బాల్యంలో చాలాకాలం, రాజకీయ పాఠాలు నేర్చుకున్న తొలి రోజులు, మా వూరి పరిసర గ్రామాల్లో గడిపాను. వూళ్లల్లో వున్న ఎంతో మందితో అప్పటినుంచి ఇప్పటిదాకా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాను. చిన్నతనంలో పెరిగిన అక్కడి వాతావరణం, పాఠశాలల్లో-కళాశాలల్లో-విశ్వవిద్యాలయాలలో నేర్చుకున్న పాఠాలు, సాహిత్యాన్ని-మానవత్వాన్ని కోణంలోనే అర్థం చేసుకునేందుకు దోహదపడ్డాయి. ఇప్పటికీ నేపధ్యంతోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అదో నిరంతర ప్రక్రియగా భావిస్తాను. సాహిత్యానికీ, మానవ విలువలకూ విడదీయని అనుబంధం వుందనీ-వుండితీరాలనీ నా భావన.

నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునే శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్ట్ మిత్రుల మధ్య పెరిగాను. ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ రెండంటే నమ్మకమే-అభిమానమే. రెంటిలోనూ వున్న మంచిని ఎలా కలిపి, లేదా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన ఎల్లప్పుడూ నన్ను వేధిస్తుంటుంది. విషయాలను నేను అర్థంచేసుకున్నంతవరకు, మిత్రులకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా, సరిగ్గా చెప్పలేకపోతున్నానేనన్న అసంతృప్తి మిగిలిపోయింది. అయినా చెప్పకుండా వుండలేకపోతున్నాను.

పుట్టి-పెరిగిన గ్రామ పరిసరాల భౌగోళిక-చారిత్రక నేపథ్యంలో, సాహిత్యం గురించి-మానవ విలువల గురించి, కొన్ని ప్రాథమిక పాఠాలను-మౌలికాంశాలను అనుభవంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న అనుభవాల జ్ఞాపకాలు-జ్ఞాపకాల అనుభవాలు, ఎప్పటికీ-ఇప్పటికీ తాజాగా గుర్తుకొస్తూనే వుంటాయి. మరిచి పోదామన్నా మరవలేని మధురమైన అనుభూతులవి. ప్రతి అనుభవం వెనుక, ప్రతి జ్ఞాపకం వెనుక, జీవితంలో నేను నేర్చుకున్న ప్రతి విషయం కళ్లకు కట్టినట్లు దర్శనమిస్తుంది. 1998లో, ఎనభై సంవత్సరాల పైనబడిన వయస్సులో మరణించిన మా నాన్న వనం శ్రీనివాసరావు గారు, బాల్యంలో నాకు నేర్పిన తొలి పాఠాలలో, చెరిపినా చెరగని నమ్మకాలున్నాయి. అందులో ఎన్నో గుడ్డి నమ్మకాలూ వున్నాయి. నాన్నగారు చదివింది ఆరో తరగతి వరకే అయినా, జీవితం నేర్పిన అనుభవంతో, పురాణాలనుండి-ఇతిహాసాలనుండి-భారత, భాగవత, రామాయణాల నుండి-వర్తమాన చారిత్రక గాధలనుండి-ఆయన పెరిగిన నైజాం నవాబుల పరిపాలనా నేపధ్యం నుండి, ఎన్నో విషయాలను నాకు చెప్పేవారు. మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్టరుడు, స్వధర్మ నిర్వహణే తన విధి అని తలచిన శ్రీరామచంద్రమూర్తి, కర్తవ్య బోధన చేసిన శ్రీకృష్ణుడు, అహింసే తన మతమన్న గాంధీ మహాత్ముడు, నాన్నగారు చెప్పిన పాఠాల్లో నాకు తరచుగా వినిపించిన పేర్లు. బాల్యంలోనే, "కర్మ సిద్ధాంతం" అంటే కొంచం-కొంచం అర్థం చేసుకున్నాను .


హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి, చిన్నతనంలోనే నన్నెంతో ప్రభావితుడిని చేసింది. అలానే పెరిగి పెద్ద వాడినయ్యాను. పుట్టుకతో హిందువునైన నేను, ప్రతిరోజో, నెలకోమారో, ఏడాదికొకసారో తప్పనిసరిగా గుడికెళ్లాలన్న నియమనిబంధనలు ఎప్పుడూ పాటించలేదు. అలా అని గుడికి వెళ్లకుండా వుండలేదు. ప్రతి సంవత్సరం ఏమాత్రం వీలున్నా తిరుపతికి వెళ్లి వస్తుంటాను. నేను నమ్మిన-నమ్ముతున్న ఆచార వ్యవహారాలను తప్పకుండా గౌరవిస్తాను-తు. తప్పకుండా పాటిస్తుంటాను. భార్య-పిల్లల నమ్మకాలనూ, పద్దతులనూ అంగీకరిస్తాను. గుడిలోకి పోయినా-పోకపోయినా, నేను వెళ్లే మార్గంలో గుడివుంటే, వీలున్నప్పుడల్లా దానిముందరనుంచే పోతాను. బయటనుంచే దేవుడికి దండం పెట్టుకుంటాను. నాన్నగారు చెప్పినట్లు, "గాయత్రి" మంత్రాన్ని, "నారాయణ" మంత్రాన్ని సమయం దొరికినప్పుడల్లా- పనిచేస్తున్నా-నిల్చున్నా-కూచున్నా-పడుకున్నా పఠిస్తుంటాను. దాన్ని జపంచేయడమంటారో-అనరో అని నేనెప్పుడు ఆలోచించలేదు. ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి, ఇవన్నీ మనతో చేయిస్తున్నదని గుడ్డి నమ్మకం. అయితే, నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన శక్తి దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే దీనికి కారణం అయుండవచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం".


నేనర్థంచేసుకున్న హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడేనని. పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో-లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. బహుశా అది నిజంకాదేమో. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అయుండాలి. ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డి పోచ కదలాలన్నా
ఒక్కరే కారణం. ఒక్కరే, సృష్టికొక అధికారినీ (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడు) నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అధ్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాయి. ఒక్కరు ఎవరికి పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-ఆగమన్నప్పుడు ఆగి, జీవితం చాలించాలి. తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి. ఉదాహరణకు బ్రహ్మనే తీసుకుందాం. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ-మళ్లీ సూర్యచంద్రులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరిగినట్లే, ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితి గతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. భూలోకంలో ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినట్లే ఇది కూడా.


   
నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయి . ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ"కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందనీ, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనీ, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా. కాకపోతే అసలు-సిసలైన "జగన్నాటక సూత్రధారి" నిర్ణయానికి లోబడే అవన్నీ జరిగుండాలి.


"
ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగేయుగే" అన్న వేదవాక్కు ప్రకారం, కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు-కారణజన్ములు-గొప్ప ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్నికోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పుచెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒకవైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశదపర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు.


మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆమాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం. సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడివుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేదానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన
వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.


మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా. రామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు   వాల్మీకి. శ్రీరామచంద్రమూర్తిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయే దాన్ని వివరంగా-రామాయణగాధగా లోకానికి తెలియచెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి, దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాసాడు వాల్మీకి. మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రులే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గం" లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమిపాలయ్యాడు. కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడు. మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌ-ఎన్-లై, స్టాలిన్ కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక" రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు. వాల్మీకైనా, మార్క్సైనా వారి-వారి సాహిత్యాలలో దేశ కాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.


మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, సంస్కృతీ-సాహిత్యాల ప్రాతిపదికగా ఆరంభించిన మహోద్యమం, నాడూ-నేడూ మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతూనే వుంది. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. ఎన్నో వందల-వేల పర్యాయాలు యుగాలు మారతాయంటారు. అందుకే, పరిణామ క్రమంలో ఏం జరిగిందోననో-జరుగుతుందోననో చెప్పినదానికన్నా, యుగానికి సంబంధించిన కథలను ప్రామాణికంగా తీసుకోవాలన్న విషయంలో పరిశోధనలు జరిగితే మంచిదేమో. ఏదేమైనా, మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం సాహిత్యమే. అందులో సందేహం లేదు.


మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, మనలాంటి వారు అంధకారంలో పడి, దురాచార పరులమైపోయి, మానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో.


మానవ విలువలను పరిరక్షించగలవాడికి కొన్ని గుణగణాలుండాలి. నాయకత్వ లక్షణాలుండాలి. అందరికీ అన్నీ సాధ్యపడవు. రామాయణ రచనకు పూనుకొమ్మని వాల్మీకిని ప్రేరేపించేందుకు ఆయనదగ్గరకొచ్చిన నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్న-సమాధానం రూపంలో గుణగణాలను తెలియచేస్తాడు రచయిత. "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు" ఎవరో వారే మానవ విలువలను కాపాడగలవారని అర్థంచేసుకోవాలి.

శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాం. అలాంటిదే ఇది. శ్రీరాముడలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వాల్మీకి విశ్వామిత్రుడితో చెప్పిస్తాడు. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపాడు. వాల్మీకి రామాయణంలోని "వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం", బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. "ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు" మధ్య జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య అన్నీ నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని గెలవలేడని స్పష్టమవుతుంది. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా, కార్మికవర్గ నియంతృత్వానికి పూర్వ రంగంలో, తమ హక్కులకొరకు శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. "సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీలేదు" అంటాడు మార్క్స్. దీనర్థం: ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నా, తమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech