ఉన్నమంత్రా
లిందు సరా
ఉన్నమంత్రా లిందు సరా వొగి
విచారించుకొంటే
విన్నకన్నవారి కెల్ల విష్ణునామమంత్రము
పరగ బుచ్చకాయల బరసి పోదు మంత్రము
గరిమ ముట్టంబు లేని ఘనమంత్రము
వరుసనెవ్వరువిన్నా వాడిచెడని మంత్రము
అరయ నిదొక్కటే పో హరినామమంత్రము
యేజాతినోరి కైన ఎంగిలిలేని మంత్రము
వోజ దప్పితే జెడక వుండేమంత్రము
తేజాన నొకరి కిస్తే దీరిపోనిమంత్రము
సాజమైనదిదే పో సత్యమైన మంత్రము
యిహము పరము దానే యియ్యజాలిన మంత్రము
సహజమై వేదాల సారమంత్రము
బహునారదాదు లెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీ వేంకటేశుమంత్రము
విష్ణు నామ మంత్ర విశిష్టతను ఈ
సంకీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆచార్య
పురుషుడు! శ్రీ మహా విష్ణు మంత్రము సాటిలేనిది, తత్త్వ
విచారణతో చూస్తే దీనికి సాటికి రాగల మరొక మంత్రం లేదు. (మరొక
సంకీర్తనలో కూడా అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అని అంటాడు).
హరి నామ మంత్రము ముట్టు, అంటూ లేనిది. ఎవరైనా వినవచ్చు,
పఠించవచ్చు! కులమత జాతి బేధములు లేక ఈ మంత్రోపాసన,
మంత్రోఛ్ఛారణ చెయ్యవచ్చు. (రామానుజ సిద్ధాంతం) ఇది
ఎంతమందికి పంచినా తరగని మంత్రము! సకల వేదాల సారమైన ఈ మంత్రం
ఇహపరాలను అవలీలగా అందిస్తుంది. విష్ణు భక్తులైన నారదాదులు
భక్తితో పాటలుగా పాడుకున్న మంత్రం! కలియుగంలో మనందరకు శ్రీ
వెంకటేశ మంత్రంగా విహితమైనది! దానిని అన్నమయ్య సంకీర్తనలో
పాడుకుందాం రండి!
పరగ =
అతిశయము; గరిమ = గొప్పతనము; అరయ = చూడగా;
వోజ = క్రమము;
సాజము = సహజము;
విహితము = హితకరమైనది |