రామాయణ రత్నాలు

త్యాగశీలి భరతుడు

                                                                             -  విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్య

 

 

ఆది కవి వాల్మీకి. ఆదికావ్యం రామాయణం. సాహితీ లోకానికి అమూల్య సంపదలు. మానవాళి నడవడికి, ఒరవడులు దిద్దే మాహాకావ్యాం రామాయణం. అందులోని ప్రతి పాత్రా ఏదో ఒక ధర్మాన్ని బోధిస్తుంది. తండ్రి, భర్త, తల్లి, భార్య, సోదరులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారి మధ్య గల మానవ సంభంధాల ఉదాత్తతను చాతి చెప్తుంది. అట్టి ఉదాత్తమైన పాత్ర భరతునిది.

‘భరతోనామ కైకేయ్యా జజ్ణేసత్యపరాక్రమః సాక్షాద్విష్ణోచతుర్భాగః సర్వైసముదితోగుణైః

కైకకు విష్ణువు యొక్క చతుర్ధాంశ భాగంగా భరతుడు జన్మిస్తాడు. రాముడు పితృ వాక్య పరిపాలన్ కోసం అరణ్యవాసం చేస్తే, భరతుడు తనకు రాజ్యం లభించినా శృంగనేరి పురంలో సకల సుఖాలు త్యజించి తాపసియై, రామ పాదుకలను పూజిస్తూ, పదనాల్గు వత్సరముల తరువాత రామునికే తిరిగి రాజ్యాన్ని సమర్పించిన త్యాగశీలి భరతుడు. సోదర ప్రేమకు పరాకాష్టగా కనబడతాడు.

‘యామేభాత్రా పితాబన్దుః యస్యగాసోస్మి సమ్మితః రాముడే నాకు సర్వస్వం. నేను రామదాసుణ్ణి అని ప్రకటించుకున్న భరతుడు, రామయణంలో, ధర్మ ప్రవర్తకునిగా, వినయశీలిగా, ధీశాలిగా, నీతిశాస్త్ర కోవిదుడుగా, త్యాగిగా, సంయముగా మనకు గోచరిస్తాడు. మేనమామ ఇంట ఉన్న భరతుడు తండ్రి మరణానికి ముందు రాత్రి దుస్వప్నాన్ని కంటాడు. మరునాడు దాన్ని మిత్రులకు తెల్పుతూ “అహం రామోభవా రాజా లక్ష్మణోవామరిష్యతి"
అని అంటాడు.

‘నేను కాని, రాముడు కాని, రాజైన నా తండ్రి దశరధుడు కాని, లక్ష్మణుడు కాని మరణిస్తాము’ అని బాధపడతాడు. తండ్రి యడ, సోదరుల యడ, భరతునికి గల ప్రేమానురాగాలు వర్ణింపనలవికానివి. అయోధ్య నుండి వచ్చిన దూతలతో భరతుడు..

“కచ్చిత్సుకుశలారాజా, పితా దశరధోమమ” నా తండ్రి గారైన దశరధ మహారాజు కుశలంగా ఉన్నారా? అని ముందుగా తండ్రిని గూర్చి ప్రశ్నించి, రామ లక్ష్మణులు, కౌసల్యా, సుమిత్రలు క్షేమంగా ఉన్నారా’ అని ఉద్వేగ భరితంగా అడిగి, చివరగా “ఆత్మకామా సదా చండీ క్రోధనా ప్రాజ్ణమానినీ’ తొందరగా కోపం తెచ్చుకునే స్వభావం గల నా తల్లి కైక బాగుందా? అని ప్రశ్నిస్తాడు. తన తల్లి గుణగణాలు భరతునికి బాగా తెలుసునన్నది ఈ మాటల వల్ల సుస్పష్టం.

తండ్రి మరణ వార్త విన్న భరతుడు తీవ్రంగా విలపిస్తూ “క్వసపాణిస్సుఖిస్ప్రర్శః" ఇక ఆ చల్లని చేతి స్పర్శ ఏది? అని చిన్న పిల్లవాడిలా వాపోతాడు. తన కోసం తల్లి రాముని వనవాసానికి పంపి, రాజ్యాన్ని కోరిందని విని తల్లితో భరతుడు పలికిన పలుకులు అమృతంపు గుళికలు.

“కిన్ను కార్యం హతస్వేద మమరాజ్యేన శోచితః’ అమ్మా తండ్రి గారూ, అన్నగారూ లేని రాజ్యం నాకెందులకు’ అని ‘దుఃఖేమేదుఃఖమకరోత్’ దుఃఖం మీద దుఃఖం కలిగించే రెండు వార్తలు చెప్పేవు. అని లోకంలో నేటికి సామాన్యులు కూడా వాడే ఓ సామెతని వాడతాడు భరతుడు. అది ‘ వ్రణేక్షారమివాదధాః’ వ్రణం మీద (పుండు మీద) కారంజల్లి నట్టు’ అని పలికి దుఃఖోద్వేగంతో సొమ్మసిల్లిపోతాడు. తండ్రి మరణం, రాముని అరణ్య గమనం, భరతుని మిక్కిలి బాధిస్తాయి.

తదుపరి కౌసల్య వద్దకు వెళ్ళి ‘అమ్మా రాజ్యాన్ని నేను కోరలేదు నాకు ఏ పాపం తెలియదు అని విలపిస్తూ రాముడు అరణ్యానికి వెళ్ళడం నాకు ఇష్టమైతే చేయకూడని పనులు చేసిన వాడు పొందే పాపాన్ని నేను పొందుతాను. అని తెల్పి కొన్ని పాపాలను వివరిస్తాడు భరతుడు. అవి నేటి సమాజానికి కూడా త్యజింపదగినవి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

1. గురువుల మాట వినకుండుట
2. చెడ్డ వారి దాస్యము చేయుట
3 సూర్యునికి ఎదురుగా మూత్ర, పురుషములు విసర్జించుట
4 ఆవుని కాలితో తన్నుట.
5 సేవకునికి పనిచేయించుకుని ప్రతిఫలమివ్వకుండుట.
6 రాజద్రోహము
7 యుద్ధము నుండి వెనుదిరుగుట
8 దేవతలకు పెట్టకుండా ముందుగా తాను భుజించుట
9 పెద్దలు, గురువులు ఎదురైనచో నమస్కరించకుండుట
10 ఉపకారికి అపకారము చేయుట
వంటి పాపపు పనులను తెల్పుతూ ‘రాజ స్తీ బాల వృద్ధానాం విధేయః పాపముచ్యతే’ ఇంకా స్త్రీ, బాల, వృద్ధులను వధించడం మహా పాపం అని నలుబది ఏడు పాపాలను వివరించి నేనేకనుక రామరాజ్యం కోరుకుని ఉంటే ఇన్ని పాపాలు చేసేవారు పోయే గతులకు నేను పోతాను. అని భీషణ ప్రమాణాలు చేసి, తన నిర్దోషిత్వాన్ని, నిష్కలంక చరిత్రని కౌసల్యకి నిరూపించి ఆమె చేతనే సాంత్వన పొందుతాదు భరతుడు, అందరికి ఆదర్శమౌతాడు.

రాముని మరల రాజ్యానికి తీసుకురావాలని బయలుదేరిన భరతుడు ముందుగా గుహుణ్ణి కలుస్తాడు. ససైన్యంతో వచ్చిన భరతుణ్ణి చూసి శంకించి ఇలా అంటాడు గుహుడు..
‘కచ్చిన్న దృష్టోవ్రజసి రామస్యాక్లిశ్టకర్మణః’
ఇయంతే మహతీసేనా శంకాంజ నయతీవమే’

‘ఇంత పెద్ద సైన్యంతో బయలుదేరావు. రామునికి ఏదైనా కీడు చేస్తావేమోయని నామదిలో శంక కలుగుతోంది. అని అంటాడు.

అప్పుడు బుద్ధిమంతుడైన భరతుడుజ్ - గుహుని రామునిపై గల భక్తి భావానికి సంతసించి ‘గుహ సత్యంబ్రవీమితే’ ఓ గుహుడా! నేను సత్యమే చెపుతున్నాను, రాముణ్ణి తిరిగి తేవడానికే వెళ్తున్నాను. అని తన సత్య సంథతని చాటుతాడు భరతుడు.

