| |
వందన - మాఘమాసం ఎప్పుడొస్తుందో,
మౌనరాగాలెన్నినాళ్ళో..
అంబుజం - ఏవే పిల్లా.. మాఘమాసం కోసం అంతలా చూస్తున్నావు, ఎంత
కూడబెట్టేడేంటే మీ నాన్న
వందన - అమ్మోయ్, అంబుజం అత్తయ్య వచ్చిందే, ఏంటత్తయా అకస్మాత్తుగా
ఇలా ఊడిపడ్డావు
వరలక్ష్మి - రా వదినా! అంతా బావున్నారా!
అంబుజం - ఆ... అంతా బానే ఉన్నారు. ఈవూళ్ళో మా పినమామ గారి అబ్బాయి
పెళ్ళని నిన్న వచ్చాం. నిన్నంతా పెళ్ళీ ఇంట్లోనే సరిపోయింది. ఎదిగో
ఇవాళిలా అన్నయ్యనీ, మిమ్మల్ని చూసివెడదామని వచ్చా.. అన్నయ్యేడీ?
వరలక్ష్మి - ఆయన ఆఫీసు పనిమిద బెజవాడ వెళ్ళారు కానీ, రా కూర్చో,
కఫీ తెస్తానుండు.. ఒక్కదానివే వచ్చావా..
అంబుజం - లేదు, మా తోడికోడలు వసంత కూడా వచ్చింది.
మధ్యాహ్నానికొస్తుంది. ఇక్కడ్నుంచే మళ్ళీ వెనక్కెళ్ళీపోతాం.
అవునే వందనా! నీ చదువు పుర్తయిపోయినట్టే కదా!
వందన - అంతా అయిపోయిందత్తయ్యా.. ఇంకా ప్రోజెక్టు ఒక్కటే మిగిలింది.
అంబుజం - సంబంధాలేమైనా చూస్తున్నారా ఒదినా?
వరలక్ష్మి - ఏం చూస్తాంలే, అన్నయ్య ఓ పట్టాన కదిల్తేగా..
అంబుజం - అన్నయ్య మాట సరే ఒదినా..అసలింతకీ మీరు ఎంతవరకు ఇవ్వగలరో
చెప్తే దాన్ని బట్టి నేనే చెప్తాను బోల్డు సంబంధాలు.
వరలక్ష్మి - మీ అన్నయ్య సంగతి నీకు తెలీందేముంది. పిల్లకి చదువు
చెప్పించేం కదా అంటున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, దానికేం
తక్కువయిందా ఏంటి - బోల్డు డబ్బయింది.
అంబుజం - అయినా అంటే అన్నానంటారు గానీ ఆడపిల్లంటూ పుట్టాక ఆమాత్రం
జాగ్రత్త పడద్దమ్మా.. అన్నయ్యంటే మగాడు, తెలీదు,,నీకైనా ఆమాత్రం
తెలీద్దా?
వందన - అన్నానంటారు గానీ నీకు, అమ్మకి నాన్నకు ఆడిపోసుకోవడం తప్ప
వేరే పనేంలేదా?
అంబుజం - చూసావా వదినా దీని వేళాకోళం. వస్తాడే ఎవడో..నీ ఆట
కట్టించేవాడు..రాకపోతాడా...నే చూడకపోతానా..
అయినా..మీ నాన్ననంటే నీకంత కోపమెందుకే..ఇదేమైనా కొత్త విషయమా,
ఏవన్నానా...ఆడపిల్లంటూ పుట్టేక ఇహనో, ఇప్పుడో పెళ్ళి చేయడా ఏంటి..
ఆ మాత్రం ముందు చూపుండద్దు.
వరలక్ష్మి - నేను చెవినిల్లు కట్టుకుని చెప్తూనే ఉన్నాను.
ఇన్నిన్ని వేలు తగలేసి ఆడపిల్లల కింత చదువులొద్దండీ అని నేనంటే
వింటేనా మీ అన్నయ్య.
వందన - అమ్మా, నాన్నేదో, ఘోరాపరాధం చేసినట్టు మాట్లాడతావేంటి.
చక్కగా చదువు చెప్పించారు. నా కాళ్ళమీద నేను నిలబడగలిగే ఆత్మ
విశ్వాసాన్నిచ్చారు.
