సీ|| వ్యర్థము వినరయ బ్లాగుల తిట్టుట, అర్థము చేసుకొ అలుక మాని!
పకపక నవ్విన పత్రికలైనను పక్కకు తొలగిరి బ్లాగు ముందు!
బతుకుట నేర్చుకొ భద్రము బ్రదరు ఈ బ్లాగుల వాగుడె బాగుబాగు
బ్లాగరి అయినువు బ్లాగుల వాగుల, వాగుము లాగుము వార్తలన్ని!

తే.గీ|| పత్రికల్ లేఖల కరువె చిత్రమయ్యె!
పట్టపగ్గాలు లేవయా పట్టపగలె!
చూడు అంతరజాలపు వేడి నీవు!
రమ్యగుణగణధామ శ్రీరామచంద్ర!

మా అత్తయ్య వాళ్ళమ్మాయిని, అంటే మా వదినని అత్తారింటికి పంపేటప్పుడల్లా, " వూరెళ్ళగానే ఒక ఉత్తరం ముక్కరాసి పడేయవే తల్లీ " అని చెప్పి పంపించేదట. మరి మా వదిన గారు చాలా పెద్దింటికోడలు కనుక ఆ రోజుల్లోనే బోళ్ళెడంత బిజీగా వుండేదట. అలా అని మాతృవాక్పాలనకి ఏ మాత్రం లోటుచేసేదికాదట.తనకి అది సమయాభావమైన పనే ఐనా వూరెళ్ళగానే ఒక కార్డు ముక్క రాసి పోస్టులో పడేసేదట. ఆ పోస్టుకార్డులో అత్తయ్య అడ్రస్సు తప్ప మరేమీ వుండేదికాదట. చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడమంటే అదే మరి. ఏమైతేనేం, ఆవిడ ఊరు క్షేమంగా చేరిందని తెలిసేది.
ఇలాంటి క్లుప్త వుత్తరాలు ఒక రకమైనవి ఐతే, జవహర్‌లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా నెహ్రూకి అనేక అద్భుతమైన లేఖలు వ్రాసారట. తరువాత అవి ఒక మహాగ్రంధంగా రూపుదిద్దుకొని, భారత దేశ చరిత్రకీ, మానవ జాగృతికీ ఒక మహాదర్పణతుల్యమై అనేకమార్లు ప్రచురింపబడ్డాయి. ఇవి నిజానికి వారి వ్యక్తిగత లేఖలే అయినప్పటికీ వాటిలోని విషయప్రవాహం మహోన్నతమై ఇందిరనే కాకుండా సమస్త భారతాన్నీ ప్రభావితం చేసాయి. ఇది మరొక రకమైన లేఖాప్రభంజన సృష్టి. ఆ రోజుల్లో ఎవరికైనా వీడ్కోలు చెబుతుంటే, వెంటనే ఉత్తరంవ్రాయమని అడగటం సామాజిక పరిపాటి. రోజూ పోస్టుమాను ఎప్పుడొస్తాడా, ఏ వుత్తరాలు వస్తాయా అని ఎదురుచూడటం ఒక నిత్యకృత్యం. ఆ వుత్తరాలు పేజీలు పేజీలుగా రావడం, అలాగే మనంకూడా మళ్ళీ వ్రాయడం, వాటిని చదివి ఎన్నో అందులోని విషయాలకు రూపకల్పన  చేసుకుని వూహించుకోవడం, పాత జ్ఞాపకాలను

 నెమరువేసుకోవడం, ఒక తీపి అనుభూతి. లేఖాపఠనం తతిమా పుస్తకపఠనాల లాగే మన అనుదిన సమయంలో భాగస్వామి కావడం, అలాగే లేఖారచనే ఒక ప్రవృత్తి కావడం, అదే ఒక పద్దతిగా ఎన్నో క్రమాలను అలవరుచుకోవడం, అలాగే లేఖారచనాపద్దతులను, క్రమాలను పాఠశాలలో సైతం భోధించడం, మనమందరం ఎరిగినవే.
ఉద్యోగాలకు ధరఖాస్తులు వ్రాయడం ఒక రకమైతే, తల్లితండ్రులకు వ్రాసే విధానం మరొక రకము. మిత్రులకు వ్రాసే కూర్పు ఒకలాగా సాగితే, ప్రేయసికి వ్రాసే నేర్పు మరొక రకము. వ్యాసాల లాగా సాగే ఉత్తరాలు ఒక రకమైతే, సంభాషణా ధోరణి మరొక రకము. ఇలా ఎన్నో రకాలుగా వ్రాసాము, ఎన్నో క్రమాలు సృష్టించుకున్నాము. మనుగడకు ఒకమంచి మాధ్యమాన్ని తెచ్చాము.

కానీ ఇప్పుడు రోజులు మారాయి.మనం సృష్టించుకున్న ఆ అందమైన లేఖ లేకనేపోయింది. ఒక ప్రేయసికి కూడా ఉత్తరంవ్రాయగలిగే అవకాశంగాని, ఆవేశంకానీ, ఆలోచనగానీ, అలవాటుగానీ, కనపడదెక్కడా. ఆ ప్రియ సంభాషణ కూడా ఒక ఈ-మెయిలులోనో లేక ఛాటింగులలోనో జరిగిపోతుంది. ఉద్యోగానికి పెట్టే ధరఖాస్తుల అవస్థ చెప్పనే అక్కరలేదు. కేవలం resume enclosed అనిమాత్రం వ్రాసేటప్పడికి చాలామందికి ఆయాసం వచ్చేస్తుంది. మా అత్తకూతురులాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే " ఉందిలే మంచి కాలం ముందుముందునా - అందరూ సుఖపడాలీ నందనందనా " అంటే ఏమో అనుకున్నాం కానీ, ఇలాంటి "కట్టె, కొట్టె, తెచ్చె " అనేలాంటి ఈ-మెయిల్ జమానా వస్తుందని ఎవరికి తెలుసు.

ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉత్తరాలు తగ్గుముఖం పట్టాయి, పత్రికలు తగ్గాయి, నవలలకు అసలుకే మోసం వచ్చింది. ఈ మధ్య అందరూ కార్లు కొనుక్కోవడం మూలంగానేమో, చనిపోతున్న రేడియోలు కాస్తా మళ్ళీ బయటకి వచ్చాయి. ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడదామంటే, ఇంటికెళ్ళగానే, ఒక పలకరింపు పడేసి, టీవి పెట్టి కూర్చోపెడతారు. సీరియల్ ఏదో చూశాక మాట్లాడతానని సీరియస్‌గా కూర్చుంటారు. ఆ సీరియల్ అయితే, మరేదో సినిమా వస్తుంది. వాళ్ళకి మాట్లాడే తీరిక గాని, ఏదైనా చదువుదామన్న ఆసక్తిగానీ, శక్తిగాని కనిపించవు. ఒక్క టీవి, సినిమాలుతప్ప మరో మాధ్యమం అగుపడదు.

కంప్యూటర్‌ల వ్యాప్తి పుణ్యమా అని ఈ-మెయిళ్ళు పుంజుకుంటున్నాయి. మన జనం ఎలాగూ కంప్యూటర్లకి అలవాటు పడ్డారుకదా అని పత్రికలు కూడా అంతర్జాలం(Internet)లో ప్రచురించి ఒక నూతన దిశలోకి వచ్చాయి. ఇది పత్రికాపరంగా వాటికి ఒక పునర్జన్మే. ఏది ఏమైతేనేం, మనకు నచ్చినా నచ్చకపోయినా అంతర్జాలం మన జీవితాలలో ఒక భాగం అయిపోయింది. ఒక మహనుభావుడన్నట్లు "there is only one thing that is constant! And that is change ! " అందుకని మనం ఆ changeనే అలవాటుచేసుకుని దానిలోని అందాన్ని, సౌలభ్యాన్నీ ఆస్వాదించుదాం. ఇంతకుముందున్న పత్రికారంగంలో మనకు వ్రాయాలనే ఆసక్తివుంటే చాలేది కాదు. ఒక పత్రిక సంపాదకుడితో సమంగా పరిచయంలేకపోతే రచయితలకు గుర్తింపు కష్టంగావుండేది. రచయితలకు తమ రచనలను ఎవరు ప్రచురిస్తారా అని ఎందరినో ఆశ్రయించాల్సిన ఖర్మ పట్టేది. అలా ఎందరికో పంపితే, అందులో ఎవరు వాటిని తస్కరించి తమపేరు వేసేసుకుంటారో అనే ఆందోళన కూడా వుండేది.

ఇప్పుడు అనేక అంతర్జాల పత్రికలున్నాయి, వాటికి మన రచనలను ఈ-మెయిళ్ళద్వారా పంపితే ముందు ఎవరో వాటిని కాపీ కొట్టేస్తారనే భయంలేదు. ఎందుకంటే, మనమే వాటిని మొదటగా పంపినట్టు ఋజువుచేయడానికి మన ఈ-మెయిలే సాక్షిగా నిలబడుతుంది. అలాగే అంతర్జాలంలో స్థలాభావం లేదుకనక ప్రచురించడానికికూడా అనేక పత్రికలు సుముఖతచూపిస్తారు. అసలు వీళ్లందరితోను మనకేంటి మన రచనలను మనమే ప్రచురించుకుందాం అనుకుంటే అనేక బ్లాగుసైట్లు వున్నాయి. నిక్షేపంగా మన రచనలను వాటిలో నిక్షిప్తం చేసుకుని, గూగుల్‌లాంటి సెర్చి ఇంజన్లద్వారా అందరిముందుకూ అవలీలగా తేవచ్చు. అంతర్జాలంలో వికిపీడియావారి సమాచారం ప్రకారం భారతభాషలన్నిటిలోకీ తెలుగుభాషే అంతర్జాలంలో అధికంగా వాడబడుతోందని తెలిసింది. మరింకేం " ఉందిలే మంచికాలం ముందు ముందునా - రచయితలంతా (అలాగే పాఠకులంతా) బాగుపడాలి నందనందనా "

మన సుజనరంజనిలో అన్ని మంచి రచనలనూ అందరి ముందుకూ తేవాలనే మావంతుగా మేము ఆకాంక్షిస్తున్నాము. అందరూ వ్రాయండి, కొత్త రచయితలను ప్రోత్సహించండి. సిలికానంధ్ర సైటులోకూడా ఒక బ్లాగు సైటు ఉంచాము. అక్కడకూడా మీ బ్లాగులను మీరు వ్రాయచ్చు. మంచి రచనలను సుజనరంజనిలో తప్పకుండా ప్రచురిస్తాము.
మీ

తల్లాప్రగడ

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 
         

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.