మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏ(వే)ర్పాటు ఉద్యమం-ఎక్కడి గొంగళి అక్కడే 

- వనం జ్వాలా నరసింహారావు

నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్, (శాన్ ఫ్రాన్సిస్కో-యు ఎస్ ఏ)

                                                                                                

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు (ఆనాడే) అభిప్రాయపడ్డారు. "విశాలాంధ్ర" ఏర్పాటు జరగాలని ప్రాణత్యాగం చేసినవారెందరో వున్నారు. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కూడా జరిగింది. అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి తెలంగాణ ఏర్పాటు జరుగుతుందా-జరగదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వుందనాలి. ఈ నేపధ్యంలో, ఉద్యమాన్ని గత నాలుగు దశాబ్దాలకు పైగా గమనిస్తూ, అంతో ఇంతో ఆ ఉద్యమంతో సంబంధం వున్న వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పూర్వాపరాలను గురించి "సిలికానాంధ్ర-సుజనరంజని" పాఠకులకు తెలియచేసే ప్రయత్నమే ఇది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, క్రమేపీ, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

ముఖ్యమంత్రి కావాలని ఎన్నా(న్నే)ళ్లు గానో కలలుకంటున్న ఆంధ్ర ప్రాంతంనుండి ఖమ్మం జిల్లాకు వలసవచ్చిన "సెటిలర్" తెలంగాణ కాంగ్రెస్ నాయకుడొకరు, ఖమ్మంలో మొదలైన నాటి ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి పరోక్షంగా మద్దతిచ్చారని బహిరంగ రహస్యంగా చెప్పుకునేవారు చాలామంది. ఆ తర్వాత కాలంలో ఉద్యమ పుణ్యమో-మరేదో కాని ఆయన కోరికైతే నెరవేరి, ముఖ్య్యమంత్రి కాగలిగినా, ఆయన మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ఆవగింజంత సహాయం కూడా చేయలేదు. ఏర్పాటుకు వ్యతిరేకించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇక నాటి ఉద్యమం విషయానికొస్తే: కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టనం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి. ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి.

ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించ బడుతున్నామని తెలంగాణ వాసులు గ్రహించినా, అధిక సంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కొరకు ఎదురుచూచారు. పదవి లేని-రాని నాయకులెవరైనా ఉద్యమం మళ్లీ ఆరంభించి-నడపక పోతారానని ఎదురు చూడసాగారు. రాజకీయ స్వార్థం కోసమైనా ఎవరైనా తమకండగా వుండకపోతారానని భావించసాగారు. సరిగ్గా పదేళ్ల క్రితం వారి కోరిక నెరవేరింది. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దొరకని కె. చంద్రశేఖర రావు-కేసీఆర్, "తెలంగాణ రాష్ట్ర సమితి"-టీ ఆర్ ఎస్ ని స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఒకరకంగా ఏకాభిప్రాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ-ఎవరూ సాధించని విజయాన్ని సాధించారని చెప్పాలి. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో, వై ఎస్ ఆర్ నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ-అటు పార్లమెంటు లోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగి, టీ ఆర్ ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేగలిగాడు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసుకుంటూ పోగలిగాడు. పార్టీలో తనకు ఎదురు తిరిగిన ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయగల సమర్థుడుగా ఎన్నో మార్లు నిరూపించుకున్నాడు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్ని మార్లైనా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. అంతవరకూ బాగానే వుంది.

జాతీయ స్థాయిలో ఇంత చేయగలిగిన కేసీఆర్ "ఇంట గెలిచి రచ్చ గెలవాలనే" నానుడిని అర్థం చేసుకోలేకపోయాడు. తన రాష్ట్రంలో తనకంటే బలమైన తన ప్రధాన ప్రత్యర్థిని అంచనా వేయడంలో తప్పటడుగు వేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇంతమంది మద్దతు కూడగట్టుకోగలిగిన కేసీఆర్, వై. ఎస్. రాజశేఖర రెడ్డి మద్దతు కూడగట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోయాడు. వై ఎస్ ఆర్ అందించిన స్నేహ హస్తాన్ని వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలచుకోలేక పోయాడు. శాసనసభలో తన వాళ్లలో చాలామందిని ఆయనకప్పచెప్పాడు. టీ ఆర్ ఎస్ ను బలహీన పరుస్తుంటే ప్రేక్షకుడిలాగా చూడసాగాడు. రాజశేఖరరెడ్డి మద్దతు సాధించకుండా సోనియా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదని గ్రహించ లేకపోయాడు. ఒక్కో సారి అనవసరమైన ఎదురుదాడికి దిగాడు. తిరుగులేని అధికారంలో వున్న వై ఎస్ ఆర్ కి అధికారంలో లేని కేసీఆర్ ను బలహీన పరచడం తేలికై పోయింది. కేసీఆర్ ఒకతప్పుతర్వాత మరో తప్పు చేయసాగాడు. అయినా ఉద్యమాన్ని నడపగలిగాడు. తప్పటడుగులు వేస్తూనే నిలదొక్కుకోగలిగాడు. ఈ నేపధ్యంలో వచ్చాయి 2009 సారస్వతిక ఎన్నికలు.

ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థి బలాన్ని అంచనావేయ లేకపోయాడు. తన బలమెంతో తెలుసుకోలేకపోయాడు. ఎవరు శాశ్వత మిత్రులో-శాశ్వత శత్రువులో గుర్తించడంలో విఫలమయ్యాడు. ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసే బదులు, తెలంగాణ రాష్ట్ర సాధనను వ్యతిరేకిస్తున్న శక్తులతో చేతులు కలిపాడు. తన బలాన్ని-తెలంగాణ ప్రజలలో తనపై వున్న నమ్మకాన్ని నిరూపించ గలిగే వీలు కలిగినా, చేజిక్కిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. అన్ని పార్టీలవారు తెలంగాణ పేరును ఉచ్చరించకుండా ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా చేయగలిగినా, తనకంటూ ప్రత్యేకతను టీ ఆర్ ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లు మరిచిపోయి, ఎన్నికల్లో చేసిన తప్పిదాలకే ప్రాముఖ్యతనిచ్చి, అనుకోని ఓటమిని రుచి చూపించారు. గుడ్డిలో మెల్లగా కేసీఆర్ మాత్రం తన సీటును దక్కించుకోగలిగాడు. ఏ ప్రజలైతే 1971 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చి తెలంగాణ కావాలన్నారో, ఆ ప్రజలే అస్పష్టమైన తీర్పిచ్చారు. తెలంగాణాలో గెలిచిన అన్ని పక్షాలకు చెందిన అభ్యర్థులు, ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ, తీర్పేంటి అన్నది అర్థంకాని ప్రశ్నలాగా మిగిలిపోయింది. చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించాడు కేసీఆర్. కొంతకాలం అజ్ఞాతంలో గడిపాడు.

అజ్ఞాతాన్ని వీడిన కేసీఆర్ బహిరంగంగా, పత్రికాముఖంగా తన తప్పిదాలను ఒప్పుకుంటూనే, భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడిచేశాడు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్థి చెపుతున్నట్లు టీవీ చానళ్లద్వారా (టీవీ9) ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ ప్రస్తుతానికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంధాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో ప్రస్తుతానికి "చిదంబర రహస్యం" గానే భావించాలి.

ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఏం జరుగనున్నదో వెండి తెరపై చూడాల్సిందే.

 

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech