నాట్య రంజని


ఎల్లలు ఎరుగని కళలు

- ఫణిశ్రీ కూచిభట్ల

 


 

ప్రతి గురువారము మరియు శనివారము హాంగ్ కాంగ్ లోని ప్యూర్ యోగా సంస్థకు అమితానందముగ తరలి వస్తారు సుమారుగ 80 మంది వనితలు. ఆందరి గమ్యము ఒక్కటే. శ్రీ ఈరంకి హరి (మాస్టర్ హరి ఓం) కూచిపూడి క్లాసు. ఇందులోని ఆశ్చర్యము ఎమిటంటే, 6 సంవత్సరముల పాప నించి 60 సంవత్సరముల అమ్మమ్మ వరకు ఉన్న ఆ సమూహములో ఒక్కరు కూడ భారతీయులు కారు.  ఫ్రాన్స్, జర్మని, కజకస్థాన్, జ్పాన్, ఇటలీ, మలేశియా, సింగపోర్, చైనా, టైవాన్, అమెరికా, బ్రిటన్, పలు దేశాలకు చెందినవారు; డాక్టర్లు, ఇంజనీయర్లు , సర్కారి అధికారులు, ఫాషన్ డిజైనర్లు, గృహినులు, క్రీడాకారులువిద్యార్థులు, అధ్యాపకులు, గణకులు, వకీలులు, వివిధ వృత్తులకు చెందినవారు;

పెద్దలు, పిల్లలు, యువతులు, వృధ్ధులు; ప్రతి రోజు ఇంతటి వర్గీకరణము గల విద్యార్థులకు తన విద్యను పంచగలుగుతున్నారని శ్రీ హరి చాల సంతసిస్తున్నారు. హాంగ్ కాంగ్ వంటి విశ్వ నగరములోనే ఇటువంటి అద్భుతమైన అనుభవము సాధ్యమని ఆయన అభిప్రాయము. 21 వ శతాబ్ద ఆరంభములో హాంగ్ కాంగ్ నగరమును యోగా ఒక తూఫానులా పెనవేసింది. అనుదినము పెరిగిపోతున్న దైనందిక ఒత్తడి, శ్రమ నుంచి ఉపశమనము, స్వాస్థ్యము  పొందుటకు యోగాని భావావేశముతో స్వీకరించారు హాంగ్ కాంగ్ దేశస్తులు. ఇటువంటి సమయములో శ్రీ హరికి ఒక విశేష అవకాశము కలిగింది. హాంగ్ కాంగ్ లో వెలుస్తున్న యోగా కేంద్రాలలో భారతీయ నృత్యములతో సమకూరిన 'యొగా నృత్యం' అన్న నృత్య ప్రణాళికని ప్రవేశపెట్టే బాధ్యత శ్రీ హరికి అప్పగించారు. చైనా, జాపాన్, సింగపూర్, యూరప్ దేశాలు, తదితర దేశాల ప్రజలున్న విశ్వజనీనమైన హాంగ్ కాంగ్ నగరములో తొలిసారిగా వివిధ భారతీయ నృత్యములను పరిచయము చేసే అద్భుతమైన సదావకాశమును తన భాగ్యముగ తలిచిన శ్రీ హరి అత్యంత ఉత్సాహముతో ఈ సాహస కృత్యమును ప్రారంభించారు. ఇలా మొదలైన ఈ ప్రయాసము ఈ రోజు హాంగ్ కాంగ్ లో మిక్కిలి ప్రజారంజకమైన క్రియా కలాపముగా మారి మరో తూఫాను రేపింది. హాంగ్ కాంగ్ వాసులకు ఆరోగ్యం మరియు సౌందర్యం పై ఉన్న ఆసక్తి, శ్రద్ధ; శారీరిక మరియు మానసిక ఆరోగ్యమునకై, ఆనందమునకై వారి తపన, కృషి  చూసి సంభ్రమాశ్చర్య చకితులు అయ్యారు శ్రీ హరి. వారి ఈ తపస్సు, సాధకము ఆయనలో నూతన ఉత్తేజాన్ని రేపాయి. చైనీస్  భాష నేర్చుకుని, వారి సంస్కృతి గురించి తెలుసుకుని, వారి రుచులను దృష్టిలో పెట్టుకుని, వారిలో ఒకరిగ కలసిపోయారు శ్రీ హరి. గురువుకి తగ్గ శిశ్యుల వలే, నాట్యభ్యాసమునకు వచ్చిన విద్యార్థులు కూచిపూడిలోని సాత్వికాభినయమునకు నృత్యాంశమే కాకుండా,  భాషా ఙ్ఞానము కూడ ఎంతో అవసరమని తెలుసుకుని తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకున్న ప్రతి పదము యొక్క అర్థము తెలుసుకుంటూ, పాటలు పాడుతూ, నృత్యానికి సంభందించిన ప్రతి విషయములో ప్రావీణ్యత పొందాలన్న వారి ఉత్సాహమును చూచిన శ్రీ హరికూచిపూడి కళలోని సంపూర్ణ అనుభూతిని అందించుటకు తన శిష్య బృందానికి విశాఖపట్నములో డాన్స్ రిట్రీట్ ఏర్పాటు చేసారు. చైనీస్ కళకారులు కూచిపూడి ప్రదర్శనలిస్తున్నారని విశాఖపట్నములోని సమాచార పత్రికలు ప్రకటించిన చిన్న తూఫానుకై ఆసక్తితో ఎదురు చూస్తోంది ఆ నగరము. మనలో ఎవరికైనను బాల్యములో నాట్యము నేర్చుకోలేదన్న కొరత ఉంటే, ఈ చైనీస్ విద్యార్థుల నించి స్ఫూర్థి పొంది, మన కలని నెరవేర్చుకోవలెను. నాట్యమనేది ఒక కళయే కాకుండా ఒక జీవన మార్గమని నేర్పుతున్న శ్రీ హరి తన విద్యార్థులలో క్రమశిక్షణను , ఆత్మాభిమానమును, ఆత్మవిశ్వాసమును బలపరిచే ఒక కారణ కర్త అయ్యారు. 

