తెలుగు తేజో మూర్తులు

తమ తమ రంగాలలో నిష్ణాతులై, పేరు ప్రఖ్యాతులనార్జించిన తెలుగువారెందరో ఉన్నారు.ఎన్ని ఇబ్బందులెదురైనా పట్టు విడవక వారు కొనసాగించిన దీక్ష, కృషి, సాధన, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలను ఈ శీర్షిక ద్వారా అందిస్తున్నాము.

గణిత మేధావి - విశిస్టాచార్య పద్మశ్రీ మాడభూషి సంతానం (ఎం ఎస్) రఘునాథన్ 

రచన: ఈరంకి వెంకట కామేశ్వర్

ప్రపంచ గణిత శాస్త్ర రంగంలో బీజగణితం (ఆల్జీబ్రా), ఆల్జీబ్రాఇక్ జామెట్రీ, లీ గ్రూప్స్, నంబర్ థియరీ క్షేత్రాలలో పట్టు కొమ్మై నిలచి, ప్రాముఖ్యత సంతరించుకున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టీ ఐ ఎఫ్ ఆర్) సంస్థలో, విశిస్ఠ గణిత శాస్త్రవేత్తగా ఎదిగిన పద్మశ్రీ అచార్య మాడబూషి సంతానం (ఎం ఎస్) రఘునాథన్. 2000 లో ఎం ఎస్ ని లండన్ లోని రాయల్ సొసైటీ ఫెల్లో గా గౌరవం సాధించి  గణిత దిగ్గజాలైన శ్రీనివాస రామానుజన్, హరీష్ చంద్ర, సీ ఎస్ శేషాద్రి, ఎం ఎస్ నరసింహన్, ఎస్ ఆర్ ఎస్ వరదన్ ల సరసన నిలిచారు.

19 యేళ్ళ వయసులో టీ ఐ ఎఫ్ ఆర్ లో " రీసర్చ్ అసిస్టెంట్ " గా చేరినపుడు బుడతడుగా పిలువబడ్డ ఎం ఎస్, నేడు టీ ఐ ఎఫ్ ఆర్ విశిష్టాచార్యులు. (ప్రొఫెసర్ ఆఫ్ ఎమినెన్స్), లీ గ్రూప్స్ క్షేత్ర దిగ్గజం, గణిత శాస్త్ర నిష్ణాతుడు, దేశంలో గణిత క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన గణిత శాస్త్రజ్ఞుడు. పాతికేళ్ళ ప్రాయంలోనే గణితాచార్య పదవిని అధిష్టించిన వీరు కేవలం 29 యేళ్ళ ప్రాయంలో, ప్రపంచ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేధమెటీషియన్స్ (ఐ సీ ఎం) లో, ఎం ఎస్ గౌరవ ఉపన్యాసం ఇచ్చారు. ఇంత పిన్న వయస్సులో ఇలాంటి మన్నన పొందిన శాస్త్రవేత్తలు అరుదు. నోబెల్ పురస్కార గ్రహీత - ఖగోళ శాస్త్ర దిగ్గజం, శ్రీ చంద్రశేఖర్ ఎం ఎస్ ను ఒక అద్భుత గణిత మేధావిగా పేర్కొన్నారు.


టీ ఐ ఎఫ్ ఆర్ తో సుదీర్ఘానుబంధంతో విశిష్ట గణితాచార్యుడిగా, గణిత క్షేత్రాభివృద్ధికి తోడ్పడ్డారు ఎం యస్.. భారత దేశంలో మేథమేటిక్స్ ఒలంపియాడ్లను నిర్వహించి, గణిత క్షేత్ర పరివ్యాప్తికి, అబివృద్దికీ దోహదం చేసారు. రఘునాథన్ గణిత మేధావిగా జగత్ ప్రసిద్ధులు. ఈయన రచించిన " డిస్క్రీట్ సబ్ గ్రూప్స్ ఆఫ్ లీ గ్రూప్స్ ", పుస్తకం ఓ కలికి తురాయి.బాల్యం, విద్య, ఉద్యోగం


