వార్త  - వ్యాఖ్య

మళ్లీ గురి తప్పుతోందా?

రచన: భండారు శ్రీనివాసరావు  


ద్రోణాచార్యుడు కురు, పాండు కుమారులకు విలు విద్య పోటీ పెట్టాడు. చెట్టుపై పిట్టబొమ్మను పెట్టి పిట్ట కంటిని గురిపెట్టి కొట్టమన్నాడు. ముందుగా ధుర్యోధనాదులను పిలిచి బాణం ఎక్కుపెట్టి ఏం కనపడుతున్నదో చెప్పమన్నాడు.`చెట్టు చెట్టు కొమ్మలు కొమ్మలనడుమ పిట్టబొమ్మ కనపడుతున్నాయని' వారు సమాధానం చెప్పారు.
ద్రోణుడు అర్జునుని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. `పిట్ట కన్ను మాత్రమే కనపడుతోందని' కిరీటి జవాబిచ్చాడు. లక్ష్యం పట్ల గురి ఎలా ఉండాలో తెలియ చెప్పడానికి ఈ కథ చెప్పేవాళ్ళు. అంటే లక్ష్య సాధనకు ఏకాగ్రత కావాలి. సాధించాల్సింది తప్ప మరో దానిపై మనసు మరల్చరాదు, అన్నది ఈ కథలోని నీతి. కానీ `తెలంగాణా రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఏ మలుపు తిరుగుతోంది? `తెలంగాణా నా ప్రాణం తెలంగాణా రాష్ట్ర సాధనే నా ధ్యేయం' అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడైన చంద్రశేఖరరావు నోట `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనే మాట ఎలా వచ్చింది? అంటే తెలంగాణా సాధన అన్న ప్రధాన లక్ష్యాన్ని కాంగ్రెస్‌ ఓటమి అనే ఉమ్మడి ధ్యేయం వెనక్కు నెట్టి వేసిందని అనుకోవాలా? కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్‌ ఓటమి ప్రధాన ధ్యేయం కావడానికి తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ తెలంగాణా అన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి చేస్తున్నదేమిటి.


మహా కూటమిలోని మిగిలిన పార్టీల విషయం వేరు తెరాస పరిస్థితి వేరు. మహాకూటమో, మెగా కూటమో ఏదో ఒక కూటమి అవసరం వారి వారి రాజకీయ అవసరాల కోణం నుంచి చూస్తే ఒక తక్షణావసరం కావచ్చు కానీ, తెరాస దాని తీరు మార్చుకోకపోయినా, ప్రాధాన్యతల క్రమం మార్చుకోవడాన్ని తెలంగాణా అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో అన్నది భవిష్యత్‌ తేలుస్తుంది.


సామ , దాన, భేద, దండోపాయాలతోనైనా సరే కార్యాన్ని సాధించాలనే సూత్రం తెలంగాణా సాధన లక్ష్యసాధనకు అన్వయింపచేయాలని చూడడం తగని పని. తెలంగాణా ప్రాంతంలోని అధిక సంఖ్యాకులకు ప్రత్యేకరాష్ట్రం పట్ల మక్కువ లేదన్న సంకేతాలను పంపే ప్రమాదం ఈ కూటములవల్ల కలిగే అవకాశం ఉంది. బహుశా, తెరాస నేతకు కూడా ఈ అంశం బోధపడే, `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనేనినాదంతో అంతరంగాన్ని అవిష్కరించి ఉంటారు.


ఈ రోజున నిజానికి తెలంగాణా ఊసెత్తని పార్టీ అంటూ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు. కానీ నాలుక తెలంగాణా అంటున్నా మనసులో మర్మం మరోటి ఉందన్న అనుమానం అందరికీ ఉంది. వేరే ఉద్దేశ్యాలను మనసులో ఉంచుకుని తెలంగాణా నామజపం చేసేవాళ్ల వల్లే తెలంగాణాకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది. తెలంగాణా మేధావులు కూడా ఈ విషయంలో పెదవి విప్పకపోవడం విషాదకరం.


తెలంగాణా వాదులకూ, తెలంగాణా పేరుతో పబ్బం గడుపుకోవాలని చూసే తెలంగాణా రాజకీయ వాదులకూ నడుమ ఎంతో అంతరం ఉంది. 1969 నుంచి జరుగుతున్నది ఇదే. మహా కూటమి ఏర్పాటుతో ఇది పునరావృతం అయ్యే అవకాశాలు పెరిగాయి. అన్ని జండాలు కలుపుకుని రాజశేఖరరెడ్డిని గద్దె దింపాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగే ఈ కూటమి కలలు ఫలించి కాంగ్రెస్‌ ఓటమి పాలయినా తెలంగాణా వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌ పరాజయం వల్ల మహా కూటమిలోని ఇతర పార్టీలకు లబ్ది చేకూరవచ్చునేమో కానీ, తెలంగాణా రాష్ర్ట సమితికి అదనంగా ఒకటో అరో సీట్లు పెరగడం మినహా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్య దిశగా వొరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై మడమ తిప్పని పోరాటం చేయాలని తామంతా కలసి ప్రతిజ్ఞ చేశామని చంద్రశేఖర రావు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రత్యేక రాష్ట్ర లక్ష్యానికి ఎడం జరుగుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే అందుకు ఆయన అభ్యంతరం పెట్టకూడదు. మరోసారి మోసపోవడమే తెలంగాణాను నిజంగా కోరుకునే వారికి మిగిలిందా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరు శ్రేయోభిలాషులు అన్నది తెలంగాణా వారే అర్ధంచేసుకుని ఆదరించాల్సి ఉంది. మరోసారి తప్పటడుగు పడితే కాలు కూడదీసుకోవడానికి కూడా వీలుండదు.
                                                                    

మితిమీరిన మీడియా ఉత్సాహం
 

నిప్పులు చిము కుంటూ  
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -
 
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!
                       -శ్రీశ్రీ
 
ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు, సమృద్ధిజీవులు మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.
 
రెండు దశాబ్దాల క్రితం పాతికమంది సిబ్బందితో మొదలై ఇంతితై, వటుడింతై మాదిరిగా  ప్రపంచం నలుచెరగులకూ పాకి, యాభయివేల పైచిలుకు యువతకు బంగారు భవితను ప్రసాదించి తెలుగు ప్రతిభనూ, ప్రాభవాన్నీ అరవయ్యారు దేశాలకు విస్తరింపచేసి, కోట్లకు పడగెత్తిన `సత్యం స్వర్ణ సామ్రాజ్యం' పాతాళానికి పతనమైంది.
 
ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి, నిరంతర శ్రమతో, నిర్విరామ కృషితో, మొక్కవోని పట్టుదలతో ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న విశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి. `సత్యమైట్లు'గా సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. మరునాటికల్లా అది చెదిరిన స్వప్నం.
 
ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
 
ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
 
సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ, రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.
 
ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో  చిక్కుకుపోయి  మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.
 
ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది. `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. అదే జరిగింది. ఇక వాటాదారులు విషయం. మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.
 
సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.
 

భండారు శ్రీనివాసరావు
                                                                   

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.