విరాట్

రచన: పానుగోటి కృష్ణా రెడ్డి 

మూలం: స్టెఫాన్ త్సైక్

జరిగిన కథ:

వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు. పదకొండుమందిని చంపిన ఆ కొండజాతీయ యువకుణ్ణి పదకొండు సంవత్సరాల పాటు భూగర్భంలోని చీకటి గదిలో నిర్భందించి ప్రతీ సంవత్సరం పదకొండు కొరడా దెబ్బలు తినేలే తీర్పు ఇస్తాడు విరాట్. తీర్పు విన్న ఆ ఖైదీ 'నేను ఆవేశ పిశాచం ఆవహించి ఆ క్షణంలో హత్యలు చేస్తే నీవేమో ప్రశాంతంగా నీ తీర్పుతో నా జీవితాన్ను హరిస్తున్నావు ' అంటూ విరాట్ ను నిందిస్తాడు. ఆ యువకుని కన్నుల్లో తనచే చంపబడ్డ అన్న కన్నులు చూచాడు విరాట్. ఆ మాటలకు చలించి సత్యమార్గాన్ని అన్వేషించటానికి ఒక నెలరోజులు సెలవు తీసుకొంటాడు. నల్లని దుస్తులు ధరించి అట్టడుగున గాఢాంధాకారంలో నున్న చెరసాలకు చేరుకుంటాడు. తను తీర్పు ఇచ్చే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అనుభవం ద్వారా నేర్చుకుంటానని, ఆ అనుభవం ముందు ముందు సరైన తీర్పులు ఇవ్వటానికి దోహదపడతాయని కొండజాతి యువకునితో చెబుతాడు. అందుగ్గాను విరాట్ ఖైదీ దుస్తులు ఆ యువకుణ్ణి ఎవరికి తెలియకుండా ఓ నెలరోజులు బయటికి పంపిస్తాడు. మరుసటిరోజునుంచి కొండజాతి యువకునికి శిక్షగా విధించిన కొరడాదెబ్బలను తనకే అమలుపరచారు. భరించలేనంత నొప్పిగా ఉండేది. ఒంట్లో నిస్సత్తువతో నేలపై అలాగే పడిపోయేవాడు. కాని, ఆ చీకటి గుహలో, ఏకాంతంలో రాగద్వేషాలకి అతీతంగా, స్వార్థచింతనలేని కాలాన్ని గడపసాగాడు. ఆత్మావలోకనంలో అలౌకిక ఆనందం పొందాడు. ఇంతలో ఆయన మనసులో భయంగొలిపే ఆలోచన ఒకటి వచ్చింది. ఒకవేళ మాటైచ్చిన ప్రకారం ఆ కొండజాతి యువకుడు తిరిగి రాకపోతే? తనను విడిపించకపోటే? తను ఈ చీకటిగుహలో శేషజీవితాన్ని గడపాల్సిందేనా? ఇలాంటి ఆలోచనలతో పిరికివాడయ్యడు విరాట్. రాజుగారికి ఈ విషయం తెలిసివచ్చి విరాట్ ను చెరసాలనుంచి విడిపించాడు. ప్రధానన్యాయమూర్తి లేదా తన అంతరంగ సలహాదారునిగా ఉండమని కోరాడు. కాని విరాట్ వాటిని సున్నితంగా తిరస్కరించి సాదాసీదాగా ప్రశాంతమైన జీవనం గడపసాగాడు. కొద్ది కాలం తర్వాత కుమారులతో ఇంటిలో పనిచేస్తున్న సేవకుని విషయంలో విభేదిస్తాడు. సేవకుల్ని పని చెయ్యటానికి బాధించ వద్దంటాడు. భగవంతునికి తప్ప వేరెవరికి వేరెవరికి ఇతరులను సరిచేసే హక్కు లేదంటాడు. అందుకు కొడుకులు ఒప్పుకోరు. అలా వాదన చిలికి చిలికి గాలివానై విరాట్ ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొంటాడు. ఇల్లు వదలిన విరాట్ ఒక అడవిలో కుటీరాన్ని నిర్మించుకొని పశుపక్ష్యాదులతో, ప్రకృతిలో నిర్మలంగా శేషజీవితాన్ని గడపసాగాడు. క్రమంగా అతని ఉనికి మిగతా ప్రజలందరికి తెలిసిపోయింది. అతన్ని ఒక మహోన్నత వ్యక్తిగా పరిగణించసాగారు. క్రమేపి అతన్ని అనుసరిస్తూ చాలామంది భవబంధాలను విడనాడి అడవిలో నివసించడం మొదలెట్టారు.
ఒకరోజు ఉదయం విరాట్ తన కుటీరం వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు అచేతనంగా పడిఉన్న సాధువును చూచాడు. అతన్ని లేపి కూర్చోబెట్టాలని ప్రయత్నించగా అది ప్రాణంలేని శరీరమని తెలిసింది. విరాట్ ఆ సాధువు కళ్ళు మూశాడు. దైవప్రార్థన చేశాడు. అంత్యక్రియలు జరపాలని నిశ్చయించి శవాన్ని రెండు చేతుల్లోకి ఎత్తుకోవాలని ప్రయత్నించాడు. కాని లేపలేకపోయాడు. చాలా కాలమునుండి సరైన తిండి తినక, పండ్లు మరియూ ఫలాలతోనే సరిపెట్టుకోవడంవల్ల శక్తి ఉడిగిపోయింది.

సహాయంకోసం నదిదాటి దగ్గరలో ఉన్న గ్రామానికి బయలుదేరాడు. 'ఏకాంతవాస ధృవతార ' అని తాము భక్తితో పిలుచుకునే సాధువు తమ ఊళ్ళోకే రావడం చూసి ప్రజలు అచ్చెరువొందారు. ఆయన చుట్టూ పెద్ద గుంపుగా చేరారు. ఆయన వచ్చిన పని చెప్పగా సాయపడటానికి నేనంటే నేనని చాలామంది ముందుకొచ్చారు.

విరాట్ తిరిగి వెళుతూవుంటే ప్రతీచోటా స్త్రీలు ఆయనకు భక్తితో నమస్కరించారు. పురుషులు ఆయనకు ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదం కోరుతూ ఆయన బట్టల్ని ముద్దుపెట్టుకున్నారు. భక్తిప్రపత్తులతో స్వాగతం పలుకుతున్న ప్రజల మధ్యనుంచి సంతృప్తితో కూడిన చిరునవ్వుతో విరాట్ ముందుకు నడిచాడు. వీళ్ళతో ఏ విధమైన అనుబంధం లేకపోయినా వీళ్ళపట్ల విరాట్ కు ఎంతో నిర్మలమైన, ఆత్మీయతతో కూడిన ప్రేమ కలిగింది.
ప్రజల హృదయపూర్వక నమస్కారాల్ని స్వీకరిస్తూ ముందుకు వెళుతున్న విరాట్ కు ఒక స్త్రీ ఇంటిలోనుండి ద్వేషంగా తనవైపు చూడడడం గమనించి ఆగాడు. తను పొరబాటు పడ్డానేమోనని ఆమె అలా చూసి ఉండదేమోనని భావించి మళ్ళీ ఆమెవైపు మళ్ళీ చూశాడు. ద్వేషంతో నిప్పులు కక్కుతున్నట్లుగా విరాట్ వైపు చూస్తున్నాయి ఆ కళ్ళు. విరాట్ భయంతో వణికిపోయాడు. ఆమెకళ్ళు చూస్తే తను హత్యచేసిన సోదరుని కళ్ళు గుర్తుకొచ్చాయి. తను శిక్ష విధించిన కొండజాతి యువకుని కళ్ళు గుర్తుకొచ్చాయి. తను అడవిలోకి వచ్చి ఏకాంతవాసం చేయడం వలన ఆ పీడ జ్ఞాపకాల్ని మర్చిపోయాడు. తాపసిగా మారాక ఇతరుల కోపం, ద్వేషం ఎలా ఉంటాయో మర్చిపోయాడు.

ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎవరో అనుకుని నాపట్ల విద్వేషంతో వ్యవహరిస్తున్నదేమో. అమెతోనే మాట్లాదామనుకొని ఆమెవైపు కదిలాడు. ఆమె చిరుతపులిలా విరాట్ వైపు చూస్తూ లోనికి వెళ్ళి పలుపులేసుకుంది. విరాట్ ఆశ్చర్యపోయాడు.

'ఆమె ఎవరు?. తనెప్పుడు చూడలేదు. వయసులో ఆమె చాలా చిన్నది. తన జీవితంలో ఏవిధంగాను, ఎప్పుడు తటస్థపడే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు ఆమెను నేనెలా బాధించి ఉంటాను?' అనుకుంటూ తనలో తనే మథనపడ్డాడు. 'ఎక్కడో ఏదో లోపం ఉంది. కనుక్కోవాలి ' అనుకుని ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. సమాధానం రాలేదు. ఆ స్త్రీ తనను ఇంకా ద్వేషిస్తూన్నట్టుగానే అనిపించింది. సహనంతో మరోసారి తలుపు తట్టాడు. అయినా ఆమె తలుపు తియ్యలేదు. కొద్దిసేపు ఆగి భిక్షకుడిలా మళ్ళీ తలుపు తట్టాడు. కొంతసేపటికి ఆమె తలుపు తీసి ద్వారబంధం దగ్గరకొచ్చి నిలబడింది. ఇంకా ద్వేషంతో చూస్తూనే ఉంది.

'ఏం కావాలి మీకు?' కోపంతో ఊగిపోతూ ప్రశ్నించింది. కిందపడిపోకుడా ద్వారాన్ని పట్టుక్కుని తమాయించుకుంది.

ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాక విరాట్ మనసు కాస్తా కుదుటబడింది. ఆమెను ఇంతకు ముందెన్నడూ చూడలేదని నమ్మకమేర్పడింది.
"మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. మీరు నావైపు అంత ద్వేషంగా చూస్తున్నారో అర్థం కావడంలేదు. నేను మీకు ఏమైనా అపకారం చేశానా?" అంటూ అమెను అడిగాడు.
"అవును, నువ్వు నాకేం హాని చేశావ్?" ఆమె వ్యంగ్యంగా నవ్వింది. "నా ఇల్లు కళకళాడుతుండేది. దాన్ని శూన్యం చేశావు. నా భర్తను నానుంచి దూరం చేశావు. నా బ్రతుకును చిందర చేశావు. నీ ముఖం నాకు చూపించకు. ఈ కోపంలో నేనేం చేస్తానో తెలియదు. నువ్వు వెంటనే ఇక్కడనుంచి వెళ్ళిపో" అంది ఆవేశంగా.

విరాట్ ఆమెవైపు చూశాడు. ఆమెకళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. కోపంతో ముఖం ఎర్రగా కందిపోయింది.

"మీరు నన్ను ఎవరో అనుకొని పొరబడుతున్నారు. నేను మనుషులకు దూరంగా బతుకుతున్నాను. ఎవరి జీవితాలలోను నాకు ప్రమేయం లేదు" అని చెప్పి అక్కడనుండి బయలుదేరాడు.

ఆమె కోపంగా మండిపడింది. "నువ్వు నాకు తెలుసు. అందరిలాగే నేనూ నిన్ను గుర్తించగలను. నువ్వు విరాట్ వి. అందరూ పిలిచే 'ఏకాంతవాస ధృవతారవి. ప్రజలందరిచేత విశిష్టగుణాలు ఆపాదింపబడిన వ్యక్తివి. నేను మాత్రం నిన్ను కీర్తించను. నా ఆరోపణ భగవంతుడు ఆలకించేదాకా నేను నిన్ను దూషిస్తూనే ఉంటాను. రా! అడుగుతున్నావు కనుక నువ్వు నాకు ఏమి కీడు చేశావో చూపిస్తాను."

ఆశ్చర్యచకితుడైన విరాట్ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. లోపలి గది తలుపు తీసింది. అంతా చీకటిగా ఉంది. ఆ గదిలో ఓ మూలకు తీసుకెళ్ళింది. అక్కడ చాపమీద చలనం లేని ఓక శరీరం పడివుంది. వంగి చూడబోయి విరాట్ వెనక్కి తగ్గాడు. ఆ శరీరం చనిపోయిన ఆమె కొడుకుది. ఆ అబ్బాయి కళ్ళు విరాట్ ను దోషిలా చూస్తున్నాయి. ఆ కళ్ళు చూస్తే విరాట్ కు చనిపోయిన తన అన్నకళ్ళు గుర్తొచ్చాయి.

ఆ అబ్బాయి పక్కన ఆమె జీవచ్చవంలా నిలబడివుంది. దుఃఖిస్తూ "వీడు మా మూడోవాడు. నా చిట్టచివరి సంతానం. మిగిలిన ఇద్దరిలాగే వీణ్ణీ పొట్టన పెట్టుకున్నావు. జనాలంతా నిన్ను తాపసివని, దేవదూతవని అంటారు. కాని నువ్వు హంతకుడవి" ఆమె ఆవేశానికి అంతులేకుండా పోయింది.

"మీ జీవితం ఇంత దుఃఖమయమవటానికి నేను ఎందుకు కారణభూతుడనో..." అని విరాట్ అంటుంటే అడ్డుతగిలి ఆమె మాట్లాడింది.

"ఈ మగ్గం చూడు. ఖాళీగా ఉన్న ఆ ముక్కాలిపీట చూడు. దానిమీద కూర్చునే నా పెనిమిటి రోజూ బట్టలు వేసేవాడు. ఆయనతో సమానమైన నేతగాడు ఈ ప్రాతంలోనే లేడు. ఆయనచేత బట్టలు నేయించుకోవటానికి ఎక్కడిడెక్కడినుంచో జనాలు వచ్చేవాళ్ళు. ఆ వృత్తే మా కుటుంబానికి జీవనాధారం. మా జీవితాలు చాలా ఆనందంగా గడిచి పోతుండేవి. మాకు ముగ్గురు పిల్లలు. మేము వాళ్ళని జాగ్రత్తగా పెంచాం. చక్కగా పెరిగి తండ్రి అంతటి వాళ్ళవుతారని ఆశలు పెట్టుకున్నాం."

విరాట్ ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆమె విరాట్ మాటలకి అడ్డు తగిలింది.

"ఒకరోజు ఒక వేటగాడు మా ఇంటికి వచ్చాడు. ఒక మనిషి సర్వము త్యజించి, అడవిలో కుటీరం నిర్మిచుకొని భగవంతుని సావలో జీవితం గడిపేస్తున్నాడని, భగవంతుని ప్రతిరూపంలా ఉన్నాడని నా భర్తతో చప్పాడు. అప్పడినుంచి నా భర్త నాకు క్రమేపి దూరమయ్యాడు. మాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉంటూ సాయంత్రాలు ధ్యానం చేసేవాడు. క్రమేపి వృత్తి మానేస్తూ ఎక్కువసేపు భగవధ్యానంలో గడిపేవాడు. ఒకరోజు రాత్రి మాతో మాటమాత్రం చెప్పక అడవిలోకి, అదే నువ్వుంటున్నా అడవిలోకే, సాధువులు, మహాత్ములు నివసించే ప్రదేశమని నీవల్ల పేరొచ్చిన అడవికే, వెళ్ళిపోయాడు."
మాటలు వింటున్న విరాట్ లో సన్నగా కంపనం మొదలయ్యింది.

"ఆయన జీవితాన్ని ఆయన చూసుకొన్నాడు. మరి మా పరిస్థితి ఏమిటి? ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నవాళ్ళం కనుక ఆయన వెళ్ళిపోగానే మాకు జీవనాధారం పోయింది. ఇంటికి దరిద్రం పట్టుకుంది. పిల్లలకు తిండి లేకుండాపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు. ఈ రోజే వీడు చనిపోయాడు. ఇదంతా నీవల్లే జరిగింది. నీవే నా భర్తను నీ మార్గంలోకి ఆకర్షించావు. నువ్వు భగవంతునికి దగ్గర కావడం కోసం నా బిడ్డల్ని నాకు దూరం చేశావు.

సంసారబంధనాలు ఒట్టి మిధ్య అని భ్రమ కల్పించి ఏకాంతవాసంలో భగవంతునికి దగ్గర కావచ్చని నా భర్తలాంటి ఇంకెందరినో నీ అడవికి ఆకర్షించావు. వీళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు పోషించేనాథుడు లేక ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకపని చేసేముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచించనివాడివి నువ్వేం మహాత్ముడివి."

విరాట్ భయంతో కంపిచిపోయాడు. అతని పెదవులు వణికాయి. "నన్ను చూసి ప్రజలు ఇలా అనుకరిస్తారనుకోలేదు. నేను ఎన్నుకున్న మార్గంలో నేనొక్కడినే నడుచుకోవాలనుకున్నాను" అన్నాడు.

"ఓ మునీ! నీ జ్ఞానం ఏమయిందయ్యా? ప్రపంచంలోని సమస్త కార్యాలు భగవత్కార్యాలే. ఏ మనిషి తన ఇష్టప్రకారం తన పనులనుండి తప్పించుకునే వీలులేదు. నీ బుద్ధికి అహంకారం పట్టింది. నీ కర్మలకు నీవే కర్తవు కాగలనుకున్నావు. ఈ విషయాన్ని ఇతరులకు బోధించగలననుకున్నావు. నీ జీవితాదర్శం కారణంగా నా బిడ్డలు బలైనారు"

విరాట్ అమె మాటల్ని అంగీకరిస్తున్నట్టు తలవంచుకున్నాడు.

"మీరు చెప్పింది నిజమే. ఏకాంతవాసంలో కంటే కర్తవ్యనిర్వహణలో క్షోభను అనుభవించే వ్యక్తిలోనే ఎక్కువ సత్యదర్శనం అవగతమవుతుంది. నేను నేర్చుకున్నదేమైనా ఉంటే అది దురదృష్టవంతుల్ని చూసి నేర్చుకున్నదే. బాధితుల చూపుల్లో నా అన్న చూపుల్ని చూసి గ్రహించిందే. నేను ఊహించుకున్నంతగా భగవంతుని ఎదుట వినమ్రుణ్ణి కాలేకపోయాను. పైగా అహంకారినయ్యాను. ఈ క్షణమే నాకీ జ్ఞానోదయమయ్యింది. సంసారబంధనాలకు దూరంగా కార్యశూన్యుడుగా బ్రతుకుతున్నాను అనుకునే వ్యక్తి తెలిసో తెలియకో ఏదోఒక కర్మ ఆచరిస్తూనే ఉంటాడు. దానికతడు బాధ్యుడనేది సత్యం."

"నేను మిమ్మల్ని క్షమాభిక్ష వేడుకొంటున్నాను. నేను అడవి నుంచి తిరిగివస్తాను. నీ భర్త నావలె ఏకాంతవాసమ్నుంచి తిరిగి వచ్చి మీకొక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు." అంటూ విరాట్ ముందుకు వంగి గౌరవసూచకంగా ఆమె చీరకొంగును కళ్ళకు అద్దుకున్నాడు.
ఆమె మనసులో ఉన్న క్రోధమంతా తుడిచిపెట్టుకుపోయింది. వెళ్ళిపోతున్న విరాట్ వైపు ఆమె అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.

(సశేషం)

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.