మాడబూషి సంతానం రఘునాథన్ ఆగస్టు 11, 1941 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రంలోని అనంతపూర్ జిల్లా లో తాతగారింట జన్మించారు. చెన్నై, మైలాపూర్ లోని పీ ఎస్ ఉన్నత పాఠశాల, మద్రాసు క్రిస్టియన్ కాలేజి ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్ ఎస్ ఎల్ సీ ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి పూర్తి చేసి, చెన్నై వివేకవర్ధని కాలేజీ నుండి గణితంలో బీ ఏ (హానర్స్) చేసారు. అనతి కాలంలోనే గొప్ప గణిత పండితుడిగా పేరొందారు.

250 సభ్యులలో టీ ఐ ఎఫ్ ఆర్ ఇద్దరిని ఎంపిక చేసినప్పుడుఆ ఇరువురిలో ఎం ఎస్ కూడా ఉన్నారు. 1960 లో టీ ఐ ఎఫ్ ఆర్ లో చేరిన ఎం యస్ అక్కడ నుండి వెనుదిరిగి చూడలేదు. 1960-62 కాలంలో, శిక్షణ పొంది, గణిత కోవిదుడు అచార్య నరసింహన్ ఇచ్చిన పరిశోధనాంశం " డిఫర్మేషన్స్ ఆఫ్ లినియర్ కన్నెక్షన్స్ అండ్ రీమానియన్ మెట్రిక్స్ " ను 1963 లో పరిష్కరించారు. గణిత శాస్త్ర నిష్ణాతుడు ఎస్ రమణన్ ఎం ఎస్ కి ఆదర్శం.

1966 లో ఎం ఎస్ నరసింహన్ పర్యవేక్షణలో, బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పీ హెచ్ డీ (డాక్టరేట్) పట్టా అందుకున్నారు. కే గౌరీశంకరన్, ఎం ఎస్ టీ ఐ ఎఫ్ ఆర్ వాతావరణంలో ఇమడడానికి సహాయం చేసారు. డాక్టరేట్ పట్టా సాధించాక ఓ ఏడాది ఇనిస్టిత్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ", ప్రిన్స్టన్, న్యూ జెర్సీ, అమెరికాలో పరిశోధనలు చేస్తూ గడిపేరు. యం యస్ 25 వ యేట అస్సోసియేట్ (ఉప) అచార్య పదవి చేపట్టేరు.


సామాన్య ప్రజల ఊహకి వాస్తవంగా వృత్తినిపుణుడు చేసే పనికి వ్యత్యాసం ఉంటోంది. అందుకని అందరికీ అర్ధమైయ్యేటట్టు చెప్పే ఆవశ్యకత ఉందంటూ గణిత శాస్త్ర అంశాల మీద అందరికీ అవగాహన అయ్యేటట్లు వివరణలు ఇచ్చారు.


