అందరికాధారమైన ఆదిపురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతడు
|| అందరి ||
సనకాదులు
కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజభవాదులకును దైవంబైనతడీతడు
యినమండలమున చెలగేటి హితవైభవుడీతడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు
|| అందరి ||
సిరులొసగి
యశోదయింట శిశువైన తడీతడు
ధరనావుల మందలలో తగరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
అరసి కుచేలుని అటుకులు ఆరగించె నీతడు
|| అందరి ||
పంకజభవునకును బ్రహ్మపదమొసగెను యీతడు
సంకీర్తనాద్యులచే జట్టిగొనియె నీతడు
తెంకిగ నేకాలము పరదేవుదయిన యీతడు
వేంకటగిరిమీద ప్రభల వెలసినఘనుడీతడు
|| అందరి ||
’ఏక మేవాద్వితీయం బ్రహ్మ’ అని వేదం పేర్కొనినట్లు సకల జగత్తునకు,
సకల ప్రాణులకు ఆధారభూతుడైన ఈ ఆది పురుషుడు అందరివాడు! ’భక్తి కొలద
పరమాత్ముడు’, ’ఎంత మాత్రమున నెవ్వరు దలచిన’ అని అన్నమయ్యే
పేర్కొనినట్లు, శ్రీ మహావిష్ణువును ఎవరెవరు ఎలా ఆరాధిస్తారో, వారికి
ఆయా రూపాలలో సంతుష్టిని కలుగచేస్తూ, అనుగ్రహిస్తాడు! దానికి ఈ
సంకీర్తనయే చక్కని ఉదాహరణ! సనకాదులు కీర్తించే సర్వాత్మకుడు ఈ
ప్రభువు! పార్వతీ దేవికి, బ్రహ్మకు ప్రత్యక్ష దైవము ఈతడు! సూర్య
మండలంలో నిత్యం ప్రకాశించే వైభవమూర్తి ఈ స్వామి! దేవతల వైభవానికి
మూలకారకుడు ఈ మహనీయుడు! రేపల్లెలొ ఆలమందలలో గోపకాడై అల్లరి చేసిన
కృష్ణుడీతడు! హృదయ నివేదన చేసిన గొల్లెతలకు చనవును(సామీప్యాన్ని)
ప్రసాదించిన బంధువు ఈతడు! బాల్యమిత్రుడైన కుచేలుడు ప్రేమతో
సమర్పించిన అటుకులనే అమృతాహారాన్ని స్వీకరించినవాడు ఈ
వాత్సల్యమూర్తి! పద్మంలో జన్మించిన బ్రహ్మకి బ్రహ్మ పదవిని ఒసగిన
కారుణ్య మూర్తి ఈతడు! అట్టి స్వామి కలియుగంలో సంకీర్తనతో పరవశుడై,
ఇహ పరాలకు దేవుడైన ఆ విరాణ్మూర్తి వేంకటగిరి మీద దివ్య ప్రభలతో
వెలుగొందుతున్నాడంటున్నాడు అన్నమయ్య!
అరసి=తెలిసికొని, గమనించి
|