త్యాగరాజు కృతులు - సామాజిక స్పృహ

 

రచన: సరోజ జనార్థన్

 


సంగీతమనగానే ఎవరికైనా గుర్తొచ్చేది త్యాగరాజస్వామి. పండితులకే కాక సామాన్యులకు కూడా ఆ పేరు విదితమే. ఎవరైనా మేము సంగీతం నేర్చుకున్నామండి అంటే, ఒక త్యాగరాజ కృతి పాడమ్మా అంటారు .
ఆ కృతులకు అంత ప్రసిద్ధి ఉంది. సంగీతంతో జీవితాన్ని తరింపజేసుకున్నవారిలో త్యాగయ్య ప్రముఖుడు. ఒక పేరు శాశ్వతంగా జన హృదయాల్లో చోటుచేసుకోవాలంటే ఎంతో కష్టం. తమ ప్రమేయం లేకుండా అంటే పేరుకోసం ప్రయత్నించకుండా మంచి పేరు, మంచి గుర్తింపు సంపాదించుకోవడం మహానుభావులకే సాధ్యం అటువంటి మహానుభావులలో ఒకరు మన త్యాగయ్య.
తన జీవితమంతా సంగీతానికే అంకితం చేశారాయన. నిస్వార్థ భక్తి తప్ప ఏ ఐహిక వాంఛలూ లేని నాదయోగి. తనవద్ద ఏ ధనమూ లేని సమయంలో, రాజాశ్రయం పొందితే ధనరాశులు కల్గుతాయని తెలిసి కూడా నిధి చాల సుఖమా రాముని సన్నిధి
సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రాముని సేవకన్నా ఏదీ గొప్ప ధనం కాదని విశ్వసించిన ఉన్నతుడు త్యాగయ్య. మేలుకోవయ్య మమ్మేలుకో శ్రీరామ అంటూ తన దినచర్య ప్రారంభిచి ఉయ్యాలలూగవయ్యా శ్రీరామ అంటూ స్వామిని నిద్రపుచ్చడంతో తన కార్యకలాపాలు పూర్తిచేయడమే ఆయన జీవితం. నా జీవాధార , నా నోముఫలమా అని ఒక కీర్తన పాడి మరణించిన ఒక వ్యక్తిని జీవితుణ్ణి చేయడం, ముందువెనుక ఇరు ప్రక్కల తోడై మురహర అని పాడగా దొంగలను రామలక్ష్మణులే స్వయంగా తరిమి కొట్టడం వంటి ఎన్నో ఉదాహరణలు త్యాగయ్య చరిత్రలో కనబడతాయి . అని వారికి గల అచంచల భక్తి విశ్వాసాలని తెలియజేస్తాయి .

ఐతే త్యాగయ్య భక్తి తో పాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తన కృతులలో పొందుపరిచారు. సమాజంలో కనపడే దోషాలను తన మీద ఆరోపించుకుని ఆ దోషాలు తొలగించమని శ్రీరాముని ప్రార్ధిస్తాడు.
త్యాగయ్య కీర్తనల్లో ఎన్నో హిత బోధలు కనిపిస్తాయి.

మంచివారితో స్నేహం చెయ్యాలని, అది ఎంతో ఆనందకరము, హితము అని చెప్తారు.
ఇంతకన్నానందమేమి ఓ రామ రామ అనే కృతిలో సంతజనులకొల్ల సమ్మతి యుంటేగాని అంటే సజ్జనుల అంగీకారమన్న మాట అంటే సజ్జన సాంగత్యం మంచివారితో స్నేహముంటే అంత కన్నా ఆనందమేమి అని భావిస్తారు.
ఆది శంకరులు కూడ భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పారు కదా. ఆ భావనే వీరు కృతులలో తెలియజేశారు. ఎటులబ్రోతువో తెలియదు ఏకాంత రామయ్య అనే కృతిలో దుష్టులతో కూడి దుష్కృత్యములు సల్పి రట్టుబడిన త్యాగరాజనుతుని దయతో ఎలా కాపాడతావు ? అని వేడుకుంటారు అంటే దుష్టులతో చేరితే చెడు పనులే చేస్తారు. అందుకే సజ్జనులని గూడి ఉండాలని తెలియజేయడమన్న మాట మరొక కృతి ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవేమనసా అను దానిలో భోగభాగ్యముల యందు నిజభాగవతులు గాని పొందు రోసి అంటారు అంటే భోగాల మీద, భాగవతులు కాని వారి మీద అంటే చెడు ప్రవర్తన గల వారి మీద రోతపుట్టాలి అని సజ్జన సాంగత్యం యొక్క అవసరాన్ని తెలియజేస్తారు.
చక్కని రాజమార్గముండగ సందులదూరనేల అనే కృతిలో పరమాత్మని చేరడానికి భక్తి అనేమార్గం ఉండగా వేరే దారులు వెతుక్కోవడమెందుకని చెప్తారు. ఐతే దీనిని మనం అన్ని చోట్ల అన్వయించుకోతగినది. అడ్డదారులు పట్టక సరైనమార్గంలో నడవాలనే నీతిని చెప్తుంది - ఈ కృతి. డాంబికమైన జీవతం గడిపే వారి గురించి ఎన్నో చోట్ల ప్రస్తావిస్తారు. పై పై విషయాలయందు ఆసక్తి చూపి తమకు తాము గొప్పవారమనుకునే వారి విషయం కృతులలో వివరిస్తారు.
తెలియలేరురామ భక్తిమార్గమున అన్న కృతిలో చరణంలో అంటారు.

వేగి లేచి నీట మునిగి బూది బూచి
వ్రేళ్ళ నెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైకమార్జన లోలురైరే గాని త్యాగరాజనుత
ప్రొద్దునే లేచి స్నానమాచరించి ముఖానికి విభూది పూసుకుని ఏదో జపం చేస్తున్నట్టు వ్రేళ్ళను లెక్కిస్తూ పూజ చేస్తున్నామనుకుంటారు గాని ధనార్జనే వారిధ్యేయం అని అర్ధం. అంటే చిత్త శుద్ధి లేకుండా సంపాదనే ముఖ్యమనుకోవడం సరికాదు. లోకం కోసం పూజ పునస్కారాలు ఆచరించడం డాంబికం.

ఇటువంటి భావమే ఎన్నాళ్ళు తిరిగేది అనే కృతిలో
భ్రమనుకొని ఇరుగుపొరుగు భక్షింప రమ్మని పిల్వ
అమరుచుకో బూజ జపము నా సాయము జేతుననుచు
ఇతరులను భ్రమింపజేసి నేను సాయంకాలం వరకు పూజలు చేస్తూనే ఉంటానని భక్తునివలె వారిచ్చే విందులు స్వీకరిస్తూ ఎన్నాళ్ళు తిరిగేది అంటారు.
కొన్ని కృతులలో అవతల వారిని ఊరికే పొగడటం గురించి చెప్తారు.
దుర్మార్గ చరాధములను దొరనీవన జాలరా అనే కృతిలో
పలుకుబోటిని సభలోన పతితమానవులకొసగే
ఖలులనెచట పొగడను శ్రీకర త్యాగరాజనుత

అంటే సరస్వతీదేవిని అంటే గ్రంధాలనుగాని ఏ రచనలనుగాని ధనము కొరకు ఎవరికిపడితే వారికి సమర్పించే దుర్మార్గులను నే పొగడను అంటారు.
ఎటులబ్రోతువో తెలియదేకాంత రామయ్య అనే కృతిలో
వట్టి గొడ్డురీతి భక్షించి తిరిగితి
పుట్టు లోభులను పొట్టకై పొగిడితి.


