| |
నిక్షేపరాయుడు తన ఆస్థానంలోని సభకుల్ని అప్పుడప్పుడూ ఉబుసుపోక ఏవేవో
ప్రశ్నలు అడుగుతూండేవాడు. అలాంటి ప్రశ్నలకు హాస్యం జోడించి
జవాబులిచ్చి సభికులను నవ్వించేవారికి మంచి బహుమానాలు ఇస్తుండేవాడు
నిక్షేపరాయుడు.
ఒకసారి ఆయన సభికులను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగాడు ’బజార్లో అన్ని
వస్తువుల్లాగే తెలివి కూడా కొనేందుకు దొరకటం ప్రారంభమైతే....
అప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది?’ అని
ఒక సభికుడు లేచి ’మహారాజా! తెలివి కొనేందుకు దొరికితే దేశంలోని
మూర్ఖులంతా దాన్ని ఎగబడి కొంటారు. ఇక దేశంలో మూర్ఖుడన్న వాడు ఉండడు’
అన్నాడు.
నిక్షేపరాయుడికి ఈ జవాబు నచ్చినట్లు ఆస్థాన విదూషకుడికి అనుమానం
కలిగింది. ఈ ఉబుసుపోక ప్రస్తావనలకు అడ్డుకట్టవేయకపోతే లాభం
లేదనుకున్నాడు.
’మహారాజా! అలా జరగటం అసంభవం. తెలివి అమ్మకానికి దొరికినా దేశంలో
మూర్ఖుల శాతం ఏమాత్రం తగ్గదు’ అన్నాడు విదూషకుడు.
’అదెలా నిరూపించు!’ అన్నాడు రాజు.
’ప్రతీ వ్యాపారీ ఎక్కువ లాభాన్ని ఆశిస్తాడు. తెలివిని కొనుక్కుని
మూర్ఖులంతా తెలివైనవాళ్ళయిపోతే ఇక తెలివిని కొనేవాడుండడు. అందువలన
వ్యాపారి తెలివి పేరు చెప్పి, మూర్ఖులకు మరేదో అమ్ముతాడు. మూర్ఖులు
మూర్ఖులుగానే ఉండిపోతారు’ అన్నాడు విదూషకుడు.
’కొనేవారు తాము కొంటున్నది తెలివో, కాదో అన్న సంగతి తెలుసుకోలేరా?’
అన్నాడొక సభికుడు.
’తెలుసుకోలేరు. తెలివిని కొనేందుకు వచ్చే వారంతా మూర్ఖులే కదా!’
అన్నాడు విదూషకుడు.
ఆ జవాబుకు సభికులు ఘొల్లున నవ్వారు.
నిక్షేపరాయుడు విధూషకుడికి మంచి బహుమానం ఇచ్చి సత్కరించాడు.
చొక్కాపు వెంకటరమణ :
స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం
అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు
ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో
ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల
పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్
రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్
బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్
ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి
గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా
బాలరంజని లో నెల నెలా వెన్నెల..
|
|