అంబుజం - అంటే అన్నానంటారు కానీ,..నువ్వెంత చదువుకున్నా...లక్షలు
ఖర్చు పెట్టందే నీ పెళ్ళెలా చెయ్యగలడో చెప్పు...
వరలక్ష్మి - ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఈ రోజుల్లో మగపిల్లలు
కట్నాలొద్దంటున్నారట గదా.
అంబుజం - ఆ... మరే...కట్నాలనే పేరుమటుకు లేదంతే...అవ్వపేరే
ముసలమ్మనీ...పిల్లకి
బాలతొడుగనీ,..లాంఛనాలు..ముద్దుముచ్చట్లూ...అన్నీ బాగానే
జరిపించుకుంటున్నారు.
వరలక్ష్మి - అంతేనంటావా వదినా.. ఇంతకీ ఎన్ని లక్షలు
కావాల్సివస్తుందేం..
అంబుజం - అయ్యొ వదినా.. నీ అమాయకత్వం చూస్తే జాలేస్తోంది... ఈ
రోజుల్లో కూడా నువ్విలా ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ పిల్లకి
ఎంతమటుకు బంగారం చేర్చావు ఇప్పటివరకూనూ.
వరలక్ష్ని - బంగారమా...పిల్లాకా...చదువులకే ఎంత డబ్బూ
సరిపోవట్లేదూ..అందులోనూ బంగారం ధర చుక్కల్నంటుతోంది. ఈరోజుల్లో
కొనగలవా..?
అంబుజం - అంటే అన్నానంటారు గానీ..అప్పుడోటీ,.. అప్పుడోటీ...ఈపాటికి
కనీసం ఇరవై నవరసుల బంగారమైనా కొనద్దా వదినా.
వరలక్ష్మి - ఇరవై నవరసులా.. ఏంటీ .. బంగారమే..
వసంత - ఏం అక్కర్లేదు. అసలే నేనే బంగారాన్నంటాడు మా నాన్న.
అంబుజం - మీ నాన్నకి నువ్వు బంగారమే కాదు. రత్న మాణిక్యాలు కూడా.
కాని పెళ్ళివారికి మటుకు బంగారమంటే అక్షరాలా బంగారమే. అందాకా
ఎందుకు.. ఇప్పుడు మా పినమామగారబ్బాయి పెళ్ళైందా.. ఆ పిల్లకి ఇరవై
ఐదు నవరసుల బంగారం పెట్టారు పుట్టింటివాళ్ళు. అత్తింటి వాళ్ళు మరో
ఇరవై నవరసులు. ఏదైనా అలా అమరితే అలా పెళ్ళి టైంలో అమరాలి. తప్పితే
తర్వాత సంసారంలోపడ్డాక వాళ్లేం కొనుక్కోగలరు చెప్పు. అవునూ.. ఆ
పెళ్ళికూతురు నీ ఫ్రెండేనట గదా..ఇందాక ఏదో చెప్పింది.
వందన - నా ఫ్రెండా.. ఏం పేరు.
అంబుజం - సరస్వతి అనుకుంటాను
వందన - ఓ సరస్వతా.. మా కాలేజ్ లోనే చదువుతోంది. కానీ వాళ్ళ
పేరెంట్స్ అంత డబ్బున్నవాళ్ళు కాదే, అంత బంగారం కొన్నారా.
అంబుజం - లేకపోవడమేంటే - నాలుగు రకాల దుద్దులు, జంకీలు. ఒక బంగారం
సెట్టు, ఒక ముత్యాల సెట్టు, ఒక కెంపుల సెట్టు, రెండు పేటల
చంద్రహారాలు, నాలుగు జతల గాజులు, నాలుగు ఉంగరాలు, ఇవన్నీ కాక ఇంకా
ఏవో చిన్నా చితకా ఉన్నాయి. నేను చూసేను కదా.
వరలక్ష్మి - ఎంత చెప్పినా మీ అన్నయ్య వినరు కదా. వదినా.. ఈ పిల్లని
ఎలా గట్టెక్కిస్తానో ఏంటో..
శృతి - వరలక్ష్మి గారు...వరలక్ష్మి గారు.. ఏం చేస్తున్నారు..
వరలక్ష్మి - అమ్మయ్యో ఈవిడా వచ్చింది.
వందన - రండి సుత్తాంటీ.
వరలక్ష్మి - ఇష్... ఊరుకోవే...వదినా..ఈవిడ శృతి అని మా పక్క
ఫ్హాట్లోనే ఉంటారు. ఈవిడ మా ఆడపడుచు అంబుజం... వాళ్ళ
పినమావయ్యగారబ్బాయి పెళ్ళికి వచ్చింది.
శృతి - ఏంటొనండి అంబుజం గారూ, ఏదైనా వస్తువు కొన్నానంటే వరలక్ష్మి
గారికి చూపించేదాకా నాకు తోచదనుకోండి.
వరలక్ష్మి - అలాగా. ఏం కొన్నారేంటీ..
శృతి - ఇదిగో..నిన్నే కొన్నాను..రెండు జతల గాజులు..డిజైన్
బాగుందంటే “తీసుకో, తీసుకో’ అంటూ తీసుకునేదాకా ఒకటే గొడవనుకోండి
మావారు.
అంబుజం - డిజైన్ నిజంగా బావుంది. ఇంతకీ ఎంతేంటి..
శృతి - జత మూడు నవరసులు. ఇప్పటికే పది జతల దాకా ఉన్నాయి. అసలే
రోజులు బాగాలేవు. బైటకేసుకెళ్ళాలంటే భయంగా ఉంది. ఇంట్లో ఆడపిల్ల
కూడా ఉంది కదా.
అంబుజం - ఆడపిల్లుంటే తీసుకోవాల్సిందే..ఇంతకీ ఎన్నేళ్ళేంటి
పిల్లకి.
శృతి - సెకండ్ స్టాండర్ లో ఉందండీ. అయినా ఆడపిల్లలు ఎంతలో
ఎదుగుతారు. ఇప్పట్నుంచి కాస్త మొదలుపెట్టాలిగా.
వరలక్ష్మి గారు ఇప్పుడే వస్తానండీ, వస్తుంటే మాలతి గారు పిలిచారు.
ఆవిడక్కూడా చూపించి వస్తా..అంబుజం గారూ ఉంటారు కదా.
అంబుజం - ఆ..ఆ..ఉంటాను,.. వెళ్ళిరండి. చూసావా వదినా అలా ఉండాలి
తెలివంటే..కూతురు రెండోక్లాస్ లో ఉన్నప్పట్నుంచీ ఎలా జాగ్రత్త
పడుతోందో చూడు..ఆవిణ్ణి చూసైనా నేర్చుకోవచ్చు కదా ఒదినా..
వరలక్ష్మి - ఆవిడ అస్తమానం ఏదో ఒకటి కొంటూనే ఉంటుంది. ఆయనది పెద్ద
ఉద్యోగమేం కాదు. మరి డబ్బులెక్కడ్నుంచి వస్తాయో.
అంబుజం - అదే మరి ప్రయోజకత్వమంటే..నేను కూడా ఇంతకాకపోయినా మా
పరిమళకి ఏదో మెళ్ళోకీ, చేతులకీ అమర్చానా లేదా..పెళ్ళిలో సాలంకృత
కన్యాదానం చేయాలంటారు. బోసిమెడతో కన్యాదానం చెయ్యకూడదు. ఆమాత్రం
తెలీదా.
వందన - అత్తయ్యా..నువ్వు మా అమ్మని కంగారు పెట్టకు.
అరుణ - హమ్మయ్య.. ఇప్పటికి ఇల్లు కనిపించిందిరా బాబూ..ఈ హైద్రాబాద్
లో అడ్రస్ పట్టుకోవడమంటే పద్మవ్యూహాని ఛేధించినట్టే.
అంబుజం- అదేంటి అరుణా... అప్పుడే వచ్చేసావు.. సాయంత్రం కానీ
రానన్నావు కదా..
అరుణ - అక్క డ పెళ్ళివారి మధ్య కురుక్శేత్రమే అయిపోతోంది. నేనూ
అక్కడుంటే ఎక్కడ చిక్కుకుంటానోనని తప్పించుకుని వచ్చేసా.
అందరూ .;.... అతృతగా.. ఎమైంది.
అరుణ - కాసిన్ని మంచినీళ్ళివ్వండి వదిన గారూ. స్థిమిత పడనీయండి...
అమ్మయ్య
శృతి - అమ్మయ్య చుట్టు పక్కలందరికీ చూపించడం అయిపోయింది వరలక్శ్మి
గారూ..అందరూ డిజైన్ బాగుందని ఎంత మెచ్చుకున్నారో..ఎదురింటి
పార్వతమ్మ గారయితే బంగారం కొనుక్కుందుకు నన్ను సాయం కూడా
రమ్మన్నారు. అవునూ..ఈవిడెవరూ
అంబుజం - మా తోడికోడలండీ..
శృతి - అవునా..ఇవిగో చూసారా గాజులు..డిజైన్ ఎలా ఉందంటారు. జత మూడు
నవరసులు పడింది.
వందన - ఆంటీ..బాగుందని తొందరగా చెప్పండి... లేకపోతే ఆవిడ సుత్తి
ఎక్కువైపోతుంది.
శృతి - ఈ వందన కెప్పుడూ నేనంటే వేళాకోళమే. అయినా దేనికైనా ఓ సరదా
అంటూ ఉండాలి కదండీ...వరలక్ష్మి గారికి ఏ సరదాలూ లేవు.
అదేంటో..ఎంతసేపూ మావార్నడుగుతాను. అడుగుతాను అంటారే కానీ అడగరు.
భార్య ముచ్చటపడి అడిగితే ఏ భర్తైనా కాదంటాడా.. చెప్పండి.
అంబుజం - అదీ నిజమేలెండి. మా వదిన కి ఎప్పటికి తెలుస్తుందో..ఏంటో..
శృతి - ఏంటో మావారు. ఒక్కోసారి ఒక్కో షాపుకి తీసుకెళ్తారు.
డిజైన్లు కొత్త కొత్తగా ఉంటాయని. అమీరుపేటలో అదేదో షాపమ్మా..పేరు
మర్చిపోయాను. చూసి చెప్తాలెండి. ఇంతకీ డిజైన్ మీకు నచ్చిందంటారా..
అరుణ - చాలా బాగుందండీ.
అంబుజం - అది సరే కాని అరుణా. పెళ్ళీవాళ్ళెందుకు గొడవపడ్డారో
చెప్పనేలేదు.
శృతి - ఏంటి, పెళ్ళి వాళ్ళింట్లో గొడవా, ఏమైందో.. చెప్పండి,
చెప్పండి
అరుణ - ఏముంది.. పెళ్ళీలో పెళ్ళీకూతురికి పాతిక నవరసుల బంగారం
పెట్టారు కదా. ఎవరో మాటల మధ్యలో చెప్పారుట. అదంతా బంగారమ్ కాదనీ..
బంగారు నీటిలో ముంచి తీసిన 1 గ్రామ్ గోల్డ్ నగలనీ.
అందరూ- ఆ ఆ .. ఏంటీ
అరుణ - అవును అవన్నీ మొత్తం బంగారంతో చేయించినవు కాదుట.1 గ్రామ్
గోల్డ్ నగలట. అది తెలీగానే మా పినమామగారు, అత్తయ్య వియ్యాలవారిని
నిలదీశారు. మరింక విధిలేక ఆ మాట నిజమేనని ఒప్పుకున్నారు.
ప్రస్తుతానికి ఇలా కానిచ్చేస్తే నెమ్మదిగా పాతిక నవరసులూ తప్పకుండా
కొనిస్తామన్నారు. మమ్మల్ని మోసం చేసేరని మగపెళ్ళీ వారు పెట్టీ బేడా
సర్దుకుని ప్రయాణం కట్టేసేరు. బ్రతిమాలుతున్నారు. అదీ విషయం.
ఇంకక్కడ ఉంటే నేనెక్కడ ఇరుక్కుంటానోనని ఇలా వచ్చోశాను.
వరలక్ష్మి - అసలీ 1 గ్రామ్ గోల్డ్ అంటే ఏమిటి
అరుణ - 1 గ్రామ్ గోల్డ్ అని వెండితోనో, రాగితోనో నగలని తయారు చేసి
1 గ్రామ్ బంగారం నీతిలో ముంచి తీస్తే పైనంతా బంగారం పట్టుకుని
అచ్చం బంగారంతో చేసినట్టుంటాయి. ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కనుక
ఆ మెరుపు కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్య అందరికీ మేచింగ్ బట్టలతో పాటు
మేచింగ్ నగలు కూడా అవసరమొస్తున్నాయి కదా. ఇవైతే డిజైన్లు
బాగుంటాయి. ధరలూ అందుబాటులో ఉన్నాయి. దొంగల భయమూ లేదని ఇప్పుడు
చాలామంది వీటినే కొనడానికి ఇష్టపడుతున్నారు.
వరలక్ష్మి - అయినా మొత్తం బంగారం అని చెప్పి పెళ్ళివారిని మోసం
చెయ్యడం తప్పుకాదా..
శృతి - తప్పేముంది. నెమ్మదిగా కొనిపెడతామనే అంటున్నారు కదా.
అయినా, నిజం చెప్పాలంటె, పెళ్ళిళ్ళల్లోనూ, ఫోటోలలోను ఈ నగలు
మెరిసినట్టు బంగారంవి మెరవనే మెరవవు.
వందన - ఆంటీ..అలా చెయ్యడం తప్పుకదా. ఈ పెద్దవాళ్ళ మోసాలు, పట్టుదలల
వల్ల పెళ్ళైన వాళ్ళిద్దరూ ఎంత వేదన పడతారో పాపం. పెద్ద వాళ్ళని
ఎదిరించలేరు. అలాగని పెళ్ళయ్యాక కానివాళ్ళిగానూ ఉండలేరు.ఇలాంటి పని
చేసేముందు వాళ్ళని గురించి ఎవరూ ఆలోచించరా..
అంబుజం - మళ్ళీ నిజంవి కొనిస్తానన్నారుగా. కోడల్ని కాపురానికి
తీసుకురావచ్చుగా.
అరుణ - ఒకసారి కోడల్ని తీసుకొచ్చేస్తే మళ్ళీ బంగారం ఇస్తారో
ఇవ్వరోనని ఏకంగా బంగారంతో పాటే మీ పిల్లనీ పంపండని వెళ్ళిపోయారు.
శృతి - (నెమ్మదిగా) నిజంగా, అలా అవుతుందంటారా వరలక్ష్మి గారూ.
అంబుజం.- ఇప్పుడయ్యిందిగా.. ఏవైనా పెళ్ళిళ్ళలో ఇలాంటి మాటతేడాలు
రాకుండానే ఉండాలి కానీ..ఒకసారి వచ్చాయంటే ఇంక ఎన్నేళ్ళయినా ఈ విషయం
పట్టుకుని ఆ పిల్లని ఏదోమాట అంటూనే ఉంటారు.
శృతి - అయితే నేనిన్నాళ్ళూ కొన్నదంతా వేస్టేనా.
వరలక్ష్మి - అంటే.. ఇన్నాళ్ళూ.. మీరు కొన్నవి 1 గ్రామ్ గోల్డ్
నగలా.
శృతి - అవునండీ..లేకపోతే ఈ రోజుల్లో.. ఈ ధరల్లో... అంత బంగారం
కొనగలమా ఏంటీ..ఇదేదో సూక్ష్మంలో మోక్షంలా ఉందని ఇవే కొంటూ వచ్చాను.
ఇలా చేస్తే రేపు మా అమ్మాయికి కూడా ఇలాగే అవుతుందేమో.
వందన - ఆంటీ..ఇప్పటికైనా తెలుసుకున్నారు. లేకపోతే లేనట్టే ఉండాలి
కాని తక్కువ కొని ఎక్కువ చెప్పుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
శృతి - ఎంతైనా మా వందన కరెక్టుగా మాట్లాడుతుంది. ఇలాంటి పిల్లకి
బంగారం లాంటి మొగుడొస్తాడు.
వందన - ఆంటీ, ఆ మొగుడు కూడా 1 గ్రామ్ గోల్డ్ కాకుండా
చూసుకోవాలేమో..
అందరూ నవ్వుతుంటారు.
|
|