ఒకపరి కొకపరి
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె
జగదేకపతిమేన చల్లిన కర్ఫూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె
పొరిమెఱుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలకినట్లుండె
మెఱయ శ్రీ వేంకటేశుమేన సింగారముగాను
తఱచైన సొమ్ములు ధరియించగా
మెఱుగు బోణి అలమేలు మంగయు తాను
మెఱుపు మేఘము గూడి మెఱసినట్లుండె
పెదతిరుమలాచార్యులవారి శృంగార సంకీర్తన!
తిరుమల స్వామి వారి తిరుమంజనపు కీర్తన ఇది.
తట్టుపునుగు అలదేవేళ, కర్ఫూర ధూళి చల్లేవేళ,
ఇతర విశేష సేవా సమయాలలో అమ్మవారితో కూడిన
స్వామివారి జగదేక సౌందర్యం అనేక రకాలుగా
భాసిస్తుందట. అలమేల్మంగతో కూడిన
వేంకటవిభుడు శరత్కాలపు పొగరు వెన్నెల
దిగబోసినట్లుగా ఉన్నడట! స్వామి వారి
చెక్కిళ్ళపై పూసిన తట్టుపునుగు కరిగి ఇరువైపులా
కారగా, అదెలాగున ఉన్నదంటే కరిగమనయైన లక్ష్మీ
విభుడు గనక సామజవరగమనుని నుండి మోహమదము
స్రవించుచున్నట్లు ఉన్నదట! వక్శస్థలమున
అలమేల్మంగను నిడుకొన్న వేంకటేశ్వర స్వామికి
సొమ్ములు (ఆభరణాలు) అలంకరించగా, తళుక్కున
మెరిసే మెరిపు నల్లని మేఘముతో కూడినట్లున్నదని
పెదతిరుమలయ్య ఆ ఇరువురి ప్రణయ సౌందర్యాన్ని
భక్తులకు అందిస్తున్నాడు.
సామజగిరి = మదపుటేనుగు సౌందర్యం;
మెరుగుబోణి = అందమైన యువతి;
జిగి = కాంతి;
పొతరువెన్నెల = నిండుపున్నమినాటి దట్టమైన
వెన్నెల;
పొరి = పదేపదే;
తొరగి = కొందకుజారి (స్రవించి);
మొకమున = ముఖము పైన;
మొలచినట్లు = అంకురించినట్లు;
కరిగమన = ఏనుగు నడక వంటి నడక కలది (లక్ష్మీదేవి);
తొలకినట్లు = అతిశయించినట్లు, తొణకినట్లు;
తరచైన = అపురూపమైన;
మొగి = కోరి
ఒక్కడే ఏకాంగ వీరుడు
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి చైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలే పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందు నీ హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోప పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కుపాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ర్పాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
చెలగి మేరువుపొంత సింహమైనాడు
బలిమి శ్రీ వేంకటేశు బంటై మంగాంబుధిని
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
ఆంజనేయుని ప్రతాపానికి
ఈ ఇలలో తిరుగులేదు! బ్రహ్మపట్టాన్ని పొందిన
ధీరుడితడు!
రాక్షసులను సంహరించి హరి పేరుకు మారుగా
నిలిచాడు. శివుని ఆత్మజుడు ఈ హనుమంతుడు!
ఆకాశాన్ని ఆక్రమించి సూర్యుణ్ణి అందుకున్నవాడు!
పాతాళము చొచ్చి శేషుడైనాడు! వాయురూపంలో జగతికి
ప్రాణమైనాడు! ఇన్ని విశిష్టతలు కల ఈ హనుమంతుడు
కలియుగంలో బ్రహ్మాండనాయకుడైన శ్రీ
వేంకటేశ్వరునికి దాసుడైనాడు అని
అన్నమాచార్యులవారు ఆంజనేయుని శౌర్య
పరాక్రమాన్ని తెలియజేస్తున్నాడు.
ఉర్వి = భూమి;
దైత్యులు = రాక్షసులు;
మేరువు పొంత = మేరు పర్వతం దగ్గర;
ఏకాంగ వీరుడు = విష్ణుముర్తి;
మంగాంబుధి = ఒక ఊరు
|