మీ నాట్యాభినయములు అత్యద్భుతం అమోఘం అద్వితీయం. మీ నాట్యాభిమానం అందరికి ఉత్సాహం కలిగించి కూచిపూడి అభ్యాసనానికి నాంది పలకాలని మీరు చిరంజీవులుగ జీవించాలని ఆ భగవంతుడిని మనసార ప్రార్థిస్తున్నాను. 

కూచిపూడి కళాకారుడైన శ్రీ ఈరంకి హరి ని అభినందిస్తూ ఇంత ఆత్మీయంగ వ్రాసారు ఒక కళాభిమాని. ఇలాంటి భావములను స్పందింపచేసిన మెరుగైన యువ కళాకారుడు శ్రీ హరి మన అందరికి మాస్టర్ హరి ఓం గా పరిచయము. మన ఆంధ్ర దేశానికి చిహ్నమైన కూచిపూడి నృత్య శైలిని ఎంతో ఆదరముగ, ఆప్యాయముగ, భక్తి భావములతో ఆచరిస్తూ, అంతటి అందమైన అనుభూతిని పలుగురితో పంచుకుంటూ, దేశముకాని దేశములో ఆ నాట్యానికి ఒక చిహ్నములా నిలుస్తున్నారు ఆయన. ఏడు సంవత్సరముల క్రితం విశాఖపట్నం నుండి హాంగ్ కాంగ్ దేశమునకు ఏగి, మన భాష, కట్టు బాటులు ఎరుగని హాంగ్ కాంగ్ వాసులకు ఈ నృత్యాన్ని ఎంతో ఆహ్లాదకరముగ ప్రదర్శించి, ఒక మంచి కళాకారుడిగ, ఒక గౌరవనీయులైన గురువుగ ప్రకాశిస్తున్నారు. ప్రొ. శ్రీ సూర్యనారయణ మూర్తి గారికి, కీ.శే. శ్రీమతి నాగమాంబ గారికి జన్మించిన శ్రీ హరి, చిన్ని చిన్ని అడుగులు వేసే మూడవ ఏటనే కూచిపూడి అడుగులు వేసారు, ఐదవ ఏట నుంచే కళాత్మకమైన ప్రదర్శనలు ఇచ్చారు, అనేక నృత్య పోటీలలో గెలుపు పొందారు  సాంప్రదాయమైన కళామూర్తుల ఇంట్లో పుట్టిన ఆయన, ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచారులు గురు శ్రీ పసుమర్తి సీతారామయ్య గారి దగ్గర కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.  కళలపై మిక్కిలి మక్కువతో శ్రీమతి బాల కొండల రావు, శ్రీ హరి రామమూర్తి గారి వద్ద కళాక్షేత్ర శైలిలో కూచిపూడి, శ్రీ రుక్మాజీ రావు వద్ద భరతనాట్యము, శ్రీ నటరాజ పరమేశ్వరన్ వద్ద పేరిని శివ  తాండవము, శ్రీ జీ. వెంకట రావు వద్ద మృదంగమును అభ్యసించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి కూచిపూడిలో డిప్లొమా పత్రము పొందారు . కూచిపూడి నృత్యములో శ్రీ హరి సంపాదించిన నైపుణ్యముని, ఙ్ఞానముని గుర్తించి భారత కేంద్ర మంత్రివర్గము యొక్క సెంటెర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ ఆయనకి స్కాలర్ షిప్ పురస్కారం అందించారు. బాల్యములోనే తన గురువుగారు శ్రీ పసుమర్తి సీతారామయ్య గారితో, ప్రఖ్యాత నాట్య శిరోమణి శ్రీమతి స్వప్న సుందరి గారితో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనములలో ప్రదర్శనములు ఇచ్చిన శ్రీ హరి, గత మూడు సంవత్సరములుగ ఆసియా యోగా కాన్ఫరెన్సుల్లో పాల్గొని, ఆ విశ్వ వేదికపై కూచిపూడి వర్కుషాపులు , ప్రదర్శనలు ఇచ్చి, భారతీయ సాంప్రదాయమైన నృత్యాలను పూర్వము ఎరుగని కొరియా, మంగోలియా వంటి దేశస్తులని కూడ తన ప్రదర్శనలతో ముగ్ధులని చేసి కూచిపూడి నృత్యములోని దైవిక తత్వాన్ని నలుగురికి తెలుపుతూ జీవిస్తున్నారు.  

కళలకి సరిహద్దులు లేవు. కళా సౌందర్య పోషకులు కళలను ఏ రూపమునైన అభిమానించి, అది ఎంత కఠినమైనా ఆ కళను అభ్యసించి, ఆ కళలోని ఆనందాన్ని అనుభవించి, జీవితము సార్థకము చేసుకుంటారు. హాంగ్ కాంగ్ శిష్యులు చూపుతున్న ఈ గుణమును చూస్తున్న శ్రీ హరి వారికి జోహారులు అర్పిస్తున్నారు. నాట్యమే తన జీవనముగ భావిస్తూ, ఈ నాట్యము ద్వారా ఉన్నతమైన, ఉత్తమమైన లక్ష్యములని సాధిస్తున్న పరిపక్వమైన కళకారుడు శ్రీ హరికి హృదయ పూర్వక అభినందనలు.  జాతి, మత, వర్ణ, భాషా భెదాలను మరిపించి ఒక అంతర్జాతీయ పీఠముపై సకల మానవ జాతిని ఐకమత్యముతో కలిపిన సాంప్రదాయమైన కళ "కూచిపూడి"కి శతకోటి ప్రణామాలు.    

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech