|
ఎటు
చూసినా తెలుగు నాట వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
దుమ్ము ధూళీ దులిపీ పాత మాటలనె కలిపీ
కొత్త అర్ధాలు నిలిపీ పాటలు చెక్కే శిల్పీ
వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
ఇలలోజరిగిన సమస్తం పలుకుతుంది నీకవిత్వం
మూగబోయినా నీగళం నీ పాటలు పాడును ప్రతి గళం
వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
మానవతావాదీ వసుధైక కుటుంబం నీది
హృదయాలు తట్టి పిలిచేది ఏనాటికైన నిలిచేది
అసలైన కవిత నీది అది విన్న భాగ్యమే మాది
వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
నారాయణ అల్లాయని శివశివయనరాదాయని
అందాల మేఘమాలాయని పదములే చాలు రామాయని
ఒకపదమా ఒకపాటా నీవు అన్న ప్రతిమాటా
ప్రతిధ్వనించును ప్రతి చోటా
వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
చిందరవందర జుట్టు చిరుగాలికి ఎగురును అట్టిట్టూ
అందరినీ మరి ఆకట్టూ రవంత అత్తరు బొట్టూ
అత్తరు బొట్టూ ఎగిరే జుట్టూ
అందరికంటే పైమెట్టు భావ కవితకే సామ్రాట్ట్తు
వినిపించు ప్రతీ నోట
ఓ కృష్ణ శాస్త్రి నీ పాట
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఎనభయ్యవ పుట్టినరోజు సందర్భంగా పాలగుమ్మి
విశ్వనాథం గారు
రచించి, స్వరపరచి, పాడిన పాట. ఈ పాటను ఆనాటి సభలో కృష్ణ శాస్త్రి గారి ఎదుట
పాలగుమ్మి విశ్వనాథం పాడారు.
|