లోభులను రోజులు గడపుకొనుటకు పొగడకూడదని ఆ చెడును తనయందు ఆరోపించుకుంటారు- అలాంటి నన్ను ఎలాకాపాడతావు అని రాముని ప్రార్థిస్తారు.
మాటకున్న ప్రాముఖ్యాన్ని రకరకాలుగా చెప్తారు.
ఎందుకు పెద్దలవలె బుద్దియ్యవు అనే కృతిలో
అందరి వలె దాటిదాటి వదరీతి అందరాని పండాయె గదరా అందరిలాగే ధర్మాన్ని అతిక్రమించాను. వాక్కును అదుపులో పెట్టుకోవడం అందుకోలేని పండైనది. అంత కష్టంగా ఉంది- అంటూ వాక్కుని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో చెప్తూ దాని అవసరాన్ని గుర్తుచేశారు.
రాముడు తనను తల్లిదండ్రియై కాపాడతానని అబద్ధలాడాడని, కానీ
కాలము పోను మాట నిలచును అని నిందాస్తుతి చేస్తూ చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా అనే కృతిలో చెప్తారు. ఐతే అందులో సమాజానికి సందేశం లేకపోలేదు. కల్లలాడితే ఉపయోగమేముంటుంది. ఇచ్చిన మాట ఎప్పటికీ నిలచి ఉంటుంది ! అని గుర్తుచేసినట్లుంటుంది.
ఏటిమోచనలు చేసేవురా అన్నే కృతిలో నోటిమాట జార్చగరాదురా అంటూ ఇక్కడ కూడా రాముణ్ణి అన్నట్లుగా ఆలోచించుకుని మాట ఇవ్వాలిగాని ఎలాపడితే అలా నోరు జార్చకూడదని ఒక సందేశమిస్తారు.
ఇంకా మంచి గురువు దొరకడం ఎంత విశేషమో, అసలు గురువంటే ఏమిటో ఎంతో చక్కని పోలికలతో చెప్తారు.
గు శబ్దస్త్యంధ కారస్య
రు శబ్దః తన్నివర్తకః అని గురుషబ్దార్ధం.
గురులేక ఎటువంచి గణికి తెలియగబోదు అన్న కృతిలో ఎంత తెలివైనవాడికైనా ఒక గురువు కావాలి అని మనసునంటక మంచి మందనుచు తత్వ-బోధన చేసి కాపాడు త్యాగరాజాప్తుడను

మనస్సుకు కష్టం కల్లకుండా మందువలె తత్వబోధన చేసే గురువు అవసరమని చప్తారు.
నీ చిత్తము నిర్మలకు నిశ్చలమని నిన్నేనమ్మినానురా అనే కృతిలో
గురువే చిల్లగింజ గురువే భ్రమరమా గురువే పరుసవేది గురువే భాస్కరుడు
అని సద్గురువుకు ఉండే లక్షణాలను చెప్తారు. చిల్లిగింజని అరగదీసి నీటిలో కలిపితే మట్టినంతటిని (అడుగుకు చేర్చి) తొలగించి మంచి నీటిని పైకిస్తుంది. అలాగే గురువు మనస్సులోని కాలుష్యాన్ని పోగొడతాడు. ఇక భ్రమరము అంటే తుమ్మెద. భ్రమర కీటక న్యాయమని ఒక న్యాయముంది. భ్రమరము కీటకము చుట్టూ తిరిగి ఝంకారం చేసి చేసి చేయగా ఆ కీటకము భ్రమరమైపోతుందని విషయమున్నది. అలా గురువు శిష్యుని తీర్చిదిద్ది తనకున్న జ్ఞానాన్నంతటినీ అందించి తనంతటి వాడిగా మారుస్తాడు అని అర్థం. పరుసవేది అనేవేరు ఏ లోహాన్ని తాకినా అది బంగారమౌతుంది. అలాగే గురువు శిష్యుని చేరి అతనిని ప్రకాశింపజేస్తాడు. ఇక భాస్కరుడంటే సూర్యుడు. గురువు సూర్యుని వలే చీకటిని అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతులు ప్రకాశింపజేస్తాడు. గురు శబ్దానికున్న సరైన అర్థం ఇందులో చెప్పబడింది. ఇంతకంటే, సద్గురువు లక్షణాలు అందంగా, ఖచ్చితంగా, సులభంగా ఎవరూ చెప్పలేరనిపిస్తుంది. సూర దాసు అంటారు కదా. గురు గోవింద్ దోవూఖడే కాకేలాగౌపామ్ బలిహరీ గురు ఆప్ నే గోవింద్ దియోబతాయ్ అని గురువు, భగవంతుడు ఎదురైనప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాంటే గురువు భగవంతుని గూర్చి తెలియజేస్తాడు గనక ముందుగా గురువుకే మ్రొక్కాలని అర్థం. అందుకే త్యాగయ్య కూడా గురువు యొక్క ఆవశ్యకతని అంత గొప్పగా తన కృతులలో మనకందించారు.
చెడే బుద్ధిమానరా అను కృతిలో భూవాసికి తగుఫలము గల్గునని బుధులు పల్క వినలేదా మనసా
అంటారు చెడుప్రవర్తన వదిలిపెట్టాలంటారు.
అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైవ ఫలమశ్నుతే అన్నట్టు భూవాసులకు తమ పనులకు తగ్గ ఫలితాలే కలు‍గుతాయి. కనుక మంచి ప్రవర్తనతో మెలగాలని భావం.
ఏరలోకభయము లేక పాశబద్ధులమ్యేరు అన్న కృతిలో కూడ పాప భీతి ఉండాలని చెప్తూ.
కొన్న కాంతలను కన్న బిడ్డలను - వన్నె చీరెలను వానగుడిసెలను
తిన్నగా గని దైవలో కమని తన్నుకోళ్ళలో త్యాగరాజనుత అంటారు.
అంటే భార్య, పిల్లలు, ఇతర వస్తువులు, చివరకు పూరి గుడిసెలు అవే గొప్ప భాగ్యమనుకొని మురిసిపోతారు. పరమాత్మను ఎవరూ తలవరే అని బాధపడతారు.
ఇలాంటి భావమే శంకరాచార్యులు భజగోవింద స్తోత్రంలో
బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
ఏరమే బ్రహ్మణి కోపినసక్తః అంటారు కదా.

ఇలా అనేక నీతులు, త్యాగరాజకృతులలో దర్శనమిస్తాయి.
భక్తి తో పాటుగా లోకానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు సరళమైన భాషలో మృదు మధుర ద్రాక్షా పాకంగా మన కందించారు త్యాగరాజస్వామి వారి మహొన్నత స్ధానానికి తీసుకెళ్ళి నేటికి వారి పేరు అందరి మనస్సులో స్థిరమైన ముద్రవేసుకునేలా చేశాయి.
నేటికి పలు ప్రాంతీలలో ఘనంగా జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలను
ఆ కీర్తనల పట్ల ఎంత మక్కువ ఉందో మనకి తెలుస్తుంది .
అందుకే త్యాగయ్య వంటి మహానుభావులు చిరంజీవులై శాశ్వత కీర్తిని
పొంది తమ తరువాత తరాలవారు నడచుటకు బంగారు బాట వేసి తరిస్తారు, తరింపజేస్తారు.

 

  ఎమ్మెస్సీ అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "మాస్టర్ ఆఫ్ మ్యూజిక్" పట్టా అందుకున్న శ్రీమతి సరోజా జనార్ధన్ సంగీతం ముఖ్యాంశంగా పద్మావతీ యూనివర్సిటీ (తిరుపతి) యందు  పి .హెచ్. డి. చేస్తున్నారు. సంగీత సాహిత్య కళానిధి \శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి శిష్యురాలైన వీరు ఎన్నో సంగీత కచేరీలు నిర్వహించడమే కాక సంగీతాన్ని భోధిస్తున్నారు కూడా.  


 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.