గణిత క్షేత్రంలో పరిశోధనలు, అభివృద్ధికి తోడ్పాటు

అప్పట్లో లీ గ్రూప్స్ అన్న అంశం మీద భారీ పరిశొధనలు జరుగుతూ ఉండేవి. వీటి ప్రభావం గణితం, ఫిజిక్స్ (భౌతిక శాస్త్ర) రంగాలు మరియు వాటికనుగుణ క్షేత్రాలలో ఎక్కువగా ఉనాయి. పరిశోధనలుకొలిక్కి రావడంతో, " డిస్క్రీట్ లై గ్రూప్స్ " అన్న క్షేత్రాంశానికి ప్రాధాన్యం వచ్చింది. దీని ప్రభావం (జైమితీ శాస్త్రం,  నంబర్ థియరీ) ల పై ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్క్రీట్ లై గ్రూప్స్ ని ఏక ప్రతిపత్తిలో వివరించడం చాలా కష్టసాధ్యం. "రిజిడిటీ ", "అరిత్మెటిసిటి " ఇందులో ముఖ్య అంశాలు. ఎం ఎస్ రఘునాథన్ ఈ క్షేత్రంలో పరిశోధనలు జరిపి మహత్వపూర్ణ ఫలితాలు సాధించి తమ సత్తా చాటారు. సుమారు 1975 ప్రాంతంలో "కాంగ్రుఎన్స్ సబ్‍గ్రూప్స్ సమస్య " మీద మేధావి వర్గం దృష్టి సారించి ఉండింది. ఈ సమస్య - రెండు విభాగాలు (క్లాసెస్) సమ్మేళనంపై (ఇంటర్ రిలేషన్స్ పై) అధారపడి ఉంటుంది. ఈ అంశం సంఖ్యా సిద్ధాంతానికి అత్యంత కీలక అంశంగా పరిగణించేరు. ఈ క్షేత్రంలో తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసారు ఎం ఎస్. "జామెట్రిక్ ఈక్వేషన్స్ " కి విశిష్ట కృషి చేసారు. ప్రపంచంలో ఎం ఎస్ ఈ క్షేత్ర పరిధిలో అఖండ మేధావిగా పేరొందేరు. ఎం ఎస్ చేసిన " రఘునాథన్ కొంజెక్చర్ " - " ధారా గతీ శాస్త్రం " (డైనమిక్ ఫ్లో) తద్సంభందిత క్షేత్రాంశాలలో ఎంతో ప్రభావం చూపింది.ఎం ఎస్ వద్ద చదువుకున్నఎందరో పీ హెచ్ డీ విద్యార్ధులు, గణిత రంగ క్షేత్రాభివృద్దికి దోహదపడి మేధావులుగా రాణిస్తున్నారు.

ఎం ఎస్ రఘునాథన్ రాసిన పుస్తకం " డిస్క్రీట్ సబ్ గ్రూప్స్ ఆఫ్ లై గ్రూప్స్ ", స్ప్రింగర్ వర్లాగ్, జర్మనీ, 1972 లో ప్రచురించింది. ఇది ఈ క్షేత్ర రంగానికి తలమానికం. ఈ పుస్తకాన్ని రష్యన్ లోకి తర్జుమా చేసి, ప్రముఖ గణితజ్ఞుడు జి ఏ మార్గూలిస్ ముందు మాటతో ప్రచురించారు.

గణిత శాస్త్ర రంగంవైపు విద్యార్ధి రంగం ఎక్కువగా దృస్ఠి సారించాలని కోరుకున్నయం యస్ జీవితాన్ని గణిత పరిశోధనలకి అంకితమ్ చేసి ఈ రంగం లో ఎన్నో అద్భుత విజయాలని సాహించారు.

యం. యస్ రఘునాధన్:

- ఇంటర్నేష్నల్ మెతమాటిక్స్ యూనియన్, కార్యనిర్వాహక సభ్యుడు
- మెహతా పరిశోధనా సంస్థ, పాలక మండలి, అధ్యక్షుడు
- నేష్నల్ బోర్డ్ ఆఫ్ హైయ్యర్ మాతమాటిక్స్, అధ్యక్షుడిగా 1987 నుండి
కొనసాగుతున్నారు. (ఈ సంస్థ ఆద్వర్యంలో 1996 లో అంతర్జాతీయ
మాథమేటికల్ ఒలంపియాడ్ విజయవంతంగా నిర్వహించారు)
- నేషనల్ బోర్డ్ ఆఫ్ హైయెర్ మేథమేటిక్స్ కి ఛైర్మన్ గా వ్యవహరించారు.
- ఎం ఎస్ ఆర్ టి ఐ ఎఫ్ ఆర్ లో "అంతర్జతీయ స్కూల్ ఇన్ ఆల్జెబ్రైక్ గ్రూప్స్
ఎండ్ డిస్క్రీట్ సబ్ గ్రూప్స్" నెలకొల్పారు.
-అంతర్జాతీయ గణిత సంస్థ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు


కొన్ని విశేషాంశాలు:

జులై 14, 2000 సంవత్సరంలో ఎం ఎస్ రఘునాథన్ (టీ ఐ ఎఫ్ ఆర్), రాయల్ సొసైటీ, లండన్, ఫెల్లో గా గుర్తింపు పొందడమ్ ద్వారా యం యస్ గణిత శాస్త్ర దిగ్గజాలైన శ్రీనివాస రామానుజన్, హరీష్ చంద్ర, సి ఎస్ శేషాద్రి, ఎం ఎస్ నరసింహన్, ఎస్ ఆర్ ఎస్ వరధన్ ల
సరసన చేరారు.

ఐ సీ ఎం సదస్సు నాలుగేళ్ళకొకసారి జరుగుతుంది. గణిత క్షేత్రంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక మైన, విశిష్ట మైన, దిశామార్గం చూపే సభగా పరిఇగణిస్తారు. 1970 లో నైస్ లో జరిగిన ఐ సీ ఎం సభను ఉద్దేశించి మాట్లాడిన భారతీయుడు డాక్టర్ ఎం ఎస్. అప్పటికి ఆయన వయస్సు 29 సంవత్సరాలే!.

ఫ్రాన్స్ గణితకారుడు - జీన్ ద్యుడోన్ని, 1977 లో ప్రచురించిన " ఏ పనోరమా ఆఫ్ ప్యూర్ మేథమేటిక్స్ " పుస్తకంలో యం యస్ గారి పరిశోధనలని ప్రస్తావించారు.అప్పటికి ఎం ఎస్ వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే.
అందుకున్న అవార్డులు

- 2001 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది
- జులై 2000 లో రాయల్ సొసైటి ఫెల్లో గా ఎంపికైయ్యారు
- తార్డ్ వాల్డ్ అకాడమి (ఇటలీ), ఫెల్లో
- ఐ ఎన్ ఎస్ ఏ నుండి శ్రినివాస రామానుజన్ పతకం
- శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు


రచనలు

- ఎం ఎస్ రఘునాథన్ రాసిన "డిస్క్రీట్ సబ్ గ్రూప్స్ ఆఫ్ లీ గ్రూప్స్" (స్ప్రింగర్, 1972) బీజగణిత క్షేత్రంలో మేటి గ్రంధం. ఇది ఈ క్షేత్ర విభాగంలో ప్రమాణాత్మక గ్రంధం. ఈ పుస్తకం రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడింది.

- దాదాపు 35 పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో, సమావేశాలలో ప్రకటించారు ఎం ఎస్. కొహొమాలజీ ఆఫ్ డిస్క్రీట్ సబ్ గ్రూప్స్, లై గ్రూప్స్, అరిత్మెటిక్ సబ్ గ్రూప్స్, ఆల్జీబ్రాయిక్ గ్రూప్స్, లాటిస్సెస్ అండ్ కార్టన్ సబ్గ్రూప్స్, క్యు-స్ట్రక్చర్స్, సెమీ-సింపుల్ లై గ్రూప్స్, కాంగ్రుఎన్స్ సబ్ గ్రూప్, ఐసోగెనీస్ ఇత్యాది అంశాల మీద తమ పరిశోధనా పత్రాలు ప్రకటించారు.

" ఎన్ని పేపర్లు ప్రకటించి అచ్చు వేయిస్తే అంత గొప్ప వాళ్ళు గా చలామణి అవుతున్నారు. ఇది నిస్సందేహంగా మంచి పద్దతి కాదు. చేసే పని మీద గురి వుండి, దాన్ని సమగ్ర వంతంగా,నిశ్చయమైన మనస్సుతో కూలంకషంగా పరిశోధన చెయ్యాలి" అని అనేవారు యం యస్. ఫీల్డ్ మెడల్ సాదించిన ఎందరు విషయాన్ని సమర్ధవంతంగా అర్ధం చేసుకుని లోతు పాతులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది వారి ప్రశ్న. నిజమే మరి!...." భారత దేశంలో గణిత శాస్త్రంపై అభిరుచి పెంపొందించడానికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. దేశ స్వాతంత్ర్యం వచ్చి చాలా కాలం అయినా ఈ విషయం గురించి నొక్కి వక్కాణించక తప్పదు. " అని ఎం ఎస్ వ్యాఖ్యానించారు. భారత దేశానికే వన్నె తెచ్చిన గణిత కోవిదుడు, ఎం ఎస్ రఘునాథన్ ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి ప్రదాత.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.