అపుదు గుహుడు చాలా సంతోషించి భరతుని ఇలా కీర్తిస్తాడు.
‘ధన్యస్త్వం నత్వయాతుల్యం పశ్యామి జగతీతలే’ ఈ జగత్తులో నీవంటి ధన్యాత్ముడు మరొకడు లేడు.’ అని. ఇలా అందరి సందేహాలు నివృత్తి చేసి భరతుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని రాముని వద్దకు వెళతాడు.

సైన్యంతో వస్తున్న భరతుణ్ణి చూసి లక్ష్మణుడు తమకి అపకారం చెయ్యడానికే వస్తున్నాడని తలచి క్రోధావేశంతో ‘శరణాం ధనుషశ్చాహమనృణోస్మిమహామృనే
ససేన్యభరతంహత్వా భవిష్యామిన సంశయః’

“ధనుర్బాణాలు ధరించి నందుకు భరతుని చంపి రుణం తీర్చుకుంటాను. అనుజ్ణ ఇమ్మని రామునితో అంటాడు. ఇలా కౌసల్య చేత, గుహునిచేత, లక్ష్మణుని చేత ద్వేషింపబడిన భరతుని సత్యసంధత, సోదర ప్రేమ రామునికి మాత్రమే తెలియును. క్రోధపూరితుడైన లక్ష్మణునితో రాముడు భరతుని గూర్చి ‘నహితే నిష్టురంవాక్యం భరతోనప్రియం వచః’ లక్ష్మణా.. భరతునికి బాధ కలిగించే మాటలు మాటాడితే నాకు బాధ కల్గించినవాడవవుతావు. అని అపార ప్రేమని ప్రకటిస్తాడు. ఇంకా ‘నీకు రాజ్యం కావాలంటే చెప్పు భరతునితో చెప్పి ఇప్పిస్తాను. భరతుడు నా మాట కాదనడు.’ అని రాముడు భరతునిపై గల నమ్మకాన్ని ప్రకటిస్తాడు. “తద్వాక్యం లక్ష్మణఃశృత్వా వ్రీళితః” అని అన్న అన్నగారి మాటలకు సిగ్గుపడి లక్ష్మణుడు భరతునికి స్వాగతం పలుకుతాడు.

భగవదత్తమైన ఈ సమస్తమూ భగవంతునికే చెందాలని కోరుకొనే భరతుడు పరమభక్తుడు. అందుకే అన్నగారిని తిరిగి రాజ్యాన్ని గ్రహించమంటాడు. వశిష్టుడు, తల్లులు, మంత్రి సుమంత్రుడు, జాబాలి మహర్షి ఇలా అందరూ తిరిగి రాజ్యాన్ని స్వీకరించమని చెప్పినా రాముడు “సత్యమేవానృశంసంచరాజవృత్తంసనాతనం
తస్మాత్సత్యాత్మకం రాజ్యం సత్యేలోకే ప్రతిష్టితః”

రాజు సత్యాన్ని పాటించాలని, అపుడే ప్రజలు సత్య మార్గంలో నడుస్తారని, కనుక తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, రాజ్యానికి రానని తెల్పి, ‘రామోవిగ్రహవాన్ ధర్మః’ అని కీర్తింప బడతాడు రాముడు. రాముని మాటలను ఔదల దాల్చిన భరతుడు రామునికి మారుగా రామ పాదుకలను శిరస్సునందుంచుకుని “ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః” ఈ పాదుకలే సమస్త లోకాలను కాపాడుతాయి అని నమ్మి, ఆ పాదుకలనే సింహాసనముపై ఉంచి కేవలం ఒక రాజ సేవకునిగా పదునాల్గు వత్సరములు రాజ్యాన్ని కాపాడి“తద్దదామిపునస్తుభ్యం” నీ రాజ్యాన్నినీకే ఇస్తున్నాను” అని తిరిగి రామునికి రాజ్యాన్ని అప్పగించిన ధన్య చరితుడు భరతుడు. అట్టి త్యాగశీలి, నీతిమంతుడు, భగవత్తత్వాన్ని తెలిసిన వాడగు భరతుని చరిత్ర ఆదర్శవంతము, సదా సంస్మరణీయము.
 

 

 
     

 మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech