుంది ధర్మరహితమైన కామం కాంక్షిస్తే కైకేయి వలన దశరధుడు, సుగ్రీవుని భార్యని కాంక్షించి వాలి, సీతని చెరపట్టి రావణుడు, ధర్మాన్ని విడచి, అకృత్యాలకు పాల్పడిన రాక్షసులు నశించినట్లు రామాయణం మనకి తెల్పుతుంది. భగవానుడైన రాముడు "ఆత్మానందూ మానుషంమన్యే " నేను మామూలు మానవుణ్ణి, ధర్మరక్షణే నా లక్ష్యం " అని లోకానికి చాటి చెప్పిన ధర్మ స్వరుపుడు రాముడు "

ధరతి విశ్వంధర్మః" ధరింపబడునది ధర్మం. దృఞధరణేః అనుధాతువు నుండి ధర్మ పదం పుట్టింది. ఇట్టి ధర్మం రెండు విధాలు. ! సామాన్య ధర్మం ఒక విశేశ ధర్మం, జ్ఞాన, తపోయజ్ఞాలు, తల్లి, తండ్రి, భార్య, సోదరులు, మిత్రులు, శతృవుల వంటి వాటి విషయంలో ప్రవర్తించ వలసిన విధి విధానాలు తేల్పేది సామాన్య లౌకక ధర్మం. తాను,

తాను పొందవలసిన దేది, దానిని పొందుటకు ఉపాయము, దాని అవరోధము, తత్పలము అను ఐదింటిని తెల్పేది విశేష ధర్మం. వేద ప్రతిపాదితములైన ధర్మగుణాల్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో వివరించేది రామాయణం. కనుకనే ఈ ఆదికావ్యం ధర్మ వృక్షంగా పిలవబడుతోంది. పితృవాక్య పరిపాలన, సత్య వ్రత దీక్ష, కళత్ర, మిత్ర, భ్రాతృ సమాదరణ, ధర్మ భ్రష్టులైన శతృ నిర్మూలన, అట్లే భగవంతుని చేరుకోతగ్గ భక్తి, మార్గాలు రాముని ద్వారా, రామాయణం మనకి బోధిస్తుంది. రాముని ధర్మస్వరూపుడైన భగవంతునిగా తొలుత విశ్వా మిత్రుడు గుర్తిస్తాడు.


"ఆహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం" అని అంటాడు. యజ్ఞ రక్షణ మిషగ బాలునివలే విశ్వామిత్రడు, శ్రీరాముని సేవించి తరస్తాడు. బాలకాండ అన్నపేరు విశ్వామిత్ర పరంగా వాల్మికి పెట్టాడని పెద్దల అభిప్రాయం. వేరువేరుగా ఉన్న లక్ష్మీ, నారాయణులను (సీతారాములను) ఒకటి చేసిన ధన్య జీవి విశ్వామిత్రుడు.

ధర్మాచరణ పరాయణులుగా, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, గుహుడు, హనుమ, విభీషణుడు వంటి వారిని ఆదర్శవంతులుగా చూపిస్తాడు వాల్మికి ధర్మవిరుద్దులుగా శూర్పనఖ, వాలి, రావణాది రాక్షసులు కనబడతారు. సీతారాముల అన్యోన్య ప్రేమ, దాంపత్య ధర్మం ఎలా ఉండాలో ఆచరించి చూపేరు. అది అమోఘం అద్వితీయం, ఆదర్శవంతం " రామస్తు సీతయా సాధ్విం విజహార బహువాన్ ఋతూన్" రాముడు సీతతో అనేక ఋతువులు హాయిగా గడిపేరు " అని అంటాడు వాల్మీకి-కనుకనే వారి కథ "రామయణంగా, సీతాయాశ్చరితం " గా అవతరించింది,

"ఇదం పనిత్రం, పాపఘ్నం, పుణ్యం, వేదైశ్చ సమ్మితం"
"ధర్మము పనిత్రమైనదీ, పాపాల్ని నశింప చేసేది, పుణ్యాన్ని కలిగించేదీ, వేదాలచే చెప్పబడినది. అందుకనే ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాలి, దీనిని రక్షిస్తే సుగ్రీవ, విభీషణాదులు రక్షింప బడతారు. ధర్మాన్ని తప్పితే రావణాదులు నశించినట్లుగా నాశనమౌతారు. ధర్మశాస్త్ర కోవిదులు ధర్మాన్ని వర్ణిస్తూ---" ధర్మ మీమాంశలు" "ధర్మపదహతోహంతి, " ధర్మోరక్షతి రక్షతః! " తస్మాద్దర్మోనహంతత్యం: మానోధర్మో వీతోభవేత్" "ధర్మాన్ని మనం రక్షిస్తే చివరి వరకు మన వెంట వచ్చి అది మనల్ని రక్షిస్తుంది. ఇదే రామాయణం ద్వారా వాల్మీకి మనకు బోధిస్తాడు. పురుషార్థాలలో మిగిలిన వాటిని కూడా ధర్మసమ్మతంగా సమానంగా చూడాలని భరతునికి రాముడు భోధిస్తాడు.


" ధర్మాలలో మరో ముఖ్య ధర్మం " పరదారేషు అసంసర్గః
ఇతరుల భార్యలను కోరకుండుట అలా కోరి ధర్మహతుడైనాడు రావణుడు. మారీచుడు రావణునికి హీతబోధ చేస్తూ
పరగారాభిమర్మాత్తా నాన్యత్ పాప తరం మహత్ "ఇతరుల భార్యలను కోరడం మహాపాపం " అంటాడు. అయినా ఆ మంచి మాటలు రావణుడి వినడు "అప్రయస్సచ, పధ్యస్యవక్తాశ్రోతొచ దుర్లభః " అని బాధపడుతాడు. అయినా సరే సీత నపహరించి ధర్మచ్యుతుడై నాశనమౌతాడు రావణుడు.
సాక్షాత్ పరమ శవుడు పార్వతికి మరో ఐదు ముఖ్య ధర్మలక్షణాలు చేపుతాడు. అవి- 1. ఇతర స్త్రీలను కోరకుండుట. 2. తనవద్ద ఉన్న స్త్రీని కాపాడుట 3. ఇవ్వని వస్తువు తీసికొనకుండుట 4. మధువు, 5. మాంసాలను త్యజించుట . శ్రీమద్రామాయణ మహా కావ్యం భారతీయ జీవన విధానానికి కరదీపిక . ఇందలి కథ పాత్రలు, సన్నివేశాలు, వర్ణనలు సమస్తమూ ధర్మ ప్రతిబోధకాలు, భక్తి ముక్తి దాయకాలు.

రామాయణ మహా మాలకి రత్నం వంటి హనుమ సేవ ధర్మానికి, భక్తికి శబరి, మిత్రత్వానికి సుగ్రీవుడు, భ్రాతృత్వానికి లక్ష్మణ, భరత, శతృఘ్నలు, యిలా ప్రతి పాత్ర ప్రతి కదలిక, ప్రతి దృశ్యం, ప్రతి సంఘటన ధర్మాన్ని బోధిస్తూ విశ్వశ్రేయః కావ్వం అన్నలక్షణానికి శత శాతం ఉదాహరణగా నిలుస్తుంది రామాయణం. శాఖోపశాఖలుగా విస్తరించిన ధర్మాన్ని అందరూ అచరించాలి. ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసికోవాలి. ధర్మ వృక్షమైన రామాయణాన్ని అందరు పఠంచాలి. ఇహ లోక, పరలోక సుఖాల్నికలగించి, నైతికతను పెంచి, పరమాత్మస్వరుపాన్ని సాక్షాత్కారం జేసి, మానవ జీవితానికి సన్మార్గమనే నీడని ప్రసాదించే ధర్మ వృక్షాన్ని గుర్తించి, తత్ఫలాలని ఆస్వాదించి, ఆదర్శవంతంగా జీవించి లోకః సమస్తాః సుఖినో భవంతు అని ఆకాంక్షిద్దాం.
 

                                                                                             ...సశేషం

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.